News – Features | వార్తలు -విశేషాలు
తెలంగాణ
స్పెస్ టెక్ ఫ్రేమ్‌వర్క్ పాలసీ
‘తెలంగాణ స్పెస్ టెక్ ఫ్రేమ్‌వర్క్ పాలసీ’ని ఐటీ మంత్రి కే తారకరామారావు ఏప్రిల్ 18న విడుదల చేశారు. స్పెస్ టెక్ వాతావరణాన్ని వేగవంతం చేసేందుకు రాష్ట్రంలోని స్టార్టప్‌లు, పరిశ్రమలు, విద్యాసంస్థలు చేపట్టే వినూత్న కార్యక్రమాల్లో ప్రభుత్వం భాగస్వామి కానుంది. ఎమర్జింగ్ టెక్నాలజీ వినియోగంలో ముందంజలో ఉన్న తెలంగాణ స్పేస్ టెక్నాలజీపై దృష్టిసారించింది.
కుమ్రం భీం జిల్లాకు అవార్డు
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాకు ప్రధానమంత్రి నేషనల్ ఎక్సలెన్సీ అవార్డు దక్కింది. ఏప్రిల్ 21న ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో కుమ్రం భీం జిల్లాకలెక్టర్ రాల్రాజ్ ఈ అవార్డును అందుకున్నారు. 2021కిగాను శిశు, బాలిక, మహిళలు, గర్భిణులు, బాలింతలకు పౌష్టికాహార కల్పన కార్యక్రమం పోషణ్ అభియాన్ అమల్లో కుమ్రం భీం జిల్లా దేశంలోనే తొలిస్థానంలో నిలిచినందుకు ఈ అవార్డు లభించింది.
దేవులపల్లి ప్రభాకర్‌రావు
జాతీయం
తొలి ఉక్కు రోడ్డు
దేశంలోనే మొట్టమొదటి ‘ఉక్కు’ రోడ్డును నిర్మించామని కేంద్ర రహదారి పరిశోధన సంస్థ (సెంట్రల్ రోడ్ రిసెర్చ్ ఇన్స్టిట్యూట్-సీఆర్ఆర్ఐ) ఏప్రిల్ 17న వెల్లడించింది. ఈ ఉక్కు రోడ్డును గుజరాత్‌లోని సూరత్ సమీపంలో హజీరా ఓడరేవు వద్ద 1.2 కిలోమీటర్లు ఆరు లేన్లతో నిర్మించారు. ఉక్కు కర్మాగారాల నుంచి వెలువడే వ్యర్థాలను కంకరతో కలిపి ప్రయోగాత్మకంగా ఈ రోడ్డును నిర్మించారు.
ఆయుష్ పెట్టుబడుల సదస్సు
3 రోజుల అంతర్జాతీయ ఆయుష్ పెట్టుబడులు, ఆవిష్కరణల సదస్సు-2022ను ప్రధాని మోదీ ఏప్రిల్ 20న ప్రారంభించారు. గుజరాత్ రాజధాని గాంధీనగర్‌లో నిర్వహించిన ఈ సదస్సుకు మారిషస్ ప్రధాని ప్రవింద్ జగన్నాథ్, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ (డబ్ల్యూహెచ్‌వో) డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనామ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా నిర్వహించిన ‘హీల్ ఇండియా’ కార్యక్రమంలో ప్రధాని మోదీ.. టెడ్రోస్ అధనామ్‌కు తులసీ భాయ్ అని పేరుపెట్టారు.
ఐఎన్ఎస్ వాగ్షీర్
ఐఎన్ఎస్ వాగ్షీర్ జలాంతర్గామి ముంబై సముద్ర తీరంలో ఏప్రిల్ 20న జలప్రవేశం చేసింది. సైలెంట్ కిల్లర్‌గా పేరొందిన ఈ జలాంతర్గామిని ముంబై మజ్గావ్ డాక్ షిప్‌బిల్డర్స్ లిమిటెడ్ (ఎండీఎల్) రూపొందించింది. ప్రాజెక్ట్-75లో ఆరు స్కార్పీన్ కేటగిరీ జలాంతర్గాములను తయారు చేయాలని భారత్ లక్ష్యంగా పెట్టుకుంది. అందులో ఇది ఆరోది, చిట్టచివరిది. ఇప్పటికే ఐఎన్ఎస్ కల్వరి, ఐఎన్ఎస్ ఖందేరి, ఐఎన్ఎస్ కరంజ్, ఐఎన్ఎస్ వేలా నౌకాదళంలోకి ప్రవేశించగా.. ఐఎన్ఎస్ వాగిర్ సీ ట్రయల్స్ పూర్తి చేసుకుంది.
గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్
ఆయిల్ ఇండియా లిమిటెడ్ (OIL) దేశంలోని మొట్టమొదటి 99.999 శాతం స్వచ్ఛమైన గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్‌ను ఏప్రిల్ 20న ప్రారంభించింది. రోజుకు 10 కిలోల స్థాపిత సామర్థ్యం కలిగిన ఈ ప్లాంట్‌ను అసోంలోని జోర్హాట్లో ఏర్పాటు చేశారు. అసోం సీఎం హిమాంత బిశ్వశర్మ, గవర్నర్ జగదీశ్‌ముఖి.
సివిల్ సర్వీసెస్ డే
15వ నేషనల్ సివిల్ సర్వీసెస్ డేని ఏప్రిల్ 21న నిర్వహించారు. 1947లో న్యూఢిల్లీలోని మెట్కాల్ఫ్ హౌస్‌లో అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ ఆఫీసర్ల ప్రొబేషనర్లను ఉద్దేశించి మొదటి హోంమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ ప్రసంగించిన రోజు జ్ఞాపకార్థంగా ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. మొదటి నేషనల్ సివిల్ సర్వీసెస్ డేని 2006లో నిర్వహించారు. ఈ ఏడాది దీని థీమ్ ’విజన్ ఇండియా@2047-బ్రింగింగ్ సిటిజన్స్ అండ్ గవర్నమెంట్ క్లోజర్’.
వార్తల్లో వ్యక్తులు
మనోజ్ పాండే
భారత 29వ సైనిక దళాధిపతి (చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్)గా లెఫ్టినెంట్ జనరల్ మనోజ్ పాండేను కేంద్రం ఏప్రిల్ 18న నియమించింది. ప్రస్తుత సైన్యాధ్యక్షుడు జనరల్ మనోజ్ ముకుంద్ నరవణె ఏప్రిల్ 30న రిటైరవుతున్నారు. ఆర్మీ కార్ప్ ఆఫ్ ఇంజినీర్స్ డివిజన్ నుంచి ఈ పదవి చేపట్టనున్న తొలి సైన్యాధికారిగా పాండే రికార్డు సృష్టించారు.
బిమల్ కొఠారి
భారత పప్పుధాన్యాల వాణిజ్యం, పరిశ్రమల అత్యున్నత సంస్థ ఇండియా పల్సెస్ అండ్ గ్రెయిన్స్ అసోసియేషన్ (ఐపీజీఏ) నూతన చైర్మన్‌గా బిమల్ కొఠారి ఏప్రిల్ 18న నియమితులయ్యారు. ఇదివరకు ఈ పదవిలో జితే భేడా ఉన్నారు. ప్రవీణ్ డోంగ్రే, జితు భేడా తర్వాత మూడో చైర్మన్‌గా బిమల్ బాధ్యతలు చేపట్టారు. ఐపీజీఏ ప్రధాన కార్యాలయం ముంబైలో ఉంది.
శాంతి సేఠి
అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ కార్యాలయంలో కార్యనిర్వాహక కార్యదర్శిగా, రక్షణ సలహాదారుగా శాంతి సేఠి ఏప్రిల్ 19న బాధ్యతలు స్వీకరించారు. భారత-అమెరికన్ అయిన ఈమె అమెరికా నౌకాదళాధికారిగా పనిచేస్తున్నారు.
అజయ్ కుమార్ సూద్
కేంద్ర ప్రభుత్వ ముఖ్య శాస్త్ర సలహాదారుగా ప్రొఫెసర్ అజయ్ కుమార్ సూద్ ఏప్రిల్ 20న నియమితులయ్యారు. సూద్ ప్రస్తుతం ప్రధానమంత్రి ‘టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్’ సలహా మండలి సభ్యుడిగా ఉన్నారు. ఇప్పటివరకు ఈ పదవిలో ప్రొఫెసర్ కే విజయ రాఘవన్ ఉన్నారు.
అంతర్జాతీయం
హీమోఫీలియా డే
వరల్డ్ ఫెడరేషన్ ఆఫ్ హీమోఫీలియా ఆధ్వర్యంలో హీమోఫీలియా దినోత్సవాన్ని ఏప్రిల్ 17న నిర్వహించారు. వరల్డ్ ఫెడరేషన్ ఆఫ్ హీమోఫీలియా స్థాపకుడు ఫ్రాంక్ ష్నాబెల్ జన్మదినాన్ని పురస్కరించుకొని 1989 నుంచి ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. రక్తం సరిగ్గా గడ్డకట్టకుండా ఉండే అరుదైన వ్యాధి హీమోఫీలియా. ఈ ఏడాది దీని థీమ్ ‘యాక్సెస్ ఫర్ ఆల్: పార్ట్ నర్షిప్. పాలిసీ. ప్రోగ్రెస్’.
ఐఎంఎఫ్ ప్యానెల్ మీటింగ్
ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ (ఐఎంఎఫ్) ఏప్రిల్ 19న అత్యున్నత స్థాయి ప్యానెల్ మీటింగ్ నిర్వహించింది. ఈ సమావేశానికి భారత ఆర్థిక మంంత్రి నిర్మలా సీతారామన్ హాజరయ్యారు. అంతకు ముందు నిర్మలా సీతారామన్ ఐఎంఫ్ ఎండీ క్రిస్టలినా జార్జీవాతో భేటీ అయ్యారు. ఈ భేటీలో ప్రస్తుత భౌగోళిక ఉద్రిక్తతలు, ఆర్థిక వ్యవస్థలపై దీని ప్రభావం తదితర అంశాలపై చర్చించారు.
రష్యా ఎంఎఫ్ఎన్ రద్దు
వాణిజ్యపరంగా రష్యాకు ఉన్న ‘అత్యంత అనుకూల దేశం (మోస్ట్ ఫేవర్డ్ నేషన్-ఎంఎఫ్ఎన్)’ హోదాను జపాన్ పార్లమెంట్ ఏప్రిల్ 20న రద్దు చేసింది. ఉక్రెయిన్‌పై యుద్ధాన్ని నిరసిస్తూ విధిస్తున్న ఆంక్షల్లో భాగంగా ఈ చర్య చేపట్టినట్లు జపాన్ ప్రకటించింది.
వరల్డ్ లివర్ డే
ప్రపంచ లివర్ (కాలేయం) దినోత్సవాన్ని ఏప్రిల్ 19న నిర్వహించారు. లివర్ సంబంధిత రుగ్మతలు, వ్యాధుల గురించి అవగాన కల్పించడానికి ఈ రోజును నిర్వహిస్తున్నారు. కాలేయం శరీరం నుంచి విష పదార్థాలను తొలగిస్తుంది.
వరల్డ్ హెరిటేజ్ డే
ఐక్యరాజ్యసమితి వరల్డ్ హెరిటేజ్ డే (ప్రపంచ వారసత్వ దినోత్సవం)ని ఏప్రిల్ 18న నిర్వహిస్తుంది. మానవ వారసత్వాన్ని పరిరక్షించడానికి, దాని కోసం పనిచేస్తున్న సంస్థల కృషిని గుర్తించడానికి ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. స్మారక చిహ్నాలు, ప్రదేశాల కోసం అంతర్జాతీయ దినోత్సవాన్ని ఏప్రిల్ 18న నిర్వహించాలని ఇంటర్నేషనల్ కౌన్సిల్ ఆన్ మాన్యుమెంట్స్ అండ్ సైట్స్ (ఐసీఓఎంఓఎస్) 1982లో ప్రతిపాదించింది. 1983లో యునెస్కో జనరల్ అసెంబ్లీ ఆమోదించింది. ఈ ఏడాది దీని థీమ్ ‘హెరిటేజ్ అండ్ క్లెమేట్’. 40 భారతీయ ప్రదేశాలను యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశాలుగా గుర్తించింది. యునెస్కో ప్రధాన కార్యాలయం పారిస్‌లో ఉంది. యునెస్కో డైరెక్టర్ జనరల్ ఆడ్రీ అజౌలే.
క్రీడలు
గుకేశ్
48వ లా రోడా ఓపెన్ ఇంటర్నేషనల్ చెస్ టోర్నీ-2022ను భారత యువ గ్రాండ్‌మాస్టర్ దొమ్మరాజు గుకేశ్ గెలుచుకున్నాడు. స్పెయిన్‌లోని లా రోడా పట్టణంలో ఏప్రిల్ 17న ముగిసిన ఈ టోర్నీలో నిర్ణీత 9 రౌండ్లలో 8 పాయింట్లు సాధించి అగ్రస్థానంలో నిలిచాడు.
పొలార్డ్
వెస్టిండీస్ ఆల్‌రౌండర్ కీరన్ పొలార్డ్ ఇంటర్నేషనల్ క్రికెట్‌కు ఏప్రిల్ 20న రిటైర్మెంట్ ప్రకటించాడు. ఐపీఎల్ లాంటి టీ20 లీగ్‌లలో మాత్రం ఆడుతానని వెల్లడించాడు. కెరీర్లో 123 వన్డేలు ఆడి 2706 పరుగులు చేశాడు. 55 వికెట్లు పడగొట్టాడు. ఈ ఏడాదిలో శ్రీలంకతో ఆడిన మ్యాచ్‌లో పొలార్డ్ 6 బంతుల్లో 6 సిక్స్‌లు కొట్టి ఇంటర్నేషనల్ క్రికెట్లో గిబ్స్, యువరాజ్ సింగ్ తర్వాత ఈ ఘనత సాధించిన మూడో క్రికెటర్‌గా నిలిచాడు.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?