శాతవాహనుల కాలంలో మతం
శాతవాహనులు వైదిక మతాభిమానులైనప్పటికీ పరమత సహనం పాటించారు.
వైదికమతం:
దేవి నాగానిక నానాఘాట్ శాసనం వల్ల మొదటి శాతకర్ణి అనేక వైదిక క్రతువులను నిర్వహించి బ్రాహ్మణులకు వేలకొలది గోవులను, కర్షాపణాలను దానం చేసినట్లు తెలుస్తుంది. నానాఘాట్ శాసనంలో ఉన్న ఇంద్ర, సంకర్షణ, వాసుదేవ, చంద్ర, సూర్య, యమ, వరుణ మొదలైన దేవతల ప్రార్థనల వల్ల పౌరాణిక మతం వైదిక ధర్మం స్థానంలో చోటు చేసుకుంటున్నట్లు తెలుస్తుంది. అంతేకాకుండా ఇదే శాసనంలో పేర్కొన్న సంకర్షణ, వాసుదేవ, కేశవ, గోవర్ధన, కృష్ణ, గోపాల వంటి పేర్లను బట్టి శాతవాహనుల కాలంలో వైష్ణవ మతం లేదా భాగవత మతం కూడా ప్రారంభమైందని తెలుస్తుంది.
-హాలుని గాథాసప్తశతి కృష్ణున్ని మధుమధనుడని, దామోదరుడని కీర్తించింది. ఇందులో గోపికలు, యశోద ప్రస్తావన ఉంది. ఈ గాథాసప్తశతి శివస్తోత్రంతో ప్రారంభమై గౌరీస్తోత్రంతో ముగుస్తుంది. గౌతమీపుత్ర శాతకర్ణి బ్రాహ్మణుల సమర్థకుడు మాత్రమే కాక, అతడు రాముడు, కేశవుడు, అర్జునుడు, భీమసేనుడు వంటి పురాణ పురుషులను ఆదర్శంగా తీసుకున్నాడని నాసిక్ శాసనం పేర్కొంటుంది.
శైవం: శైవంలో అతి ప్రాచీనమైన పాశుపత శైవాన్ని
లకులీస శివాచార్యులు స్థాపించారు. శాతవాహనుల కాలంలో ఇది దక్షిణాదికి వ్యాపించింది. హాలుని గాథాసప్తశతి పశుపతి, రుద్ర, గణపతి, గౌరి, పార్వతి మొదలైన శైవ దేవతలను పేర్కొంటుంది. కుతూహలుని లీలావతి పరిణయం సప్త గోదావరి గొప్ప శైవ తీర్థం అని అక్కడ భీమేశ్వర స్వామికి కనక దేవాలయం, ఒక పాశుపత మఠం కూడా ఉందని తెలుపుతుంది.
జైన మతం:
జైన మతం తెలంగాణలో ప్రబలంగా ఉండేది. మొదటి జైనమత తీర్థంకరుడైన రుషభనాథుడు వారణాసి రాజు. ఇతని తర్వాత పెద్ద కుమారుడు కాశీకి రాజు కాగా, రెండో కొడుకు బాహుబలి అస్మక (భోదన్)కు పాలకుడయ్యాడు. అంతేకాక జైన తీర్థంకరుల్లో పదోవాడైన శీతలనాథుడి జన్మస్థలం ఖమ్మం జిల్లా భద్రాచలం (బాదలపురి). ఈ విధంగా తెలంగాణలో ఆది నుంచి జైనం ప్రబలంగా ఉండేది. ఇక శాతవాహనుల విషయానికి వస్తే శాతవాహన రాజ్య స్థాపకుడైన శ్రీముఖుడు జైన మతాన్ని ఆచరించి, జైనులకు కొన్ని గుహలను నిర్మించినట్లు జైన మత గ్రంథాల వల్ల తెలుస్తుంది. ప్రస్తుత జగిత్యాల జిల్లాలో జైన స్థావరమని పిలిచే మునులగుట్ట వద్ద లభించిన శ్రీముఖుని నాణేలు ఈ విషయాన్ని బలపరుస్తున్నాయి.
బౌద్ధ మతం:
బుద్ధుడు స్థాపించిన బౌద్ధమతం అతడి జీవితకాలంలోనే తెలంగాణ-ఆంధ్ర ప్రాంతాలకు వ్యాపించింది. షంబల రాజు సుబేంద్రుని కోరికపై బుద్ధుడు అమరావతిని సందర్శించి, కాల చక్రమాల తంత్రోపదేశం చేశాడని, టిబెటన్ బౌద్ధుల విశ్వాసం. క్రీ.పూ 2వ శతాబ్దం నాటికే తెలంగాణలో బౌద్ధమతం వేళ్లూనుకొని ఉందనడానికి ధూళికట్ట, పాశగాం స్థూపాలు సాక్ష్యాలుగా ఉన్నాయి. పాశగాం బౌద్ధ స్థూపాన్ని చెన్నపూస అనే బౌద్ధ పండితుడు నిర్మించినట్లు బీఎన్ శాస్త్రి పేర్కొన్నారు. దీన్ని ప్రాచీన పేరు చెన్నపూసగాం. అది తర్వాత కాలంలో పాశగాంగా మారింది. పూస అంటే ఆచార్యుడని అర్థం. ఇక శాతవాహనుల విషయానికి వస్తే వీరు వైదిక మతావలంబికులైనప్పటికి, బౌద్ధ మతాన్ని కూడా పోషించారు. శాతవాహన రాణులు మాత్రం బౌద్ధమతాన్ని విశేషంగా ఆదరించారు.
గౌతమీపుత్ర శాతకర్ణి తన తల్లి గౌతమీ బాలశ్రీ గౌరవార్థం త్రిరశ్మి వద్ద గ్రామాన్ని బౌద్ధ భిక్షువులకు దానంగా ఇచ్చాడు. రాజు కుటుంబీకులే కాకుండా, అధికారులు, వర్తకులు, వృత్తిపనివారు, ధనవంతులైన స్త్రీలు బౌద్ధాన్ని ఆదరించి పోషించినట్లు శాసనాలు తెలుపుతున్నాయి. బౌద్ధ భిక్షువుల కోసం గ్రామాలను, భూములను, ధనాన్ని దానం చేయడంలో పోటీపడ్డారు. నాసిక్, జున్నార్, కన్హేరి మొదలైన శాసనాలు వివిధ శ్రేణులు కొంత ధనాన్ని డిపాజిట్ చేసి దాని మీద వచ్చే వడ్డీ బౌద్ధ భిక్షువుల కోసం దానం చేసినట్లు వివరిస్తున్నాయి. రాజుల ఆదరణ కంటే వ్యాపార వర్గాలు, వివిధ వృత్తుల వారి ఆదరణ మూలంగానే బౌద్ధమతం విరాజిల్లిందని చెప్పవచ్చు. శాతవాహనుల కాలంలో బౌద్ధ మతవ్యాప్తి మూలంగా దక్కన్లో చైత్యాలు, స్థూపాలు, విహారాలు నిర్మితమయ్యాయి. మహారాష్ట్రలో భాజ, కార్లా, నాసిక్, కన్హేరి, కొండనే, బేడ్సా, ఆంధ్రప్రదేశ్లో అమరావతి, నాగార్జునకొండ, భట్టిప్రోలు, శాలిహుండం, ఆల్లూరు, ఘంటసాల, జగ్గయ్యపేట, చందవరం, చినగంజాం, గుంటుపల్లి, రామతీర్థం, బొజ్జన్నకొండ, గోలి, తెలంగాణలో కొండాపూర్, ఫణిగిరి, తిరుమలగిరి, ధూళికట్ట, పాశగాం, మీర్జాంపేట మొదలైనవి ఈ కాలంలో ముఖ్యమైన బౌద్ధ ప్రదేశాలు.
-అమరావతి శాసనంలో చైత్యకుల గురించి చెప్పబడింది.
-చైత్యక వాద శాఖ స్థాపకుడు మహాదేవ భిక్షువు.
-చైత్యకులు బుద్ధుని జీవిత ఘట్టాలకు సంబంధించిన చిహ్నాలను పూజిస్తారు.
చైత్యశాఖలు వాటి ప్రధాన కేంద్రాలు
-అపరశైల- నాగార్జున కొండ
-పూర్వశైల- అమరావతి
-ఉత్తరశైల- జగ్గయ్యపేట
-రాజగిరిక- గుంటుపల్లి
-సిద్దార్థక- గుడివాడ
విద్య, సాహిత్యాలు:
శాతవాహనుల కాలంలో ప్రాకృతం, పాళీ, సంస్కృత భాషల్లో అపార సాహిత్యం వెలువడింది. వీరి కాలంలో ప్రాకృతం రాజభాష. శాతవాహన రాజు హాలుడు స్వయంగా కవి. 700 ప్రాకృత పద్యాలతో సత్తసయి (గాథాసప్తశతి)ని సంకలనం చేశాడు. ఇందులో చక్కటి సాహిత్య విలువలున్నాయి. గాథాసప్తశతిలో అనేక తెలుగు పద్యాలున్నాయి. గాథాసప్తశతి రచనకు తోడ్పడినవారిలో అణులక్ష్మి, అనుపలబ్ద, రేవ, మాధవి మొదలైనవారు ఉన్నారు. భాష, చక్కని ప్రకృతి వర్ణన, గ్రామీణ జీవితం ఇందులో ఉన్నాయి. హాలుని పట్టపురాణి మలయవతి సంస్కృత, ప్రాకృతాంధ్ర భాషల్లో నిష్ణాతురాలు. ఆమెను ఉల్లాసపర్చడానికి కవి, పండిత సభలు నిర్వహించేవాడు. కుతూహలుడు, కుమారిలుడు, శ్రీపాలితుడు మొదలైన కవులు హాలుని చేత సన్మానం పొందారు. కవులను ఆదరించేవాడు కాబట్టి హాలునికి కవివత్సలుడు అనే బిరుదు ఉంది. కొండాపూర్ (మెదక్) నివాసి అయిన గుణాఢ్యుడు పైశాచీ భాషలో ఏడువేల శ్లోకాలతో బృహత్కథను రాశాడు. తెలంగాణ మొదటి లిఖిత కవి గుణాఢ్యుడని చెప్పవచ్చు.
-బృహత్కథ ఆధారంగానే సోమదేవసూరి సంస్కృతంలో కథాసరిత్సాగరం, క్షేమేంద్రుడు బృహత్కథామంజరిని రాశారు. హాలుని కాలానికి చెందినవాడుగా భావిస్తున్న శర్వవర్మ కాతంత్రవ్యాకరణం అనే సంస్కృత గ్రంథాన్ని రచించాడు. వాత్సాయనుడు కామసూత్రాలు అనే గ్రంథాన్ని మలి శాతవాహనుల కాలంలో రాశాడు. శృంగారం, శృంగార జీవితానికి సంబంధించిన అన్ని విషయాలను నిర్మొహమాటంగా, శాస్త్రీయంగా వివరించాడు. ఆచార్య నాగార్జునుడు యజ్ఞశ్రీ శాతకర్ణికి సమకాలికుడు. ఇతను యజ్ఞశ్రీకి రాసిన సుహృల్లేఖ అనే గ్రంథాన్ని చిన్న పిల్లలు కూడా కంఠస్థం చేసేవారని 700 ప్రాంతంలో భారతదేశాన్ని సందర్శించిన ఇత్సింగ్ అనే చైనా యాత్రికుడు తెలిపాడు. నాగార్జునుడు సంస్కృతంలో ప్రజ్ఞా పారమిత, అష్టాసాహస్రిక, మూల మాధ్యమికారికావళి, విగ్రహవ్యార్తిని, ద్వాదశ నికాయము, శూన్యసప్తశతి మొదలైన అనేక గ్రంథాలను రచించాడు. ఇతన్ని రెండో బుద్ధుడు అంటారు. నాగార్జుని తత్వానికి మాధ్యమికవాదమని పేరు. ఇతడు మహాయాన తత్వాన్ని శూన్యవాదంగా చెప్పాడు. ప్రాకృతం, సంస్కృత భాషలే కాకుండా దేశీ భాష కూడా ఉండేది. తెలుగు, కన్నడ భాషలకు ఈ భాష మూలమని తెలుగు భాషకు, దేశీ భాషకు సంబంధం ఉందని డీసీ సర్కార్ అభిప్రాయపడ్డాడు. శాతవాహన యుగంలో ధాన్యకటకం, నాగార్జున కొండల్లో విశ్వవిద్యాలయాలు స్థాపితమయ్యా యి. వీటిలో వ్యాకరణం, రాజనీతి, అర్థశాస్త్రం, తర్కం, గణితం, న్యాయశాస్త్రం, జ్యోతిషశాస్త్రం, ఖగోళ శాస్త్రం మొదలైనవి బోధించేవారు. ఈ విశ్వవిద్యాలయాల్లో విదేశీ విద్యార్థులు సైతం విద్యాభ్యాసం చేసేవారు.
-గౌతమీపుత్ర శాతకర్ణి కాలం నుంచి శాతవాహనుల వెండి నాణేలపై ప్రాకృతం, దేశీ భాషలు ఉండేవి. దేశీ సామాన్య ప్రజల భాష. శాతవాహన రాజైన పులోమావి పేరు దేశీ పదమే.
-గాథాసప్తశతిలో అత్త, పొట్ట, వాలుగ, పిల్ల, పంది, అద్దం, తీరదు, కుసమ, వేంట (పత్తి), తుప్ప (నేయి) మొదలైన తెలుగు (దేశీ) పదాలు ఉన్నాయి.
వాస్తు, శిల్పకళలు:
బౌద్ధమతం దక్కన్కు వ్యాప్తి చెందడంతో శాతవాహనుల కాలంలో అనేక స్థూపాలు, విహారాలు, చైత్యాలు నిర్మితమయ్యాయి. శాతవాహనుల కాలం నాటి శిల్పకళకు అమరావతి శిల్పకళ అని పేరు. క్రీ.పూ రెండో శతాబ్దం నుంచి క్రీ.శ రెండో శతాబ్దం వరకు ఉచ్ఛస్థితిలో ఉంది. అమరావతి, నాగార్జునకొండ, జగ్గయ్యపేట కేంద్రాలుగా ఈ శిల్పకళారీతి అభివృద్ధి చెందింది. ఈ అమరావతి శిల్పకళా రీతి ఆనాం, థాయిలాండ్, జావా, సుమత్రా, బోర్నియా మొదలైన ఆగ్నేయాసియా దేశాలకు విస్తరించింది. జేమ్స్ ఫెర్గూసన్ ట్రీ అండ్ సర్పెంట్ వర్షిప్ గ్రంథంలో అమరావతి వాస్తుకళలకు అత్యంత ప్రాచుర్యాన్ని కల్పించాడు.
చిత్రలేఖనం:
మహారాష్ట్రలోని ఔరంగాబాద్ జిల్లాలో అజంతా గుహల్లోని 9, 10 సంఖ్య గల గుహల్లోని వర్ణ చిత్రాలు శాతవాహనుల కాలం నాటివని చరిత్రకారుల అభిప్రాయం. అజంతా చిత్రాలకు అమరావతి శిల్పాలకు గల పోలికలను బట్టి ఇవి శాతవాహనుల కాలానికి చెందినవిగా నిర్ధారించారు. బేడ్సా, పిఠల్ఖోరా, జున్నార్ల్లోని గుహాలయాల్లో కూడా చిత్రాలున్నాయి. ఈ విధంగా దక్కన్లో తొలి విశాల సామ్రాజ్యాన్ని స్థాపించి సుస్థిర, సుదీర్ఘ పాలనను అందించి ప్రజల ఆర్థిక, సామాజిక, మత భాషా వికాసానికి వాస్తు, శిల్ప, చిత్రకళల ప్రగతికి తోడ్పడిన శాతవాహనుల పాలన చరిత్రలో చిరస్మరణీయం.
నాగార్జునుని గ్రంథాలు
ప్రజ్ఞాపారమిత శాస్త్రం, సుహృల్లేఖ, శూన్యసప్తశతి, రసరత్నాకరం (రసాయన వాదం), ద్వాదశనికాయ శాస్త్రం, ఆరోగ్య మంజరి (వైద్యశాస్త్ర గ్రంథం), మాధ్యమిక కారిక, ప్రమాణ విభేతన శాస్త్రం
మాథ్యమిక శాస్ర్తానికి ఆకుతోభయ పేరుతో వ్యాఖ్యానం రచించాడు.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు