ఒత్తిడిని అధిగమించండిలా!
ఒకవైపు రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. అదేవిధంగా విద్యార్థుల్లో పదో తరగతి పరీక్షల టెన్షన్ కూడా పెరుగు తోంది. బోర్డు పరీక్షలు దగ్గర పడుతున్న కొద్దీ ఒత్తిడి, ఆందోళన ఎక్కువవుతున్నాయి. కానీ ఈ సమయంలో పెరగాల్సింది ఒత్తిడి కాదు సబ్జెక్ట్‌పై అవగాహన, ప్రశాంతంగా ఉండటం. అప్పుడు మాత్రమే ఎటువంటి అడ్డంకులు లేకుండా పరీక్షలు రాయగలరు. మొదటిసారి బోర్డు పరీక్షలు రాసే విద్యార్థులందరికీ పరీక్షలు అంటే భయం సహజం. కానీ దాన్ని అధిగమించడం చాలా ముఖ్యం. ఒత్తిడికి గురైతే డ్రిపెషన్లోకి వెళ్ళిపోతారు. అసలు పరీక్షలు రాయలేని స్థితి ఏర్పడుతుంది. అందుకే పరీక్షల ముందు ఒత్తిడి, ఆందోళనను అధిగమించటానికి కొన్ని చిట్కాలను ‘నిపుణ’ మీ కోసం అందిస్తోంది.
పదోతరగతి మీ భవిష్యత్తుకు మొదటి మెట్టు. ఇందులో మంచి మార్కులతో ఉత్తీర్ణులయితేనే ఐఐఐటీ వంటి ప్రతిష్ఠాత్మక సంస్థల్లో చదువుకునే అవకాశం లభిస్తుంది. ఈ సమయంలో స్నేహితులు ఊరినుంచి వచ్చారనో, లేదా చిన్ననాటి స్నేహితులు వచ్చారనో వారితో గడపడానికి ఎక్కువ సమయాన్ని వృథా చేసుకోవద్దు. అలా అని అస్సలు కలవకుండా ఉండొద్దు. కొంత రిలీఫ్ కోసం అప్పుడప్పుడు స్నేహితులను కలవొచ్చు. అయితే ముందుగా మీరు ఆరోజు చదవాలనుకున్న సబ్జెక్టును పూర్తిచేసి మాత్రమే కలవండి. అధ్యయనాన్ని క్రమం తప్పకుండా పూర్తిచేయండి.
దేనికి ప్రాధాన్యం ఇవ్వాలి?
- ఒక్కొక్కసారి అనుకోకుండా తప్పనిసరిగా హాజరు కావలసిన ఫంక్షన్లు వస్తుంటాయి. కానీ ఒకటి కావాలంటే తప్పనిసరిగా మరొకటి వదులుకోవాలి.
- చదవడం, ఎంజాయ్ చేయడం రెండూ సాధ్యం కాదు. ఎంజాయ్ పరీక్షలు అయ్యాకైనా చేయొచ్చు. కానీ పరీక్షలు ఒకసారి మాత్రమే వస్తాయి. కాబట్టి ప్రస్తుతం పరీక్షలే ముఖ్యం. మీప్రాధాన్యం మొత్తం చదువే కావాలి.
- మీ ఇంట్లోనే ఫంక్షన్ అయితే చదువును, ఇంట్లో విషయాలను తప్పనిసరిగా బ్యాలన్స్ చేసుకోవాలి.
- కొన్నిసార్లు ఒత్తిడి మనల్ని ఏకాగ్రతతో చదవనీయకుండా చేస్తుంది. అలాంటప్పుడు ఒత్తిడిని తగ్గించుకోవడానికి ఒక గంట మీకిష్టమైన పనిచేయండి.
- తల్లిదండ్రులు కూడా మీ పిల్లల బాధ్యతను విస్మరించకుండా ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నా పిల్లల కోసం కొంత సమయాన్ని కేటాయించండి.
- పిల్లలకు మీరు పరీక్షలు బాగా రాయగలరనే నమ్మకాన్ని మనోధైర్యాన్ని ఇవ్వండి.
ఒత్తిడి పెరగడానికి కారణాలు
- ఫెయిల్ అవుతారనే భయం.
- ముందు నుంచి బాగా చదవకపోవడం.
- చదువుకోవడానికి ఎక్కువ సమయం లేదని భావించడం.
- చదివింది గుర్తుండకపోవడం. పరీక్షలో గుర్తుకు వస్తాయో లేదో అనే అనుమానం.
- చదువుతున్నది అర్థం కాకపోవడం, అర్థం చేసుకోవడంలో కొంత కష్టంగా ఉండటం.
- మంచి మార్కులు తెచ్చుకోవాలని కుటుంబం నుంచి ఒత్తిడి.
- ఇతరులతో పోటీపడాలని భావించి వారిలాగా చదువుతున్నానో లేదో అనే భయం.
ఏం చేయాలంటే?
- ముందు మీరు పరధ్యానంగా ఉండటం మానేయండి. పరధ్యానంగా ఉంటే చదువుకోవడం కష్టంగా అనిపిస్తుంది.
- అదే ఏకాగ్రతతో ఉంటే మీరు అనుకున్నది తొందరగా పూర్తి చేస్తారు. తొందరగా చదివిన విషయాలు అర్థమవుతాయి.
- అందుకే ముందుగా చదువుకునే వాతవరణాన్ని కల్పించుకోండి. మంచి స్థలాన్ని ఎంపిక చేసుకోండి.
- అన్ని చిందరవందరగా లేకుండా నీట్‌గా సర్దుకోండి. మీకు కావలసినవన్నీ ఒక దగ్గరే పెట్టుకొండి. అన్నీ ఉన్నాయని నిర్దారించుకున్న తర్వాత చదవడం మొదలు పెట్టండి.
- పరీక్షల గురించి వీలైనన్ని ఎక్కువ విషయాలు తెలుసుకోవడానికి ప్రయత్నించండి.
- ప్రశ్నకు సంబంధించిన సమాధానాన్ని ఎలా రాయాలో ముందుగానే మైండ్మ్యాప్లు వేసుకొని ప్రాక్టీస్ చేయండి.
- విసుగ్గా అనిపించిన ప్రతిసారి తప్పనిసరిగా బ్రేక్ తీసుకోండి. స్నాక్స్ తినడానికో లేదా పెంపుడు జంతువుతో ఆడుకోవటానికో ఆ సమయాన్ని కేటాయించండి.
- మీరు చదువుతున్న అంశాల్లో మీకు డౌట్ వస్తే దాన్ని తెలుసుకోవడానికి మీ ఉపాధ్యాయులనో,
- స్నేహితులనో లేదా మీ తల్లిదండ్రులనో సహాయం చేయమని అడగండి.
- ఆయా సబ్జెక్టులను పూర్తిచేసి ఉంటారు. కాబట్టి మళ్ళీవాటిని ఒక్కసారి రిఫర్ చేసుకోండి.
- ప్రతి సబ్జెక్టులో ముఖ్యమైన ప్రశ్నలను ఎంపిక చేసుకొని బాగా సాధన చేయండి.
- సైన్స్ సబ్జెక్టులో అయితే ఇంతకు ముందు ఏ పాఠ్యాంశాల నుంచి డయాగ్రమ్స్‌ను ఎక్కువగా
- అడుగుతున్నారో గత ప్రశ్నపత్రాలను పరిశీలించి ముఖ్యమైన డయాగ్రమ్స్‌ను బాగా ప్రాక్టీస్ చేయాలి.
సోషల్ మ్యాప్ పాయింటింగ్‌ను గుర్తించడం ప్రాక్టీస్ చేయాలి.
ప్రణాళిక
- మీరు రివిజన్‌కు సంబంధించి మంచి ప్రణాళికను వేసుకోవాలి.
- ఏ సబ్జెక్టు ఎన్ని రోజుల్లో పూర్తిచేయాలి. ఎన్ని గంటలు చదవాలి. ఎన్ని గంటలు రాయాలి. వంటి అంశాలతో సరైన ప్రణాళికను వేసుకోండి.
- మీ సమయాన్ని సరిగ్గా వినియోగించుకోవడానికి ఉపయోగపడే టైం టేబుల్‌ను రూపొందించండి.
దాని ప్రకారం మీరు చదువుతున్నారో లేదో రివ్యూ చేసుకోండి. - టైం ప్రకారం అనుకున్నది చదువుకుంటూ మీకు మీరే ప్రేరణగా నిలవండి. అప్పుడు మీపై మీకు నమ్మకం పెరుగుతుంది.
చదువుతున్నప్పుడు సహాయపడే చిట్కాలు
- ప్రతిరోజు ఒకే సమయానికి నిద్రలేవడం, తినడం, నిద్రపోవడం చేయండి.
- సరిపడినంత నిద్రపోవడం వల్ల మీకు రీఛార్జిలా ఉపయోగపడుతుంది. మీరు చదివిన అంశాలు గుర్తుంచుకోవడానికి దోహదం చేస్తుంది.
- టీవీలు వంటివి చూడటం మానేయాలి. అంతే సమయం వాకింగ్ చేయండి,
- మీరు చదవాలనుకున్న లక్ష్యాలను ఎప్పటికప్పుడు పూర్తి చేయాలి.
- చదువుమీదే దృష్టి కేంద్రీకరించండి. స్నేహితుల గురించి, ఇతర విషయాల గురించి ఆలోచించొద్దు.
- జంక్ ఫుడ్‌కి దూరంగా ఉండండి. అది ఎంత తొందరగా శక్తిని ఇస్తుందో అంత తొందరగా డౌన్ అవుతుంది కూడా.
- కూరగాయలు, పండ్లు, డ్రై ప్రూట్స్, వంటి సమతుల్య ఆహారాన్ని తినాలి. అప్పుడే మెదడుకు సరిపడిన ప్రొటీన్స్ అంది యాక్టివ్‌గా పనిచేస్తుంది.
- మధ్యలో బ్రేక్ తీసుకోండి. విశ్రాంతి సమయంలో మెడిటేషన్ చేయాలి లేదా మ్యూజిక్ వినాలి. ఈ ఎండాకాలంలో ఎనర్జీ డ్రింక్‌లకు బదులు ఎక్కువ వాటర్ తాగండి. అలసిపోకుండా ఉంటారు.
పరీక్షలకు కొద్ది రోజుల ముందు
- పరీక్షలు దగ్గర పడుతున్న కొద్దీ చదువుకునే సమయం పెంచాలి.
- మాక్ పేపర్స్‌ను ఎక్కువగా చేయాలి
- కొత్త సబ్జెక్టులు/ టాపిక్‌లు చదవడం ప్రారంభించవద్దు.
- పరీక్షకు కావలసిన సామగ్రిని ముందుగా కొని పెట్టుకోవాలి.
- పరీక్ష కేంద్రం తెలియకపోతే ముందుగా ఒకసారి వెళ్లి చూసి రావడం మంచిది.
- పరీక్ష కేంద్రం దూరం అయితే ఎలా వెళ్ళాలో ముందే ఆలోచించుకోండి.
- ఒత్తిడి ఎక్కువగా అనిపిస్తే కామెడీ షో చూడటం, చల్లని గాలిలో తిరగడం చేయాలి.
- పరీక్షల ముందు ఎక్కువ సమయం మేల్కొని నైటవుట్లు చేయటం కరెక్ట్ కాదు.
- శరీరానికి సరిపడినంత నిద్ర కూడా ఉండాలి.
పరీక్ష ముందు రోజు
- రాత్రికే హాల్ టికెట్, స్టేషనరీ అన్నీ సర్దిపెట్టుకోండి.
- పుస్తకాలను సాయంత్రానికే క్లోజ్ చేయండి.
- ఒత్తిడి లేకుండా కొంత సమయం కుటుంబంతో సరదాగా గడపండి.
- స్నేహితులను పరీక్షల ప్రిపరేషన్‌కు సంబంధించిన ప్రశ్నలు అడగొద్దు.
- నిద్రపోయే ముందు ప్రశాంతంగా పడుకొని చదువుకున్న సబ్జెక్ట్‌ను ఒక్కసారి మైండ్‌లో రివైజ్ చేసుకోండి.
- ముఖ్యమైన ఫార్ములాలు, ప్రశ్నలు, కీవర్డ్స్ వంటివి రిమైండ్ చేసుకొని ప్రశాంతంగా నిద్రపోండి.
పరీక్ష రోజు తీసుకోవాల్సిన జాగ్రత్తలు
- పరీక్షరోజు తీసుకెళ్లాల్సిన వాటిని ముందురోజు రాత్రే సర్దిపెట్టుకోండి
- తేలికపాటి ఆహారం తీసుకోండి మీ శక్తికి, మీ ఏకాగ్రతకు ఇది దోహదపడుతుంది. హార్డ్ ఫుడ్ అస్సలు తినకండి.
- పరీక్ష ముందు ఆందోళనగా అనిపిస్తే గట్టిగా శ్వాస తీసుకొని మీ శ్వాసపై దృష్టిపెట్టడానికి ప్రయత్నించండి.
- పరీక్ష రాసే ముందు ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నించండి.
- పరీక్ష రాసే ముందు ఎక్కువ వాటర్ తాగొద్దు.
- భయపడకండి. ఇది మీ చదువుకు పరీక్షమాత్రమే, కోండి.
- ముందు హాయిగా కూర్చోండి.
- పేపర్‌ను జాగ్రత్తగా చదవండి.
- కీవర్డ్స్, సూచనలను అండర్లైన్ చేయండి.
- ప్రతి విభాగానికి ఎంత సమయం ఉందో లెక్కవేసుకోండి. ఆ టైంలో రాని ప్రశ్నలకు సమాధానం గుర్తు తెచ్చుకోవడానికి సమయం వృధా చేయకండి. ముందుగా వచ్చిన ప్రశ్నలకు సమాధానాలు రాయండి.
- కోరిక, అంకితభావం, ఏకాగ్రత, సాధించాలనే తపన మిమ్మల్ని విజయ తీరాలకు తప్పకుండా చేరుస్తాయి. కనుక ఎలాంటి ఒత్తిడి లేకుండా హాయిగా చదవండి.. పరీక్ష రాయండి… విజయం సాధించండి.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు