వైఎస్ తెలంగాణ వ్యతిరేక నిర్ణయాలు
– వైఎస్ రాజశేఖర్ రెడ్డి రాష్ర్ట మంత్రివర్గంలో చర్చించకుండానే పులిచింతల, పోలవరం, సింగూరు కెనాల్ ప్రాజెక్టులను తెలంగాణ ప్రాంత ప్రయోజనాలకు హాని కలిగించే రీతిలో చేపట్టడంతో టీఆర్ఎస్ మంత్రులు అసహనానికి గురయ్యారు. దీంతో ప్రభుత్వం నుంచి వైదొలగాలని పార్టీ నిర్ణయించింది. 2005, జూలై 4న సంతోష్ రెడ్డి తప్ప టీఆర్ఎస్ నుంచి మంత్రి పదవులు పొందిన వారంతా తమ పదవులకు రాజీనామాలు చేశారు.
– రాష్ర్ట ప్రభుత్వం నుంచి తాము వైదొలగడానికి కారణం ఏమిటో ప్రజలకు వివరించడానికి టీఆర్ఎస్ పార్టీ 2005, జూలై 17న వరంగల్లులో భారీ బహిరంగసభ నిర్వహించింది. ఈ సభకు కేంద్రమంత్రి శరద్ పవార్ హా జరై తెలంగాణకు మద్దతు పలికాడు.
– ఇదిలావుంటే వైఎస్ టీఆర్ఎస్ కు చెందిన 10 మంది ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టి వారిని తనవైపు తిప్పుకుని పార్టీని చీల్చడానికి కుట్రచేశాడు. దీంతో వైఎస్ తో చేతులు కలిపిన టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కేసీఆర్ 2005, డిసెంబర్ 28న పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. వైఎస్ అండతో తొమ్మిది మంది సస్పెండ్ అయిన టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కౌన్సిల్ ఎన్నికల్లో స్వతంత్య్ర అభ్యర్థిగా కాసాని జ్ఞానేశ్వర్ నామినేషన్ పై సంతకాలు చేసి బలపర్చారు. దీంతో టీఆర్ఎస్ నుంచి ఎన్నికై విప్ ను ధిక్కరించినందుకు వారిని అనర్హులు గా ప్రకటించాలని కేసీఆర్ అసెంబ్లీ స్పీకర్‌కు విజ్ఞప్తి చేశారు. విచారణ పేరుతో స్పీకర్ రెండేండ్లు కాలయాపన చేసి 2008, డిసెంబర్ 22న వారిని అనర్హులుగా ప్రకటించారు.
– మరోవైపు ఏడాదిన్నరయినా ప్రణబ్ ముఖర్జీ కమిటీ నివేదిక ఇవ్వలేదు. టీఆర్ఎస్ ప్రతినిధి బృందం సోనియాను కలువగా.. ఆమె యూపీఏకు బయటి నుంచి మద్దతిస్తున్న సీపీ ఎం పార్టీ తెలంగాణ ఏర్పాటును వ్యతిరేకిస్తున్నదని అన్నా రు. టీఆర్ఎస్ ప్రతినిధులు సీపీఎం నాయకులైన సీతారాం ఏచూరి, ప్రకాష్ కారత్ లను కలువగా సీతారాం ఏచూరి బదులిస్తూ భాషాప్రయుక్త రాష్ట్రాల సిద్ధాంతానికి కట్టుబడి ఉన్నందున మా పార్టీ తెలంగాణ ఏర్పాటును సమర్థించడం లేదు. అంతమాత్రాన యూపీఏ తెలంగాణ ఇస్తానంటే అడ్డుపపడుతామని మేమెప్పుడూ చెప్పలేదు. ఒకవేళ ఇవ్వాలనుకుంటే ఉభయసభల్లో వారికి సరిపడా బలం ఉంది అని చెప్పారు. దీంతో కేవలం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి అడ్డుపడటంవల్లే సోనియాగాంధీ తెలంగాణ రాష్ర్టం ఇవ్వడానికి సుముఖంగా లేరని కేసీఆర్, ఇతర టీఆర్ఎస్ నేతలు అర్థం చేసుకున్నారు. కేంద్ర మంత్రివర్గం నుంచి వైదొలగాలని నిర్ణయించుకుని 2006, ఆగస్టు 23న కేసీఆర్, నరేంద్ర తమ మంత్రి పదవులకు రాజీనామా చేశారు.
– తాము ఎందుకు రాజీనామా చేయాల్సి వచ్చిందో దేశ ప్రజ ల దృష్టికి తీసుకురావడానికి 2006, ఆగస్టు 24న కేసీఆర్ జంతర్ మంతర్ వద్ద నిరాహారదీక్ష చేశారు. మరుసటి రోజు లోక్ సభలోని అన్ని పార్టీల ప్రజాప్రతినిధులు తెలంగాణపై చర్చించాలని పట్టుబట్టారు. లోక్ సభ పక్షాన స్పీకర్ సోమనాథ్ చటర్జీ కేసీఆర్‌కు దీక్ష విరమించాలని విజ్ఞప్తి చేశారు. అదేరోజు రాత్రి 10 గంటలకు శరద్ పవా ర్ దీక్షా శిబిరానికి వచ్చి, కేసీఆర్‌కు నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేశారు.
– కేసీఆర్, నరేంద్ర మంత్రి పదవులకు రాజీనామా చేసి హైదరాబాద్ చేరుకున్న తర్వాత.. తామెందుకు రాజీనామా చేయాల్సి వచ్చిందో, తెలంగాణ ఏర్పాటు విషయాన్ని యూపీఏ కామన్ మినిమమ్ ప్రోగ్రామ్‌లో చేర్చకుండా ఎలా మోసగించిందో ప్రజలకు తెలియజేయడానికి సిద్దిపేటలో తెలంగాణ సమర శంఖారావం పేరుతో 2006, సెప్టెంబర్ 8న బహిరంగసభను నిర్వహించారు. సభ అంచనాలకు మించి విజయవంతం కావడంతో కాంగ్రెస్ నాయకులు, టీఆర్ఎస్ అసమ్మతి నాయకులు టీఆర్ఎస్పై విమర్శల వర్షం కురిపించారు. ఇంకా కొందరు కేసీఆర్‌ను లక్ష్యంగా చేసుకుని ఆయనపై వ్యక్తిగత దూషణలకు దిగారు. ఈ దూషణల్లో భాగంగానే అప్పటి క్రీడల శాఖామంత్రి ఎం. సత్యనారాయణరావు కేసీఆర్ ను ఉద్దేశిస్తూ రెండేండ్లు మంత్రిపదవి అనుభవించి ఇప్పుడు తెలంగాణపై మాట్లాడుతున్నావ్. కాంగ్రెస్ మద్దతుతో ఎంపీ స్థానం గెలిచావ్, దమ్ముంటే ఆ స్థానానికి రాజీనామా చేసి మళ్లీ గెలువు అంటూ సవాల్ విసిరాడు. దాన్ని స్వీకరించిన కేసీఆర్ 2006, సెప్టెంబర్ 12న రాజీనామా చేశారు.
ఫలించని వ్యూహం
– రాష్ర్ట ఏర్పాటు కోసం కేంద్రంపై ఒత్తిడి పెంచడానికి టీఆర్ఎస్కు చెందిన 2008, మార్చి 3న నలుగురు ఎంపీలు, మార్చి 4న 16 మంది ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎమ్మెల్సీలు రాజీనామా చేశారు. అయితే 10 మంది టీఆర్ఎస్ అసమ్మతి ఎమ్మెల్యేలు మాత్రం రాజీనామాలు చేయలేదు. ఈ ఉప ఎన్నికల్లో వైఎస్ఆర్ వ్యూహాత్మకంగా పావులు కదిపారు. టీఆర్ఎస్ ఆ వ్యూహాన్ని చేధించలేకపోయింది. ఫలితంగా 2008, మార్చి 29న జరిగిన ఎన్నికల్లో టీఆర్ఎస్ పరాజయాన్ని చవిచూడాల్సి వచ్చింది. టీఆర్ఎస్ పార్టీ రాజీనామా చేసిన 16 అసెంబ్లీ స్థానాల్లో 7 స్థానాలను, 4 పార్లమెంట్ స్థానాల్లో రెండు స్థానాలను మాత్రమే గెలిచింది.
రోశయ్య కమిటీ
– ఒకవైపు ఎన్నికలు సమీపిస్తుండటం, మరొకవైపు ఉధృతం అవుతున్న తెలంగాణ ఉద్యమాన్ని గుర్తించిన అప్పటి సీఎం వైఎస్ఆర్ కంటితుడుపు చర్యగా 2009, ఫిబ్రవరి 12న ఆర్థిక మంత్రి రోశయ్య నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేశారు.
– ఇందులో నలుగురు తెలంగాణవారు (జే గీతారెడ్డి, ఉత్తమ్ కుమార్‌రెడ్డి, శ్రీధర్ బాబు, అక్బరుద్దీన్ ఒవైసీ), ముగ్గురు ఆంధ్రావారు (కొణతాల రామకృష్ణ, పద్మరాజు, షేక్ హుస్సేన్) సభ్యులుగా ఉన్నారు. ఈ సభ్యుల్లో ఒక్క అక్బరుద్దీన్ ఓవైసీ తప్ప అందరు కాంగ్రెస్ వారే – అయితే అనేక రాజకీయ కారణాలవల్ల ఈ కమిటీ తన నివేదికను ఇవ్వలేదు.
2009 ఎన్నికలు-పొత్తులు
– 2009లో శాసనసభ, లోక్ సభకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించారు. ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్, టీడీపీ, సీపీఐ, సీపీఎం మహాకూటమిగా ఏర్పడి సీట్ల పంపిణీ చేసుకున్నా యి.
చంద్రబాబు జై తెలంగాణ
– తెలంగాణ ప్రజల కసి ఎలా ఉంటుందో 2004 ఎన్నికల్లో చంద్రబాబుకు తెలిసివచ్చింది. 2009లో ఎలాగైనా అధికారంలోకి రావాలనుకున్న చంద్రబాబు జై తెలంగాణ అనకుంటే తెలంగాణలో ప్రజల వద్దకు వెళ్లలేమని గ్రహించాడు.
– ఎన్నడూ లేనిది చంద్రబాబు… 2008, జూలైలో కలిసి పనిచేద్దామని కేసీఆర్‌కు ప్రతిపాదించాడు. దానికి కేసీఆర్ జవాబిస్తూ మీరు తెలంగాణను సమర్థించాలి అని షరతు పెట్టారు. అందుకు ఒప్పుకున్న చంద్రబాబు దసరా పండుగనాడు మీడియాతో మాట్లాడుతూ తెలుగుదేశం పొలిట్ బ్యూరో తెలంగాణకు అనుకూలంగా తీర్మానం చేసిందని ప్రకటించారు. తెలంగాణ ఒక చారిత్రక అవసరమని, తెలంగాణ ప్రజలు మూడేండ్లుగా చేస్తున్న ఉద్యమానికి ప్రభావితమై సుదీర్ఘ చర్చల తర్వాత తెలుగుదేశం పార్టీ తన నిర్ణయాన్ని మార్చుకుందని చెప్పాడు. మహాకూటమి ఏర్పాటుకు వ్యూహరచన చేశాడు. టీఆర్ఎస్ అనేక అనుమానాల మధ్య మహాకూటమితో చేరడానికి ఒప్పుకుంది.
ఇతర పార్టీలు
– విజయశాంతి తన తల్లి తెలంగాణ పార్టీని టీఆర్ఎస్లో విలీనం చేశారు. దీంతో కేసీఆర్ తాను పోటీ చేయాలనుకున్న మెదక్ స్థానాన్ని ఆమెకిచ్చి తాను మహబూబ్ నగర్ స్థానంలో పోటీ చేశారు.
– సినీనటుడు చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీ సామాజిక తెలంగాణ నినాదంతో అన్ని స్థానాలకు పోటీ చేసింది.
– దేవేందర్ గౌడ్ తాను స్థాపించిన నవతెలంగాణ పార్టీని ప్రజారాజ్యంలో విలీనం చేశాడు. ఈవిధంగా 2009లో జరిగిన ఎన్నికల్లో పాల్గొన్న ప్రధాన పార్టీలన్నీ తెలంగాణ నినాదంతో ప్రజల ముందుకు వచ్చాయి.
ఎన్నికలు-ఫలితాలు
– ఈ ఎన్నికల్లో మళ్లీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. అయితే పొసగని భావజాలంతో ఒక్కటైన మహాకూటమిని ప్రజలు ఆదరించలేదు. చిరంజీవి ఆకర్షణ బలం గెలవడానికి ఉపయోగపడకపోయినా ఓట్లను మాత్రం చీల్చగలిగింది. దీంతో కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి వచ్చింది. ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ కు మహబూబ్ నగర్, మెదక్ ఎంపీ స్థానాలు మాత్రమే దక్కాయి. 45 అసెంబ్లీ స్థానాల్లో పోటీచేయగా, 10 స్థానాలు గెలిచింది.
కరీంనగర్ ఎన్నిక
– కేసీఆర్ రాజీనామా చేయడంతో రాబోయే కరీంనగర్ ఉప ఎన్నిక తెలంగాణకు రెఫరెండం అని వైఎస్ఆర్ వ్యాఖ్యానించాడు. వైఎస్ మాటలు నేరుగా తెలంగాణ ప్రజల గుండెలను తాకినవి. పార్టీలకతీతంగా, మతాలకు అతీతంగా, భావజాలాలకు అతీతంగా తెలంగాణ వాదులకు-తెలంగాణ వ్యతిరేకులకు నడుమ పోటీగా ఈ ఎన్నిక జరిగింది.
– 2006, డిసెంబర్ 4న పోలింగ్ జరిగింది. డిసెంబర్ 7న జరిగిన ఓట్ల లెక్కింపులో కేసీఆర్ 2,01,582 ఓట్ల మెజారిటీతో గెలిచారు. వైఎస్ఆర్ ఈ ఎన్నికల్లో కేసీఆర్ ను ఓడించడానికి తనవద్ద ఉన్న అస్త్రశస్త్రాలన్నీ వాడినా ప్రయోజనం లేకపోయింది.
నల్లగొండ నగారా
– 2007, ఏప్రిల్ 6-12 వరకు వారం రోజులపాటు నల్లగొండ జిల్లాలోని ఫ్లోరైడ్ పీడిత గ్రామాల్లో కేసీఆర్ పాదయాత్ర చేశారు. ఇందులో భాగంగా ఆయన మాట్లాడుతూ నాగార్జునసాగర్ రిజర్వాయర్ నుంచి ఆంధ్రా పాలకులు తాగునీరు-సాగునీరు ఇస్తే ఈ సమస్య ఉండేదికాదని వంకర్లు తిరిగిన రెక్కలు, బొక్కలు చూసైనా ఆంధ్ర పాలకులు గుక్కెడు నీళ్లు ఇవ్వలేదని, మన పక్కనుంచే పోతున్న కృష్ణమ్మ మన పంట పొలాలకు కడుపు నింపట్లేదని, నాగార్జున సాగర్ నీళ్లు నల్లగొండ పొలాలకిచ్చినా, ఎస్ఎల్బీసీ సొరంగం పనులు పూర్తయినా ఈ ఘోస తెలంగాణ బిడ్డలకుండేది కాదని కేసీఆర్ వాపోయారు.
– మైనార్టీల సంక్షేమం కోసం సచార్ కమిటీ సిఫార్సులను వెంటనే అమలు చేయాలని 2007, జూలై 15న ఇందిరా పార్క్ వద్ద కేసీఆర్ ఒకరోజు నిరాహార దీక్ష చేశారు. ఫలితంగా ప్రభుత్వంపై ఒత్తిడి పెరిగింది.
ప్రణణ్ ముఖర్జీ కమిటీ
– యూపీఏ ప్రభుత్వం తెలంగాణ అంశంపై వివిధ పార్టీలతో సంప్రతింపులు జరిపి విస్తృతస్థాయిలో అంగీకారం కోసం ప్రయత్నించడానికి సీనియర్ మంత్రి ప్రణబ్ ముఖర్జీ ఆధ్వర్యంలో ఒక కమిటీని నియమించింది. ఈ కమిటీలో డీఎంకే పార్టీకి సంబంధించిన మంత్రి దయానిధి మారన్, రాష్ట్రీయ జనతాదళ్ కు సంబంధించిన మంత్రి రఘువంశ ప్రసాద్ సింగ్ సభ్యులు. ఈ కమిటీ తెలంగాణపై అభిప్రాయాలను చెప్పాలంటూ అన్ని పార్టీలకు లేఖలు రాసింది. ఈ సందర్భంలోనే టీఆర్ఎస్ ఎంపీలు కేసీఆర్, నరేంద్ర, వినో్ద్ కుమార్, రవీంద్రనాయక్, మధుసూధన్ రెడ్డిలతోపాటు ప్రొ.జయశంకర్ అన్ని పార్టీలను కలిసి, వారికి తెలంగాణ రాష్ర్ట ఏర్పాటు అవసరాన్ని వివరించి తెలంగాణపై సానుకూల అభిప్రాయాలను ప్రకటించాలని కోరారు.
– యూపీఏలోని 13 పార్టీల్లో 11 పార్టీలు (ఆర్జేడీ, ఎన్సీపీ, పీఎంకే, జేఎంఎం, లోక్ జనశక్తి, ఎండీఎంకే, టీఆర్ఎస్ మొదలైనవి) తెలంగాణ రాష్ర్ట ఏర్పాటుకు అనుకూలంగా లేఖలు రాశాయి. డీఎంకే తన సానుకూలతను రాతపూర్వకంగా కాకుండా 2006, ఆగస్టు 24న జరిగిన యూపీఏ సమావేశంలో రాష్ర్ట ఏర్పాటుకు తన సమ్మతిని ప్రకటించింది. కమిటీ మా ఆధ్వర్యంలోనే నడుస్తుంది. కాబట్టి మేము ప్రత్యేకంగా రాతపూర్వకంగా తెలుపనవసరం లేదని కాంగ్రెస్ ఎలాంటి లేఖను అందించలేదు.
– యూపీఏకు బయట నుంచి మద్దతిస్తున్న 11 పార్టీల్లో బీఎస్పీ, రాష్ట్రీయ లోక్‌దళ్, ఫార్వర్డ్ బ్లాక్, జనతాదళ్, సిక్కిం డెమోక్రటిక్ ఫ్రంట్, ఎస్జేపీ (ఆర్)లు తెలంగాణకు అనుకూలంగా లేఖలు రాశాయి. సమాజ్‌వాదీ పార్టీ ఏ అభిప్రాయాన్ని ప్రకటించలేదు. భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు కట్టుబడి ఉన్నామంటూ తెలంగాణ రాష్ర్ట ఏర్పాటును సీపీఎం వ్యతిరేకించింది. సీపీఐ తన అభిప్రా యం చెబుతూ తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని సవరించడానికి ప్రత్యేక ప్యాకేజీలు, ప్రాంతీయ బోర్డులు ఏర్పాటు చేయాలని, ఇవేవీ ఫలితాలు ఇవ్వనప్పుడు ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటుచేసి దానిద్వారా తెలంగాణ రాష్ర్ట ఏర్పాటు అంశాన్ని పరిశీలించాలని తెలిపింది.
– ప్రతిపక్ష కూటమి అయినప్పటికీ ఎన్డీఏలోని 14 పార్టీల్లో ఎనిమిది పార్టీలు (బీజేపీ, శిరోమణి అకాళీదళ్, జేడీయూ, ఐఎఫ్డీ, ఎంఎన్ఎఫ్ తదితర పార్టీలు) తెలంగాణకు అనుకూలంగా లేఖలు రాశాయి. శివసేన, ఏజేపీ, నేషనల్ కాన్ఫరెన్స్‌లు.. బీజేపీ ఏ నిర్ణయం తీసుకున్నా తమకు సమ్మతమేననిప్రకటించాయి. 196 మంది సభ్యులున్న ప్రతిపక్ష ఎన్డీఏ కూటమిలో కేవలం ఐదుగురు సభ్యులుగల టీడీపీ మాత్రమే తెలంగాణ రాష్ర్ట ఏర్పాటును వ్యతిరేకించింది. ఇలా 543 మంది సభ్యులున్న లోక్ సభలో 440 మందికిపైగా తెలంగాణ ఏర్పాటును సమర్థించారు. అయినప్పటికీ కాంగ్రెస్ నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో.. వర్షాకాల సమావేశాల లోపు ఏ నిర్ణయం తీసుకోకుంటే తాము మంత్రి పదవులకు రాజీనామా చేస్తామని కేసీఆర్ హెచ్చరించారు. మరోవైపు ఎనిమిది నెలల్లో నివేదిక ఇవ్వాల్సిన ప్రణణ్ ముఖర్జీ కమిటీ 20 నెలలైనా ఇవ్వలేదు.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు