Telangana women’s war against landlords | భూస్వాములపై తెలంగాణ నారీ పోరు
-సాయుధ పోరాట కాలంలోని కొన్ని ఘటనలు
తెలంగాణ పోరాటంలో స్త్రీలు చాలా ప్రముఖపాత్ర వహించారు. భూమి కోసం, గిట్టుబాటు కూలీకోసం, భూస్వాముల వ్యతిరేక పోరాటాల్లో మహిళలు కూడా పురుషులతో సమానంగా పాల్గొన్నారు. అడవుల్లోని చిన్న చిన్న గూడెంల నుంచి కోయ, చెంచు మొదలైన వారందరినీ తరిమివేసే బ్రిగ్స్ పథకాన్ని పురుషులతో సమానంగా స్త్రీలూ ఎదిరించారు.
-నిజాం-రజాకార్ వ్యతిరేక పోరాటంలోనూ తరువాత నెహ్రూ సైన్యాలకు, కాంగ్రెస్ రజాకర్లకు వ్యతిరేకంగా పోరాడటంలోనూ తమ అన్నదమ్ములు, భర్తలతోపాటు స్త్రీలు పాల్గొన్నారు. వారూ దళాల్లో చేరారు. మిగతా అన్ని దళాలతో పాటే చీమలు దూరని చిట్టడవుల్లో, కొండలు, గుట్టల్లో ఎండకు ఎండుతు, వానకు తడుస్తూ కష్టసుఖాలు పంచుకున్నారు. స్త్రీలు కూడా కొరియర్లుగా, రాజకీయ ఆందోళనకారులుగా కూడా బాధ్యతలు నిర్వర్తించారు. ఉద్యమం కొత్తగా విస్తరిస్తున్న ప్రాంతాల్లో ప్రజా ఉద్యమాల్లోనూ, ప్రజాసంఘాల్లోనూ ప్రముఖపాత్ర నిర్వహించారు. రజాకర్-నిజాం పోలీసులు, ఆ తరువాత నెహ్రూ సైన్యాలు జరిపిన అమానుష, చిత్రహింసలకు ఎక్కువగా గురైంది, బలైందీ స్త్రీలే.
భూమిని నిలుపుకోవటంలో స్త్రీ పాత్ర
-విసునూర్ దేశ్‌ముఖ్ దురాక్రమణకు గురికాకుండా తన భూమిని నిలబెట్టుకునేందుకు ఆంధ్రమహాసభ కమ్యూనిస్టు పార్టీల సహకారంతో మొదట తీవ్రంగా పోరాడింది జనగామ తాలూకా పాలకుర్తి గ్రామానికి చెందిన చాకలి ఐలమ్మ. తన కొడుకులు, కూతుళ్లను కూడా పార్టీకి అండగా ఎన్నికష్టాలొచ్చినా సరే నిలబడమని ప్రోత్సహించిందామే.
-మిర్యాలగూడెం తాలూకా ముకుందాపురంలో ఒక షావుకారు కుమ్మరి మట్టయ్యను భూమి స్వాధీనం చేయమని బలవంతపెట్టాడు. మట్టయ్య అంగీకరించకపోవటంతో, నెహ్రూ సైన్యాల సహకారంతో మట్టయ్యను చిత్రహింసలు పెట్టి చివరికి చంపేయించాడు. కానీ మట్టయ్య భార్య రంగంలోకి గ్రామస్తుల సహకారంతో పోరాటం చేసి భూమిని దక్కించుకున్నారు.
-వాడపల్లిలో ఒక లంబాడా రైతును, భూమిని తనకు అప్పగించనందుకు భూస్వామి హత్య చేయించాడు. అతని భార్యకూడా పోరాటంలోకి దిగి కాంగ్రెస్ పోలీస్ బీభత్సాన్ని ఎదిరించి భూమి నిలుపుకొంది.
-కొండప్రోలులోనూ అంతే 2 ఎకరాల మాగాణి భూమి సాగుచేసుకుంటున్న లంబాడా రైతును ఆ భూమిని తిరిగి తనకు దక్కాలని దత్తుడు అనే భూస్వామి చంపేయించాడు. కానీ ఆ రైతు భార్య ముందకు వచ్చి ఆ భూమి తానే నిలపుకొంది. సిలారుమియాగూడెంలో భూమిని భూస్వామికి స్వాధీనం చేయనందుకు గొల్ల ముత్తయ్యను చంపేశారు. ఆయన భార్య మాత్రం ఆ భూమిని తిరిగి భూస్వాముల వశంకాకుండా పోరాడి సాధించింది. మొద్దులకుంటలో ఓ లంబాడా రైతు రామకృష్ణమ్మ అనే భూస్వామికి చెందిన భూమిని కొద్దిగా ఆక్రమించుకున్నాడు. నెహ్రూ సైన్యాల ప్రవేశం అనంతరం ఆ భూమిని పోలీసుల సహాయంతో తిరిగి స్వాధీనం చేసుకోటానికి ఆ భూస్వామి ప్రయత్నించాడు. ఆ లంబాడా రైతును చితకబాది ఇంటి నుంచి, పొలం నుంచి వెళ్లగొట్టాడు. అయినా ఆయన భార్య మాత్రం తలొగ్గలేదు. ఆ భూమిని దున్నుకొని పంటను ఇంటికి తెచ్చుకుంది.
కూలి కోసం పోరాటం
-కొండపల్లి ప్రాంతంలోనూ ఆ పరిసర ప్రాంతాల్లోనూ కూలి రోజుకు రెండు లేక మూడు శేర్లుండేది. దాన్ని 4 శేర్లకు పెంచాలని కోరుతూ కూలీల సమ్మె జరిగింది. స్త్రీలు పెద్ద సంఖ్యలో కదిలారు. జెండాలు చేతబూని ప్రదర్శనలు చేశారు. భూస్వాములు లొంగి ఆ కూలికి ఒప్పుకొనక తప్పలేదు.
-గోదావరి తీర అడవుల్లో బీడీ ఆకు కోయటం ప్రధానవృత్తి. వేలాది స్త్రీలు దానితో జీవనం గడుపుతారు. బీడీ ఆకు కోయటానికి ఎక్కువ కూలి కావాలని జరిగిన పోరాటంలో స్త్రీలు ముందున్నారు.
-పిండిప్రోలు, ఇల్లందు పరిసర ప్రాంతాల్లో 90 గ్రామాల్లో వ్యవసాయ కార్మిక సమ్మెలు జరిగాయి. దాదాపు 20 గ్రామాల్లో ప్రత్యేకించి స్త్రీల కూలీల వేతనాల సమస్య ఇమిడి ఉంది. ఈ గ్రామాల్లో స్త్రీలే ముందున్నారు.
-పోలీస్ నిర్బంధకాండకు, దాడులకు వ్యతిరేకంగా, నిజాం రజాకార్ వ్యతిరేక పోరాట రోజుల్లో కూడా సాయుధ సైనికులు బాలేముల, పాత సూర్యాపేట, మల్లారెడ్డిగూడెం, దేవరుప్పల తదితర అనేక గ్రామాలపై దాడిచేసినప్పుడు వారిని వడిశెలతో ప్రతిఘటిస్తున్న పురుషుల పక్కనే నిలబడి వడిశెలకు రాళ్లందించారు. ఈ కార్యక్రమంలో నిమగ్నమైన ఒక స్త్రీ మల్లారెడ్డిగూడెంలో పోలీసుల కాల్పుల్లో బలైంది. ఇలాంటి పోరాటంలోనే గాజులలంకలో వియ్యమ్మ అనే మహిళ మరణించింది. ఆమె చల్లపల్లి జమీందారుకు వ్యతిరేకంగా కృష్ణా జిల్లాలో పోరాడుతున్నప్పుడు పోలీసులు ఆమెను కాల్చి చంపారు.
-సూర్యాపేట తాలూకా వల్లభాపురం భీమ్లా-వాత్స్యా అనే లంబాడాల ఇండ్లను స్త్రీలు తమ రక్షణ స్థలంగా ఎంచుకున్నారు. రజాకార్ల కాలం నుంచి భారత సైన్యం ప్రవేశించిన తర్వాత కూడా వారి ఇండ్లు సురక్షిత ప్రదేశంగా ఉన్నాయి. ఆ తర్వాత వారిని అరెస్టు చేసి కాల్చిచంపారు. అయినప్పటికీ వారి ఇండ్లలోని స్త్రీలు పార్టీ ఉద్యమాలకు సహకరిస్తూ వచ్చారు.
-జోనల్ నాయకుడు, అనంతరం సూర్యాపేట తాలూకా ప్రాంతీయ నాయకుడిగా ఉన్న కామ్రేడ్ అనిరెడ్డి రామిరెడ్డిని పర్సాయపల్లికి చెందిన అచ్చమ్మ తన ఇంట్లో ఆశ్రయం ఇచ్చి చాలా కాలం కాపాడింది.
-సూర్యాపేట తాలూకా చిల్పకుంట గ్రామానికి చెందిన లింగమ్మ భూస్వామి జన్నారెడ్డి ప్రతాపరెడ్డికి వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో ప్రముఖపాత్ర పోషించింది. తన కుటుంబం మొత్తాన్ని ఆంధ్రమహాసభ, కమ్యూనిస్టు పార్టీల్లో చురుకుగా పనిచేసేందుకు ప్రోత్సహించింది. దీంతో తన అల్లుడైన లింగారెడ్డి దళనాయకుడిగా ఎదిగాడు. అయితే 1952లో జరిగిన ఎన్నికల్లో జన్నారెడ్డితో లింగారెడ్డి జతకలిశాడు. దీంతో లింగమ్మ, ఆమె కూతురు కలిసి లింగారెడ్డి బలపరుస్తున్న జన్నారెడ్డికి వ్యతిరేకంగా పనిచేసి అతన్ని ఓడించారు.
కొందరు వీరవనితలు
-లచ్చమ్మ: నడిగడ్డ చాకలి. దళాల దుస్తులను ఉతకడమే కాకుండా వారికి ఆహారం అందించేవారు. ఒకదాడిలో ఆమె భారత సైన్యానికి దొరికిపోయారు. ఆమెను వివస్త్రను చేసి, తలక్రిందులుగా చెట్టుకు వేలాడదీసి రాములమ్మ ఎక్కడుందో చెప్పమని హింసించారు. ఎంతకూ సమాధానం చెప్పకపోవడంతో ఆమెను వదిలేశారు.
-జైనాబీ: రాజారం గ్రామంలో ఒక దినసరి కూలీ జైనాబీ. చిన్నతనంలోనే భర్త చనిపోయాడు. ఆమెకు ఒక కొడుకు, తమ్ముడు ఉన్నారు. చల్లా సీతారామిరెడ్డి-ఆదిరెడ్డి దళం ఆ ఊరికి దగ్గర్లో ఉన్న గుట్టలను కేంద్రంగా చేసుకుని పనిచేస్తుండేది. వారికి ఆమె ఆహారం అందించేవారు. భారత సైన్యాలు వచ్చిన తర్వాత పార్టీకి బాగా పలుకుబడిగల గ్రామాల్లో మిలిటరీ క్యాంపులు పెట్టారు. రాజారంలోనూ ఆ క్యాంపు ఉంది. జైనాబీ భయపడకుండా దళాలకు ఆహారం చేరవేశారు. గెరిల్లా దళ సభ్యులు ముగ్గురు పొరపాటున దారితప్పి దళాలను చేరుకోలేకపోయారు. వారికి రక్షణ ఇచ్చిన జైనాబీ, వెళ్లగా దళకేంద్రానికి చేర్చింది.
-మిలిటరీ ఆమె ఇంటిపై దాడిచేసి సీతారామిరెడ్డి జాడ చెప్పాలని హింసించింది. నాకు తెలియదు అన్నదే ఆమె సమాధానమయ్యింది.
-పొద్దుటూరు ప్రాంతంలో జమీందార్ ఘాతుకాలకు అంతులేదు. చుట్టపక్కల గ్రామాలైన లక్ష్మీపురం, కొత్తగూడెం, గోవిందాపురం, గార్లపాటు, నేరెడ గ్రామాలపై ప్రతిరోజు దాడిచేయించేవాడు. వారితోపాటు భూస్వాముల గూండా అయిన సీతయ్య ఒకేరోజు ఏడుగురిని చంపాడు. వారిలో ఆ ప్రాంత ప్రజలంతా గౌరవించే రామచంద్రారెడ్డి కూడా ఉన్నాడు. ఈ క్రమంలో ఆ గ్రామానికి ఒక దళనాయకుడు వచ్చాడు. ఆయనకు నిజాం వ్యతిరేక పోరాటం నుంచి, పార్టీకి సానుభూతిగా ఉండే ముస్లిం కుటుంబం అతనికి ఆశ్రయమిచ్చింది.
-కానీ ఆ దళ నాయకుని కొరియర్ అయిన కృష్ణమూర్తి పట్టుబడ్డాడు. దీంతో అసలు విషయం తెలిస్తే ఆ కుటుంబానికి ప్రమాదమని గ్రహించిన ఆ నాయకుడు మరోచోటికి వెళ్లిపోయాడు. తర్వాత కొంతకాలానికి ఆ గ్రామానికి వచ్చిన ఆయన ఆ జమీందారును, సీతయ్యను చంపివేశాడు.
-హాము-మంగ్లీ: ధర్మాపురం పశ్చిమాన లంబాడా తండాలో నివసించేవారు. విసునూరు దేశ్‌ముఖ్ కొడుకైన బాబు ఈ తండాలపై దాడి చేశాడు. హామూని, అతని కొడుకులను, వారిలో ముఖ్యమైన కేంద్ర కార్యకర్త ధానూను పట్టుకునేందుకు ఆ దాడి జరిగింది. ధానూ తల్లిదండ్రులు హామూ, మంగ్లీలను పట్టుకుని తీవ్రంగా హింసించారు. మంగ్లీ విసునూరు దేశ్‌ముఖ్‌పై తిరగబడి ప్రతీకారం తీర్చుకునేలా గ్రామ ప్రజలను ఉసిగొల్పారు.
-ఐదారుగురు యువకులను విడదీసి, వారితో చితులు పేర్పించి ధానూను గురించి చెప్పమని బాధించారు. వారు సమాధానం చెప్పకపోవడంతో దహనం చేశారు. ధానూ అన్న సోమ్లా కూడా వారిలో ఉన్నాడు.
-రెండునెళ్ల తర్వాత మళ్లీ దాడి జరిగింది. దేశ్‌ముఖ్ సైన్యం మంగ్లీని హింసించింది. బోడ ఘెలియా, బోడ తమినియా, జత్రవేధ్ ధౌడా అనే ముగ్గురు యువలకులను కాల్చి చంపారు. ఎంతగా హింసించినప్పటికీ మంగ్లీ దళానికి సంబంధించిన వివరాలు వెళ్లడించలేదు.
-భారత సైన్యాలు ప్రవేశించిన తర్వాత దళాలు విసునూరు బాబును హతమార్చాయి. అయితే ధానూని పట్టుకున్న సైన్యం, అతన్ని చంపివేసింది. మంగ్లీ మనుమలు జనార్దన్, కొమరయ్యలను పోలీసులు అరెస్టు చేశారు. కొమరయ్యను చంపివేయగా, వారి నుంచి తప్పించుకున్న జనార్దన్ రహస్య జీవితం గడుపుతూ పోరాటకాలమంతా కార్యక్రమాల్లో పాల్గొన్నాడు.
-నేరెడకు చెందిన వెంకయ్య, అనంతయ్య, సీతయ్య, వారి కుటుంబం అంతా కలిసి శత్రువు చేతిలో చిక్కిన దళ నాయకుడిని కాపాడారు. దీంతో మిలిటరీ ఆ గ్రామంపై దాడిచేసి వెంకయ్య కుటుంబాన్ని చిత్రహింసలకు గురిచేసింది.
-మల్లికాంబ: ఆమె భర్త బ్రహ్మయ్య మరణించాడు. ఆమెకు ఆరుగురు సంతానం. వారిలో ఒకడైన వెంకటేశ్వర్లు దళంలో చేరాడు. దీంతో మల్లికాంబ పార్టీకి ఎంతో సహాయకారిగా ఉండేది. రజాకార్లు ఆ గ్రామంపై దాడిచేసి దోచుకుంటుండగా, ఆ సమాచారాన్ని మచ్చా వీరయ్య దళానికి చేరవేసింది. దీంతో రజాకార్లను తరిమివేసి, వారు దోచుకున్న దాన్ని తిరిగి ఎవరిది వారికి ఇచ్చేశారు.
-మల్లికాంబ ఇంటిపై రజాకార్లు ఎన్నోసార్లు దాడిచేసి ఆమె హింసించారు. ఆమె కొడుకు వెంకటేశ్వర్లు దళాలకు మందులు కొనేందుకు విజయవాడకు వెళ్తే అతన్ని అరెస్టు చేశారు. మునగాల క్యాంపులో చిత్రహింసలు పెట్టి చివరికి ఖమ్మం బోనుకు తీసుకెళ్లారు. అయినా ఆమె తన ఇంటిని దళాలకు, పార్టీ కార్యకర్తలకు రక్షణ కేంద్రంగా నిర్వహించింది.
-ఎర్రమ్మ: హుజూర్నగర్ తాలూకా రంగాపురం గ్రామానికి చెందిన ఎర్రమ్మ తన కుమార్తె అనసూయను గెరిల్లా నాయకుడు, పార్టీ నాయకుడు కామ్రేడ్ మేదరమెట్ల సీతారామయ్యకిచ్చి వివాహం చేసింది. ఆమె అన్న రాఘవయ్య కూడా పార్టీ అభిమాని.
-రజాకార్ల కాలంలో ఆమె ఇంటిపై దాడిచేసి ధ్వంసం చేశారు. రజాకార్లను అణిచివేసిన తర్వాత, రక్తపాతం జరపడం, చిత్రహింసలు పెట్టడం భారత సైన్యం వంతైంది. చివరకు ఎర్రమ్మ కుటుంబం రంగాపురం వదిలిపెట్టాల్సి వచ్చింది.
-రాంబాయమ్మ: పిండిప్రోలు గ్రామానికి చెందిన రాంబాయమ్మ చిన్నవయస్సులోనే భర్తను కోల్పోయింది. పిండిప్రోలు గుట్టలు రజాకార్ల క్యాంపులపై దాడికి, పార్టీ కేంద్రంగా ఉండేది. ఈ కేంద్రానికి, దళాలకు రాంబాయమ్మ చాలా సహాయం చేసింది. ఉద్యమానికి తోడ్పడటం కోసం చుట్టుపట్ల గ్రామాల్లోని స్త్రీలందరినీ సమీకరించింది. తరువాత ఆమెను అరెస్టుచేసి వరంగల్ జైలులో బంధించారు. అక్కడ ఆమె 18 నెలలు గడిపింది. ఆ జైలులోనే మరణించింది.
-వెంకమ్మ: నందిగామ తాలూకా సరిహద్దుల్లో చొప్పకట్లవారి పాలెంకు చెందిన ధనిక రైతు రత్తయ్య భార్య వెంకమ్మ. ఆమె గెరిల్లా దళాలకు భోజ సదుపాయాలు చూసేది. గాయపడ్డవారికి రహస్యంగా వైద్య సహాయం చేసింది. భారత సైన్యం ప్రవేశించిన తర్వాత ఆమె ఇంటిపై దాడిచేసి రత్తయ్యను అరెస్టు చేసి ఖమ్మం క్యాంపునకు తరలించింది.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?