Naxalite movement in Telangana | తెలంగాణలో నక్సలైట్ ఉద్యమం
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పాలనలో తెలంగాణ ప్రాంతం అభివృద్ధి చెందకపోవడానికి నక్సలైట్ సమస్యే ప్రధాన కారణమని ఆంధ్ర పాలకులు పేర్కొన్నారు.తెలంగాణ ప్రాంతం అభివృద్ధి చెందకపోవడానికి నిజంగా నక్సలైట్లే కారణమా? లేక నక్సలైట్లను బూచిగా చూపి అభివృద్ధిని విస్మరించారా? అనే విషయాలను కూలంకషంగా తెలుసుకోవాలి. నిరంతర నిర్లక్ష్యం, నిరాటంక దోపిడీవల్ల తెలంగాణ అభివృద్ధిలో వెనకబడిపోయిందా లేక నక్సలైట్ సమస్యకారణమా అనే విషయాలను పరిశీలిద్దాం.
నక్సలైట్ ఉద్యమం – కారణాలు
-1920 లలో కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (సీపీఐ) ఏర్పాటైంది.
-మాస్కో నేతృత్వంలోని కమ్యూనిస్టు పార్టీ నుంచి వచ్చే ఏ సూచనను అయినా తప్పకుండా భారత కమ్యూనిస్టు పార్టీ అమలు చేసేది.
-కమ్యూనిస్టు సిద్ధాంతం నిజమని తెలంగాణ రైతాంగ పోరాటం నిరూపించింది.
-1948లో జరిగిన పార్టీ సమావేశంలో కమ్యూనిస్టు పార్టీ తెలంగాణ రైతాంగ పోరాటయోధులకు జోహార్లు అర్పిస్తూ తెలంగాణ మార్గమే భారతదేశ మార్గంగా చేస్తామని ప్రతిజ్ఞ చేసింది.
-1949లో చైనాలో మావో నేతృత్వంలో కమ్యూనిస్టు పార్టీ ప్రభుత్వం ఏర్పడింది.
-మావో నేతృత్వంలోని కమ్యూనిస్టు పార్టీ తెలంగాణ సాయుధ పోరాటాన్ని భారతదేశంలో సామాన్య ప్రజల ప్రజాస్వామ్య స్థాపనకు ప్రథమ ప్రయత్నంగా, రైతు ఉద్యమానికి నాందీ వాచకంగా పేర్కొంది.
-భారత్ స్వాంతంత్య్రం పొందిన అనంతర కాలంలో 1950ల నుంచి భారత యూనియన్ ప్రభుత్వం, సోవియట్ యూనియన్ల మధ్య స్నేహపూర్వక సంబంధాలు ఏర్పడ్డాయి.
-దీంతో మాస్కోలోని కమ్యూనిస్టు పార్టీ (సోవియట్ రష్యా).. భారత్‌లోని కమ్యూనిస్టు పార్టీని నెహ్రూ ప్రభుత్వానికి సహకరించవలసిందిగా సూచన ఇచ్చింది.
-అంతేగాకుండా తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటాన్ని విరమించాలని సలహా ఇచ్చింది.
-ఆ సూచనలకు అనుగుణంగా 1955లో భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటాన్ని విరమించింది.
-అంతేగాకుండా సోవియట్ రష్యా కమ్యూనిస్టు పార్టీ అగ్రనాయకులైన బుల్లానిన్, కృశ్చేవ్లు 1956లో భారత్‌ను సందర్శించారు.
-ఈ అగ్రనాయకుల పర్యటనతో భారత్, సోవియట్ రష్యా సంబంధాలు మరింతబలపడ్డాయి.
-దీంతో భారత ప్రభుత్వంతో స్నేహంగా మెలగాలని 1956 పాల్ఘాట్ సమావేశంలో భారత కమ్యూనిస్టు పార్టీ నిర్ణయించింది.
-ఈ నిర్ణయాన్ని చైనా కమ్యూనిస్టు పంథా నాయకులు పుచ్చలపల్లి సుందరయ్య, మాకినేని బసవపున్నయ్యలు వ్యతిరేకించారు.
-1960లో సోవియట్ రష్యా, చైనాల మధ్య కూడా విభేధాలు అధికమయ్యాయి.
-1962లో భారత్‌పై చైనా యుద్ధం చేసి భారత భూభాగాలను ఆక్రమించుకుంది.
-దీంతో భారత కమ్యూనిస్టు పార్టీ అధ్యక్షుడైన ఎస్.ఎ.డాంగే చైనాను తీవ్రంగా విమర్శించి భారత ప్రభుత్వానికి తమ మద్దతు ప్రకటించాడు.
-దీంతో పార్టీలోని చైనా కమ్యూనిస్టు పంథా నాయకులు ఎస్.ఎ.డాంగేతో విభేధించి చైనాకు తమ పూర్తి మద్దతు ప్రకటించారు.
-ఈ పరిణామాల ఫలితంగా భారత కమ్యూనిస్టు పార్టీ 1964లో రెండుగా చీలిపోయింది.
నక్సల్బరి ఉద్యమం
-1967లో పశ్చిమబెంగాల్లో ఎన్నికలు వచ్చాయి.
-ఈ ఎన్నికల ముందు బెంగాల్లో సీపీఐ(ఎం) తమ పార్టీ మ్యానిఫెస్టోను విడుదల చేసింది.
-ఈ మ్యానిఫెస్టోలో బెంగాల్లో 6 లక్షల హెక్టార్ల భూమిని పేదలకు, గిరిజనులకు పంచుతామని హామీ ఇచ్చింది.
-ఈ హామీతో 1967 ఎన్నికల్లో సీపీఐ(ఎం) గెలిచి ముఖ్యమంత్రిగా అజయ్ముఖర్జి, ఉప ముఖ్యమంత్రి, హోంమంత్రిగా జ్యోతిబసు ప్రమాణస్వీకారం చేశారు.
-ఎన్నికల మ్యానిఫెస్టోలో పేర్కొన్న విధంగా 6 లక్షల హెక్టార్ల ఖాళీ భూములను పంచడానికి ప్రభుత్వం నిరాకరించింది.
-దీంతో డార్జిలింగ్ ప్రాంత సీపీఐ (ఎం) జనరల్ సెక్రటరీగా ఉన్న చారుమజుందార్ పార్టీ నిర్ణయాన్ని వ్యతిరేకించాడు.
-ప్రభుత్వం భూమిని పంచకపోవడంతో చారుమజుందార్ నేతృత్వంలో డార్జిలింగ్ (బెంగాల్) ప్రాంతంలోని సిలిగురి ప్రజలు భూఆక్రమణకు పూనుకున్నారు.
-సిలిగురి ప్రాంతంలోని నక్సల్బరీ అనే గ్రామంలో 1967 మే 23-25 మధ్య 10 వేల మంది సంతాల్ గిరిజనులు భూఆక్రమణ మొదలుపెట్టారు.
-ఈ భూ ఆక్రమణకు వ్యతిరేకంగా పోలీసులు జరిపిన కాల్పుల్లో ఐదుగురు మహిళలు, ముగ్గురు చిన్నారులు మరణించారు.
-దేశవ్యాప్తంగా సీపీఐ(ఎం)లోని అసంతృప్తివాదులు పార్టీ నాయకత్వంపై అంతర్గత పోరాటం ప్రారంభించారు.
-ఆంధ్ర కమ్యూనిస్టు పార్టీలో సీనియర్ నాయకులు తరిమెల నాగిరెడ్డి, చండ్ర పుల్లారెడ్డి, కొల్లా వెంకయ్య, దేవులపల్లి వెంకటేశ్వరరావులు కేంద్ర నాయకత్వంతో విభేదించారు.
-1967 నవంబర్‌లో వివిధ కమ్యూనిస్టు వర్గాల మధ్య ఉన్న సిద్ధాంతపరమైన భేదాలను తగ్గించుకోవాలనే ఉద్దేశంతో కమ్యూనిస్టు విప్లవకారుల అఖిల భారత సమన్వయ కమిటీ ఏర్పడింది.
-1969 జనవరిలో పాలకొల్లులో జరిగిన ప్లీనరీలో తరిమెల నాగిరెడ్డి, చండ్ర పుల్లారెడ్డి, కొల్లా వెంకయ్య, దేవులపల్లి వెంకటేశ్వరరావులు మధురై తీర్మానాన్ని వ్యతిరేకించారు.
-దేశాన్ని పరిపాలిస్తున్నది బడా బూర్జువా వర్గం కాంప్రాడార్-బ్యూరోక్రటిక్ తత్వం కలిగిన వర్గమని ఈ నలుగురు నాయకులు సూత్రీకరించారు.
-ఈ సూత్రీకరణను సీపీఎం తిరస్కరించింది.
-మధురై సమావేశంలో సీపీఎం వారు చేసిన సోషలిజంలోకి పరివర్తన రూపాలు (ఆన్ ఫోరమ్ ఆఫ్ ట్రాన్సిషన్ టు సోషలిజమ్) అనే భావనను ఆంధ్ర కమ్యూనిస్టు నాయకులు వ్యతిరేకిస్తూ.. సీపీఎం కేంద్ర కమిటీ శాంతియుత పార్లమెంటరీ పంథాను దుయ్యబట్టారు.
-కమ్యూనిస్టు విప్లవకారుల అఖిల భారత సమన్వయ కమిటీ 2వ సమావేశం 1968 మే నెలలో కలకత్తాలో జరిగింది.
-ఈ సమావేశంలో సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి అయిన చారు మజుందార్ ఎన్నికలను బహిష్కరించాలని, సాయుధ పోరాటం చేపట్టాలని పేర్కొన్నాడు.
-చారు మజుందార్ ప్రకటనను శ్రీకాకుళం గిరజనోద్యమ నాయకులు పంచాది కృష్ణమూర్తి, చౌదరి తేజేశ్వరరావులు అంగీకరించారు.
-కానీ జాతీయ కమ్యూనిస్టు పార్టీ నాయకులైన తరిమెల నాగిరెడ్డి, దేవులపల్లి వెంకటేశ్వరరావులు చారు మజుందార్ ప్రకటనను వ్యతిరేకించారు.
-1968 జూన 16న తరిమెల నాగిరెడ్డి, చండ్ర పుల్లారెడ్డి, కొల్లా వెంకయ్య, దేవులపల్లి వెంకటేశ్వరరావులను పార్టీ నుంచి బహిష్కరించారు.
-1968 జూన్ 29, 30 తేదీల్లో విజయవాడలో తరిమెల నాగిరెడ్డి, చండ్ర పుల్లారెడ్డి, దేవులపల్లి వెంకటేశ్వరరావు, కొల్లా వెంకయ్యలు సమావేశమై తమను తాము కమ్యూనిస్టు విప్లవకారులుగా ప్రకటించుకున్నారు.
-తరిమెల నాగిరెడ్డి సమన్వయకర్తగా 9 మంది సభ్యులతో ఆంధ్రరాష్ట్ర సమన్వయ సంఘం ఏర్పడింది.
-మావో ఆలోచనలే తమకు మార్గదర్శకమని ప్రకటిస్తూ 1944-51 నాటి తెలంగాణ సాయుధ పోరాటం మాదిరిగా త్వరలో మరో తెలంగాణ రైతాంగ ఉద్యమాన్ని ప్రారంభించనున్నట్లు ప్రకటించారు.
-తెలంగాణలోని వరంగల్, ఖమ్మం జిల్లాలను తమ కార్యక్రమ ప్రాంతాలుగా ఎంచుకున్నారు.
-తరిమెల నాగిరెడ్డి, దేవులపల్లి వెంకటేశ్వరరావులు చారు మజుందార్‌తో వ్యతిరేకించి 1969 ఫిబ్రవరిలో యునైటెడ్ కమిటీ ఆన్ కమ్యూనిస్టు రెమ్యుషనరీ మార్క్సిస్టు లెనినిస్టు ఆఫ్ ఇండియా (యూసీసీఆర్‌ఐఎంఎల్)ను ఏర్పాటు చేశారు.
-చారుమజుందార్ తీర్మానాన్ని ఆమోదించినవారు 1969 ఏప్రిల్ 22న సీపీఐ(ఎంఎల్)ను స్థాపించారు.
-1969 మే 1న కలకత్తాలోని షహీద్ మినార్ మైదానంలో కానూ సన్యాల్ సీపీఐ(ఎంఎల్) పార్టీ అవతరణను, పార్టీ విధానాలను ప్రకటించాడు.
-దీన్నే సోషలిజానికి మొదటి దశ అయిన న్యూ డెమోక్రటిక్ విప్లవం అంటారు.
నక్సలైట్ ఉద్యమం – విస్తరణ
-1967లో నక్సల్బరీలో ప్రారంభమైన ఉద్యమం 1968లో శ్రీకాకుళంకు వ్యాపించింది.
శ్రీకాకుళం గిరిజనోద్యమం
-శ్రీకాకుళం జిల్లాలోని గిరిజన ప్రాంతాల్లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన విప్లవకారులు 1967 నుంచే గిరిజన సంఘాలు, మహిళా సంఘాలను ఏర్పాటు చేయడం ప్రారంభించారు.
-అటవీ భూములను స్వేచ్ఛగా ఉపయోగించే హక్కు, వెట్టి చాకిరీ నిర్మూలన, వేతనాల పెంపు ప్రధాన లక్ష్యాలుగా ఈ సంఘాలు పనిచేశాయి.
-వెంపటావు సత్యనారాయణ, ఆదిబట్ల కైలాసం, పంచాద్రి కృష్ణమూర్తి నాయకత్వంలో విజృంభించిన శ్రీకాకుళ గిరిజనోద్యమం చాలా ప్రాధాన్యతను సంతరించుకుంది.
-ఈ క్రమంలో నక్సల్బరి ఉద్యమానికి మూలకారకుడైన చారు మజుందార్‌తో చౌదరి తేజేశ్వరరావు, పంచాది కృష్ణమూర్తి వంటి శ్రీకాకుళం ఉద్యమకారులకు ప్రత్యక్ష సంబంధాలు ఏర్పడ్డాయి.
-1967 సాధారణ ఎన్నికల అనంతరం గిరిజనులు బంజరు భూములను పంపిణీ చేయాలని ఉద్యమం చేపట్టారు.
-1967 అక్టోబర్ 31న మొండెంఖల్ అనే ప్రాంతంలో గిరిజన రైతు కూలీ సంఘం సమావేశం ఏర్పాటు చేశారు.
-దీని ప్రధాన ఉద్దేశం నక్సల్బరిలో జరిగిన ఉద్యమాన్ని గిరిజనులకు వివరించడం.
-గిరిజనులు తమ లక్ష్య సాధనకు ఉద్యమించారు. దాదాపు 4 వేల ఎకరాల అటవీ భూములను ఆక్రమించుకున్నారు.
-గిరిజనుల డిమాండ్లను భూస్వాములు అంగీకరించాల్సిన పరిస్థితి ఏర్పడింది.
-ఉద్యమం తీవ్రరూపం దాల్చడంతో రెవెన్యూ పన్నుల వసూళ్లు నిలిచిపోయాయి.
-గిరిజన సంఘాల అనుమతి లేకుండా ప్రభుత్వ ఉద్యోగులు, పోలీసులు అటవీ ప్రాంతాల్లో ప్రవేశించలేని పరిస్థితి ఏర్పడింది.
-పశ్చిమబెంగాల్ నక్సల్బరీ పోరాట ఉద్యమం శ్రీకాకుళ గిరిజనోద్యమానికి కొంత ప్రోత్సాహాన్ని కలుగజేసింది.
-సాయుధ పోరాటం ద్వారా రాజ్యాధికారాన్ని చేజిక్కించుకోవాలన్న ఏఐసీసీసీఆర్ నిర్ణయం శ్రీకాకుళం ఉద్యమాన్ని ప్రభావితం చేసింది.
-అప్పటికే వృద్ధి చెందుతున్న ఉద్యమంలో చారు మజుందార్ సలహాల మేరకు వ్యూహాత్మక మార్పులు చేశారు.
-శ్రీకాకుళంలో, తెలంగాణలో సాయుధ పోరాట కేంద్రాలు వృద్ధి చెందాయి.
-నాగిరెడ్డి, దేవులపల్లి చట్టబద్ధంగా, చట్టం వెలుపల కూడా సంఘర్షణలు జరపాలని, ఆర్థిక పోరాటాల ద్వారా సుదీర్ఘమైన సన్నాహాలు చేసి పూర్తిస్థాయి పోరాటాన్ని మొదలుపెట్టాలని భావించారు.
-1968 అక్టోబర్‌లో శ్రీకాకుళం ప్రాంత నాయకులతో చౌదరి తేజేశ్వరరావు సంబంధాలు ఏర్పరుచుకున్నాడు.
-1968 అక్టోబర్‌లో శ్రీకాకుళం జిల్లా సమన్వయ సంఘం బొడ్డుపాడులో సమావేశమై సాయుధ పోరాటాన్ని తక్షణం ప్రారంభించాలని తీర్మానించింది.
-1968 నవంబర్ 24న బొగ్గపాడు సమీపంలోని గరుఢభద్ర గ్రామంలోని భూస్వామి పంటలను స్వాధీనం చేసుకోవడంతో సాయుధ పోరాటానికి తిరిగి నాంది జరిగింది.
-1969 జనవరి-ఆగస్టు మధ్యకాలంలో 86 సంఘటనలు జరిగాయి.
-శ్రీకాకుళం పోరాటం చారుమజుందార్ చేతుల్లోకి వెళ్లింది.
-1969 ఫిబ్రవరి 19, 20, 21 తేదీల్లో గుంటూరు జిల్లా పిడుగురాళ్ల సమీపంలోని గుత్తికొండ బిలంలో చారుమజుందార్ రహస్య సమావేశం నిర్వహించారు.
-ఈ రహస్య సమావేశానికి పంచాది కృష్ణమూర్తి, చౌదరి తేజేశ్వరరావు, మామిడి అప్పలసూరి హాజరయ్యారు.
కమ్యూనిస్టు పార్టీ రెండు వర్గాలుగా చీలిక
1. కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా – (సీపీఐ)
2. కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్టు) – (సీపీఐ-ఎం)
ఈ సమయంలో ఆంధ్రప్రదేశ్ కమ్యూనిస్టు నాయకులు కూడా రెండు వర్గాలుగా చీలిపోయారు.
-రావి నారాయణరెడ్డి, చండ్ర రాజేశ్వరరావులు సీపీఐలో కొనసాగారు.
-పుచ్చలపల్లి సుందరయ్య, బసవ పున్నయ్యలు సీపీఎంలో కొనసాగారు.
-సీపీఐ రష్యాను సమర్థించగా, సీపీఐ (ఎం) చైనాను సమర్థించింది.
-సీపీఐ (ఎం) చైనా కమ్యూనిస్టు పంథాను అనుసరించింది.
-1964లో ఏప్రిల్ 11న జరిగిన జాతీయ సమితి సమావేశంలో వాకౌట్ చేసి బయటకు వచ్చిన 32 మంది సభ్యులు సీపీఐ (ఎం)ను ఏర్పాటు చేశారు.
-1964 చీలిక తర్వాత సాయుధ పోరాట ప్రారంభానికి చర్యలేమీ చేపట్టకపోవడంతో 1967 మే నెలలో బెంగాల్‌లోని నక్సల్బరిలో స్థానిక సీపీఐ నాయకులు రైతాంగ తిరుగుబాటును లేవదీశారు.
-రైతాంగ తిరుగుబాటును లేవదీసినవారు మరోసారి చీలిక కమ్యూనిస్టు పార్టీ (ఎంఎల్) ఏర్పరుచుకున్నారు.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?