News Highlights | వార్తలు- విశేషాలు
తెలంగాణ
ప్రైడ్ ప్లేస్
ట్రాన్స్జెండర్ల రక్షణ కోసం దేశంలోనే తొలిసారిగా రాష్ట్రంలో ఏర్పాటు చేసిన ‘ప్రైడ్ ప్లేస్’ ప్రత్యేక విభాగాన్ని డీజీపీ మహేందర్‌రెడ్డి ఏప్రిల్ 12న ప్రారంభించారు. తెలంగాణ మహిళా భద్రత విభాగం ఆధ్వర్యంలో దీనిని ఏర్పాటు చేశారు. ట్రాన్స్జెండర్ల సమస్యలకు వన్ స్టాప్ సొల్యూషన్ కేంద్రంగా ప్రైడ్ ప్లేస్ పనిచేస్తుందని తెలంగాణ మహిళా భద్రత విభాగం అడిషనల్ డీజీపీ స్వాతిలక్రా వెల్లడించారు.
టీ సిటీ ఆఫ్ ది వరల్డ్
2021కు గాను ట్రీ సిటీ ఆఫ్ ది వరల్డ్ అవార్డు హైదరాబాద్, ముంబై నగరాలకు ఏప్రిల్ 12న లభించింది. యునైటెడ్ నేషన్స్ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ (ఎఫ్ఏవో), ఆర్బోర్ డే ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ అవార్డును అందించారు. హైదరాబాద్‌కు వరుసగా రెండో ఏడాది కూడా అవార్డు లభించడం విశేషం. 2020లో ట్రీ సిటీ ఆఫ్ ది వరల్డ్‌గా గుర్తింపు పొందిన ఏకైక నగరం హైదరాబాద్.
జాతీయం
గాంధీ అవార్డ్ ఫర్ లెప్రసీ
చండీగఢ్‌కు చెందిన డాక్టర్ భూషణ్ కుమార్, గుజరాత్‌కు చెందిన సహ్యోగ్ కుష్ఠ యజ్ఞ ట్రస్ట్ లకు ‘ఇంటర్నేషనల్ గాంధీ అవార్డ్ ఫర్ లెప్రసీ-2021’ లభించింది. ఈ అవార్డును ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఏప్రిల్ 13న న్యూఢిల్లీలో ప్రదానం చేశారు.
రాష్ట్రీయ్ గ్రామ్ స్వరాజ్ అభియాన్
రాష్ట్రీయ్ గ్రామ్ స్వరాజ్ అభియాన్ (ఆర్జీఎస్ఏ) అమలు గడువును 2022, ఏప్రిల్ నుంచి 2026, మార్చి 31 వరకు పొడిగిస్తున్నట్లు కేంద్రం ఏప్రిల్ 13న ప్రకటించింది. రూ.5,191 కోట్లతో దీనిని అమలుపర్చేందుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. పంచాయతీరాజ్ సంస్థల పాలనా సామర్థ్యాలను మెరుగుపర్చేందుకు అవసరమైన వనరులు సమకూర్చడమే లక్ష్యంగా ఈ ఆర్జీఎస్ఏ ని 2019, ఏప్రిల్ 24న ప్రారంభించారు.
ప్రధానుల మ్యూజియం
భారత ప్రధాన మంత్రుల మ్యూజియాన్ని (ప్రధానమంత్రి సంగ్రహాలయ) న్యూఢిల్లీలోని తీన్‌మూర్తి కాంప్లెక్స్‌లో ప్రధాని మోదీ ఏప్రిల్ 14న ప్రారంభించారు. మాజీ ప్రధానుల జీవిత/పరిపాలనా విశేషాలను భవిష్యత్తరాలకు అందించేందుకు ఈ మ్యూజియాన్ని ఏర్పాటు చేశారు. దీనిలో మొత్తం 43 గ్యాలరీలు ఉన్నాయి. మ్యూజియంపై ప్రజాస్వామ్యానికి చిహ్నమైన ధర్మచక్రాన్ని దేశ ప్రజలు ఎత్తి పట్టుకున్నట్లుగా లోగో ఉంటుంది.
తీర్థ దర్శన్‌లో మౌ
అంబేద్కర్ జన్మించిన మౌ పట్టణాన్ని ‘తీర్థ దర్శన్ యోజన’ జాబితాలో చేర్చనున్నట్లు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ హాన్ ఏప్రిల్ 14న ప్రకటించారు. ఈ పట్టణంలోని కాళిపల్టాన్ ప్రాంతంలో 1891, ఏప్రిల్ 14న అంబేద్కర్ జన్మించారు. ప్రస్తుతం ఈ ప్రాంతం పేరు అంబేద్కర్ నగర్‌గా మారింది.
అంబేద్కర్ జయంతిని ఈ ఏడాది నుంచి ‘సమానతా దినోత్సవం’గా పాటిస్తామని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ప్రకటించారు.
హిమాచల్‌ప్రదేశ్
హిమాచల్‌ప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని ఏప్రిల్ 15న నిర్వహించారు. హిమాచల్‌ప్రదేశ్ రాష్ట్రంగా 1970, డిసెంబర్ 18న పార్లమెంట్లో ఆమోదం పొందింది. 1971, జనవరి 25న హిమాచల్‌ప్రదేశ్ 18వ రాష్ట్రంగా అవతరించింది. ఆ రాష్ట్రం 1947లో బ్రిటన్ నుంచి స్వాతంత్య్రం పొంది 1948, ఏప్రిల్ 15న భారత ప్రావిన్స్‌గా ఏర్పడింది. దీంతో ఏప్రిల్ 15నే అవతరణ దినోత్సవంగా నిర్వహిస్తున్నారు.
అట్టారీ-వాఘా సరిహద్దు
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ ఏప్రిల్ 14న పంజాబ్‌లోని అట్టారీ-వాఘా సరిహద్దును సందర్శిం చారు. దీంతో ఈ సరిహద్దు ను సందర్శించిన తొలి సీజేఐగా జస్టిస్ ఎన్వీ రమణ రికార్డులకెక్కారు.
క్రీడలు
రన్నరప్‌గా సానియా జోడీ
చార్ల్టన్ ఓపెన్ డబ్ల్యూటీఏ టెన్నిస్ టోర్నీ-2022లో సానియా మీర్జా-లూసీ హర్డెసా (చెక్ రిపబ్లిక్) జోడీ రన్నరప్‌గా నిలిచింది. అమెరికాలోని సౌత్ కరోలినా రాష్ట్రంలో ఉన్న చార్ల్టన్ నగరంలో ఏప్రిల్ 10న జరిగిన డబుల్స్ ఫైనల్ మ్యాచ్‌లో మాగ్దా లినెడ్ (పోలెండ్)-ఆండ్రియా క్లెపాచ్ (స్లోవేనియా) జోడీ విజయం సాధించగా సానియా మీర్జా జోడీ రన్నరప్‌గా నిలిచింది.
జూనియర్ మహిళల ప్రపంచ కప్ హాకీ
జూనియర్ మహిళల హాకీ ప్రపంచకప్ టైటిల్‌ను నెదర్లాండ్స్ గెలుచుకుంది. ఏప్రిల్ 12న దక్షిణాఫ్రికాలోని పోచెఫ్స్ట్రూమ్లో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో జర్మనీని ఓడించిన నెదర్లాండ్స్ నాలుగోసారి ప్రపంచ కప్‌ను సాధించింది. మూడో స్థానం కోసం జరిగిన పోటీలో భారత్ ఇంగ్లండ్ చేతిలో ఓడిపోయి నాలుగో స్థానంలో నిలిచింది.
హాకీ-2023 లోగో
భారత్‌లో నిర్వహించనున్న 15వ ఎడిషన్ హాకీ ప్రపంచకప్-2023 లోగోను భువనేశ్వర్‌లోని కళింగ స్టేడియంలో ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ఏప్రిల్ 14న ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఇంటర్నేషనల్ హాకీ ఫెడరేషన్ (ఎఫ్ఐహెచ్) అధ్యక్షుడు నరిందర్ బాత్రా పాల్గొన్నారు. ఒడిశా రాష్ట్రంలోని భువనేశ్వర్, రూర్కెలా నగరాల్లో ఈ ప్రపంచకప్ మ్యాచ్‌లు 2023, జనవరి 23 నుంచి 29వ తేదీ వరకు నిర్వహించనున్నారు.
ప్రజ్ఞానంద
రెక్జావిక్ ఓపెన్ ఇంటర్నేషనల్ చెస్ టోర్నీలో తమిళనాడుకు చెందిన యువ గ్రాండ్‌మాస్టర్ ఆర్ ప్రజ్ఞానంద విజేతగా నిలిచాడు. ఏప్రిల్ 13న ఐస్లాండ్ రాజధాని రెక్జావిక్‌లో జరిగిన ఈ టోర్నీలో తొమ్మిది రౌండ్లలో 7.5 పాయింట్లు సాధించి టోర్నీ గెలిచాడు. 58 ఏండ్ల చరిత్ర కలిగిన ఈ టోర్నీలో పెంటేల హరికృష్ణ (2006), అభిజత్ గుప్తా (2010, 2016), భాస్కరన్ అధిబన్ (2018) తర్వాత విజేతగా నిలిచిన నాలుగో భారతీయ చెస్ క్రీడాకారుడిగా ప్రజ్ఞానంద గుర్తింపు పొందాడు.
కిమ్ క్లిజ్స్టర్స్
బెల్జియం టెన్నిస్ క్రీడాకారిణి కిమ్ క్లిజ్స్టర్స్ ఏప్రిల్ 12న టెన్నిస్‌కు రిటైర్మెంట్ ప్రకటించింది. 2007, 2012లో రిటైర్మెంట్ ప్రకటించి ఆ తర్వాత మళ్లీ ఆడింది. కెరీర్ మొత్తంలో 41 టైటిల్స్ గెలుచుకుంది.
వార్తల్లో వ్యక్తులు
సంజయ్ కుమార్
ఢిల్లీలో తెలంగాణ ముఖ్యమంత్రి కార్యా లయ పౌరసంబంధాల అధికారి (సీఎం పీఆర్వో)గా సంజయ్ కుమార్ ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఏప్రిల్ 7న ఉత్తర్వులు జారీచేసింది. బీహార్‌కు చెందిన ఆయన ఈ పదవిలో రెండేండ్లు ఉంటారు.
అమర్ మిత్ర
బెంగాలీ రచయిత అమర్ మిత్రకు 2022కు గాను ఓ హెన్రీ అవార్డు ఏప్రిల్ 12న లభించింది. ఆయన 45 ఏండ్ల క్రితం గాన్‌బురో అనే చిన్న కథను రాశారు. దీనిని ‘ది ఓల్డ్ మ్యాన్ ఆఫ్ కుసుంపుర్’ అనే పేరుతో ఇంగ్లిష్‌లో అనువదించారు. ఈ అవార్డును చిన్న కథలకు ప్రదానం చేస్తారు. అమెరికన్ రచయిత ఓ హెన్రీ పేరు మీద ఈ అవార్డును అందజేస్తున్నారు.
షెహబాజ్ షరీఫ్
పాకిస్థాన్ 23వ ప్రధానమంత్రిగా షెహబాజ్ షరీఫ్ ఏప్రిల్ 11న ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మొత్తం 342 అసెంబ్లీ స్థానాల్లో షెహబాజ్‌కు 174 ఓట్లు వచ్చాయని స్పీకర్ అయాజ్ సాదిక్ వెల్లడించాడు.
నిమేశ్ పటేల్
బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (బీఏఐ) కొత్త అధ్యక్షుడిగా నిమేశ్ పటేల్ ఏప్రిల్ 9న ఎన్నికయ్యారు. ఆయన మారుతి ఇన్ఫ్రా సీఎండీగా పనిచేస్తున్నారు. 8 దశాబ్దాల చరిత్ర ఉన్న బీఏఐ అధ్యక్షుడిగా గుజరాత్ నుంచి ఎన్నికైన తొలి వ్యక్తి నిమేశ్.
ప్రభాత్ పట్నాయక్
ఆర్థికవేత్త, రాజకీయ విశ్లేషకుడు ప్రభాత్ పట్నాయక్‌ను 2022కు గాను మాల్కమ్ ఆదిశేషయ్య అవార్డుకు ఏప్రిల్ 13న ఎంపిక చేశారు. ఈ అవార్డును మాల్కం, ఎలిజబెత్ ఆదిశేషయ్య ట్రస్ట్ అందజేస్తుంది. పట్నాయక్ న్యూఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్‌యూ)లోని స్కూల్ ఆఫ్ సోషల్ సైన్సెస్‌లో సెంటర్ ఫర్ ఎకనామిక్ స్టడీస్ అండ్ ప్లానింగ్‌లో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. ఈ అవార్డు కింద ప్రసంశాపత్రం, రూ.2 లక్షల నగదు అందజేస్తారు.
రి చున్-హీ
ఉత్తరకొరియాలో న్యూస్ రీడర్‌గా పనిచేస్తున్న ‘రి చున్-హీ’కి దేశాధినేత కిమ్ జోంగ్ ఉన్ కానుకగా ఇచ్చిన భవంతిలోకి దేశాధ్యక్షుడితో కలిసి ఆమె ఏప్రిల్ 13న గృహప్రవేశం చేశారు. ఆమె ఆ దేశంలోని ‘కొరియన్ సెంట్రల్ టెలివిజన్ (కేసీ టీవీ)’లో 5 దశాబ్దాలుగా పనిచేస్తుంది. అదేవిధంగా ఆమె వస్త్రధారణతో ‘పింక్ లేడీ’గా గుర్తింపు పొందింది.
అంతర్జాతీయం
భారత్-అమెరికా
భారత్-అమెరికా 2+2 మంత్రుల సమావేశం వాషింగ్టన్లో ఏప్రిల్ 12న ముగిసింది. ఐరాస భద్రతా మండలిలో భారత్ శాశ్వత సభ్యత్వం పొందేందుకు, న్యూక్లియర్ సప్లయర్స్ గ్రూప్‌లో ఢిల్లీ చేరేందుకు తదితర విషయాలపై చర్చించారు. ఈ సమావేశానికి భారత్ తరఫున విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్ జైశంకర్, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, అమెరికా తరఫున ఆ దేశ విదేశాంగ మంత్రి ఆంటోని బ్లింకెన్, రక్షణ మంత్రి లాయిడ్ ఆస్టిన్ హాజరయ్యారు.
ఐరాస కమిటీల్లో భారత్ ఎన్నిక
ఐక్యరాజ్యసమితిలోని ఆర్థిక, సామాజిక మండలిలోని నాలుగు కమిటీలకు భారత్ ఏప్రిల్ 13న ఎన్నికయ్యింది. ఐరాసలోని సామాజిక అభివృద్ధి కమిషన్, ఎన్జీవోస్ కమిటీ, కమిటీ ఆన్ సైన్స్ అండ్ టెక్నాలజీ డెవలప్మెంట్, ఆర్థిక-సామాజిక-సాంస్కృతిక హక్కుల కమిటీల్లో భారత్‌కు ప్రాతినిధ్యం లభించింది.
మాస్కోవా
రష్యాకు చెందిన ప్రముఖ యుద్ధనౌక ‘మాస్కోవా’ను పేల్చేశామని ఉక్రెయిన్ మిలిటరీ అధికారులు ఏప్రిల్ 14న ప్రకటించారు. ఈ యుద్ధనౌక పేల్చివేతకు గుర్తుగా ఉక్రెయిన్ ఒక పోస్టల్ స్టాంప్‌ను విడుదల చేసింది.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?