అంతా కండ్ల ముందు కనిపిస్తుంటే..
‘స్వరాష్ట్రంలో ఏ అభివృద్ధి జరగలేదు. ప్రజలకు ఒనగూరిందేమీ లేదు. అన్ని అక్రమాలే జరిగాయి. విచారణ చేసి జైలుకు పంపుతం. ఒక్క ఉద్యోగం ఇవ్వలేదు. కాళేశ్వరం జలాలు ఒక్క ఎకరాకు అందలేదు..’ ఇలా రకరకాల అబద్ధపు మాటలు.. విష ప్రచారాలు చేయడం ఈ మధ్య కొందరికి అలవాటుగా మారింది. ప్రజలను పక్కదారి పట్టించేందుకు నానా యాతన పడుతున్నారు. స్వరాష్ట్ర పాలనలో ఆరేండ్లలోనే ఏ రాష్ట్రంలో జరుగనం త అభివృద్ధి, అమలవుతున్న పథకాలు, సంక్షేమ ఫలాలు కండ్లముందే కనిపిస్తున్నాయి. అయినా వాటిని చూడకుండా ప్రతిపక్ష నాయకులు వ్యవహరిస్తున్నారు.
స్వరాష్ట్రంలో ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదన్నట్లు దుష్ప్రచారాలకు దిగే ప్రతిపక్ష నాయకులు, కండ్లు తెరిచి చూస్తే వాస్తవాలు కనిపిస్తాయి. ప్రభుత్వ, ప్రైవేట్ రంగంలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలను కల్పించేందుకు.. సర్కారు ఆది నుంచీ ప్రణాళికాబద్ధంగా ముందుకు పోతున్నది. నిరుద్యోగులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెంచాలంటే వీలైనన్ని ఎక్కువ పరిశ్రమలు ఏర్పాటయ్యేలా చూసింది. అందుకోసం దేశంలో ఎక్కడా లేని విధంగా టీఎస్ ఐపాస్ తెచ్చింది. తాజాగా విడుదలైన ఇండియా స్కిల్స్ నివేదిక 2021ను పరిశీలిస్తే.. ఉద్యోగాల నైపుణ్యాల ఆధారంగా తెలంగాణ ఐదో స్థానంలో ఉన్నది. నగరాలపరంగా హైదరాబాద్ తొలిస్థానం దక్కించుకున్నది. పన్ను రాయితీలు, మౌలిక వసతుల కారణంగా తెలంగాణకు కంపెనీలు తరలివస్తున్నాయి. హైదరాబాద్‌కే పరిమితమైన ఐటీ రంగాన్ని వరంగల్, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్‌నగర్, నిజమాబాద్‌కు విస్తరించింది కండ్ల ముందు కనిపిస్తున్న నిజాలు కాదా? ఇక ఉద్యోగాలు ఇవ్వలేదంటూ అర్థరహిత విమర్శలెందుకు? 2014 నుంచి 2020 వరకు ప్రభుత్వ రంగంలో 1,33,699 ఉద్యోగాలు, అలాగే టీఎస్ ఐపాస్ ద్వారా 14 లక్షల ఉద్యోగాలు కల్పించినట్లు ఇటీవలే ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ఆధారాలతో సహా ప్రకటించారు.
తెలంగాణ ఏర్పడితే కరంటు కరువై అంధకారంలోకి వెళ్తుందని విషప్రచారం చేసిన సమైక్యవాదుల వాదనలు అబద్ధమని స్వరాష్ట్రం సాధించిన ఆరునెలల్లోనే విద్యుత్ కష్టాలను అధిగమించింది నిజం కాదా? రాష్ట్రంలోని 24.31 లక్షల పైచిలుకు వ్యవసాయ పంపుసెట్లకు 2018 నుంచి 24 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్ ఇస్తున్నది కండ్లముందు కనిపించే అభివృద్ధి కాదా? విద్యుదుత్పత్తి, పంపిణీ, సరఫరా విభాగాల్లో తెలంగాణ దేశంలోనే నంబర్‌వన్ అని సీపీఈడబ్ల్యూ ప్రకటించడం తెలంగాణ విజయాలకు సంకేతం కాదా?
మానవ నిర్మిత అద్భుతంగా ప్రపంచంలోనే అతిపెద్ద ఎత్తపోతల పథకమైన కాళేశ్వరం ప్రాజెక్టు నీళ్లు పొలాలకు చేరడం లేదా? పాలమూరు- రంగారెడ్డి, సీతారామ, దేవాదుల వంటి ప్రాజెక్టుల నిర్మాణాలు శరవేగంగా జరుగుతున్నాయి. మిషన్ కాకతీయ ద్వారా చెరువుల పునరుద్ధరణ పనులు పూర్తయ్యాయి. భూగర్భ జలమట్టం 4 మీటర్ల మేర పెరిగింది. 2014లో 35 లక్షల ఎకరాల్లో వరి పండిస్తే.. ప్రస్తుతం కోటి 4 లక్షల ఎకరాల్లో సాగవుతున్నది. దీనివల్ల తెలగాణ నేడు దేశానికే అన్నపూర్ణగా మారింది. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్ర ప్రభుత్వం ధాన్యంతోపాటు వివిధ రకాల పంటలను మద్దతు ధరకు కొనుగోలు చేస్తున్నది.
ఆరోగ్యరంగంలో కూడా విప్లవాత్మక మార్పులొచ్చాయి. కేసీఆర్ కిట్ పథకం అమల్లోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ దవాఖానల్లో ప్రసవాలు 20 శాతానికిపైగా పెరిగాయి. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన ఆరోగ్యసర్వే ప్రకారం అన్ని రాష్ర్టాలు కేంద్ర పాలిత ప్రాంతాల కంటే, తెలంగాణ దేశంలోనే టాప్‌లో నిలిచింది. రాష్ట్రంలో చేపలు, రొయ్యల పెంపకం కొత్త సంపదను సృష్టిస్తూ.. లక్షల మంది నిరుపేదలైన మత్స్యకారులకు కొండంత ఆసరాగా నిలుస్తున్నది. ఒక్క మాటలో చెప్పాలంటే సిరుల మీనాల తెలంగాణగా మారింది. గత నాలుగేండ్లలో మత్స్య సంపదపై వచ్చే ఆదాయం 107 శాతం పెరిగింది. రాష్ట్రంలో 2016-17లో చేపలు, రొయ్యలపై రూ.2,252 కోట్ల ఆదాయం వస్తే. 2019-20లో రూ.4,670 కోట్లకు చేరినట్లుగా మత్స్య శాఖ లెక్కలు చెప్తున్నాయి.
సమైక్య రాష్ట్రంలో కేవలం 19 బీసీ గురుకులాలుంటే అందులో కేవలం 6వేల మంది విద్యార్థులకు విద్య అందింది. కానీ, బీసీల బిడ్డలకు మంచి విద్యను అందించాలన్న లక్ష్యంతో ముఖ్యమంత్రి కేసీఆర్ విద్యార్థుల కోసం 261 గురుకుల పాఠశాలలు, 19 జూనియర్ కళాశాలలు, ఒక మహిళా డిగ్రీ కళాశాల ఏర్పాటు చేసి లక్షా 13వేల మందికి చదువు అందిస్తున్నది. బీసీ విద్యార్థులు విదేశాల్లో విద్యను అభ్యసించడానికి రూ.20 లక్షల గ్రాంటు ఇస్తున్న ఏకైక రాష్ట్రం దేశంలో తెలంగాణ మాత్రమే. అలాగే షెడ్యూల్ కులాల ప్రగతి కోసం ఏటా రూ.16వేల కోట్లకుపైగా, షెడ్యూల్ తెగల ప్రగతికి రూ.9వేల కోట్ల పైచిలుకు, మైనార్టీల ప్రగతి కోసం 1500 పైచిలుకు కోట్లతో సంక్షేమ కార్యక్రమాలు అమలుచేస్తున్నది కనిపించడం లేదా?
హరితహారం కింద ఇప్పటివరకు 2015-16 నుంచి 200 కోట్లకుపైగా మొక్కలు నాటారు. ఇటీవల ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా విడుదల చేసిన దేశవ్యాప్త నివేదికలో పచ్చదనం గణనీయంగా పెరుగుతున్న రాష్ర్టాల్లో తెలంగాణ ఒకటి అని పేర్కొన్నది. చరిత్రలో ఎప్పుడు లేని విధంగా పల్లె ప్రగతి కింద గ్రామ రూపురేఖలు మారుతున్నాయి. ఒకటి రెండు కాదు, ఏ రంగంలో చూసినా తెలంగాణ దేశంలో ముందు వరుసలో ఉన్నది. కానీ, కొందరు స్వప్రయోజనాల కోసం కండ్ల ముందు జరుగుతున్న అభివృద్ధిని, అమలవుతున్న సంక్షేమ పథకాలను చూడనిరాకరిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ప్రతిపక్ష నాయకుల మాటల్లో ఏది నిజం? ఏది అబద్ధమో అందరూ ఆలోచించాల్సిన అవసరమున్నది.
ఉద్యోగాల నైపుణ్యాల ఆధారంగా తెలంగాణ ఐదో స్థానంలో ఉన్నది.. పన్ను రాయితీలు, మౌలిక వసతుల కారణంగా తెలంగాణకు కంపెనీలు తరలివస్తున్నాయి.. ఇక 2014 నుంచి 2020 వరకు ప్రభుత్వ రంగంలో 1,33,699 ఉద్యోగాలు, అలాగే టీఎస్ ఐపాస్ ద్వారా 14 లక్షల ఉద్యోగాలు కల్పించినట్లు మంత్రి కేటీఆర్ ఆధారాలతో సహా ప్రకటించారు.
-కడపత్రి ప్రకాశ్‌రావు
- Tags
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు