Rural festivals are symbols of Telangana culture | తెలంగాణ సంస్కృతి ప్రతీకలు పల్లె పండుగలు
పండుగలు అన్ని మతాల్లో, కులాల్లో నాటి నుంచి సంప్రదాయకంగా వస్తున్న ఆచారం. కానీ దేవున్ని కొలిచే విధానం వేర్వేరు అయినప్పటికీ మూలం, అర్థం, పరమార్థం చూసినట్లయితే అంతరార్థం ఒక్కటే. దేవుడు ఉన్నాడా? లేడా? ఎవరికీ తెలియదు. అది ఒక నమ్మకం మాత్రమే. పూర్వం ఆదిమానవులు ప్రకృతిలో ఉండే బీభత్సాలు ఉరుములు, మెరుపులు, గాలివాన, సునామీలకు భయపడి అప్రయత్నంగా అమ్మో, నాన్నో అని అరిచేవారు. అమ్మనాన్నలను చూసి ధైర్యం తెచ్చుకొనేవారు. ఆ ధైర్యంతోనే జీవనం కొనసాగించేవారు. రక్షణ కోసం ఏ చెట్టునో, పుట్టనో, రాయినో ఆశ్రయించేవారు. రక్షణనిచ్చే ఆ చెట్టును దేవుడు/శక్తిగా నమ్మేవారు. ఈ రకంగా క్రమక్రమంగా శక్తిని నమ్ముకున్నప్పుడు మంచి ఫలితాలు వస్తాయని ఆశ కలిగి ప్రతిఒక్కరు దేవుడిని కొలవడం ప్రారంభించారు. ఆ రకంగా దేవుడంటే ప్రకృతి అని భావించి ప్రకృతికి సంబంధించిన పండుగలు జరుపుకోవడం ప్రారంభించారు.
పండుగల్లో ముఖ్యమైనవి
ఉగాది:
ఉగాది అనే తెలుగుమాట యుగాది అనే సంస్కృత పదానికి వికృతరూపం. మార్చి నెలలో అంటే (ఏప్రిల్‌లో కొన్నిసార్లు) చైత్రశుద్ధ పాఢ్యమి రోజున తెలుగు ప్రజల కొత్త ఏడాది ప్రారంభమవుతుంది. ఈ పండుగ బ్రహ్మకమలం ఆరంభమయ్యే మొదటి యుగాది అంటే మొదటి సంవత్సరం (ప్రభవ)లో మొదటి రుతువు వసంత రుతువులో మొదటి మాసం (చైత్రమాసం), మొదటి తిథి అయిన పాఢ్యమినాడు మొదటి రోజైన ఆదివారం నాడు యావత్తు సృష్టిని ప్రభావింపజేశాడని అర్థం. అందువల్ల మొదటి ఏడాదికి ప్రభవ అని పేరు. చివరి 60వ సంవత్సరం పేరు క్షయ (అక్షయ) అంటే నాశనం అని అర్థం. కల్పాంతంలో సృష్టి నాశనమయ్యేది కూడా క్షయ సంవత్సరంలోనే అందువల్ల చైత్రమాసంలో శుక్లపక్షంలో సూర్యోదయ సమయానికి పాఢ్యమి తిథి ఉన్నరోజు యుగాది (ఉగాది)గా నిర్ణయించబడింది. ఈ పండుగ రోజు ఉగాది పచ్చడికి ప్రత్యేకత ఉంది. (చింతపండు+బెల్లం+వేపపువ్వు+నీరు+ఉప్పు) షడ్రుచులు ఉన్న పచ్చడి రూపొందించి ఇంటిల్లిపాది స్వీకరిస్తారు. ఇందులో పులుపు, తీపి, చేదు, వగరు తదితర రుచులు జీవిత సుఖ దు:ఖాలను (ఒడిదొడుకులు) సూచిస్తాయి. ఈ పండుగ రోజే మరో ప్రత్యేకత పంచాగ శ్రవణం. ఇందులో సాయంత్రం వేళ ప్రజలందరూ ఆలయాల వద్ద పండింతులు చెప్పే పంచాంగ వివరాలు, కొత్త ఏడాది తమ అదృష్ట దురదృష్టాలను అంచనా వేసుకొని తదనుగుణంగా నడుచుకుంటారు. ఈ ఉగాది పండుగ రోజున తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్, కన్నడ, కొంకణి, బాలి ప్రజలు కూడా కొత్త సంవత్సరాన్ని ప్రారంభిస్తారు. (ఆంగ్ల క్యాలెండర్ ప్రకారం – జనవరిలో వచ్చే సంక్రాంతి పండుగ నుంచి కొత్త సంవత్సరం ప్రారంభమవుతుంది). ఈ పండుగ ఒక్క తెలుగు సంప్రదాయంలోనే కాక మరాఠీలు గుడిపడ్వాగాను, తమిళులు పుత్తాండు పేరుతో, మలయాళీలు విషు పేరుతో, సిక్కులు వైశాఖి పేరుతో, బెంగాళీలు పోయ్లా బైశాఖీగాను జరుపుకుంటారు.
శ్రీరామ నవమి:
మార్చి/ఏప్రిల్ నెలలో చైత్ర శుద్ధ నవమి రోజున శ్రీరామ నవమి జరుపుకుంటాం. ఈ రోజును శ్రీరాముడితో సీతాదేవి వివాహం జరిగిన రోజుగా భావిస్తాం. ప్రతి పల్లె, పట్టణాల్లో రామాలయాలు కల్యాణోత్సవాన్ని ఘనంగా జరుపుతాయి. ముఖ్యంగా భద్రాచలంలో కన్నుల పండువగా నిర్వహిస్తారు. రాష్ట్ర ప్రభుత్వం పట్టువస్ర్తాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పిస్తారు. ఈ ఆనవాయితీ కుతుబ్‌షాహీల కాలం నుంచి వస్తుంది.
వినాయక చవితి:
ఈ పండుగను ఆగస్టు/సెప్టెంబర్ మాసంలో భాద్రపద శుద్ధ చవితి రోజున నిర్వహించుకుంటారు. ఈ రోజు పార్వతీ పరమేశ్వరుల కుమారుడైన గణపతికి పూజలు నిర్వహించి తమ ప్రయత్నాలు, పనులు నిర్విఘ్నంగా పూర్తికావాలని, దీవించాలని వేడుకుంటారు. పొద్దునే స్నానమాచరించి పొలాల్లోంచి 21 రకాల ఆకులు, పూలతో అందంగా అలంకరించిన వినాయక విగ్రహాలను ప్రతిష్టించి 9 రోజులు పూజ చేస్తారు. అన్నిటికన్నా ప్రత్యేకమైనది హైదరాబాద్‌లోని ఖైరతాబాద్ వినాయకుడు. హైదరాబాద్‌లో గణేష్ నిమజ్జనం కూడా కన్నులపండువగా జరుగుతుంది. విదేశీ పర్యాటకులు కూడా పాల్గొంటారు.
దసరా పండుగ:
ఇది హిందువుల ప్రసిద్ధమైన పండుగ. శక్తి ఆరాధనకు ప్రాధాన్యతనిచ్చే అశ్వయుజ శుద్ధపాఢ్యమి నుంచి అశ్వయుజ శుద్ధనవమి వరకు 9 రోజుల పండుగ. దేవి నవరాత్రుల అనంతరం 10వ రోజైన దశమి కలిపి విజయదశమి (దసరా)గా పిలుచుకుంటారు. ఈ దసరా పండుగను నవరాత్రి, శరన్నవరాత్రి అని పిలుచుకోవడానికి కారణం శక్తి ఆరాధనకు ప్రాధాన్యమిస్తాయి, శరదృతువు ఆరంభంలో వచ్చే పండుగ కావున ఈ పేరు వచ్చింది. ఇది మహాభారత, రామాయణ కాలం నుంచి ఆచారంగా వస్తుంది. ఈ పండుగకు మొదటి 3 రోజులు పార్వతిదేవి, తర్వాత 3 రోజులు లక్ష్మీదేవి ఆ తర్వాత సరస్వతిదేవికి పూజలు చేయడం ఆనవాయితీ. దుర్గా అనే స్త్రీశక్తిని మహిషాసురవర్ధినిగా కొలుస్తారు. ఈ పండుగ మరో ప్రత్యేకత ఆయుధ పూజ, వివిధరకాల వృత్తిపనివారు తమ పనిముట్లకు, వాహనాలకు పూజచేస్తారు. అమ్మవారికి ఒక్కోరోజు ఒక్కో అలంకారం చేస్తారు. 10వ రోజు పార్వేట ఉత్సవం చేస్తారు. జమ్మిచెట్టు ఉన్న ప్రదేశంలో పార్వేట చేయడం ఆనవాయితీ.
చారిత్రక నేపథ్యం: రాముడు రావణునిపై గెలిచిన సందర్భంగా విజయదశమిని జరుపుకోవడం, పాండవులు వనవాసం వెళ్తూ జమ్మిచెట్టుపై తమ ఆయుధాలను తిరిగి తీసుకున్న రోజుగా కూడా చెప్పుకుంటారు. ఆ విధంగా రావణ వధ, జమ్మి ఆకుల పూజ చేయడం ఆనవాయితీగా మారింది. ఈ పండుగ ప్రాధాన్యత ఈశాన్య భారతదేశంలో ఎక్కువగా ఉంటుంది.
శివరాత్రి: ఈ పండుగ ఫిబ్రవరి లేదా మార్చి నెలలో వస్తుంది. ఈరోజు దేవాలయాల్లో శివుడు, పార్వతిలకు కల్యాణం నిర్వహిస్తారు. భక్తులు పగలంతా ఉపవాసం ఉండి రాత్రికి జాగరణ చేస్తారు. రాష్ట్రంలో వేములవాడ, కీసరగుట్ట, ఏడుపాయల, బోధన్‌లోని ఏకచక్రేశ్వరాలయం, ఆచన్‌పల్లి పాండుఫారం శివాలయాలు ప్రసిద్ధిచెందినవి. పాండవులు అరణ్యవాసం చేసినప్పుడు బోధన్‌లోని ఆచన్‌పల్లి శివారు పాండుఫారం గ్రామంలోని పాండుచెరువులో స్నానంచేసి స్వయంగా లింగాన్ని ప్రతిష్ఠించి పూజించారని స్థలపురాణం ద్వారా తెలుస్తుంది.
బోనాలు
సాధారణంగా జూలై/ఆగస్టు ఆషాఢ మాసంలో వస్తుంది. తెలంగాణలో అత్యంత వైభవంగా నిర్వహించే పండుగ బోనాలు. బోనం అంటే భోజనం అని అర్థం. బోనాలు సమర్పించడం వల్ల గ్రామ దేవతలు శాంతించి అంటువ్యాధులు రాకుండా కాపాడుతారని ప్రజల విశ్వాసం. ఈ ఆచారం కొన్ని వేల ఏండ్ల నుంచే ఉన్నది. వర్షాకాలంలో వచ్చే రోగాల నుంచి ప్రజలను, పశువులను, పంటలను కాపాడాలని అమ్మవారిని వేడుకొని నైవేద్యం సమర్పించే పండుగ ఇది. ఈ నైవేద్యం సమర్పించడానికి కొత్త కుండలో వంట చేస్తారు. కుండ అడుగున మూతికి సున్నం పూసి, మధ్యలో నూనె రాసి పసుపు, కుంకుమతో గుండ్రంగా బొట్టుపెట్టి పై మూత (కంచుడు)పై జ్యోతిని వెలిగించి నెత్తిన పెట్టుకొని వెళ్లి మొక్కులు తీర్చుకుంటారు. (ఈ బోనాలు బేసి సంఖ్యలో మొక్కును బట్టి ఉంటాయి). రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో మైసమ్మ, పోచమ్మ, ఎల్లమ్మ, పెద్దమ్మ, పోలేరమ్మ, ముత్యాలమ్మ, దుర్గమ్మ మొదలగు పేర్లతో గ్రామ దేవతలను పూజించి బోనం సమర్పిస్తారు.
ఈ విధంగా ఆదివారం, గురువారం రోజుల్లో భక్తులు అమ్మవారికి బోనం సమర్పించుకుంటారు. మొదటగా గోల్కొండలో కుతుబ్‌షాహీల కాలం నుంచే బోనాలు సమర్పించే ఆచారం ఉందం టే తెలంగాణలో మత సామరస్యం ఎలా ఉండేదో అర్థమవుతుంది. తర్వాత సికింద్రాబాద్‌లో నిర్వహించే ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాలు ప్రసిద్ధమైనవి. వీటిని లష్కర్ బోనాలు అంటారు.
లష్కర్ బోనాల తర్వాత బల్కంపేటలో ఎల్లమ్మగుడి వద్ద బోనాల జాతర జరుగుతుంది. ఆ తర్వాత నాల్గవ వారం జంట నగరాల్లో అన్ని పరిసర ప్రాంతాల్లో అమ్మవారి గుళ్లలో ఈ పండుగ జరుగుతుంది. చివరగా శ్రావణమాస మొదటివారం లాల్బజార్లో బోనాల ఉత్సవాలు జరుపుకుంటారు. పరమాన్నం, పప్పు అన్నాలతో పాటు రకరకాల పిండివంటలు చేస్తారు. శివసత్తుల పూనకాలు, పోతరాజుల వేషధారణ ప్రత్యేక ఆకర్షణగా ఉంటుంది. బోనాల పండుగ రెండో రోజు రంగం కార్యక్రమం నిర్వహిస్తారు. ఈ కార్యక్రమంలో యువతి భవిష్యవాణి వినిపిస్తుంది. ఈ సమయంలో ప్రజలు రాబోయే రోజుల్లో ఎదుర్కొనే కష్టసుఖాల గురించి తెలుపుతుంది. పిల్లలు పుడితే బాలారిష్టాలు లేకుండా బాగుంటే తొట్టే కడతామని మొక్కుకున్నవారు ఐదు అంతరాలు, ఏడు అంతరాలు తొట్టెలను వెదురు కర్రలతో రంగు కాగితాలతో తయారుచేసి అమ్మవార్లకు సమర్పించుకుంటారు. తెలంగాణ ప్రభుత్వం నాల పండుగను రాష్ట్ర పండుగగా ప్రకటించింది. ఈ పండుగ కొత్తగా పళ్లైన కూతురు పుట్టింటికి వచ్చిన విధంగా, ఆషాఢం నెలలో దేవి (అమ్మవారు) తమ పుట్టింటికి వస్తుందని జానపదుల నమ్మకం. అందుకే ఈ పండుగ సమయంలో గ్రామదేవతలను దర్శించుకొని వివిధ రకాల పిండి వంటలతో బోనాలకు నైవేద్యం సమర్పిస్తారు. దీన్నే ఊరడిగా పిలుస్తారు.
బతుకమ్మ పండుగ
దీన్నే పూల పండుగ అంటారు. అశ్వయుజ మాస శుద్ధ పాఢ్యమి అంటే మహాలయ అమావాస్య నుంచి దుర్గాష్టమి వరకు 9 రోజులపాటు బతుకమ్మ పండుగ నిర్వహిస్తారు. ఇది ప్రకృతి దేవత ఆరాధనకు సంబంధించిన పండుగగా చెప్పుకోవచ్చు. బతుకమ్మను పూజించడమంటే లక్ష్మీదేవిని ఆరాధించడమే. మన రాష్ట్రంలో బతుకమ్మ పండుగ ప్రసిద్ధమైనది. ఇది స్త్రీల ప్రధాన పండుగ. పసుపుతో గౌరమ్మను రూపొందించి కుంకుమబొట్టు పెట్టి పూలతో అలంకరిస్తారు. బతుకమ్మను తయారు చేయడానికి తంగేడు, గునుగు, బంతి, చామంతి, నందివర్ధనం వంటి పూలను ఉపయోగిస్తారు. వీటిని క్రమంగా పెట్టి బతుకమ్మను త్రిభుజాకారంగా పేరుస్తారు. మహిళలందరూ ఒక చోట చేరి బతుకమ్మల చుట్టూ తిరుగుతూ పాటలు పాడతారు. దీనివల్ల సోదరభావం, ఐక్యత, ప్రేమానురాగాలు కలగలసి రంగరించినట్టుగా కనిపిస్తుంది. పాట చివరన ఉయ్యాలో, వలలో, చందమామ లాంటి పదాలను ఉపయోగిస్తారు. సద్దుల బతుకమ్మ దసరాకి 2 రోజుల ముందు వస్తుంది. చివరిరోజున నిర్వహించే పండుగ సద్దుల బతుకమ్మగా పేర్కొంటారు. సాయంత్రం ఆడటం పూర్తయిన తర్వాత చెరువుల్లో నిమజ్జనం చేస్తారు. చక్కెర, బెల్లం, రొట్టెతో మలీద ముద్దలను తయారుచేసి బంధుమిత్రులకు ప్రసాదంగా పంచిపెడతారు. నిమజ్జనం తర్వాత ఖాళీ తాంబూలంతో సరదాగా వలలో అంటూ పాటలు పాడుతూ (బతుకమ్మను కీర్తిస్తూ) ఇంటికి చేరుకుంటారు. బతుకమ్మను ప్రపంచస్థాయికి తీసుకెళ్లిన ఘనత జాగృతి అధ్యక్షురాలు కే కవితకు దక్కుతుంది. దీన్ని ప్రభుత్వం 2014, జూన్ 16న రాష్ట్రపండుగగా ప్రకటించింది. లక్ష్మీదేవి మానవాళికి సమస్త భాగ్యాలు, సుఖశాంతులు ప్రసాదిస్తుందని ప్రజల నమ్మకం.
బతుకమ్మ 9 రోజుల పేర్లు – నైవేద్యాలు
1) ఎంగిలి పూల బతుకమ్మ – నువ్వులు, నూకలు
2) అటుకుల బతుకమ్మ – ఉడకబెట్టిన పప్పు, బెల్లం, అటుకులు
3) ముద్దపప్పు బతుకమ్మ – తడిబియ్యం, పాలు, బెల్లం
4) నాన బియ్యం బతుకమ్మ – తడిబియ్యం, పాలు, బెల్లం
5) అట్ల బతుకమ్మ – అట్లు
6) అలిగిన బతుకమ్మ – అట్లు
7) వేపకాయల బతుకమ్మ – వేపపండ్ల ఆకారంలో బియ్యం పిండి
8) వెన్నముద్దల బతుకమ్మ – వెన్న, నువ్వులు, బెల్లం
9) సద్దుల బతుకమ్మ – ఐదు లేదా తొమ్మిది రకాల సద్దులు
బతుకమ్మ కథ
అమ్మవారు మహిషాసురున్ని చంపి అలిసి మూర్ఛపోయినప్పుడు బతుకు అమ్మ అని మహిళలంతా కలిసి పాటలతో స్పృహ తెప్పించే ప్రయత్నమని ఆ విధంగా ఆ పాటలే బతుకమ్మగా పిలుచుకుంటున్నామని ఒక ఇతిహాసం. ఓ పల్లెలో వరద బారి నుంచి కాపాడిన త్యాగమూర్తే బతుకమ్మ అని పిలుచుకునేవారని ఇంకో కథనం. తామరపువ్వును ఓ రాజు తన తోటలోని కొలనులో వేసినప్పుడు కొలనుచుట్టూ తంగేడు పూలు పూస్తాయి. కొంతకాలానికి విష్ణుమూర్తి దిగొచ్చి ఆ తామరను మనిషిగా చేసి లక్ష్మి అవతారమని పేరుపెట్టారు. పువ్వులకు బతుకుదెరువు చూపింది కాబట్టి బతుకమ్మ అయిందని మరో కథనం తెలుపుతుంది.
బొడ్డెమ్మ
పెండ్లికాని ఆడపడచులు జరుపుకొనే పండుగ. వినాయక చవితి భాద్రపద బహుళ పంచమితో మొదలు పెట్టి మహాలయ అమవాస్య వరకు బొడ్డెమ్మ పండుగ నిర్వహిస్తారు. ప్రత్యేక పీఠంపై పుట్టమన్నుతో బతుకమ్మ ఆకారంలో త్రికోణ గోపురం నిర్మించి దాని చుట్టూ తంగేడు, బంతి, చామంతి తదితర పూలతో అలంకరిస్తారు. బొడ్డెమ్మ తలభాగంలో కలశాన్ని పెట్టి బియ్యం పోసి కొత్త రవికపై పసుపు ముద్దతో వేసిన గౌరమ్మను పెడతారు. సాయంకాలం ఆరుబయట పుట్టమన్నుతో అలికిన స్థలంలో ఈ బొడ్డెమ్మలను పెట్టి వాటి చుట్టూ లయబద్ధంగా తిరుగుతూ పాటలు పాడతారు. దీన్ని 9 రోజులపాటు జరుపుకొని కలశంలో 9 రోజులు పోసిన బియ్యంతో చివరి రోజు పాయసం చేసుకుంటారు.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?