తండ్రి బాటలో తనయ
అనేక త్యాగాల ఫలితంగా, అనేక సంవత్సరాల ప్రజా ఉద్యమాల అనంతరం.. కేసీఆర్ నాయకత్వం పర్యవసానంగా తెలంగాణ రాష్ర్టం అవతరించిన పిదప మహత్తర పరిణామాలు సంభవించాయి. ఇదంతా కవులు, రచయితలు, చరిత్రకారులు ఎన్నడూ విస్మరించలేని ఉజ్వల చరిత్ర- ఇటీవలి చరిత్రే. ప్రాచీన గ్రంథాలను, శిథిలాలలో దాగిన శాసనాలను, ఇతర చారిత్రక ఆధారాలను వెలికితీసి పరిశోధించవలసిన అవసరం లేదు. డెబ్బయి నాలుగు సంవత్సరాల స్వతంత్ర, ప్రజాస్వామ్య, రాజ్యాంగబద్ధ భారత చరిత్రలో ఇటీవలి తెలంగాణ రాష్ర్టం ఒక ఉజ్వల, మహోజ్వల అధ్యాయాన్ని రచించింది.
తెలంగాణ రాష్ర్టం, తెలంగాణ ప్రభుత్వం అవతరించిన పిదప రెండు సంవత్సరాలకే (2016లో) హైదరాబాద్లో స్వతంత్ర భారతంలో అప్పటివరకు ఎన్నడూ ఎక్కడా జరుగని ఒక చరిత్రాత్మక సంఘటన జరిగింది. రాష్ర్ట ప్రభుత్వం- తెలంగాణ రాష్ర్ట ముఖ్యమంత్రి స్వయంగా- అధికారికంగా రాజధాని హైదరాబాద్ నగరంలో తెలంగాణ బ్రాహ్మణ ప్రముఖుల సమావేశం ఏర్పాటుచేసింది. ఆ అధికారిక సమావేశానికి ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షత వహించారు. ముఖ్యమంత్రి పిలుపుపై బ్రాహ్మణ ప్రముఖులు కొందరు ఆ సమావేశంలో మాట్లాడినారు. రాష్ర్టంలోని బ్రాహ్మణుల సంక్షేమం, శ్రేయస్సు, అభివృద్ధికి అవసరమయిన అధికారిక చర్యల గురించి ఆలోచించడానికి ఈ సమావేశం జరిగింది. గౌరవనీయ ముఖ్యమంత్రి కేసీఆర్.. నన్ను గూడా మాట్లాడమన్నారు. ప్రత్యేకంగా ఆయనకు కృతజ్ఞ్ఞతలు తెలుపుతూ నేను మాట్లాడినాను- ‘బాపనోళ్లం మనను ఎవరు అడుగుతారు అని తెలంగాణ రాష్ర్టం ఏర్పడేవరకు బ్రాహ్మణులు దిగులు చెందేవారు. తెలంగాణ రాష్ర్టం ఏర్పడి కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన మరుక్షణమే పరిస్థితి మారింది. ఇతర సామాజిక వర్గాలతో సమానంగా తెలంగాణలో బ్రాహ్మణులకు తగిన గుర్తింపు, ప్రాధాన్యం లభిస్తున్నాయి; గౌరవం చేకూరుతున్నది..’. ఆ సమావేశం చర్చల ఫలితంగా అదే ముహూర్తాన ‘తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్తు’ అవతరించింది.
ముఖ్యమంత్రి కేసీఆర్ ఉదారంగా అందించిన ప్రోత్సాహం, అండదండలతో తెలంగాణ బ్రాహ్మణ పరిషత్తు విశాల ప్రాంగణ సొంత భవన నిర్మాణం పూర్తి అవుతున్నది, తెలంగాణ బ్రాహ్మణ సమాజానికి రాష్ర్ట ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల ఫలితాలన్నీ అందుబాటులోకి వస్తున్నాయి. స్వాతంత్య్రానంతరం, గత డెబ్బయి నాలుగు సంవత్సరాలలో బ్రాహ్మణ సమాజానికి ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలలో, పథకాలలో ఇతర వర్గాలతో సమానంగా ఒక పీట లభించడం, తగిన గుర్తింపు, సముచిత ప్రాధాన్యం లభించడం- అదీ నూతన, శైశవ తెలంగాణ రాష్ర్టంలో- బహుశ ఇదే ప్రథమ పర్యాయం. తెలంగాణ రాష్ట్రంలో, రాష్ట్ర ప్రభుత్వం దృష్టిలో ఎటువంటి విచక్షణ, వ్యత్యాసం లేకుండా అన్ని వర్గాలకు, ఇతర అగ్ర వర్గాలకు అన్ని రంగాలలో సమాన ప్రాధాన్యం లభించడం విశేషం. అగ్ర, ఉగ్ర వాదనల తారతమ్యాలు ఏవీ లేకుండా ముఖ్యమంత్రి కేసీఆర్ (తెలంగాణ రాష్ర్ట సాధన ఉద్యమంలో వలె), తెలంగాణ రాష్ర్ట ప్రభుత్వ విధానాలలో సమగ్ర, సమానత్వ మానవతా దృక్పథాన్ని ప్రదర్శిస్తున్నారు. ఆయన అచంచలంగా ప్రదర్శిస్తున్న ఈ సహేతుక దృక్పథం, అవధులు లేని ఉదారత్వం కారణంగా రాష్ర్టంలో ఏ వర్గానికయినా ఎన్నటికయినా, ఎన్నడయినా ఊహించని రీతిలో న్యాయం జరుగుతున్నది గాని అన్యాయం జరుగడం లేదు. సంతృప్తి కలుగుతున్నది గాని అసంతృప్తి చీకట్లు అలుముకోవడం లేదు.
ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ తత్వం, తెలంగాణ అభిమానం ఫలితంగా తెలంగాణ బిడ్డలకు- కాళోజీ, దాశరధి, పి.వి. తదితరులకు- సముచిత గౌరవస్థానం లభిస్తున్నది. ప్రధానమంత్రి పీవీ నరసింహారావు చేపట్టిన ఆర్థిక సంస్కరణలు, ఆయన అత్యంత సాహసవంతంగా తీసుకున్న ఇతర రాజకీయ, పరిపాలనాసంబంధ చర్యలు సకల భారతదేశానికి విస్మరించలేని లాభం కలిగించాయి. అయినప్పటికీ దేశంలో ఎక్కడా ఏ స్టేడియంకు, ఢిల్లీలో నిర్మిస్తున్న నూతన పార్లమెంటు భవనాలకు (పీవీ పదిహేడు భాషలలో- దేశ, విదేశ- గొప్ప మేధావి, గొప్ప పార్లమెంటేరియన్, ప్రజాస్వామ్యవాది) పీవీ పేరు పెట్టడం లేదు, ఎందువల్ల? పీవీ శత జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించడంలో కేసీఆర్ అద్వితీయ పాత్ర మొత్తం దేశానికి మార్గదర్శకమయినది. ఈ ఉదారత్వంలో, తెలంగాణ అస్తిత్వానికి శ్రీరామరక్షగా నిలువడంలో కేసీఆర్కు సాటి కేసీఆరే. ప్రపంచమంతట, నలుదిశల తెలంగాణ కీర్తిని విస్తరింపజేసిన బహుముఖ ప్రతిభాశాలి, అభ్యుదయ శీలి, సంస్కరణశీలి పీవీ సమున్నత వ్యక్తిత్వానికి నమోవాకాలు సమర్పించే అవకాశం తెలంగాణ ప్రజలకు, ముఖ్యంగా పట్టభద్రులకు కల్పించడానికి ముఖ్యమంత్రి, ఉద్యమ అధినేత కేసీఆర్ ఇప్పుడు శాసనమండలి ఎన్నికలలో ఒక అభ్యర్ధిగా పీవీ పుత్రిక సురభి వాణీదేవిని నిర్ణయించారు.
ముఖ్యమంత్రి పదవిని, అత్యంత క్లిష్ట పరిస్థితిలో (ఆరోగ్యం బాగా లేకున్నా) ప్రధానమంత్రి పదవిని విజయవంతంగా నిర్వహించడంలో తండ్రి (బాపు) పీవీకి వాణీదేవి అందించిన చేదోడును విస్మరించకుండా ఆమెను ఘనంగా గెలిపించడం తెలంగాణ ప్రజల ముఖ్యంగా పట్టభద్రుల ప్రధాన కర్తవ్యం. మహనీయుల మహత్తర జీవితాలలో మహిళామణుల నేపథ్య పాత్ర గణనీయమయినది. పీవీ ప్రధానమంత్రిత్వంలో వారి పుత్రిక శ్రీమతి వాణి ప్రచారరహితంగా నిర్వహించిన పాత్ర విలువయినది. విద్య, వినయం, సంస్కారం, సహృదయం అమూల్య భూషణాలుగా శోభిస్తున్న వనితారత్నం వాణీదేవి. అయిదు సంవత్సరాలు ప్రధానమంత్రిగా పీవీ యాభయి దేశాలలో (అమెరికాలో రెండు పర్యాయాలు, చైనాలో రెండు పర్యాయాలు) జరిపిన విస్తృత పర్యటనలలో ఆమె పాత్ర స్పష్టంగా కన్పిస్తుంది. ప్రజాస్వామ్యంలో వోటు ప్రాణతుల్యమయినదని, వోటిచ్చినప్పుడే ఉండాలె బుద్ధి అని కాళోజీ కవి చేసిన ఉద్బోధ ఈ సందర్భాన జ్ఞాపకం రావడం సహజం. తండ్రి బాటలో చిత్తశుద్ధితో పయనిస్తున్న, కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ అభ్యున్నతికి అంకితమైన సురభి వాణీదేవికి తెలంగాణ ప్రజల, ముఖ్యంగా పట్టభద్రుల శుభాకాంక్షలు, ఆశీస్సులు పుష్కలంగా ఉండగలవనడంలో సందేహం లేదు.
-దేవులపల్లి ప్రభాకరరావు
- Tags
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు