ఫ్రీజోన్తో రాజుకున్న వేడి..
రాష్ట్రపతి ఉత్తర్వుల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని జిల్లాలన్నింటినీ ఆరు జోన్లుగా విభజించి హైదరాబాద్ నగరాన్ని 6వ జోన్లో చూపించారు. ఈ ఉత్తర్వుల్లో ఎక్కడ కూడా హైదరాబాద్ నగరం ఫ్రీజోన్ అనే పదం కానీ, లేదా 7వ జోన్ అనే పదం కానీ లేదు. ఉత్తర్వుల్లో ఈ అంశాలు లేనప్పటికీ అధికార యంత్రాంగం మాత్రం అధికారిక పరిపాలన విధానాల్లో ఉత్తర ప్రత్యుత్తరాల్లో హైదరాబాద్ నగరాన్ని ఫ్రీజోన్‌గా, 7వ జోన్‌గా పరిగణించి యథేచ్ఛగా నియామకాలు చేసింది.
హైదరాబాద్ ఫ్రీజోన్ అంటూ సుప్రీంకోర్టు డివిజన్ బెంచ్ 2009 అక్టోబర్ 9న తీర్పునిచ్చింది. సుప్రీంకోర్టు డివిజన్ బెంచ్‌కి రాష్ట్ర ప్రభుత్వం సరైన తీరులో స్పందించలేకపోయింది. సుప్రీంకోర్టులో రాష్ట్రం తరఫున వాదించడానికి రాష్ట్రపతి ఉత్తర్వులపై అవగాహన ఉన్న న్యాయవాదితో కాకుండా రాష్ర్టానికి సంబంధంలేని గుజరాత్ న్యాయవాదిని మొక్కుబడిగా ప్రభుత్వం నియమించింది. అతడు సరిగా వాదించలేకపోయాడు.
సుప్రీంకోర్టు: సీఏ నం. 5141-2002కు సంబంధించిన కేసులో 2009 అక్టోబర్ 9న సంచలనాత్మక తీర్పునిచ్చింది. రాష్ట్రపతి ఉత్తర్వుల నుంచి మినహాయించిన 14ఎఫ్ హైదరాబాద్ సిటీ పోలీస్ ఉద్యోగ నియామకాల్లో స్థానిక రిజర్వేషన్ ఉండదు. ఈ ఉద్యోగాలకు స్థానిక, స్థానికేతర అభ్యర్థులందరూ అర్హులే. అయితే ప్రభుత్వ రంగంలో ఉపాధి అవకాశాలు అధికంగా ఉండేది కేవలం రెండే రెండు డిపార్ట్మెంట్లలో. ఒకటి ఉపాధ్యాయ రంగం, రెండోది పోలీస్ డిపార్ట్మెంట్. తెలంగాణలో మొత్తం పోలీస్ డిపార్ట్మెంట్ ఉద్యోగాల్లో సగానికిపైగా ఉద్యోగాలు హైదరాబాద్ సిటీ పరిధిలోనే ఉంటాయి. ఈ తీర్పుతో హైదరాబాద్ సిటీ పోలీస్‌లో స్థానికులకు రిజర్వేషన్ లేకుండాపోవడం ఉద్యోగులు, నిరుద్యోగులను ఆందోళనకు గురిచేసింది. దీంతో విద్యార్థులు, ఉద్యోగులు, ప్రజాసంఘాలు, రాజకీయ పార్టీలు రాష్ట్రపతి ఉత్తర్వుల నుంచి 14ఎఫ్‌ను తొలగించాలని డిమాండ్ చేశాయి. ప్రభుత్వం వెంటనే హైదరాబాద్‌ను 6వ జోన్లో భాగంగా చేయాలని, అందుకు అవసరమైన రాజ్యాంగ సవరణను ప్రభుత్వం పార్లమెంట్లో ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశాయి. అంతవరకు తెలంగాణ ఉద్యోగ సంఘాలన్నీ జాయింట్ యాక్షన్ కమిటీగా ఏర్పడి ఉద్యమిస్తామని ప్రకటించాయి.
ఉద్యమ తీవ్రతను గమనించిన ప్రభుత్వం అక్టోబర్ 19న ఫ్రీజోన్ అంశంపై అఖిలపక్ష సమావేశం ఏర్పాటుచేసింది. అనంతరం ప్రభుత్వం ఫ్రీజోన్ అంశంపై సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ వేస్తామని ప్రతిపాదించింది. టీఆర్ఎస్, లోక్‌సత్తా మినహా అన్ని పార్టీలు ప్రభుత్వ ప్రతిపాదనను అంగీకరించాయి. రివ్యూ పిటిషన్‌ను ప్రతివాది అంటే ప్రభుత్వం వేయాలి. వాదనలు ఉండవు. రాతపూర్వక అఫిడవిట్లు మాత్రమే సమర్పించాలి. సుప్రీంకోర్టుకు సరైన వాదనలను సమాచారాన్ని అందించని ప్రభుత్వం రివ్యూ పిటిషన్ ద్వారా చెప్పే కొత్త విషయం ఏమీ ఉండదు. ఒకవేళ సుప్రీంకోర్టు రివ్యూ పిటిషన్ కొట్టివేస్తే క్యూరేటివ్ పిటిషన్ ద్వారా సుప్రీంకోర్టు తలుపులు తట్టవచ్చు. కానీ అత్యంత అరుదైన కేసుల్లో మాత్రమే సుప్రీంకోర్టు క్యూరేటివ్ పిటిషన్‌ను అనుమతిస్తుంది. కాబట్టి హైదరాబాద్‌ను ఫ్రీజోన్ నుంచి తొలగిస్తూ 6వ జోన్‌గా మార్చాలంటే రాజ్యాంగ సవరణ తప్ప మరో గత్యంతరం లేదు. కాబట్టి గతంలో 1972లో ముల్కీ రూల్ రాజ్యాంగబద్ధమేనని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు రాజ్యాంగ సవరణ ద్వారా ఏ విధంగా రద్దు అయిందో, అదేవిధంగా హైదరాబాద్ ఫ్రీజోన్ తీర్పుని కూడా రద్దు చేయాలని ఉద్యోగ, ప్రజాసంఘాలు, టీఆర్ఎస్ పార్టీల ప్రభుత్వాన్ని కోరాయి.
సిద్దిపేట ఉద్యోగ గర్జన-కేసీఆర్ ఆమరణ దీక్ష ప్రకటన
-ఉద్యోగ, ప్రజాసంఘాలు, టీఆర్ఎస్ పార్టీల విజ్ఞాపనలను ప్రభుత్వం తేలిగ్గా తీసుకుంది. దీంతో హైదరాబాద్ ఫ్రీజోన్ విషయంపై తాడో పేడో తేల్చుకోవడానికి ఉద్యోగ, ప్రజా సంఘాలు ఉద్యమానికి సిద్ధమయ్యాయి. తెలంగాణ ఉద్యమాన్ని ఐక్యంగా నిర్మించడానికి ఉద్యోగ సంఘాలన్నీ జాయింట్ యాక్షన్ కమిటీ (జేఏసీ)గా ఏర్పడ్డాయి. ఉద్యోగ సంఘాలకు బాసటగా టీఆర్ఎస్ నిలిచింది. హైదరాబాద్‌ను ఫ్రీజోన్‌గా పరిగణించడాన్ని వ్యతిరేకిస్తూ ఉద్యోగ సంఘాలు 2009 అక్టోబర్ 21న సిద్దిపేట ఉద్యోగ గర్జనకు పిలుపునిచ్చాయి. తెలంగాణ నలువైపుల నుంచి ఉద్యోగులు లక్షల సంఖ్యలో హాజరై విజయవంతం చేశారు. ప్రముఖ సామాజిక కార్యకర్త స్వామి అగ్నివేష్ ఈ సభకు హాజరై తన మద్దతును ప్రకటించారు. ఈ సభలో హైదరాబాద్‌ను ఫ్రీజోన్ కాకుండా 6వ జోన్లో అంతర్భాగంగా చేస్తూ కేంద్ర ప్రభుత్వం వెంటనే రాజ్యాంగ సవరణ చేయాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేశాయి. లేని పక్షంలో తెలంగాణ ప్రాంత ఉద్యోగులు పెన్‌డౌన్, పోలీసులు గన్‌డౌన్ చేసి పరిపాలనను స్తంభింపచేస్తామని ప్రకటించాయి.
ఇదే బహిరంగ సభ నుంచి టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తెలంగాణ వాలే జాగో, ఆంధ్రవాలే భాగో అనే నినాదం ఇచ్చారు. ఈ మాసాంతం తెలంగాణ రాష్ట్ర సాధన కోసం సకల ప్రయత్నాలు చేస్తాం, అయినా సిద్దించకపోతే నేను పుట్టిన గడ్డ సిద్దిపేట అమరవీరుల స్థూపం వద్ద ఆమరణ నిరాహార దీక్ష చేపట్టి ఆత్మార్పణ చేసైనా తెలంగాణ రాష్ర్టాన్ని సాధిస్తాను, ఆమరణ నిరాహార దీక్ష గాంధేయమార్గంలో, అహింసాయుత మార్గంలో జరుగుతుంది, ఇక కేసీఆర్ శవయాత్రలో పాల్గొంటారో, తెలంగాణ జైత్రయాత్రలో పాల్గొంటారో తేల్చుకోవాల్సింది ప్రజలేనని అన్నారు.
-ప్రజాసంఘాల హెచ్చరికలు, కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష ప్రకటనలను సైతం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తేలిగ్గా తీసుకున్నాయి. ప్రత్యేక తెలంగాణ ఆకాంక్ష బలంగా ఉందని రుజువు చేయడానికి సమీప భవిష్యత్‌లో ఎన్నికలు లేవు. తెలంగాణ రాష్ట్ర సాధనే ఏకైక డిమాండ్‌తో ఉద్యమ కార్యాచరణను రూపొందించిన టీఆర్ఎస్కు మొదట్లో ఏ పార్టీ మద్దతు ఇవ్వలేదు. ఈ విపత్కర పరిస్థితుల్లో ప్రజాసంఘాలు కేసీఆర్ ఆమరణ దీక్ష, టీఆర్ఎస్ ఉద్యమ కార్యాచరణకు అండగా నిలిచాయి. ప్రజా సంఘాలు కేసీఆర్ ఆమరణ దీక్ష చారిత్రక అవసరం గురించి తెలుపుతూ తెలంగాణ వ్యాప్తంగా సభలు, సమావేశాలు, ర్యాలీలు, కరపత్రాలు, సాహిత్య సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఇలా ప్రజా సంఘాలు తెలంగాణ ఉద్యమాన్ని సంఘటితంగా కొనసాగించడం వల్ల కేసీఆర్ దీక్ష నాటికి బలమైన పునాదులు పడ్డాయి.
ఉస్మానియా విద్యార్థుల ఆందోళన
-2009 నవంబర్ 21న ఓయూలోని విద్యార్థి సంఘాలు విద్యార్థి జాయింట్ యాక్షన్ కమిటీగా ఏర్పడ్డాయి. టీఆర్ఎస్వీ అధ్యక్షుడు బాల్క సుమన్, పిడమర్తి రవి, కైలాష్ నేత, బాలరాజు తదితర విద్యార్థి నాయకుల ఆధ్వర్యంలో 14ఎఫ్‌కు వ్యతిరేకంగా ఆందోళనలు మొదలయ్యాయి.
కాకతీయ విద్యార్థి గర్జన
-కాకతీయ విశ్వవిద్యాలయంలో 2009 నవంబర్ 22న వేలాది విద్యార్థులతో భారీ బహిరంగ సభ జరిగింది. ఈ సభకు ముఖ్య అతిథిగా కేసీఆర్ హాజరై తెలంగాణ ఉద్యమంలో విద్యార్థుల భాగస్వామ్యం, వారు పోషించాల్సిన కీలక భూమిక, చారిత్రక అవసరాన్ని వివరించారు. ఇక కేసీఆర్ చచ్చుడో తెలంగాణ వచ్చుడో జరిగిపోవాలి అంటూ ప్రసంగించారు.
దీక్షకు ముందు సన్నాహాలు
-తెలంగాణ ప్రజలను చైతన్యపర్చడం కోసం టీఆర్ఎస్ వివిధ రకాలైన ఉద్యమ కార్యక్రమాలను నిర్వహించింది. నవంబర్ 23న సర్వమత ప్రార్థనలు చేసింది. నవంబర్ 24న గ్రామగ్రామాన దండోరా వేయించింది. అదేరోజు రాత్రి అమరవీరుల స్థూపాల వద్ద కొవ్వొత్తులను, కాగాడాలను ప్రదర్శించింది. నవంబర్ 26న తెలంగాణవ్యాప్తంగా విద్యాసంస్థలను బహిష్కరించి ర్యాలీలు, మానవహారాలను నిర్వహించింది. 27న తెలంగాణ దీక్ష కంకణధారణలో భాగంగా ప్రతిఒక్కరి నుదుట తిలకం దిద్ది కంకణం కట్టింది. 28న ఎడ్లబండ్లు, సైకిళ్లు, ద్విచక్ర వాహనాలపై ర్యాలీలు నిర్వహించింది. అలాగే కేసీఆర్ నాయకత్వంలో ఒక బృందం జాతీయ, ప్రాంతీయ అధికార, ప్రతిపక్షాలను కలిపి ఆమరణ నిరాహార దీక్షకు సహకరించాల్సిందిగా విజ్ఞప్తి చేసింది. ఇంకోవైపు సిద్దిపేటలోని రాజీవ్ రహదారికి ఆనుకొని ఉన్న రంగధాంపల్లిలోని తెలంగాణ అమరవీరుల స్థూపం వద్ద దీక్షా వేదిక ఏర్పాట్లు చురుకుగా కొనసాగించింది.
కేసీఆర్ అరెస్ట్-ఉవ్వెత్తున ఎగిసిన ఉద్యమం
-దీక్ష ప్రారంభించడానికి మూడు రోజుల ముందే వ్యూహంలో భాగంగా కేసీఆర్ కరీంనగర్లో గల ఉత్తర తెలంగాణ భవన్‌కు చేరుకున్నారు. పోలీసులు కేసీఆర్ దీక్షకు దిగకుండానే ముందస్తుగా కరీంనగర్లో ఒకరోజు ముందే అరెస్ట్ చేయడానికి సన్నాహాలు ప్రారంభించారు. అందుకు అనుగుణంగా కరీంనగర్లో 144 సెక్షన్ విధించారు. మొత్తంగా కరీంనగర్లో అనధికారిక కర్ఫ్యూ వాతావరణం కొనసాగింది. 2009 నవంబర్ 28న అర్ధరాత్రి కేసీఆర్‌ను అరెస్ట్ చేయాలని పోలీసు ఉన్నతాధికారులు తెలంగాణ భవన్‌కు చేరారు. అయితే విషయం తెలిసిన టీఆర్ఎస్, ప్రజా సంఘాల నాయకులు, కార్యకర్తలు కేసీఆర్‌కు రక్షణగా నిలిచారు. పోలీసులు కేసీఆర్‌ను రాత్రి అరెస్టు చేయలేకపోయారు. అంతిమంగా 2009, నవంబర్ 29న ఉదయం 7:50 గంటలకు ఎడతెగని ఉత్కంఠ మధ్య ఆమరణ నిరాహార దీక్ష కోసం కేసీఆర్ కరీంనగర్ నుంచి సిద్దిపేట దీక్షా వేదిక వద్దకు బయలుదేరారు.
అయితే కేసీఆర్‌ను అల్గునూరు దగ్గర పోలీసులు అరెస్ట్ చేసి ఖమ్మంకు తరలించారు. కేసీఆర్ వాహనం వెంట డజన్ల కొద్ది పోలీస్ వాహనాలు కాన్వాయ్‌గా వెళ్లాయి. ఆ రోజు ఆదివారం కావడంతో సెకండ్ క్లాస్ స్పెషల్ మెజిస్ట్రేట్ చదలవాడ శ్రీరామమూర్తి ఇంటి వద్ద కేసీఆర్‌ను, ఇతర నాయకులను హాజరుపరిచారు. కేసీఆర్‌తోపాటు మరో పది మంది నాయకులకు 14 రోజుల రిమాండ్ విధించారు. వీరిని దానవాయిగూడెంలోని జిల్లా జైలుకు తరలించారు. కేసీఆర్ ఆమరణ దీక్షలో ఉండటంతో 24 గంటలు ప్రత్యేక వైద్యుల పర్యవేక్షణలో ఉంచాలని అధికారులు నిర్ణయించారు. ఇదిలా ఉండగా కేసీఆర్ అరెస్ట్ వార్త తెలంగాణ అంతటా పాకిపోయింది. దీంతో జెండాలు, అజెండాలు, సిద్ధాంతాలు, పార్టీలకతీతంగా 4 కోట్ల తెలంగాణ ప్రజలు ఒక్కటయ్యారు. స్వచ్ఛందంగా ఎవరికి తోచిన పద్ధతిలో వారు తమ నిరసనను వివిధ రూపాల్లో వెల్లడించారు. ఓయూ విద్యార్థులు సీఎం దిష్టిబొమ్మను దహనం చేశారు.
ఆర్ట్స్ కాలేజీ నుంచి ఎన్సీసీ గేట్ వరకు వేలాదిగా విద్యార్థులు శాంతియుతంగా ర్యాలీ ప్రారంభించారు. ర్యాలీ చేస్తున్న విద్యార్థులపై పోలీసు బలగాలు ఎలాంటి హెచ్చరికలు చేయకుండానే విచక్షణారహితంగా లాఠీచార్జి చేశారు. క్యాంపస్‌లో ఎటుచూసినా సృహ కోల్పోయిన విద్యార్థులు, గాయాలైన విద్యార్థుల హాహాకారాలు దర్శనమిచ్చాయి. ఓయూతో పాటు కేయూ, తెలంగాణ, పాలమూరు, శాతవాహన, మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయాలు సైతం రణ క్షేత్రాలయ్యాయి. తెలంగాణవ్యాప్తంగా ఉద్యమకారులపై ప్రభుత్వం అనుసరిస్తున్న దమనకాండకు నిరసనగా హైదరబాద్‌లోని ఎల్బీనగర్ చౌరస్తాలో అంబేద్కర్, జగ్జీవన్‌రాం విగ్రహాల సాక్షిగా నల్లగొండ జిల్లాకు చెందిన కాసోజు శ్రీకాంతాచారి తన శరీరంపై పెట్రోల్ పోసుకొని నిప్పు అంటించుకున్నాడు. శ్రీకాంతాచారి అగ్నికి ఆహుతి అవుతూ కూడా జై తెలంగాణ, జైజై తెలంగాణ, మరోజన్మ అంటూ ఉంటే మరోసారి తెలంగాణ కోసం ప్రాణాలర్పిస్తా అంటూ నినాదాలిచ్చాడు. ఇలా తీవ్రగాయాలతో ఆస్పత్రిపాలైన శ్రీకాంతాచారి డిసెంబర్ 3న తుదిశ్వాస విడిచాడు.
Latest Updates
Aruba Bet : guide complet de la plateforme pour les joueurs français
Winbeatz casino : une lecture neutre du signup et du profil — focus paiements
Betriviera : dépôts, paiements et gestion de la caisse
Only Spins et la différence entre jackpots fixes et progressifs : repères avant de commencer
Corgibet : méthodes, limites et règles de retrait
Spinbit Fresh Bonus Guide Highlights New Zealand
Corgibet casino et la vérification expliquée du profil au paiement — examen des preuves et restrictions
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు






