వృత్తిధర్మంలో మానవతే కీలకం
ప్రపంచంలో బలమైన సమాజంగా, భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతిబింబంగా ఉన్న భారతీయ సమాజంలో.. సమాజశాస్త్ర సహజ సూత్రాలకు పూర్తి భిన్నమైన సామాజిక జీవనం కనిపిస్తుంది. సమాజ నిర్మాణంలో అంతర్భాగాలైన పితృస్వామ్య వ్యవస్థ, వర్ణవ్యవస్థ/కులవ్యవస్థ వంటివి అనివార్యంగానే మహిళలను, నిమ్న కులాలను మరింత బలహీనపర్చాయి. సమాజంలో బలహీన వర్గాలుగా పరిగణించబడుతున్నవారిపట్ల ఆధునిక ప్రభుత్వాలు మరింత సున్నితత్వాన్ని కలిగి ఉండాలని సమాజ శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు.
మహిళలపట్ల వివక్ష
-ప్రపంచ దేశాల మాదిరిగానే భారత జనాభాలో కూడా మహిళలు దాదాపు 50 శాతం వాటా కలిగి ఉన్నప్పటికీ.. దేశ సామాజిక చరిత్రలో మహిళలపట్ల ప్రదర్శించిన వివక్ష, సామాజిక దోపిడీ, అణచివేత, పురుషాధిక్యత వంటివి స్త్రీని రెండో తరగతి పౌరురాలిగా మార్చాయి.
-నిజానికి భారతదేశ సామాజిక చరిత్ర ప్రారంభంలో అంటే తొలివేద కాలంలో స్త్రీ సామాజిక అంతస్తు ఉన్నతంగా ఉండేది. పురుషునితో సమానంగా అన్ని సామాజిక కార్యక్రమాల్లో స్త్రీలు పాల్గొనేవారు. సభ, సమితిలలో సభ్యత్వాన్ని కలిగి ఉండేవారు. స్త్రీలకు సంబంధించిన సామాజిక దురాచారాలైన బాల్య వివాహాలు, సతీసహగమనం, వితంతు పునర్వివాహాల నిషేధం వంటివి లేవు. పురుషులతో సమానంగా స్త్రీలు వేద అధ్యయనం చేసేవారు. ఇలాంటి స్త్రీలను బ్రహ్మవాదినిలు, మంత్రద్రస్టులు అని పిలిచేవారు. స్త్రీలు పురుషులతో సమానంగా గృహసంబంధ విధులు, బాధ్యతలు చేపట్టేవారు. స్త్రీ అనుమతితోనే వివాహం జరిపించే సాంప్రదాయాలు ఉండేవి. ఒక్కమాటలో చెప్పాలంటే తొలివేద కాలంలో స్త్రీని దేవతగా, సృష్టికర్తగా పరిగణించేవారు.
-తొలివేద కాలంలో స్త్రీకి సమాజంలో లభించిన గౌరవం, సామాజిక అంతస్తు మలివేద కాలంలో పూర్తిగా కనుమరుగయ్యాయి. స్త్రీకి సంబంధించిన సామాజిక దురాచారాలు ప్రమాదకరస్థాయిలో ఆచరణలో ఉండేవి. మధ్యయుగంలో ఈ దురాచారాలు మరింత ప్రమాదకరస్థాయికి చేరుకున్నాయి. సుదీర్ఘ కాలంపాటు ముస్లిం పరిపాలన కొనసాగడంవల్ల భారతీయ సామాజిక వ్యవస్థలో అనేక మార్పులు చోటుచేసుకున్నాయి. మధ్యయుగంలో ఆవిర్భవించిన భూస్వామ్య వ్యవస్థ తెలంగాణ ప్రాంతంలో జోగిని, దేవదాసి వంటి లైంగిక బానిసత్వ వ్యవస్థలను సృష్టించడం మరో ప్రమాదకరమైన సామాజిక సంఘర్షణ. వెట్టిచాకిరి, కట్టు బానిసత్వం సర్వసాధారణంగా మారిపోయాయి. అందువల్ల భారతదేశ చరిత్రలో మధ్యయుగ కాలాన్ని.. భారతీయ స్త్రీ సామాజిక చరిత్రలో చీకటి కాలంగా చరిత్రకారులు, సామాజికవేత్తలు పరిగణిస్తారు.
-భారతీయ సమాజంలోని స్త్రీలు ఆరోగ్యం, విద్య, ఆస్తి హక్కు, ఉపాధి అవకాశాలు, వృత్తి, ఉద్యోగ అభివృద్ధి వంటి అనేక అంశాల్లో అసమానత, వివక్షతను ఎదుర్కొంటున్నారు. స్త్రీలు ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయడమే కాకుండా రక్తహీనత, పౌష్టికాహార లోపంతో బాధపడుతున్నారు. ఉన్నత విద్య, సాంకేతిక విద్య స్త్రీలకు పూర్తిస్థాయిలో అందుబాటులో లేదు.
పితృస్వామ్యంతో అసమానత
-సమాజంలో పురుషులకు ఎక్కువ అధికారం, ముఖ్యంగా స్త్రీలపై పురుషుల ప్రాబల్యాన్ని పితృస్వామ్యం అంటారు. పురుష ప్రాబల్యం (పితృస్వామ్యం) కాలక్రమంలో వివిధ రూపాలను ఏర్పర్చుకొని సమాజంలో స్త్రీలను రెండో తరగతి పౌరులుగా మార్చింది. భారతీయ సమాజంలో పితృస్వామ్య భావన అనేది సామాజిక జీవనంలో అంతర్భాగంగా కొనసాగుతున్నది. మతం, మత ఆచరణలు కూడా ఈ భావనను బలపరిచేవిగా ఉన్నాయి. కుటుంబ వ్యవస్థ క్రమానుగత శ్రేణి రూపాన్ని సంతరించుకున్నది. పురుషాధిక్యత అనివార్యంగానే గృహహింసకు కారణమవుతున్నది.
-సమాజం, రాజకీయ, ఆర్థిక వ్యవస్థల్లో మహిళలకు సమాన హక్కులు, భాగస్వామ్యం కోసం శతాబ్దాలుగా పోరాటాలు, ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. అయితే కుటుంబ నిర్మితిని సంస్కరించడానికిగాని, కుటుంబస్థాయిలో మానవ సంబంధాలను ప్రజాస్వామ్యీకరించడానికిగాని కచ్చితమైన ప్రయత్నాలేవీ జరగలేదనే చెప్పవచ్చు. కుటుంబంలో పురుషాధిక్యతను ప్రశ్నించే ఏ ప్రయత్నమైనా స్త్రీ, పురుషుల మధ్య వ్యతిరేకతను తెస్తుంది. ప్రఖ్యాత ఫెమినిస్టు రచయిత మేరి డాల్హి వివరణ ప్రకారం.. భారతదేశంలో సతీసహగమనం, చైనాలో మహిళల పాదాలు కట్టివేసే ఆచారం, ఆఫ్రికాలో బాలికల శరీరాంగ విచ్ఛిత్తి, యూరప్‌లో మధ్యయుగ కాలంలో మంత్రగత్తెలన్న నెపంతో స్త్రీలను వధించడం, జైనోసైడ్ (బాలికలను చంపడం) అమెరికన్ గైనకాలజీ పేరిట కొనసాగుతున్న బాలికా వధ వంటివి స్త్రీలపట్ల పితృస్వామ్య హింసకు కొన్ని ఉదాహరణలు. స్త్రీలు ఈ పితృస్వామ్య వ్యవస్థతో కుటుంబస్థాయి నుంచి ప్రపంచస్థాయి వరకు పోరాడాల్సి వస్తున్నది. సమకాలీన స్త్రీవాద ఉద్యమాలు ఈ దిశగా వ్యూహాలను ఏర్పరుస్తున్నాయి.
అసమానత సూచీ
-ఆరోగ్యం, విద్య ఆర్థిక వనరులపై అధికారం అనే అంశాల ఆధారంగా జెండర్ అభివృద్ధి సూచీని నిర్ణయిస్తారు. పునరుత్పత్తి ఆరోగ్యం, సాధికారత, లేబర్ మార్కెట్ భాగస్వామ్యానికి సంబంధించి దేశంలో సాధించిన అంశాల్లో జెండర్ అసమానతలను గ్రాస్ ఇన్‌ఈక్వాలిటీ ఇండెక్స్ తెలుపుతుంది. 2014 నివేదిక ప్రకారం 152 దేశాల జెండర్ ఇన్‌ఈక్వాలిటీ ఇండెక్స్‌లో భారత్ 127వ స్థానంలో ఉంది. బంగ్లాదేశ్, చైనా లాంటి దేశాలు ఈ విషయంలో భారత్ కంటే మెరుగైన స్థానాల్లో ఉన్నాయి.
-2011 జనాభా లెక్కల ప్రకారం దేశంలో మహిళల సగటు అక్షరాస్యత 65.46 శాతం. గత దశాబ్దాలతో పోలిస్తే స్త్రీల అక్షరాస్యత విషయంలో ఇది గణనీయమైన మెరుగుదల అయినప్పటికి నేటికీ వివక్ష కొనసాగుతూనే ఉంది. అక్షరాస్యతకు ఉపాధి కల్పనకు సంబంధం లేకుండాపోయింది. దేశంలోని మొత్తం శ్రామిక శక్తిలో మహిళల వాటా కేవలం 25 శాతం మాత్రమే. దేశంలోని కుటుంబాల్లో స్త్రీలు యజమానులుగా 11 శాతం మాత్రమే ఉన్నాయి.
స్త్రీలు కుటుంబం, పేదరికం బరువును మోస్తున్నప్పటికీ వారికి ఆస్తి హక్కు, ఆర్థిక భాగస్వామ్యం లేదు. పనిచేస్తున్న స్త్రీలలో అత్యధిక మంది అసంఘటిత రంగంలోనే ఉన్నారు. వారిలో 80.9 శాతం మందికి కనీస వేతనాలు కూడా లభించడంలేదు. దేశంలోని స్త్రీలు చేసే పనులకు ఆర్థికపరమైన విలువ చాలా తక్కువ. ఫలితంగా వారు ఆర్థికంగా వెనుకబడిపోయారు. సమాజస్థాయిలో చూస్తే స్త్రీల అంతస్తు స్థానం, పాత్రలకు సంబంధించిన అభిప్రాయాల దృష్టికోణం ఇంకా సాంప్రదాయిక దృష్టి కోణంగానే ఉంది. స్త్రీల పట్ల పెరుగుతున్న నేరాలు, హింస, అత్యాచారాలు, హత్యలు ఈ సామాజిక ఆలోచనా విధానానికి ఒక ఉదాహరణ.
హింసతో సహవాసం
-భారత్‌తోపాటు ప్రపంచంలోని అనేక దేశాల్లో నేటికీ మహిళలపట్ల హింస వివిధ రూపాల్లో కొనసాగుతున్నది. స్త్రీకి వ్యతిరేకంగా శారీరక, లైంగిక, మానసిక, ఆర్థిక, ఉద్వేగాత్మక దుర్వినియోగాన్ని ప్రోత్సహించే చర్యను మహిళలపై హింసగా పేర్కొంటారు. దేశంలో 52 శాతం మహిళలు తమ జీవితకాలంలో ఒక్కసారైనా పురుషులవల్ల శారీరక లేదా మానసిక హింసకు గురయ్యారని అనేక అధ్యయనాల్లో వెల్లడైంది. ఉమెన్స్ డెవలప్మెంట్ స్టడీస్ చేసిన అధ్యయనంలో సగటున ప్రతి 5 గంటలకు ఒక స్త్రీ ఇంట్లో క్రూరత్వానికి లోనవుతున్నట్లు తేలింది. ది నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే, ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ రిసెర్చ్ ఆఫ్ ఉమెన్ అనే సంస్థలు తమ నివేదికల్లో.. దేశంలో ప్రతి ఐదుగురిలో ఒక స్త్రీ గృహహింసకు లోనవుతున్నదని పేర్కొన్నాయి.
పరువు హత్యల పరంపర
-భారతీయ సమాజం జీవితంలోని అన్ని అంశాల్లో కులం, మతం, అస్తిత్వాలకు ప్రాధాన్యత ఇస్తుంది. కుటుంబ జీవితంలో ఆదర్శప్రాయమైన, మతపరమైన పాత్రలను స్త్రీలు నిర్వహించాలని భావిస్తారు. ఈ పాత్రలను వర్ణవ్యవస్థ, కులవ్యవస్థ నియమాలకు అనుగుణంగా నిర్ణయించబడతాయి. విద్యావంతులైన స్త్రీలు వివాహానికి, సంబంధాలకు హేతువాద ఆధారం ఉండాలని భావిస్తారు. అయితే స్త్రీలు ఆకాంక్షించే ఈ సాంస్కృతిక స్వయం ప్రతిపత్తిని దేశంలోని మతఛాందసవాద సమూహాలు అంగీకరించకపోవడంతో స్త్రీలపై హింస రోజురోజుకు పెరుగుతున్నది. ఈ హింసను కల్చరల్ పోలీసింగ్ అంటారు. కులాంతర, మతాంతర వివాహాలు చేసుకున్నప్పుడు మహిళలను హత్యచేసిన సందర్భాలు అనేకం కనిపిస్తాయి.
-పరువు పేరుతో హత్యలు చేయడమే పరువు హత్యలు. కులాంతర, మతాంతర వివాహాలు చేసుకున్నప్పుడు ఇవి ఎక్కువగా జరుగుతున్నాయి. ఈ హత్యలు భూస్వామ్య వ్యవస్థ అవశేషాలు. ఇవి ఎక్కువగా ఖాప్ పంచాయతీలుగల హర్యానాలోని జజ్జర్, జింద్, ఫతేబాద్, రోహ్తక్ వంటి ప్రాంతాల్లో, ఉత్తరప్రదేశ్‌లోని మీరట్, బాగ్పట్, ముజఫర్‌నగర్‌లలో కనిపిస్తున్నాయి.
-పశ్చిమ ఉత్తరప్రదేశ్, హర్యానాలోని జాట్లలోగల కుల పెద్దల పంచాయతీని ఖాప్ పంచాయతీ వ్యవస్థ అంటారు. ఈ వ్యవస్థ కఠినమైన శిక్షలను విధిస్తున్నది. మనోజ్-బాబ్లీ హత్యతో దేశంలో పరువు హత్యల చర్చ దేశవ్యాప్తంగా విస్తరించింది. 2011లో భగవాన్‌దాస్ కేసు తీర్పులో సుప్రీంకోర్టు పరువు హత్యలకు పాల్పడే వారిని కఠినంగా శిక్షించాలని పేర్కొన్నది.
వ్యాపార వస్తువుగా చూడటం
-ప్రపంచవ్యాప్తంగా మీడియా స్త్రీలను సినిమా, వ్యాపార ప్రకటనల్లో అమర్యాదగా, అశ్లీలంగా చూపిస్తున్నది. స్త్రీల అందానికి కొలమానాలు నిర్ణయించడం జరుగుతున్నది. అందాల పోటీలను నిర్వహించడం వంటి కార్యక్రమాలతో కొన్ని వ్యాపార సంస్థలు తమ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకుంటున్నాయి. ఈ ధోరణి స్త్రీలను, వారి అందాన్ని వస్తువుగా పరిగణిస్తుంది. దేశంలో జరుగుతున్న స్త్రీవాద ఉద్యమాలు (రైటిస్ట్, లెఫ్టిస్ట్) స్త్రీని వస్తువుగా పరిగణించడాన్ని వ్యతిరేకిస్తున్నాయి. కానీ సినిమా, టీవీ సీరియళ్లు స్త్రీలపట్ల హింసను అంతగా పట్టించుకోవాల్సిన అవసరంలేని అంశంగా చిత్రిస్తున్నాయి. వీటివల్ల యువత ప్రభావితమవుతున్నది.
-మహిళల అక్రమ రవాణా మరో అతిపెద్ద అంతర్జాతీయ వ్యాపారంగా మారింది. అమాయక మహిళలను ప్రలోభపెట్టి, అక్రమ వ్యాపారానికి గురిచేసి వ్యభిచారంలోకి నెట్టివేయడం జరుగుతున్నది. ఫలితంగా మహిళల జీవితం మరింత దుర్భరంగా మారుతున్నది. ఇలా అనేక అంశాల్లో స్త్రీలు రకరకాలుగా ఇబ్బందులకు, హింసకు, మనోవేదనకు గురవుతున్నందున సమాజం వీరిపట్ల సున్నితత్వాన్ని కలిగి ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రాజ్యాంగంలో మహిళలకు అనేక రక్షణలు ఉన్నప్పటికీ, మహిళా సమస్యల పరిష్కారానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక చట్టాలను, సంక్షేమ కార్యక్రమాలను రూపొందించినప్పటికీ.. వాటిని అమలుచేసే ప్రభుత్వ ఉద్యోగులకు ముఖ్యంగా పోలీసులకు మహిళల సమస్యలపట్ల ఉదారగుణం, మానవతాగుణం తప్పనిసరిగా ఉండాలి.
సామాజికంగా బలహీన వర్గాలు
1. మహిళలు
2. షెడ్యూల్డ్ కులాలు (SC)
3. షెడ్యూల్డ్ తెగలు (ST)
4. వెనుకబడిన తరగతులు (BC)
5. వితంతువులు
6. వికలాంగులు/దివ్యాంగులు
7. వృద్ధులు
8. బాలలు
- Tags
- nipuna special
- TSPSC
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు