చరిత్ర మరిచిన మహాకవి మడుపతి నాగయ్య
తెలుగు సాహిత్యాన్ని, కవిత్వాన్ని, ఆయుర్వేద, మంత్ర, జ్యోతిష్యాలను సుసంపన్నంచేసి వెలుగులు విరజిమ్మిన ఎంతోమంది మహాకవి, పండితులు తెలంగాణలోనూ ఎందరో ఉన్నారు. అలాంటివారిలో మడుపతి నాగయ్య ఒకరు.
-తెలుగు సాహిత్యచరిత్రకు తెలియని ఈయన 16, 17వ శతాబ్దం నాటి కవి (16వ శతాబ్దం చివరి, 17వ శతాబ్దం మొదలు). ఇప్పటివరకు ఈయన గురించి తెలుగు ప్రజానీకానికి మన తెలంగాణకు అంతగా తెలియదు.
-ఈయన సర్వేశ్వర మహాత్మ్య-శివదీక్షా బోధ నియమావళి అనే ద్విపద కావ్యాన్ని మూడు అశ్వాసాల వరకు తాళపత్రగ్రంథాలపై రాశాడు. ఈ తాళపత్రగ్రంథం మెదక్ (జిల్లా) సదాశివపేటలోని ఓదెల సంగమేశ్వర్ ఇంటిలో లభించాయి (వీటిని వ్యాసకర్త శ్రీనివాస్ పరిష్కరించి, త్వరలో వెలుగులోకి తీసుకురానున్నారు). 265 పుటలు కలిగిన ఈ తాళపత్రగ్రంథాల్లో (శివ) హర దీక్ష నియామవళి, భక్తిత్వం, పంచాక్షరి (నమఃశివాయ), షడాక్షరి, ప్రణవాక్షరి ఓం నమఃశివాయ-మంత్రాల రహస్యాలు వాటి ఫలితాలు, తత్వజ్ఞానం గురించి ఎంతగానో వర్ణించాడు. ఈ మహాగ్రంథం ఇప్పటివరకు ముద్రణకు నోచుకోలేదు.
-తాను రాసిన ఒక తాళపత్ర కమ్మ నాలుగో పేజీలో గురువును బ్రహ్మవిష్ణుశ్చ-రుద్రశ్చ-ఐశ్వర్యశ్చ సదాశివః ఏతే గర్భగతఃశ్చైవ తస్మైశ్రీగురవేనమః అని గురునామస్మరణతో విన్నవించారు. పూర్వం, శంకరాచార్యుల శిష్యులైన తోటకాచార్యులు, హస్తములకాచార్యులు అనుసరించిన శైవ సంప్రదాయ పద్ధతి ఇందులో స్పష్టంగా మనకు కనిపిస్తుంది.
-అక్కడక్కడ మనకు కొన్ని కొన్ని పదాలు పూర్వసరళ గ్రాంథిక భాషలో (జానుతెనుంగులో) ఉన్నాయి. భాషపై కవికి మంచి పట్టు ఉన్నప్పటికీ అక్కడక్కడ కొన్ని పదదోషాలు కనిపిస్తున్నాయి.
తన గురువైన శ్రీర్యావణౌశిద్ద (రేవణోసిద్ద) లింగయ్య శిష్యుండను శ్రీమత్కొలనుపాక సూ(సో)మేశ్వర అంబామల్లేశ్వర! పాదసేవకుడను చంన్న (చెన్న) మల్లయ్య పుతృ (త్రు)ండను, తన సతియైన వీరంమ్మ కవి కుమారుండను నాగయ్య అనునామంబు గలవాడను అని తల్లి, తండ్రి, గురువు, బోధ గురువుతో విన్నవించుకున్నాడు
-ఇందులో అక్షరానికి లక్ష చొప్పున శివ పంచాక్షరి మహామంత్రాన్ని జపమంత్రానుష్టానంగావిస్తూ శివున్ని ధ్యానిస్తే సాక్షాత్తు ఆ మహాశివుడు ప్రత్యక్షం అవుతాడని సెలవిచ్చారు. ఇది అనుభవపూర్వ అనుష్టాన మహాశైవ (శివ) తంత్య్రం అని కూడా స్పష్టంగా తన ద్విపదకావ్యంలో శివదీక్ష గురించి స్పష్టంగా పొందుపర్చాడు. అంతేగాక తెలిసీతెలియక రాసినాను అధికారుడ నేనుగాను అని అనుకూలముతో సవినయంగా విన్నవించుకున్నాడు. పర్ణన హవేళి (లి) అనే గ్రామము నేడు కరీంనగర్ జిల్లాలో కూడా ఉంది.
-అయితే నాటి వ్యాఘ్ర నగరి (పురి) నేటి పుల్లూరుబండపై సిద్దుల సొరంగంలో (శివ-నారసింహ్మ) రాసినట్లుగా, ఈ వంశీకులు చెబుతున్నారు. మడుపతి సంగయ్య స్వామి, శైవకవి ఈ వంశస్థుడని కూడా కొందరు చెబుతున్నారు.
-తాళపత్ర కమ్మ 10.. నందు ద్విపదలో అంతటా సర్వేశ్వరుడే ఉన్నాడంటాడు అంతేకాక
పరమేశునీశ్వరు పార్వతి నాథు!
వరదుని సద్భక్తువత్చ(త్స)లు గొల్వు!
నెవ్వండు బోధించు నెవ్వండుచేనూపు!
ఎవ్వండు హరియంచున్ ప్రపంచంబున!
నతని మహాదేవుడని నిశ్చయించి
నతనిచేగాని బాయదు భబబాధ!
వేరేదైవంబుల వెదకకు కదల బారకు!
శివునాత్ముపదిలంబరచు!!!
-అని అంటూనే వేరేదైవాన్ని వెదకక శివున్నే స్మరించమంటాడు అక్కడక్కడా పద్యం శ్లోకాలు పాదం నియమం మించి ఉన్నాయి, అయితే పూర్తి భావ సంపదకు తోడ్పడుతాయి అనుటలో ఏ మాత్రం సందేహంలేదు. ఇందులో లింగధారణ వివరాలు-లింగపూజ-శివనామస్మరణ ఉండాలంటూనే డంబాచారం విషయంలో ముక్కుసూటిగా చెప్పినాడు. పరోపకారం-గురుశిష్యుల సంబంధం-మైతీభావం తల్లిదండ్రులయందు సోదరీసోదరమణులయందు భక్తిభావనలు ఎలా ఉండాలన్న విషయాలనుకూడా చెప్పినాడు. దాదాపు 200 తాళపత్ర కమ్మల్లో ఉన్న పూర్తి కావ్య, ద్విపద, గ్రంథ సమాచారం ఉంది. ఇలాంటి అజ్ఞాత (మహా) కవులు-పండితులు, వైద్యవిద్వానులు, జోతిష్య తర్క, మీమాంస మహామహులు మన తెలంగాణ మాగాణంలో ఉన్నారు. ఇలాంటి వారిని వెలుగులోకి తెచ్చే ప్రయత్నం జరుగుతుంది.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు