పంచాయతీరాజ్ ప్రకరణలు
ఎల్ఎం సింఘ్వీ కమిటీ (1986):
1986లో రాజీవ్‌గాంధీ ప్రధానిగా ఉన్నప్పుడు పంచాయతీలను బలోపేతం చేయడానికి అవసరమైన సిఫారసులు చేయడానికి ఎల్ఎం సింఘ్వీ అధ్యక్షతన ఒక కమిటీని నియమించారు. స్థానిక సంస్థలకు రాజ్యాంగ ప్రతిపత్తి కల్పించి వాటిని పరిరక్షించాలని, గ్రామపంచాయతీలకు ఆర్థిక వనరులను కల్పించాలని, కొన్ని గ్రామ సముదాయాలకు న్యాయపంచాయతీలను ఏర్పాటు చేయాలని, గ్రామాలను పునర్వ్యవస్థీకరించాలని, గ్రామసభను ఏర్పాటు చేయాలని, క్రమం తప్పకుండా ఎన్నికలను నిర్వహిస్తూ ఎన్నికలకు సంబంధించిన వివాదాలను పరిష్కరించడానికి ప్రత్యేక జ్యుడీషియల్ ట్రిబ్యునల్‌ను ఏర్పాటు చేయాలని ఈ కమిటీ సిఫారసులు చేసింది.
ఆర్ఎస్ సర్కారియా కమిటీ (1988):
క్రమం తప్పకుండా ఎన్నికలను నిర్వహించాలని, స్థానిక సంస్థలను రద్దుచేయడానికి సంబంధించి అన్ని రాష్ర్టాల్లోనూ ఒకేరకమైన చట్టాన్ని అమలు చేయాలని, పంచాయతీరాజ్‌కు సంబంధించిన అధికారాలను రాష్ర్టాలకు అప్పగించాలని, స్థానిక సంస్థలను ఆర్థికంగాను, విధులపరంగాను పటిష్టపర్చాలని, దేశానికంతటికీ అవసరమయ్యే పంచాయతీరాజ్ చట్టాన్ని రూపొందించాలని ఈ కమిటీ పేర్కొంది.
పీకే తుంగన్ కమిటీ (1988):
గ్రామీణాభివృద్ధి మంత్రిత్వశాఖకు సంబంధించిన పార్లమెంటు సంప్రదింపుల కమిటీ ఉపకమిటీ చైర్మన్ అయిన పీకే తుంగన్ అధ్యక్షతన ఈ కమిటీని 1988లో ఏర్పాటు చేశారు. దీన్ని పీకే తుంగన్ క్యాబినెట్ సబ్ కమిటీ అంటారు. స్థానిక సంస్థలకు రాజ్యాంగబద్ధత కల్పించాలని, జిల్లాస్థాయిలో జిల్లా పరిషత్ ప్రణాళికను అభివృద్ధి ఏజెన్సీగా పరిగణించాలని ఈ కమిటీ సిఫారసు చేసింది.
73వ రాజ్యాంగ సవరణ చట్టం-1992
-ఎల్ఎం సింఘ్వీ, పీకే తుంగన్ కమిటీల సిఫారసుల మేరకు 64వ రాజ్యాంగ సవరణ బిల్లును రాజీవ్‌గాంధీ ప్రభుత్వం 1989, మే 15న లోక్‌సభలో ప్రవేశపెట్టింది. లోక్‌సభలో 2/3వ వంతు మెజారిటీ పొందినప్పటికీ, రాజ్యసభలో 2 ఓట్లు తక్కువకావడంతో ఈ బిల్లు వీగిపోయింది.
-తర్వాత వీపీ సింగ్ ప్రభుత్వం పంచాయతీలకు, పురపాలక సంఘాలకు సంబంధించిన ఉమ్మడి బిల్లును 1990, సెప్టెంబర్ 7న 74వ రాజ్యాంగ సవరణ బిల్లుగా లోక్‌సభలో ప్రవేశపెట్టింది. ప్రభుత్వం పడిపోవడంతో ఈ బిల్లు చర్చకు నోచుకోలేదు.
-తర్వాత పీవీ నర్సింహారావు ఆధ్వర్యంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం పంచాయతీరాజ్ సంస్థలకు రాజ్యాంగ ప్రతిపత్తిని కల్పించాల్సిన విషయాన్ని గుర్తించి 1991లో పంచాయతీలకు సంబంధించిన బిల్లును, మున్సిపాలిటీ (పురపాలక సంఘాలు)లకు సంబంధించిన బిల్లును వేర్వేరుగా పార్లమెంట్లో ప్రవేశపెట్టింది.
-ఆ బిల్లులను సంయుక్త పార్లమెంటరీ కమిటీకి నివేదించారు. ఆ కమిటీ సమర్పించిన నివేదికను 1992, డిసెంబర్ 22న పార్లమెంట్ ఆమోదించింది. తర్వాత ఆ బిల్లులను రాష్ట్ర శాసనసభల్లో ఆమోదం కోసం పంపారు. మెజారిటీ రాష్ట్ర శాసనసభలు (17 రాష్ర్టాలు) ఆ బిల్లులకు ఆమోదం తెలిపాయి.
-అప్పటి రాష్ట్రపతి శంకర్దయాల్శర్మ ఆ బిల్లులపై సంతకం చేశారు. దీంతో 73, 74 రాజ్యాంగ సవరణ బిల్లులకు రాజ్యాంగ ప్రతిపత్తి కల్పించారు.
-పంచాయతీలకు సంబంధించిన 73వ రాజ్యాంగ సవరణ చట్టం 1993, ఏప్రిల్ 24 నుంచి అమల్లోకి వచ్చింది. ఏప్రిల్ 24ను పంచాయతీ దినోత్సవంగా జరుపుకొంటున్నాం.
-పట్టణ, మున్సిపాలిటీలకు సంబంధించిన 74వ రాజ్యాంగ సవరణ చట్టం 1993, జూన్ 1 నుంచి అమల్లోకి వచ్చింది.
-73వ రాజ్యాంగ సవరణ చట్టం- 1992 అమల్లోకి వచ్చిన తర్వాత ఆ చట్టం ప్రకారం పంచాయతీరాజ్‌ను మొదటిసారిగా ఏర్పాటు చేసిన రాష్ట్రం కర్ణాటక. కర్ణాటక రాష్ట్ర పంచాయతీరాజ్ చట్టం 1993, మే 10 నుంచి అమల్లోకి వచ్చింది. 73వ రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారం దేశంలో పంచాయతీలకు మొదటిసారిగా ఎన్నికలు నిర్వహించిన రాష్ట్రం కూడా కర్ణాటకే.
నూతన పంచాయతీరాజ్ వ్యవస్థ ప్రకరణలు
-73వ రాజ్యాంగ సవరణ చట్టం-1992 ద్వారా కొత్త పంచాయతీరాజ్ చట్టాన్ని రాజ్యాంగంలోని IXవ భాగంలో 243, 243(A) నుంచి 243(O) వరకు గల మొత్తం 16 ప్రకరణల్లో పొందుపర్చారు.
-73వ రాజ్యాంగ సవరణ, 7వ రాజ్యాంగ సవరణ చట్టం-1956 ద్వారా తొలగించిన IXవ భాగాన్ని తిరిగి ప్రవేశపెట్టారు. దీంతో కొత్తగా IXవ షెడ్యూల్‌ను కూడా చేర్చారు. పంచాయతీరాజ్ అంశం (స్థానిక సంస్థల పాలన, అధికారాలు) రాజ్యాంగంలోని VIIవ షెడ్యూల్లోని రాష్ట్ర జాబితాలో ఉంది.
ప్రకరణ 243 నిర్వచనాలు
1. జిల్లా అంటే ఒక రాష్ట్రంలోని జిల్లా అని అర్థం.
2. గ్రామసభ అంటే గ్రామస్థాయిలో పంచాయతీ పరిధిలోని ఒక గ్రామానికి సంబంధించిన ఓటర్ల జాబితాలో రిజిస్టర్ అయిన వ్యక్తుల సమూహం.
3. మాధ్యమిక స్థాయి అంటే జిల్లా స్థాయికి, గ్రామస్థాయికి మధ్యగల స్థాయి. దీనికి సంబంధించి ఏది మాధ్యమిక స్థాయిగా పరిగణిస్తారో గవర్నర్ పబ్లిక్ నోటిఫికేషన్ ద్వారా నోటిఫై చేస్తారు.
4. పంచాయతీ అంటే గ్రామీణ ప్రాంతాల్లో 243(B) ప్రకరణ కింద ఏర్పాటైన స్థానిక స్వపరిపాలనా సంస్థ.
5. పంచాయత్ ఏరియా అంటే ఒక పంచాయతీ ప్రాదేశిక ప్రాంతం.
6. జనాభా అంటే చివరిగా జనాభా లెక్కల సేకరణ జరిగి ప్రచురించిన జాబితాలో గల జనాభా.
7. గ్రామం అంటే గవర్నర్ ద్వారా గ్రామంగా నోటిఫై అయిన ప్రాంతం. అనేక గ్రామాలను కలిపి కూడా గ్రామంగా నోటిఫై చేసి ఉండవచ్చు.
-ప్రకరణ 243(A) గ్రామసభ: గ్రామస్థాయిలో గ్రామసభ తన అధికార బాధ్యతలను శాసనసభ నిర్దేశించినవిధంగా చెలాయిస్తుంది.
-ప్రకరణ 243B(1) ప్రకారం IXవ భాగంలోని నిబంధనలకు అనుగుణంగా ప్రతి రాష్ట్రంలోనూ గ్రామ, మాధ్యమిక, జిల్లాస్థాయిల్లో పంచాయతీలను ఏర్పాటు చేయాలి.
-ప్రకరణ 243B(2) ప్రకారం 20 లక్షల జనాభా దాటని రాష్ర్టాల్లో మాధ్యమిక స్థాయిలో పంచాయతీలను తప్పనిసరిగా ఏర్పాటు చేయనవసరం లేదు.
-ప్రకరణ 243C పంచాయతీల నిర్మాణం, ఎన్నికల గురించి తెలుపుతుంది.
-ప్రకరణ 243C(1) ప్రకారం పంచాయతీల నిర్మాణం గురించి శాసనసభ తగు నిబంధనలను రూపొందించాలి. పంచాయతీ పరిధిలోని జనాభా, ఆ పంచాయతీలో ఎన్నిక ద్వారా భర్తీ కావల్సిన సీట్ల మధ్య నిష్పత్తి వీలైనంతవరకు రాష్ట్రమంతా ఒకే విధంగా ఉండాలి.
-ప్రకరణ 243C(2) ప్రకారం పంచాయతీ స్థానాల నుంచి సభ్యుల ఎంపిక ప్రత్యక్ష ఎన్నిక ద్వారా జరుగుతుంది. అందుకు ప్రతి పంచాయతీని ప్రాదేశిక నియోజకవర్గాలుగా విభజిస్తారు. ప్రతి నియోజకవర్గంలోని జనాభాకు, సీట్లకు మధ్యగల నిష్పత్తి కూడా వీలైనంతవరకు పంచాయతీ ఏరియా అంతటికీ ఒకే విధంగా ఉండాలి.
-ప్రకరణ 243C(3) ప్రకారం పంచాయతీలో ప్రాతినిధ్యానికి సంబంధించి శాసనసభ కింద పేర్కొన్న విధంగా శాసనాలను చేయవచ్చు.
1. గ్రామ పంచాయతీల అధ్యక్షులకు మాధ్యమిక పంచాయతీల్లో ప్రాతినిధ్యం కల్పించడం. మాధ్యమిక పంచాయతీలు లేని రాష్ర్టాల విషయంలో గ్రామపంచాయతీల అధ్యక్షులకు జిల్లా పంచాయతీల్లో ప్రాతినిధ్యం కల్పించడం.
2. మాధ్యమిక పంచాయతీల అధ్యక్షులకు జిల్లా పంచాయతీల్లో ప్రాతినిధ్యం కల్పించడం.
3. లోక్‌సభ సభ్యులు, రాష్ట్ర శాసనసభ్యులకు తమ నియోజకవర్గాల పరిధిలోగల మాధ్యమిక, జిల్లా పంచాయతీల్లో ప్రాతినిధ్యం కల్పించడం.
4. రాజ్యసభ, రాష్ట్ర శాసనపరిషత్తు సభ్యుల విషయంలో వారు ఓటరుగా ఎక్కడ నమోదయ్యారన్న అంశం ఆధారంగా మాధ్యమిక పంచాయతీలోగాని లేక జిల్లా పంచాయతీలోగాని ప్రాతినిధ్యం కల్పిస్తారు.
-ప్రకరణ 243C(4) ప్రకారం పంచాయతీ అధ్యక్షులకు, పంచాయతీ సభ్యులందరికీ (ప్రత్యక్షంగా ఎన్నికయ్యారా లేదా అన్నదాంతో సంబంధంలేకుండా) పంచాయతీ సమావేశాల్లో ఓటింగ్‌లో పాల్గొనే హక్కు ఉంటుంది.
-ప్రకరణ 243C(5) ప్రకారం గ్రామస్థాయిలో పంచాయతీ అధ్యక్షుని ఎన్నికకు సంబంధించి శాసనసభ నిబంధనలు జారీచేస్తుంది. మాధ్యమిక, జిల్లా పంచాయతీల అధ్యక్షులను ఆయా పంచాయతీల్లోని ఎన్నికైన సభ్యుల నుంచి ఎన్నుకుంటారు.
-ప్రకరణ 243D పంచాయతీల్లో రిజర్వేషన్ల గురించి తెలుపుతుంది.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు