Survival lanes | బతుకుదెరువు దారులు
ప్రపంచదేశాలన్నీ అభివృద్ధి పథంలో ముందుకు సాగుతున్నాయి. వేగవంతమైన అభివృద్ధి కోసం అనేక
కార్యక్రమాలు చేపడుతున్నాయి. ఈ పరిణామక్రమంలో ప్రజల జీవితాల్లో అనేక మార్పులు సంభవిస్తున్నాయి. ముఖ్యంగా అభివృద్ధిలో అసమాతనల కారణంగా మానవ వలసలు పెరిగిపోతున్నాయి. ఉన్నచోట ఉపాధి దొరకని పరిస్థితుల్లో జీవనోపాధిని వెతుక్కొంటూ కొత్త ప్రదేశాలకు వలస పోతున్నారు. ఈ అభివృద్ధి పరిణామాలపై నిపుణ పాఠకులకోసం ప్రత్యేకం..
-సాధారణంగా వలస కార్మికులు తమ పేర్లను ఇంటర్ స్టేట్ మైగ్రెంట్ వర్క్‌మెన్ యాక్ట్ (ISMWA) ప్రకారం నమోదు చేసుకోవాలి. కానీ చేయడం లేదు. నిర్మాణరంగంలో వలస కార్మికులకు రియల్ ఎస్టేట్‌వారికి మధ్యవర్తులుగా మధ్యప్రదేశ్‌లో ప్రధానంగా ముక్కద్దమ్స్ ఉంటారు. వారు కార్మికులకు డబ్బులు అడ్వాన్స్‌గా కూడా ఇస్తారు.
-కార్మికులను నియమించుకునేవారు, కార్మికులు ISMWA ప్రకారం నమోదు కావాలి. అదేవిధంగా కార్మికుల ఏజెంట్లుకాని, కార్మికులను నియమించేవారుగాని తప్పకుండా వారికి కొన్ని వసతులు కూడా కల్పించాలి.
-ISMWA ప్రకారం నియమించేవారు కార్మికులకు మంచి పని పరిస్థితులు, శిశు విహారాలు కల్పించాలి. దీంతో పాటు కనీస వేతనం ఇచ్చి వారి ఆరోగ్యం గురించి పట్టించుకోవాలి.
-దాదాపు 52 శాతం కార్మికులు ఆరుబయట నిద్రపోతున్నారు. వారు పోలీసులు, పట్టణ అధికారుల వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా వారి నివాసాల ఎత్తివేత, అక్రమ వసూళ్లు, వారి హక్కుల దుర్వినియోగం మొదలైనవి ఎదుర్కొంటున్నారు.
-మహిళలపై లైంగికదాడులు కూడా జరుగుతున్నాయి. పిల్లలను అసాంఘిక కార్యకలాపాలకు వినియోగిస్తున్నారు. ఉపాధిపోతుందనే భయంతో ఈ దారుణాలన్నీ భరిస్తున్నారు.
-శ్రామిక సంఘాలు కూడా వీరిని సంఘాల్లో చేర్చుకోవడం లేదని గణాంకాలు తెలుపుతున్నాయి. ఎందుకంటే వీరు అధికంగా వలస వెళ్లడంతో సాధ్యం కావడంలేదని శ్రామిక సంఘాలు వెల్లడిస్తున్నాయి.
-నిర్మాణరంగ కంపెనీలు వేతనాలను కార్మికులకు చెల్లించకుండా మధ్యవర్తులకు చెల్లించడంతో కార్మికులు తక్కువ వేతనానికి గురవుతున్నారు. దీంతో దీర్ఘకాలిక రుణ ఊబికి గురవుతున్నారు. రుణ ఊబి వెట్టిచాకిరీకి దారితీస్తుంది.
-ILO ప్రకారం ప్రతి 1000 మంది కార్మికులకు 165 మంది కార్మికులు పని పరిస్థితుల్లో ప్రమాదాలకు గురవుతున్నారు. కాని సరైన పని పరిస్థితులు కల్పించడం లేదు. స్త్రీలు తమ పిల్లలకు పాలిస్తే కూడా యజమానులు అభ్యంతరం చెబుతున్నట్లు 62 శాతం పాలిచ్చే తల్లులు పేర్కొంటున్నారు.
-నిర్మాణరంగం తరువాత ఇటుకల తయారీలో కూడా వలస కార్మికులు అధికంగా ఉంటున్నారు.
-దాదాపు దేశంలో 50,000 ఇటుక తయారీ సంస్థలు ఉన్నట్లు గణాంకాలు తెలుపుతున్నాయి.
-సుమారుగా ప్రతి సంస్థలో సగటున 100 మంది కార్మికులు పనిచేస్తున్నారు. గణాంకాల ప్రకారం పిల్లలు, మహిళలు మొత్తం కలిపితే దాదాపు 10 మిలియన్ల ప్రజలు ఇటుకల తయారీలో పనిచేస్తున్నారు.
-ఇటుకల తయారీరంగంలోని కార్మికులకు రోజువారీగా రూ. 70 నుంచి 130 చొప్పున మాత్రమే చెల్లిస్తున్నారు. వచ్చినవాటిలో కూడా ఎక్కువగా మద్యానికే ఖర్చు చేస్తూ ఎలాంటి పొదుపు లేకుండా రుణ ఊబిలో కూరుకుపోతున్నారు. ఇటుక బట్టీల్లో ఎక్కువగా బీహార్, పశ్చిమ ఒడిశా నుంచి వచ్చినవారే పనిచేస్తున్నారు.
-బీహార్‌లో ఉండే ముసహర్ కులస్థులు పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్ రాష్ర్టాలకు వలస వెళ్లి ఇటుకబట్టీల్లో పనిచేస్తున్నారు. ఈ కులస్థులు కనీసం ఎన్జీవో అంటే వీరి తరఫున మాట్లాడే సంఘాలు కూడా లేవని పేర్కొన్నారు.
-టెక్స్టైల్ పరిశ్రమలో దాదాపు 31 శాతం మంది వలస కార్మికులే పనిచేస్తున్నారు. వీరు ఎక్కువగా భీవండీ, సూరత్, షోలాపూర్, అహ్మదాబాద్‌లకు వలస వెళ్తున్నారు. గుజరాత్లో దాదాపు 8,00,000 మంది పనిచేస్తున్నట్లు గణాంకాలు తెలుపుతున్నాయి.
-దాదాపు 80 శాతం ఒరియా కార్మికులు టెక్స్‌టైల్‌లో పనిచేస్తుండగా మిగిలిన 20 శాతం ప్లాస్టిక్స్, సాల్ట్ తయారీ, ఫార్మా, డైమండ్ పాలిష్‌లో పనిచేస్తున్నారు. దాదాపు 2 మిలియన్ల కార్మికులు తోలు పరిశ్రమలో పనిచేస్తున్నారు.
-ఈ పరిశ్రమలు ధారవి (ముంబై) ప్రాంతంలో ఎక్కువగా ఉన్నాయి. ఈ పరిశ్రమలో అధికంగా పనిచేసేవారు బీహార్, ఉత్తరప్రదేశ్ నుంచి వలసవచ్చినవారే.
-ప్రపంచంలో చైనా తర్వాత రెండో స్థానంలో ఉన్న భారత్‌లోని తోలు పరిశ్రమల్లో బాల కార్మికులు అధికంగా పనిచేస్తున్నారు.
-ఈ పరిశ్రమ అధికంగా తమిళనాడు, ముంబై, ఉత్తరప్రదేశ్, పంజాబ్, ఢిల్లీలలో కేంద్రీకృతమై ఉంది.
-బీహార్‌లోని Barthi గ్రామంలో దాదాపు 2170 కుటుంబాలు ఉన్నాయి. ఇందులో అధికంగా యాదవులు, ముస్లింలు, ఎస్సీలు ఉన్నారు. దాదాపు 70 శాతం కుటుంబాలు ముంబై, ఢిల్లీ, గుజరాత్, సూరత్, అహ్మదాబాద్, కోల్‌కతా మొదలైన ప్రాంతాలకు వలస వెళ్లాయి.
-ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, బీహార్, రాజస్థాన్‌లో పనిచేసే మైకా గనుల కార్మికుల విషయంలో అసలు గణాంకాలే నిర్వహించడంలేదు.
-వీరి పేర్లు బి Register ప్రకారం నిర్వహించబడతాయి.
-ఉత్తరప్రదేశ్, బీహార్, పంజాబ్ రాష్ర్టాల్లో దాదాపు 8,19,000 మంది వలస కార్మికులు వ్యవసాయరంగంలో ఉన్నారు. కొన్ని కాలాల్లో ముఖ్యంగా విత్తనాలు వేసే సమయాల్లో, పంట కోసే సమయాల్లో వలస ఉంటుంది. అదేవిధంగా పశ్చిమబెంగాల్లోని బర్ధమాన్ ప్రాంతంలో కూడా వ్యవసాయ వలస కార్మికులు దాదాపు 5,00,000 వరకు నమోదయ్యారు.
-మహారాష్ట్ర, గుజరాత్, కర్ణాటక రాష్ర్టాల్లో చక్కెర పరిశ్రమకు సంబంధించి కూడా వలస కార్మికులు ఉన్నారు.
-ఇందులో ఎక్కువగా ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వారున్నారు. ఒక్క మహారాష్ట్ర నుంచే దేశంలో 40 శాతం పంచదార ఉత్పత్తి అవుతున్నది.
-మహారాష్ట్రలోని ఖాందేశ్, కర్ణాటకలోని బెల్గామ్‌లలో దాదాపు 3,00,000 మంది వలస కార్మికులు ఉన్నారు. అందులో 6-14 ఏండ్ల వయస్సు కలిగినవారు కూడా ఉన్నారని సెంటర్ ఫర్ డెవలప్మెంట్ రిసెర్చ్ అండ్ డాక్యుమెంటేషన్ పేర్కొన్నది.
-దేశంలో పత్తిని గుజరాత్లో ఎక్కువగా పండిస్తున్నారు. దీంతో రాజస్థాన్‌లోని దక్షిణప్రాంతం నుంచి గుజరాత్‌కు వలస వస్తున్నారు. వలస కార్మికుల్లో ఎక్కువగా పిల్లలే (14 ఏండ్లలోపు వారు) ఉన్నట్లు తెలుస్తోంది.
-ఆహార ప్రక్రియ పరిశ్రమలో కూడా ఈ వలస కార్మిక వ్యవస్థ ఉన్నది. దాదాపు 7 శాతం జీడీపీని అందించే పరిశ్రమలో 9 మిలియన్ల మంది పనిచేస్తున్నారు.
-ఇండ్లలో పనిచేయడానికి (డొమెస్టిక్ వర్క్) దాదాపు 20 మిలియన్ల ప్రజలు ముఖ్యంగా స్త్రీలు, పిల్లలు బీహార్, ఒడిశా, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, అసోం, మిజోరంల నుంచి ఢిల్లీ, ముంబైలాంటి పెద్ద పట్టణాలకు వలస వెళ్తున్నట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి.
-ఇందులో 20 శాతం కార్మికులు 14 ఏండ్లలోపు పిల్లలే.
-దేశంలో దాదాపు 8 మిలియన్ల రిక్షా కార్మికులు ఉన్నారు. 2007 గణాంకాల ప్రకారం బీహార్, ఉత్తరప్రదేశ్‌లకు చెందిన దాదాపు లక్ష మంది కార్మికులు ఢిల్లీలో రిక్షా లాగుతున్నట్లు నమోదయ్యింది.
-బీహార్‌లో పుర్ణియా, మధుబన్, సీతామర్హి జిల్లాల నుంచి కార్మికులు దాబాలు, రెస్టారెంట్లలో పనిచేయడానికి వలస వెళ్లినట్లు గణాంకాలు తెలుపుతున్నాయి.
-వలస వ్యవస్థలో సెక్స్ వర్కర్లు కూడా అధికంగానే ఉన్నారు. మహారాష్ట్ర, కర్ణాటక మురికివాడల్లో ఈ సమస్య అధికంగా ఉన్నట్లు గణాంకాలు తెలుపుతున్నాయి.
వలస ప్రభావం
-వలసల వల్ల ఆర్థిక వ్యవస్థలో రుణాత్మక, ధనాత్మక ప్రభావాలు ఉంటాయి. అయితే ఇందులో ధనాత్మక అంశాలను పెంచాలి.
ధనాత్మక అంశాలు
-వేరే ప్రాంతాలకు వెళ్లినవారు ఉపాధికోసం వెళ్లి స్వదేశానికి ఉత్పత్తిదారులుగా తిరిగి వస్తున్నారని హెచ్‌డీఐ నివేదిక పేర్కొంది.
-వలసల వల్ల ప్రపంచం ఒక గ్రామంగా తయారై వనరులను ఇచ్చిపుచ్చుకోవడం జరిగింది. విదేశాలకు వెళ్లినవారు తమ కుటుంబాల జీవన ప్రమాణాలను మెరుగుపర్చుకుంటున్నారు.
-ఇలా ప్రజలు వలస వెళ్లడం వల్ల స్వదేశంలో ఉద్యోగాలపై, దేశంలో వనరులపై ఒత్తిడి తగ్గుతుంది.
రుణాత్మక ప్రభావం
-మానవ వనరులు విదేశాలకు తరలివెళ్లడం వల్ల ఒక దేశం సమర్థమైన యువకులను కోల్పోయే అవకాశం ఉంది.
-జనాభాలో ఉత్పాదక కార్మికుల సంఖ్య తగ్గి వృద్ధులు, పిల్లల సంఖ్య పెరుగుతుంది. అంటే అనుత్పాదక కార్మికుల సంఖ్య అధికమవుతుంది. దీంతో జనాభా అసంతులనం ఏర్పడే అవకాశం ఉంది. ప్రజలు చెల్లించే పన్నుల ద్వారా చదువుకొని విదేశాల్లో సేవ చేయడం స్వదేశానికి నష్టం.
వలసలకు కారణం
-ప్రజలు ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వలస వెళ్లడానికి ఎన్నో కారణాలు ఉంటాయి.
ముఖ్యంగా… ఆర్థిక అంశాలు
-ప్రజలు సాధారణంగా ఉపాధి కోసం వలస వెళ్తుంటారు. తమ ప్రాంతంలో ఉపాధి, జీవనం దుర్భరంగా మారినప్పుడు ఇతర ప్రాంతాలకు వెళ్తారు. దీన్నే Push Factor అంటారు.
-తమ ప్రాంతంలో పేదరికం అధికంగా ఉన్నప్పుడు దానినుంచి బయటపడేందుకు, కరువు, కాటకాలు సంభవించినప్పుడు ఇతర ప్రాంతాలకు వెళ్తారు. దీన్ని కూడా Push Factor అంటారు.
-కొన్ని సందర్భాల్లో వరదలు వచ్చినప్పుడు ప్రజలు వేరొక ప్రాంతాలకు వెళ్తారు.
-ఎప్పుడైతే పంటనష్టం జరుగుతుందో ప్రజలు ముఖ్యంగా భూమిలేని రైతు కూలీలు, చిన్న, సన్నకారు రైతులు మరో ప్రాంతానికి వలస వెళ్తారు.
సాంఘిక అంశాలు
-మంచి జీవన ప్రమాణం కోసం ప్రజలు ఇతర ప్రాంతాలకు వెళ్తారు.
రాజకీయ అంశాలు
-ఒక ప్రాంతంలోని ప్రజలు తమ ప్రాంతంలో రాజకీయ అస్థిరత ఉన్నప్పుడు ఆ ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి తరలి వెళ్తారు. ముఖ్యంగా ఉగ్రవాదం, కులమత కొట్లాటలు, తెగల మధ్య తగాదాలు మొదలైన అంశాలు.
పర్యావరణ అంశాలు
-తమ ప్రాంతంలో సంభవించే ప్రకృతి బీభత్సాల నుంచి బయటపడేందుకు వలస వెళ్తారు.
పుష్, పుల్ ఫ్యాక్టర్స్
-ఒక వ్యక్తి తన ప్రాంతంలో ఏదో ఒక కారణం చేత జీవనం దుర్భరమై వేరే ప్రాంతానికి వలస వెళ్తే అలాంటి వలసను పుష్ ఫ్యాక్టర్ వలసగా పేర్కొంటారు. ఉదా: నిరుద్యోగం, సౌకర్యాల కొరత, భద్రత లేకపోవడం, కరువు, కాటకాలు, పంట నష్టం, పేదరికం, వరదలు వంటివి.
-ఒక వ్యక్తి ఉన్నత జీవితం కోసం మరొక ప్రాంతానికి వలస వెళ్తే దాన్ని పుల్ ఫ్యాక్టర్ వలసగా పేర్కొంటారు. ఉదా: ఉన్నత ఉద్యోగం, మంచి పర్యావరణం కోసం, ఉన్నత పరమైన సేవల కోసం, సారవంతమైన భూమి, నాణ్యమైన ఆహారం, ఆస్తి, ప్రశాంతమైన జీవనం కోసం వలస వెళ్లడం.
వలస సిద్ధాంతం-నవ్య సంప్రదాయ ఆర్థిక సిద్ధాంతం
-దీనిప్రకారం అభివృద్ధి చెందిన దేశాల మధ్య వలస పుల్ ఫ్యాక్టర్ వల్ల జరుగుతుంది. అదేవిధంగా ప్రజలు పేద దేశాల నుంచి ధనిక దేశాలకు పుష్ ఫ్యాక్టర్‌గా వెళ్తున్నారు. దీన్నే ద్వంద్వ మార్కెట్ సిద్ధాంతంగా పేర్కొంటారు. అంటే ఆర్థికంగా బలమైన దేశాల మధ్య వలస North-North, పేద దేశాల నుంచి ధనిక దేశాలకు అంటే South-North దేశాలకు జరుగుతుంది.
వలస సాపేక్ష దోపిడీ సిద్ధాంతం
-ఇరుగు పొరుగు కుటుంబాల ఆర్జన కూడా వలసకు దారితీస్తుంది.
-ఒక కుటుంబంలో బయటి దేశం నుంచి ద్రవ్యం పంపిస్తున్నప్పుడు వారు ఆర్థికంగా ఉన్నత స్థాయికి వెళ్లడంతో అసమానతలు పెరుగుతున్నాయి. ఇలాంటి సమయంలో మిగిలిన కుటుంబాల్లోని వ్యక్తులు కూడా పిల్లలకు నాణ్యమైన విద్యను అందించి వారిని ఇతర దేశాలకు పంపిస్తారు. దీన్ని సాపేక్ష అంటే పోల్చడం/ప్రదర్శన అంశంగా పేర్కొనవచ్చు.
ఐఓఎం
-1951లో జెనీవా కేంద్రంగా ఐఓఎం (ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ మైగ్రేషన్) ప్రారంభమైంది. ఇది ప్రతి ఏడాది ఒక కరపత్రాన్ని విడుదల చేస్తుంది. దానిని వరల్డ్ మైగ్రేషన్ రిపోర్ట్ అంటారు. దీనిప్రకారం ప్రపంచంలోని 3.2 జనాభా ఇతర ప్రాంతాలకు వలస వెళ్తున్నారు. వీరిలో దాదాపు 7.6 శాతం మంది శరణార్థులని ప్రపంచ బ్యాంకు గుర్తించింది.
-ప్రపంచంలో అమెరికా, రష్యా, జర్మనీ, కెనడా, యునైటెడ్ కింగ్డమ్, స్పెయిన్, ఫ్రాన్స్, ఆస్ట్రేలియాలకు ఎక్కువగా వలస వెళ్తున్నారు. అదేవిధంగా వలస వెళ్లే దేశాల్లో మెక్సికో, భారత్, రష్యా, చైనా, ఉక్రెయిన్ ఉన్నాయి. 2010 గణాంకాల ప్రకారం భారత్, చైనా, మెక్సికో, ఫిలిప్పీన్స్, ఫ్రాన్స్, జర్మనీ, బంగ్లాదేశ్‌లు వలసల వల్ల అధిక ఆదాయాన్ని పొందుతున్నాయి.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?