అమలుకాని జీవో 610..
1983లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో చాలా మార్పులు చోటు చేసుకున్నాయి. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడంతో ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి అయ్యారు. 1984లో రాయలసీమ ఉద్యోగుల సంఘం లంబోదరం నేతృత్వంలో ఉద్యోగ నియామకాల్లో రాష్ట్రపతి ఉత్తర్వులు అమల్లోకి వచ్చిన నాటి నుంచి తమ ప్రాంతంలోని ఉద్యోగ నియామకాల్లో ఆ ఉత్తర్వులకు లోబడి నియామకాలు జరగడం లేదని ఫలితంగా తమ ప్రాంతంవాళ్లకు దక్కాల్సిన ఉద్యోగాల్లో స్థానికేతరులు నియామకమవుతున్నారని, ఇతర జోన్లకు చెందిన వాళ్లు తమ జోన్ నాలుగులో 50,654 మంది ఉన్నారని, వారి స్థానికత ఆధారంగా ఎవరి జోన్‌కు వాళ్లను పంపి ఏర్పడే ఖాళీలను తమ ప్రాంతం వారితో భర్తీ చేయాలని ముఖ్యమంత్రి రామారావుకి వినతిపత్రం ఇచ్చారు.
40 వేల మంది స్థానికేతరులు
సరిగ్గా ఇదే సమయంలో తెలంగాణ ఎన్జీవోల సంఘం స్వామినాథన్ నేతృత్వంలో 1975 నుంచి అమల్లోకి వచ్చిన రాష్ట్రపతి ఉత్తర్వులు తెలంగాణ జోన్లు అయిన 5, 6ల్లో సరిగా అమలు చేయకపోవటంతో దాదాపు 40 వేల మంది స్థానికేతరుల ఉద్యోగ నియామకాలు తెలంగాణలో జరిగాయని, వాటిని పరిశీలించి ఉద్యోగుల స్థానికత ఆధారంగా రాష్ట్రపతి ఉత్తర్వులను అనుసరించి ఎవరి జోన్లకు వాళ్లను పంపి ఏర్పడే ఖాళీలను స్థానికులచే నింపాలని డిమాండ్ చేస్తూ ముఖ్యమంత్రి రామారావుకు వినతిపత్రం సమర్పించారు.
వేధింపులకు గురైన ఉద్యోగులు
రామారావు ఉద్యోగుల సమస్యను తొందరగా పరిష్కరించకుండా వారిని వేధింపులకు గురిచేయడం ప్రారంభించాడు. 1978లో మర్రి చెన్నారెడ్డి ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టినప్పుడు ఉద్యోగుల రిటైర్మెంటు వయస్సు 55 నుంచి 58 ఏండ్లకు పెంచాడు. ఈ రిటైర్మెంట్ వయస్సు 58ని రామారావు ఆకస్మికంగా 55కు తగ్గించాడు. దీంతో 58 వేల మంది ఉద్యోగులు అయిష్టంగా ఆవేదనతో రిటైర్ అయ్యారు. ఈ విధంగా రిటైర్మెంటైన ఉద్యోగుల్లో అత్యధికులు రాయలసీమ, తెలంగాణ జిల్లాలకు చెందినవాళ్లు ఉండటం గమనార్హం. దీంతో ఉద్యోగుల్లో అభద్రతాభావం పెరిగి ఆవేదనతో ఆందోళనకు గురై ఉద్యమ బాట పట్టారు.
ఆఫీసర్ల కమిటీలతో జాప్యం
ఉద్యమబాట పట్టిన తెలంగాణ, రాయలసీమ ఉద్యోగ సంఘాలు లేవనెత్తిన అంశాలపై, ఉద్యోగ నియామకాల్లో విధిగా పాటించాల్సిన రాష్ట్రపతి ఉత్తర్వుల అమలు తీరుతెన్నులపై ఫిబ్రవరి 1984లో అసెంబ్లీలో చర్చ జరిగింది. చర్చ అనంతరం ముఖ్యమంత్రి రామారావు ఉద్యోగ సంఘాల నేతలతో చర్చించి రాజ్యాంగ సవరణ, రాష్ట్రపతి ఉత్తర్వుల ద్వారా అమల్లోకి వచ్చిన జోన్లవారీ రిజర్వేషన్ విధానం, నియమ నిబంధనలకు అనుగుణంగా ఉద్యోగ నియామకాలు 1975 – 1984 మధ్యకాలంలో జరిగినవా లేవా?
అన్న విషయాన్ని పరిశీలించాల్సిందిగా ముగ్గురు సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్లు జయభారత్‌రెడ్డి, కమలనాథన్, ఉమాపతిలతో త్రిసభ్య కమటీని నియమించారు. దీనినే ఆఫీసర్ల కమిటీ అని కూడా అంటారు. ఉద్యోగ సంఘాలు లేవనెత్తిన స్థానిక, స్థానికేతర ఉద్యోగుల వివాదాలు, రాష్ట్రపతి ఉత్తర్వుల అమలు జరుగుతున్న విధానాన్ని పరిశీలించే నిమిత్తం ఆగస్టు 1984లో రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ వి.సుందరేశన్‌తో మరో ఏకసభ్య కమిషన్ కూడా ఏర్పాటు చేశాడు.
తూతూమంత్రంగా జీవో విడుదల
రామారావు 610 జీవోనైతే విడుదల చేశారు. కానీ దాని అమలు గురించి ఎలాంటి చర్యలు చేపట్టలేదు. 1985లో విడుదలైన 610 జీవోపై అవగాహన గురించి మూలన పడ్డ ముల్కీ, అమలు కాని ఆరు సూత్రాలు, జీవో 610 అన్న చిన్న బుక్లెట్, న్యాయం కోసం నిరీక్షణ అనే డాక్యుమెంటరీ చిత్రం ద్వారా వెలుగులోకి తెచ్చారు ఉస్మానియా యూనివర్సిటీ అధ్యాపకులు. ఉస్మానియా, కాకతీయ విశ్వవిద్యాలయాల్లో రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం స్థానికులకు రిజర్వు చేసిన 85 శాతం సీట్లను స్థానిక తెలంగాణ విద్యార్థులతో భర్తీచేసి, మిగతా 15 శాతాన్ని స్థానికేతరులకు కేటాయించిన కోటాగా పరిగణిస్తూ వాటిని స్థానికేతరులతో భర్తీ చేసేవారు.
ఈ విధానాన్ని తప్పుపడుతూ 1993లో తెలంగాణ స్టూడెంట్స్ ఫ్రంట్ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. దాంతో అప్రమత్తమైన ఉస్మానియా యూనివర్సిటీ అధికారులు తాము కొన్ని సంవత్సరాలుగా చేస్తూ వస్తున్న తప్పును గ్రహించి సూపర్ న్యూమరీ కోటాలో అదనపు సీట్లను పెంచి వాటిని తెలంగాణ స్థానికులకు ఇచ్చారు. రాష్ట్రపతి ఉత్తర్వులు 610 జీవోపై ఉద్యోగుల్లో అవగాహన కల్పించేందుకు టీఎన్జీవో సంఘం జిల్లాలవారీగా సదస్సులు నిర్వహించింది. వీరితోపాటు ఉపాధ్యాయ సంఘాలు ముఖ్యంగా ఏపీటీఎఫ్, డీటీఎఫ్, ఉద్యమసంస్థలు, ప్రజా సంఘాలు, విద్యార్థుల కృషి ఫలితంగా 610 జీవో అంశం తెలంగాణ రాష్ట్రసాధన ఉద్యమంలో కీలక అంశంగా మారింది.
అక్రమాలను బయటపెట్టిన గిర్గ్లాని కమిషన్
కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు డిప్యూటీ స్పీకర్ పదవికి శాసనసభ్యత్వానికి, తెలుగుదేశం పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి 24/4/2001లో రాజీనామా చేసి తెలంగాణ రాష్ట్రసమితిని ఏర్పాటు చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలంగాణకు నీళ్లు, నిధులు, నియామకాల్లో జరుగుతున్న అక్రమాలను ఎత్తిచూపుతూ 610 జీవో అమల్లో జరుగుతున్న జాప్యాన్ని ఎండగడుతూ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాన్ని చేపట్టారు. 610 జీవో అమలుపై ప్రజా సంఘాలు, ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు, విద్యార్థుల నుంచి తెలంగాణ రాష్ట్ర సమితితో పాటు మిగతా రాజకీయ పార్టీల నుంచి వస్తున్న ఒత్తిడిని ఉద్యమాన్ని దృష్టిలో ఉంచుకొని నాటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు 22-6-2001న సీనియర్ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి జి.ఎం.గిర్‌గ్లానితో ఏకసభ్య కమిషన్‌ను ఏర్పాటు చేశారు. గిర్గ్లాని 6-10-2001న తన ప్రాథమిక నివేదికను ప్రభుత్వానికి సమర్పించారు. ఈ నివేదికలో ఉద్యోగ నియామకాల్లో విధిగా పాటించాల్సిన రాష్ట్రపతి ఉత్తర్వుల ఉల్లంఘనలు తరచుగా జరిగినట్లు పేర్కొన్నారు. గిర్గ్లాని ప్రాథమిక నివేదికలోని కీలక అంశాలు.
1. చంద్రబాబునాయుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ర్టానికి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జిల్లాస్థాయి కేడర్లకు సంబంధించిన సెకండరీగ్రేడ్ టీచర్ల జీతాలను పెంచి, వాటిని జిల్లాస్థాయి కేడర్ ఉద్యోగాలుగానే పరిగణిస్తూ జిల్లాల స్థాయిలో రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం స్థానికులకు ఉండాల్సిన రిజర్వేషన్‌ను 80 నుంచి 70 శాతానికి కుదించారు. దీనికి ప్రభు త్వం ఇచ్చిన వివరణ ఈ విధంగా ఉంది. పెంచిన సెకండరీగ్రేడు టీచర్ల జీతాలు జోనల్ నాన్‌గెజిటెడ్ ఉద్యోగి జీతాలతో సమానంగా ఉన్నాయి కాబట్టి జోనల్ నాన్‌గెజిటెడ్ ఉద్యోగాలకుండే స్థానిక రిజర్వేషన్ 70 శాతం కాబట్టి వీళ్లకు కూడా స్థానిక రిజర్వేషన్ 70 శాతం ఉంటుందని వివరణ ఇచ్చాడు. దీనికి సంబంధించిన ఉత్తర్వులు 4 ఫిబ్రవరి 2000న వెలువడ్డాయి.
మినిస్ట్రీ ఆఫ్ అఫేర్స్, న్యూఢిల్లి 4/2/2000 s.o.106(E) కాని అవి అమల్లోకి వచ్చేది మాత్రం గతంలోనుంచి అంటే 1 జనవరి 1994 నుంచి అని పేర్కొన్నారు. అంటే ప్రభుత్వాధికారులు 1994 నుంచే ఈ తప్పులు చేస్తున్నారు. అందుకే చేసిన తప్పులకు చట్టబద్ధత కల్పించుకునే నిమిత్తమే ఈ ఉత్తర్వులను గతంలోనుంచి అమల్లోకి వస్తాయని పేర్కొంది. ప్రభుత్వం జిల్లా కేడర్లకు సంబంధించిన ఈ సవరణ తెచ్చే ముందు ఉపాధ్యాయ సంఘాలతోగాని ప్రతిపక్షాలతో సంప్రదించకుండా ఏకపక్ష నిర్ణయం తీసుకుంది. ఈ ఉత్తర్వులు వచ్చిన అనంతరం జిల్లాల స్థాయిలో ఉపాధ్యాయ ఉద్యోగాలకు సంబంధించి మూడుసార్లు నియామకాలు జరిగాయి. దీంతో రంగారెడ్డి జిల్లాలో స్థానికేతర ఉపాధ్యాయుల సంఖ్య గణనీయంగా పెరిగింది. గిర్గ్లాని నివేదికలో ప్రిలిమినరీ ఫైండింగ్ 1(బి)లో దీన్ని తప్పుపడుతూ ఈ విధంగా చేయడం రాష్ట్రపతి ఉత్తర్వులను అగౌరవపర్చడమే అవుతుందని పేర్కొన్నారు.
2.రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం జోనల్ స్థాయి నాన్ గెజిటెడ్ ఉద్యోగాలైన అసిస్టెంటు ఇంజినీర్, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్, పాలిటెక్నిక్ కళాశాలల్లో పనిచేసే అసిస్టెంట్ లెక్చరర్లకు ఉండాల్సిన స్థానిక రిజర్వేషన్ 70 శాతం కాగా ప్రభుత్వం ఈ పోస్టులను గెజిటెడ్ పోస్టులుగా మార్చి వాటికి గతంలో ఉన్న 70 శాతం రిజర్వేషన్‌ను 60 శాతానికి తగ్గించింది. ఈ విధంగా చేయడాన్ని గిర్గ్లాని తప్పుపట్టారు.
3.రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం జిల్లాస్థాయి కేడర్లలో 80 శాతం జోనల్ స్థాయి నాన్‌గెజిటెడ్ కేడర్లలో 70 శాతం జోనల్ స్థాయి గెజిటెడ్ కేడర్లలో 60 శాతం ఉద్యోగాలు స్థానికులకు రిజర్వు చేయాలి. అవి పోగా మిగిలిన వాటిని ఓపెన్ కాంపిటీషన్ ద్వారా భర్తీ చేయాలి. వాటికి స్థానిక, స్థానికేతర అభ్యర్థులందరూ అర్హులే. కానీ దీనికి భిన్నంగా ఆ ఖాళీలను ఆంధ్రజోన్లకు చెందినవారితో నింపారు. ఇది తప్పు అని గిర్గ్లాని అభిప్రాయపడ్డారు.
4.రాష్ట్రపతి ఉత్తర్వుల నుంచి మినహాయింపు ఉన్న పేరా 14లోని కార్యాలయాలు సచివాలయం, శాఖాధిపతుల కార్యాలయాలు, రాష్ట్రస్థాయి కార్యాలయాలన్నింటిలో స్థానికులకు సముచిత వాటా ఉండాలని కమిషన్ అభిప్రాయపడింది.
5.గిర్గ్లాని తన నివేదికలో ఆంధ్రప్రాంత ఉద్యోగులు తెలంగాణకు బదిలీలు డిప్యుటేషన్ల పేరుతో వస్తున్నారని, ఈ బదిలీలు డిప్యుటేషన్లు ఆంధ్రప్రాంతం నుంచి తెలంగాణకు నిరంతరంగా కొనసాగుచున్నవని, కానీ తెలంగాణ నుంచి ఆంధ్రకు ఈ విధంగా జరగటంలేదని, ఈ బదిలీలు డిప్యుటేషన్లు రాష్ట్రపతి ఉత్తర్వులకు అనుగుణంగా లేవని పేర్కొన్నారు.
6.సింగరేణి కాలరీస్‌కు సంబంధించిన విద్యాసంస్థలు, సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థలు, ప్రపంచ బ్యాంకు ఆర్థిక సహాయంతో నడుస్తున్న సంస్థలన్నింటిలో రాష్ట్రపతి ఉత్తర్వులు పాటించటంలేదని పేర్కొంటూ వీటన్నింటిలో విధిగా పాటించాలని అభిప్రాయపడ్డారు.
7.హైకోర్టు నుంచి మొదలుకొని మున్సిఫ్ మెజిస్ట్రేటు కోర్టు వరకు ఎక్కడ కూడా రాష్ట్రపతి ఉత్తర్వులను పాటించటంలేదు. ఈ న్యాయస్థానాలన్నింటిలో కిందిస్థాయి ఉద్యోగం నుంచి పైస్థాయి ఉద్యోగం వరకు అంతా స్థానికేతరులే అధికంగా ఉన్నట్లు గిర్గ్లాని నిర్ధారణకు వచ్చి దీన్ని తప్పుబట్టారు.
8.బీసీ, ఎస్సీ, ఎస్టీ బ్యాక్లాగ్ వేకెన్సీల నియామకాల్లో రాష్ట్రపతి ఉత్తర్వులను 25 సంవత్సరాల నుంచి సరిగా అమలు చేయడంలేదని, ఈ బ్యాక్లాగ్ ఉద్యోగాలను నూటికి నూరుశాతం స్థానికులకే రిజర్వు చేయాలని కమిషన్ అభిప్రాయపడింది.
9.నర్సింగ్‌లో శిక్షణ పొందినవారు, అలాగే ఉపాధ్యాయ శిక్షణ పొందినవారు బీసీ ఎ కేటగిరీ, ఎస్సీ, ఎస్టీల్లో లభించటం లేదని గిర్గ్లాని పేర్కొంటూ వారికి శిక్షణ ఇచ్చి ఆయా ఉద్యోగాలను స్థానికులతో భర్తీ చేయాలని సూచించారు.
ఈ మధ్యంతర నివేదికను శాసనసభలో ప్రవేశపెట్టి చర్చించారు. అసెంబ్లీలో సుదీర్ఘమైన వాడివేడి చర్చ పిదప నాటి ప్రభుత్వం 29-12-2001న 610 జీవో అధ్యయనంపై 18 మంది శాసనసభ్యులతో శాసనసభా కమిటీని రేవూరి ప్రకాష్‌రెడ్డి అధ్యక్షతన ఏర్పాటు చేశారు. ఈ కమిటీ దాదాపు రెండు సంవత్సరాల్లో 27 సార్లు సమావేశమై అందుబాటులోఉన్న వివరాలతో తన మధ్యంతర నివేదికను 17-3-2003లో ప్రభుత్వానికి అందజేసింది. ఈ నివేదికలోని ప్రధాన అంశాలు ఈ విధంగా ఉన్నాయి.
(1) ఎక్సైజ్ డిపార్టుమెంటులో 56 ఎస్సై పోస్టులను అక్రమంగా ఆంధ్రప్రాంతానికి బదిలీ చేసినందున ఆ పోస్టులను తెలంగాణ ప్రాంతాలకు బదిలీ చేసి తెలంగాణ ఉద్యోగులచే నియమించాలి. (2) ఆంధ్రప్రదేశ్ రెసిడెన్షియల్ విద్యా సంస్థల్లో స్థానిక రిజర్వేషన్లు పాటించడం లేదు. ఇక నుంచి వాటిలో స్థానిక రిజర్వేషన్ పాటించాలి. (3) హైదరాబాద్ సిటీ పోలీస్ విభాగంలో 1975 నుంచి 2002 వరకు జరిగిన సబ్ ఇన్స్పెక్టర్లు, కానిస్టేబుళ్ల నియామకాల్లో రాష్ట్రపతి ఉత్తర్వులను సరిగా పాటించకపోవడంతో స్థానికేతరులైన 273 మంది సబ్ ఇన్స్పెక్టర్లు, 4700 మంది కానిస్టేబుళ్లు ఉన్నట్లు గుర్తించారు. (4) 97 రిజర్వు సబ్ ఇన్స్పెక్టర్ ఉద్యోగుల్లో 44 మంది స్థానికేతరులున్నట్లు గుర్తించారు.
అయితే ఈ నివేదిక అమలు కాలేదు. 2004 ఎన్నికల ముందు రేవూరి ప్రకాశ్‌రెడ్డి ఇంకొక మధ్యంతర నివేదికను అందజేశాడు. 14-11-2003న అందులో కొంతమంది స్థానికేతరులను రంగారెడ్డి జిల్లా విద్యాశాఖలో, ఎక్సైజ్‌శాఖలో, కొంతమందిని పోలీస్ డిపార్టుమెంటులో గుర్తించారు. ఏకపక్షంగా తయారుచేసిన ఈ నివేదికలో ఎవరికీ ఆమోదం కాని తెలంగాణ ప్రాంతానికి అన్యాయం చేసే రీతిలో ఒక సిఫారసు చేశారు. అది ఏమంటే జరిగిన నష్టాన్ని వదిలేసి రాబోయే ఉద్యోగ ఖాళీల్లో తెలంగాణ ప్రాంతానికి న్యాయం చేస్తామని చెప్పడం. శాసనసభా కమిటీ సమర్పించిన మొదటి నివేదికను అమలు చేసేందుకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టలేదు. ఇక రెండో నివేదిక అసలు వెలుగులోకే రాలేదు.తెలంగాణకు సంబంధించిన 610 జీవో అమలు గురించి ప్రభుత్వం కమిటీలమీద కమిటీలు వేసి జాప్యానికి పాల్పడింది. అదే రాయలసీమకు సంబంధించిన జీవో 564ను ఎలాంటి అవరోధాలు కల్పించకుండా, జాప్యం చేయకుండా అమలుపర్చింది.
గ్రూప్-1, 2, 3 ప్రత్యేకం
610 జీవో. సీమాంధ్రుల పాలనలో 30 సంవత్సరాలైనా అమలుకు నోచుకోని జీవో. డిసెంబర్ 12 1985న జీవో జారీ చేసినా 2014 జూన్1 వరకు కూడా అమలుకునోచుకోని జీవో ఇది. 58,986 మంది అక్రమంగా ఉద్యోగాలు పొందారని లెక్కలు తేల్చినా.. ఏ ఒక్క ఉద్యోగిని వెనుకకు పంపించలేదు. రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం.. నియామకాలు జరగలేదని.. అక్రమాలు అనేకం జరిగాయని గిర్గ్లాని ఏకసభ్య కమిషన్ నిగ్గుతేల్చినా.. సీమాంధ్ర ప్రభుత్వాలకు పట్టలేదు. అన్యాయాల మీద అన్యాయాలు చేస్తూ తెలంగాణను నిండా ముంచారు. 610 జీవోను అటకెక్కించారు.
58,986 అక్రమ నియామకాలు
తెలంగాణ నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ యూనియన్ అధ్యక్షుడు స్వామినాథన్ 5/12/1985 నాడు జయభారత్‌రెడ్డి నేతృత్వంలోని త్రిసభ్య కమిటీని కలిసి ఎంప్లాయీస్ సెన్సెస్ 30 జూన్ 1981 వివరాలను జతపర్చిన లేఖను అందజేశాడు. రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం జరగాల్సిన జోన్లవారీ రిజర్వేషన్ నియమ నిబంధనలకు వ్యతిరేకంగా ఆంధ్రజోన్లయిన 1,2,3 లకు చెందిన వాళ్లు దాదాపుగా 58,986 మంది తెలంగాణ జోన్లయిన 5,6ల్లో అక్రమంగా నియామకమయ్యారని ఎంప్లాయీస్ సెన్సెస్ 30 జూన్ 1981 ద్వారా అర్థమవుతుంది. ఈ సెన్సెస్ ప్రకారం ఖమ్మం జిల్లాను ఉదాహరణగా తీసుకుంటే ఆ జిల్లాలో పనిచేస్తున్న ఉద్యోగుల్లో స్థానికులు, స్థానికేతరులు దాదాపు సమానంగా ఉన్నారు. ఆఫీసర్ల కమిటీ (త్రిసభ్య కమిటీ) 1975 నుంచి 1984 మధ్యకాలంలో జరిగిన ఉద్యోగ నియామకాలన్నింటినీ క్షుణ్ణంగా పరిశీలించి 36 పేజీల నివేదికను ప్రభుత్వ ప్రధాని కార్యదర్శికి సమర్పించారు.
ఈ నివేదికను పరిశీలించి తెలంగాణ ఎన్జీవో సంఘం నాయకులతో చర్చించిన ముఖ్యమంత్రి రామారావు ఒక జీవోను 30/12/1985న జారీ చేశాడు. అదే 610 జీవో. చేసిన తప్పులను సరిదిద్దుకునే క్రమంలో భాగంగా వెలువడినదే ఈ జీ.వో. 610. 30-3-1986 నాటికల్లా ఈ జీవోని అమలుపర్చి తెలంగాణ జోన్లయిన 5,6ల్లో ఉన్న స్థానికేతర ఉద్యోగులనందరినీ ఎవరి జోన్‌కు వారిని పంపి ఏర్పడే ఖాళీలను స్థానిక తెలంగాణవాళ్లతో నింపాలని ఈ జీవో తెలుపుతుంది. రాయలసీమ ఉద్యోగ సంఘం నాయకులతో చర్చించి ముఖ్యమంత్రి రామారావు సీమ ఉద్యోగులకు సంబంధించిన జీవో 564ను విడుల చేశారు. జయభారత్‌రెడ్డి నేతృత్వంలోని ఆఫీసర్ల కమిటీ, సుందరేశన్ కమిటీ ఈ రెండు కూడా ఉద్యోగ నియామకాల్లో విధిగా పాటించాల్సిన రాష్ట్రపతి ఉత్తర్వుల నియమ నిబంధనలను ఉల్లంఘించి నియామకాలు చేపట్టినట్టు నిర్ధారించాయి. కానీ స్థానికేతర ఉద్యోగులను గుర్తించి వారి సంఖ్యను తెలపలేదు. స్థానికేతర ఉద్యోగులను గుర్తించి వారి సంఖ్యను నిర్ధారించేందుకు ఒక ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయాలని అభిప్రాయపడ్డారు.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు