పరీక్ష ఏదైనా.. gs ఒక్కటే
కాంపిటేటివ్ ఎగ్జామ్స్‌లో సాధారణంగా ఒక్కో పరీక్షకు ఒక్కో సిలబస్ ఉంటుంది. మనం ఏ పరీక్ష రాస్తున్నామో దానికి సంబంధించిన సిలబస్‌ను ముందుగా తెలుసుకొని అందులో అంశాలను చదవాలి. అయితే అన్ని పరీక్షలకు ఒక సబ్జెక్టు కామన్‌గా ఉంటుంది. అదే జనరల్ స్టడీస్. గ్రూప్-4 నుంచి గ్రూప్-1 వరకు, పంచాయతీ సెక్రెటరీ, వీఆర్వో, బ్యాంక్ పీవోస్, పోలీస్ కానిస్టేబుల్ ఇలా ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ తీసుకున్నా అందులో అందరూ కామన్‌గా చదవాల్సిన సబ్జెక్టు జనరల్ స్టడీస్. అయితే పరీక్ష స్థాయిని బట్టి ప్రశ్నలు అడుగుతారు.
జనరల్ స్టడీస్‌లో ప్రధానంగా 10 అంశాలు. సైన్స్‌లో 4 సబ్జెక్టులు. ఆర్ట్స్‌లో నాలుగు సబ్జె క్టులు. వీటికి అదనంగా అర్థమెటిక్, జీకే అండ్ కరెంట్ అఫైర్స్. సైన్స్‌లో భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం, వృక్షశాస్త్రం, జంతుశాస్త్రం. ఆర్ట్స్‌లో భూగోళ శాస్త్రం, చరిత్ర, పౌరశాస్త్రం, ఆర్థిక శాస్త్రం. టెన్త్ క్లాస్‌లోపు ఎన్సీఈఆర్టీ, తెలుగు అకడమీ పుస్తకాలపై పట్టుసాధిస్తే సగం విజయం సాధించినట్లే.
తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగులకు ఉపాధి కల్పించేందుకు ఇటు ప్రభుత్వరంగం, అటు ప్రైవేటు రంగాలను ఏక కాలంలో సమాయత్తం చేస్తోంది. ముఖ్యంగా ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ అభ్యర్థులకు జరిగిన అన్యాయాన్ని, నష్టాన్ని భర్తీచేసేందుకు పూర్తి పారదర్శకంగా ఉద్యోగాల భర్తీకి శ్రీకారం చుట్టుంది.
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా దాదాపు లక్ష ఉద్యోగాల భర్తీకి ముమ్మర ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగానే యుద్ధప్రాతిపదికన సిలబస్‌లో కొన్ని మార్పులు కూడా ప్రతిపాదించారు. అయితే ఈ మార్పులపై ఉద్యోగార్థుల్లో అనేక భయాలు, ఆందోళనలు ఉన్నాయి. వాస్తవానికి ఇప్పటి వరకు కొనసాగుతున్న సిలబస్‌ను భవిష్యత్‌లో కూడా కొనసాగిస్తూనే తెలంగాణకు సంబంధించిన అంశాలను అదనంగా చేర్చనున్నారు. ఇది అనివార్యం కూడా. దశాబ్దాల పోరాటం, ఆత్మబలిదానాల ఫలితంగా ఏర్పడిన తెలంగాణ రాష్ర్టానికి దేశ చరిత్రలో ప్రత్యేక స్థానం ఉంది. అందువల్ల ఈ రాష్ట్రంలో పనిచేసే ప్రతి ఉద్యోగికి తెలంగాణకు సంబంధించిన అన్ని విషయాలపై స్పష్టమైన అవగాహన, లోతైన విజ్ఞానం తప్పనిసరిగా ఉండాలనే సదుద్దేశంతోనే సిలబస్‌లో కొన్ని మార్పులు చేయనున్నారు.
తెలంగాణ జాగ్రఫిపై దృష్టిసారించాలి భారతదేశ, ప్రపంచ భౌగోళికశాస్త్రం విభాగం నుంచి వచ్చే ప్రశ్నల్లో ఎక్కువగా ఫిజికల్, సోషల్, ఎకనమిక్ జాగ్రఫికి సంబంధించిన అంశాలు ఉంటాయి.
ముఖ్యంగా భారతదేశంలో సహజ వనరులు, వ్యవసాయ రంగం, వాటిపై ఆధారపడిన రంగాలు, వాటి ప్రభావంపై ప్రశ్నలు వస్తున్నాయి. అందువల్ల ఇండియన్ జాగ్రఫిని ఎంత లోతుగా అర్థం చేసుకోగలిగితే మూడో పేపర్లోని ఎకానమీ సంబంధిత ప్రశ్నలకు సులభంగా సమాధానాలు గుర్తించడానికి అవకాశం ఉంటుంది.
ఉదా : సాధారణంగా అల్యూమినియం కింది వాటిలో ఏ రూపంలో లభించును ? (జవాబు 2)
1) పైరెట్ 2) బాక్సైట్ 3) ఇల్మానైట్ 4) ప్యూర్ మెటల్
ప్రపంచ భౌగోళిక సంబంధిత విషయాల్లో ప్రధానంగా వాతావరణంలో సహజసిద్ధంగా కలిగే మార్పులు, జలసంధులు, ఎత్తయిన పర్వతాలు, ముఖ్యమైన నదులు, ఖనిజ లభ్యత వంటివి పరీక్ష కోణంలో ముఖ్యమైనవి. జాగ్రఫిని చదివేటప్పుడు అట్లాస్‌ను ముందుపెట్టుకొని నిశితంగా పరిశీలిస్తూ చదవడం అలవాటు చేసుకోగలిగితే అత్యంత కఠినమైన ప్రశ్నలకు కూడా ఏదో ఒక విధంగా సరైన సమాధానాన్ని గుర్తించడానికి అవకాశం ఉంటుంది. తెలంగాణ ఏర్పడిన నేపథ్యంలో తెలంగాణ జాగ్రఫి నుంచి 2నుంచి 3 ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. తెలంగాణ నైస్వర్గిక స్వరూపం, జనాభా, పరిశ్రలు, రవాణా తదిరత అంశాల నుంచి ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది.
జాతీయోద్యమం నుంచి ఎక్కువ ప్రశ్నలు
భారతదేశ చరిత్ర సుదీర్ఘమైనది. అయినప్పటికీ సామాజిక, ఆర్థిక, రాజకీయ అంశాలకు సంబంధించి స్థూల అవగాహన ఉంటే ఎక్కువ ప్రశ్నలకు సమాధానాలు గుర్తించవచ్చు. ఇందు లో ప్రాచీన, మధ్యయుగ భారతదేశ చరిత్ర నుంచి తక్కువ ప్రశ్నలువస్తాయి. ఇవికూడా చరిత్రను మలుపుతిప్పిన సంఘటనలకు సంబంధిం చినవిగా ఉంటాయి.
ఉదా : అలెగ్జాండర్ ఇండియాపై దండయాత్ర చేసినది ? (1)
1) 327 బి.సి
2) 303 బి.సి
3) 302 బి.సి 4) 298 బి.సి
ఇక భారత జాతీయోద్యమం నుంచి అడిగిన ప్రశ్నల్లో 19వ శతాబ్దంలో సాంఘిక సంస్కరణ ఉద్యమాలు, జాతీయోద్యమం జరిగిన తీరు, జాతీయోద్యమంలో క్రియాశీల పాత్ర పోషించిన నాయకులు, సంస్థలు, పత్రికలు, ఆధునిక భారతదేశ చరిత్రను పూర్తిగా మార్చివేసిన ఉద్యమాలు, సంఘటనలు పరీక్ష కోణంలో అత్యంత కీలకం. వందేమాతర ఉద్యమం, హోంరూల్ ఉద్యమం, సహాయ నిరాకరణ ఉద్యమం, శాసనోల్లంఘన ఉద్యమం, క్విట్ ఇండియా ఉద్యమం, భారతదేశానికి స్వాతంత్య్రం రావడం మొదలైన అంశాలు ప్రధానమైనవి. చరిత్రను కాలానుగుణంగా వివిధ సంఘటనలన ఆధారంగా గుర్తుంచుకోవడానికి ప్రయత్నిస్తే కఠినమైన ప్రశ్నలకు కూడా ఏదో విధంగా సమాధానాలు గుర్తించవచ్చు. క్రానాలజీని గుర్తించుకుంటే 10 ప్రశ్నల వరకు సులభంగా ఆన్సర్ చేయవచ్చు.
ఆర్టికల్స్ వారీగా అధ్యయనం చేయాలి
పాలిటీలో భాగంగా భారత రాజ్యాంగం నుంచి ప్రశ్నలు అడుగుతారు. రాజ్యాంగం కీలక భావనలు, షెడ్యూల్స్, విభాగాల వివరాలు, హక్కులు విధులు, రాష్ట్రపతి, గవర్నర్ అధికారాలు, విధులు. న్యాయవ్యవస్థ పరిధి, ఆర్థిక సంఘం, తదితర అంశాల నుంచి ఎక్కువగా ప్రశ్నలు అడుగుతారు. అలాగే ఎకనామిక్స్ నుంచి కీలకభావనలు, భారతదేశ ఆర్థిక వ్యవస్థ, ప్రణాళికలు-లక్ష్యాలు, ఎగుమతులు, దిగుమతులు ఇటీవల ఏర్పడిన నీతి ఆయోగ్ రూపకల్పన, బడ్జెట్ నుంచి ప్రశ్నలు ఎక్కువగా అడుగుతారు. కాకపోతే ఎకానమీని కరెంట్ అఫైర్స్‌తో లింకు చేసి చదవాల్సి ఉంటుంది.
విపత్తు నిర్వహణలో జాగ్రత్త పడాలి
ప్రభుత్వ యంత్రాంగంలో అధిక ప్రాధాన్యం ఉంటుంది. ముఖ్యంగా రెవెన్యూ, ఫైర్ సర్వీసెస్, పోలీస్ విభాగాలు విపత్తులు సంభవించినపుడు క్రియాశీల పాత్ర పోషించాల్సి ఉంటుంది. గ్రూప్-2 ద్వారా భర్తీచేయబడే డిప్యూటీ తహసీల్దార్, పదోన్నతుల్లో తహసీల్దార్, ఆతర్వాత ఆర్డీఓ చివరకు కలెక్టర్ కూడా కావచ్చు (అతిచిన్న వయస్సులోఎస్సీ, ఎస్టీ అభ్యర్థులైతే). అందువల్ల ఈ విభాగం గురించి క్షుణ్ణంగా తెలుసుకోవాలి.
విపత్తు నిర్వహణ సిలబస్ చాలా తక్కువ. ప్రశ్నలు ఎక్కువగా పునరావృతం అవుతున్నాయి. ప్రధానంగా విపత్తు అనగా ? విపత్తు నిర్వహణ చట్టంలోని అంశాలు, ప్రధాన విపత్తులు, వాటి ద్వారా జరిగే నష్టం, విపత్తు నిర్వహణ యంత్రాంగం వంటి అంశాలను గురించి ప్రతిసారి అనేక ప్రశ్నలు వస్తున్నాయి. మిగతా విభాగాల్లో చదివిన అంశాల నుంచి తక్కువ ప్రశ్నలు వచ్చి చదవని విభాగాల నుంచి ఎక్కవ ప్రశ్నలు వస్తుండగా విపత్తు నిర్వహణలో చదివిన విషయాలన్నీ ప్రశ్నలుగా కన్పిస్తున్నాయి. కావున ఎట్టి పరిస్థితుల్లో ఈ అంశానికి అధిక ప్రాధాన్యం ఇవ్వాలి.
ఉదా : జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీ చైర్మన్‌గా ఎవరు వ్యవహరిస్తారు ?
1) రాష్ట్రపతి 2) ప్రధానమంత్రి
3) హోంమంత్రి 4) రక్షణమంత్రి (జవాబు 2)
జనరల్ మెంటల్ ఎబిలిటి
అభ్యర్థి సృజనాత్మకతను, తార్కిక సామర్థ్యాన్ని, వేగంగా ఒక సమస్యకు పరిష్కారాన్ని కనుగొనే సామర్థ్యాన్ని పరీక్షించే ఉద్దేశంతో ఈ విభాగాన్ని రూపొందించారు. ఇందులో రీజనింగ్, అనలైటికల్ ఎబిలిటి సంబంధిత ప్రశ్నలు ఎక్కువగా ఉంటాయి. లాజికల్ రీజనింగ్ అంశానికి సంబంధించిన సూత్రాలను, లాజిక్స్‌ను ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. చిత్రాల రూపంలో ప్రశ్నలు ఇచ్చి ఇందులో ఎన్ని త్రిభుజాలు, చతురస్రాలు, స్క్వెయర్లు ఉన్నాయని దిశల ఆధారంగా ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది. సిరీస్, పని-కాలం, శాతాలు, సరాసరివేగం, కోడింగ్, డీ కోడింగ్, సంభావ్యత, గడియారం, రక్తసంబంధాలు, వయసు ఆధారిత ప్రశ్నలు ఎక్కువగా వస్తున్నాయి. దీనికిగాను గణితానికి సంబంధించిన పాఠశాల స్థాయి పాఠ్యపుస్తకాల్లో గల ప్రాథమిక సూత్రాలను నేర్చుకొని నిరంతరం ప్రాక్టీసు చేయడం మంచిది.
ఉదా : 1. 5,12,19,26,33 ? (జవాబు 2)
1) 38 2) 40 3) 43 4) 48
2. ZA, YB, XC, WD …..UF
1)SH 2) EV
3)VE 4) HS (జవాబు 3)
మెంటల్ ఎబిలిటి విభాగంలో వచ్చేప్రశ్నల్లో దాదాపు 50 శాతం సాధారణ పరిజ్ఞానంతో ఆర్ట్స్ అభ్యర్థులు కూడా జవాబులు గుర్తించడానికి వీలుగా ఉంటాయి. మిగతా 50 శాతం ప్రశ్నల్లో మరింత సీరియస్‌గా కష్టపడి నిరంతరం సాధన చేయగలిగితే ఎక్కువ ప్రశ్నలకు సమాధానాలు గుర్తించడానికి అవకాశం ఉంటుంది.
జనరల్ స్టడీస్‌లో మార్పులు లేవు
జనరల్ స్టడీస్ ఒక సముద్రం లాంటిది. ఎంత చదివినా ఇంకా చదవాల్సింది మిగిలే ఉంటుంది. కాబట్టి వ్యూహాత్మకంగా, ప్రణాళికాబద్ధంగా ప్రిపేర్ కావాలి. ఈ సబ్జెక్టులో ఎలాంటి మార్పులు చేయలేదు కాబట్టి ప్రతి విభాగానికి సంబంధించి ఇప్పటి వరకు చదువుతున్న ప్రామాణిక పుస్తకాలను కొనసాగించడం మంచిది. మార్కెట్లొ కనబడే ప్రతి పుస్తకాన్ని చదవడానికి ప్రయత్నించడం అంతగా ఉపయోగపడదు.
కొంతకాలంగా రాష్ట్రంలోని నిరుద్యోగులు పోటీ పరీక్షల సిలబస్‌లో మార్పుల గురించి ఆందోళన చెందుతున్నారు. ప్రతిచోటా ఇదే చర్చనీయాంశంగా మారింది. అయితే సిలబస్ రూపకల్పనకు నియమించిన కమిటీ మాత్రం జనరల్ స్టడీస్ సిలబస్ యథాతథంగా కొనసాగిస్తూనే ఇతర అంశాల్లో మార్పులు, చేర్పులను అంగీకరించింది.
జనరల్ స్టడీస్ అనేది అన్ని పోటీ పరీక్షల్లో తప్పనిసరిగా ఉండే సబ్జెక్టు. అంతేకాకుండా పరీక్ష రాసే ప్రతి అభ్యర్థి తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన అంశాలను సిలబస్‌గా కలిగిఉన్నందున ఈ సబ్జెక్టులో ప్రావీణ్యం సంపాదించకుండా విజయం సాధించలేరు. అందువల్ల ప్రిపరేషన్‌ను ఇకముందుకూడా కొనసాగించడం తప్పనిసరి.
ప్రస్తుతమున్న జనరల్ స్టడీస్‌లోని అంశాలు
– జనరల్ సైన్స్,
– భారతదేశ చరిత్ర, స్వాతంత్య్రోద్యమం
– ప్రపంచ, భారతదేశ భౌగోళిక అంశాలు
– ఇండియన్ పాలిటీ, రాజ్యాంగం
– భారత ఆర్థిక వ్యవస్థ
– విపత్తు నిర్వహణ
– జీకే అండ్ కరెంట్ అఫైర్స్
– మెంటల్ ఎబిలిటీ, రీజనింగ్ వంటి విభాగాలు నూతనంగా ప్రవేశపెట్టబోతున్న సిలబస్‌లో కూడా ఉంటాయి. కావున అభ్యర్థులు జనరల్ స్టడీస్ విషయంలో ఎలాంటి ఆందోళనలు చెందాల్సిన అవసరం లేదు.
– అయితే నూతన జనరల్ స్టడీస్‌లో కూడా తెలంగాణ ముద్ర స్పష్టంగా కనబడనున్నది.
ముఖ్యంగా కరెంట్ అఫైర్స్‌లో అంతర్జాతీయ, జాతీయ అంశాలతో పాటు తెలంగాణకు సబంధించిన వర్ధమాన అంశాలను కూడా క్షుణ్ణంగా తెలుసుకోవాలి. భారతదేశ చరిత్రలో భాగంగా దక్షిణ భారతదేశ చరిత్రలో అంతర్భాగంగా తెలంగాణ చరిత్ర నుంచి, భారతదేశ భౌగోళిక అంశాల్లో భాగంగా తెలంగాణ భౌగోళిక అంశాల నుంచి, భారత ఆర్థిక వ్యవస్థలో భాగంగా తెలంగాణ ఆర్థిక వ్యవస్థ నుంచి కూడా ఆశించిన స్థాయిలో ప్రశ్నలు రావడానికి అవకాశం ఉంది. మొత్తంగా చూస్తే జనరల్‌స్టడీస్‌లోని వివిధ విభాగాల్లో అంతర్భాగంగా తెలంగాణకు సంబంధించి కనీసం 15 నుంచి 20 ప్రశ్నలు రావొచ్చు. కాబట్టి జనరల్ స్టడీస్‌ను చదివేటప్పుడు సంబంధిత విభాగంలో తెలంగాణ ప్రస్తావన ఉంటే తప్పనిసరిగా దాన్ని అధ్యయనం చేయాలి.
అంశం ప్రశ్నల సంఖ్య సుమారుగా
జనరల్ సైన్స్ — 30-40
భారతదేశ చరిత్ర — 20-30
పాలిటీ — 14-16
ఎకానమీ — 15-20
జాగ్రఫి — 20-30
డిజాస్టర్ మేనేజ్మెంట్ — 10-15
మెంటల్ ఎబిలిటీ — 17-24
కరెంట్ అఫైర్స్ — 25-40
జనరల్ నాలెడ్జ్ — 5-10
పోటీ ఎక్కువ – జాగ్రత్త..!
-గత నాలుగేళ్లుగా ఎలాంటి నోటిఫికేషన్ లేకపోవడం వల్ల పోటీ తీవ్రంగా ఉండే అవకాశం ఉంది. ఉమ్మడి రాష్ట్రం లో తెలంగాణ అభ్యర్థులకు ఆశించిన స్థాయిలో ఉద్యోగాలు రానందున సహజంగానే రాబోయే నోటిఫికేషన్లలో గట్టి పోటీ ఉండనుంది. కాబట్టి మరింత కష్టపడి చదివితే ఉద్యోగాన్ని సంపాదించడం సులువవుతుంది.
-ఉమ్మడి రాష్ట్రంలో రాష్ట్రస్థాయి ఉద్యోగాల్లో అత్యధికం ఆంధ్రప్రాంత అభ్యర్థులకే దక్కడం వల్ల తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగింది. స్వరాష్ట్రంలో ఉద్యోగాలన్నీ స్థానికులకే లభించనుండటంతో వుద్యోగార్థులు రెట్టింపు ఉత్సాహంతో ప్రిపరేషన్‌ను కొనసాగిస్తున్నారు. సివిల్స్, గ్రూప్-I, గ్రూప్-II లాంటి పరీక్షలకు సంబంధించి ఇప్పటికే కోచింగ్ తీసుకొని, ప్రిపేరై, నోటిఫికేషన్ల కోసం చూస్తున్న అభ్యర్థులు ఈసారి గట్టి పోటీ ఇవ్వనున్నారు. అందువల్ల కొత్తగా ప్రిపేరయ్యే అభ్యర్థులు మరింత ఎక్కువ కష్టపడాల్సి ఉంటుంది.
-జనరల్ స్టడీస్‌లో గత కొంతకాలంగా అనేక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. నూతనంగా వస్తున్న మార్పు లు, సంస్కరణలు, పరిశోధనలు, అంతర్జాతీయ పరిణామాలు మొదలుకొని, రాష్ట్రంలో చోటుచేసుకుంటున్న పరిణామాలను కూడా నిశితంగా పరిశీలిస్తే తప్ప పరీక్షలో విజయం సాధించలేరు. కాబట్టి మరింత అప్రమత్తంగా ఉండాలి.
కరైంట్ అఫైర్స్ కీలకం
-ప్రతి పోటీ పరీక్షలో సాధారణంగా రెండు రకాల అంశా లు ఉంటాయి.
-1) సబ్జెక్టు మౌలికాంశాలు, సిద్ధాంతాలు, వివరణలు
-2) ఆయా సబ్జెక్టులకు సంబంధించి గత కొంతకాలంగా జరిగిన పరిణామాలు, పరిశోధనల ఫలితాలు, ప్రభుత్వ నిర్ణయాలు, విధానాలు, అనువర్తిత అంశాలు ఉంటాయి.
-రెండో అంశం కరెంట్ అఫైర్స్ రూపంలో ఉంటుంది. ప్రతి సబ్జెక్టు ప్రిపరేషన్ పూర్తవ్వాలంటే దానికి సంబంధించిన వర్థమాన సంఘటనల గురించి కూడా అప్పనిసరిగా తెలుసుకొని ఉండాలి. ఒక రకంగా చెప్పాలంటే జనరల్ స్టడీస్‌లో అత్యధిక మార్కులు సంపాదించాలంటే కరెంట్ అఫైర్స్‌పై పూర్తి పట్టు ఉండాల్సిందే. అంతేకాకుండా కరెంట్ అఫైర్స్ చదవడం వల్ల ప్రతి సబ్జెక్టులో నూతనత్వం కనబడటంతోపాటు చదివేటప్పుడు ఇం ట్రెస్ట్ కూడా పెరుగుతుంది. అందువల్ల ప్రతిరోజూ న్యూస్‌పేపర్స్, నెలవారి కాంపిటేటివ్ మేగజైన్స్ చదవడం అలవాటు చేసుకోవాలి.
కరెంట్ అఫైర్స్
కరెంట్ ఈవెంట్స్ విభిన్న అంశాలకు సంబంధించి అడుగుతున్నారు. కాబట్టి ఈ విభాగాన్ని విస్తృతంగా అధ్యయనం చేయాలి. ముఖ్యంగా అంతర్జాతీయ సదస్సులు, అంతర్జాతీయ సంస్థల్లో ప్రముఖుల నియామకాలు, నోబెల్ బహుమతులు, అవార్డులు, అంతర్జాతీయ సంబంధాల వంటివి ముఖ్యమైనవి. కాగా జాతీయస్థాయిలో జరిగే పరిణామాలు, ప్రభుత్వ నిర్ణయాలు, పథకాలు, క్రీడలు, నియామకాలు, వివాదాస్పద అంశాలు మొదలైనవి తెలుసుకోవాలి. కరెంట్ ఈవెంట్స్ పరిధి గరిష్ఠంగా రెండేళ్లు కాగా, కనిష్ఠంగా ఆరు నెలలు. అందువల్ల ఎక్కువ విషయాలు తెలుసుకోవడానికి ప్రయత్నించాలి. దానికిగాను వార్తా పత్రికలు, మేగజైన్స్ రెగ్యులర్‌గా ఫాలో కావాలి.
జనరల్ నాలెడ్జ్
జనల్ స్టడీస్‌లోని వివిధ విభాగాల్లో అత్యంత కీలకమైన సంఘటనలు, విశిష్టమైన అంశాలను పట్టిక రూపంలో రూపొందించుకొని చదివితే దానినే జనరల్ నాలెడ్జ్ అంటారు. మొదటిది, చివరిది, ఎత్తయినది, పొడవైనది, అత్యంత ప్రాచీనమైనది, వంటి వాటిని గుర్తుపెట్టుకోవాలి.అయితే ఎక్కువ కాలం గుర్తుపెట్టుకోవాలంటే ఎక్కువ సార్లు రివిజన్ చేయాలి.
గత ప్రశ్నపత్రాలు కీలకం
జనరల్ స్టడీస్ ఒక సముద్రం లాంటిది. అందువల్ల ఇందులో అత్యధిక మార్కులు పొందాలంటే కనబడిన ప్రతి బుక్‌ను, ప్రతి అంశాన్ని చదవాలని చాలా మంది అనుకుంటుంటారు. అయితే ఇది కేవలం హార్డ్‌వర్క్ చేశామన్న తృప్తి కలిగిస్తుంది తప్ప అంతి మ విజయానికి పెద్దగా ఉపయోగపడదు. జీఎస్‌లో విజయం సాధించాలంటే ప్రతి విభాగంలో, ప్రతి అంశం నుంచి గతంలో వచ్చిన ప్రశ్నలను క్షుణ్ణంగా పరిశీలించగలిగితే పరీక్ష కోణంలో ముఖ్యమైనది ఏది? ఏది అవసరం లేదు? అన్న విషయం తెలుస్తుంది. ఫలితంగా సబ్జెక్టుపై పట్టు వస్తుంది. గత ప్రశ్నపత్రాల నుంచి ప్రత్యక్షంగానో, పరోక్షంగానో 40 ప్రశ్నలు రావడానికి అవకాశం ఉంది కాబట్టి వాటిపై ప్రధానంగా దృష్టి సారించాలి.
జనరల్ సైన్స్
ఈ విభాగానికి చెందిన ప్రశ్నలు ఎక్కువగా సైన్స్‌కు సంబంధించిన సాధారణ పరిజ్ఞానం, సాధారణ అనువర్తనాలు, నిత్యం గమనించే అంశాలకు సంబంధించినవి ఉంటాయి. దీనికోసం సైన్స్‌లో ప్రత్యేక డిగ్రీ అవసరం లేదని సిలబస్‌లో పేర్కొన్నారు. కాబట్టి సైన్స్ బ్యాగ్రౌండ్ కాని అభ్యర్థులు భయపడాల్సిన అవసరం లేదు. అయితే సైన్స్‌కు సంబంధించిన అనువర్తనాలను కూడా అర్థం చేసుకొని గుర్తుంచుకోవాలంటే ప్రాథమిక భావనలు (Fundamental Cncepts) తప్పని సరిగా తెలుసుకోవాలి. దీనికోసం పాఠశాల స్థాయి సైన్స్ పుస్తకాలు చదవడం తప్పనిసరి.
జనరల్ సైన్స్ ప్రాథమిక లక్షణాలను తెలుసుకోగలిగితే అనువర్తనాలు సులభంగా అర్థం చేసుకోవచ్చు. జీవశాస్త్రంలో జంతు, వృక్ష శాస్ర్తాల గురించిన మౌలిక సమాచారాన్ని అధ్యయనం చేయాలి. జంతుశాస్త్రంలో మానవ శరీర ధర్మశాస్త్రం నుంచి కనీసం ఐదు ప్రశ్నలు వస్తున్నాయి. కాబట్టి ఈ అంశాన్ని క్షుణ్ణంగా చదవాలి. రక్త వర్గీకరణ, శ్వాసక్రియ, రక్తప్రసరణ వ్యవస్థ, జీర్ణ వ్యవస్థ, విసర్జక వ్యవస్థ వంటి శరీర ధర్మ ప్రక్రియలను విడివిడిగా చదువుతూ వాటి మధ్య ఉన్నసంబంధాన్ని కూడా తెలుసుకోవాలి.
ఉదా : సిరా రక్తాన్ని ఆక్సిజన్ కోసం ఉపిరితిత్తులకు చేరవేసేది ? (2)
1) పుపుస సిరలు 2) పుపుస ధమనులు
3) కుడి జఠరికలు 4) మహాసిర
మానవుని శరీరంలో అన్ని ధమనులు గుండె నుంచి మంచి రక్తాన్ని శరీర భాగాలకు తీసుకెళ్తాయి. కానీ పుపుస ధమని మాత్రం చెడు రక్తాన్ని ఊపిరి తిత్తులకు చేరుస్తుంది. ఇలాంటి అతీతమైన(Exception) విషయాలను పరీక్షలో అడుగుతారు. కాబట్టి చదివేటప్పుడు నిశితంగా పరిశీలిస్తుండాలి. అదేవిధంగా మెమోరీతో సంబంధం లేకుండా కేవలం కామన్సెన్స్, లాజిక్‌తో కూడా సమాధానాలను గుర్తించాల్సి ఉంటుంది.
ఉదా : రసాయనిక చర్యల ద్వారా ఇంకను విచ్ఛిత్తిని కలిగించని పదార్థం ? (1)
1) వెండి 2) చక్కెర 3) నీరు 4) గాలి
వెండి రసాయన నామం Ag, చక్కెర రూపం H12O6, నీరు H2O గాలి O2 వీటిలో వెండిని రసాయనికంగా ఇంకా విచ్ఛిత్తి చేయడం సాధ్యం కాదనే విషయం కేవలం దాని రసాయన రూపం ఆధారంగానే గుర్తించవచ్చు. ఇలాంటి విషయాలు భౌతికశాస్త్రం, వృక్షశాస్త్రం అదే విధంగా సైన్స్ అండ్ టెక్నాలజీలో కూడా అనేకం ఉంటాయి. కాబట్టి జాగ్రత్తగా గమనిస్తూ చదవాలి.
ప్రణాళికాబద్ధమైన ప్రిపరేషన్‌తో ముందుకు
ప్రణాళికాబద్ధమైన ప్రిపరేషనే విజయానికి తొలిమెట్టు. మొదట సిలబస్‌ను పూర్తిగా అవగాహన చేసుకొని, దానికి తగిన మెటీరియల్ సమకూర్చుకోవాలి. మార్కెట్లో దొరికే ప్రతీ పుస్తకాన్ని కాకుండా స్టాండర్డ్ మెటీరియల్‌ను ఎంచుకోవాలి. వాటినే పదే పదే చదవాలి. ఏదైనా ఒక అంశాన్ని నాలుగుసార్లు చదివితే పూర్తిస్థాయిలోగ్రిప్ వస్తుంది. ప్రతీ చాప్టర్లో మనకు తెలిసిన విషయాలు, తెలియని విషయాలు ఉంటాయి. తెలిసిన విషయాలు పక్కనపెట్టి తెలియని విషయాలపై దృష్టి సారించాలి. మనసును ఎప్పుడు లక్ష్యంవైపే ఉండేటట్లు చూడాలి.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు