History of India Rajputra | భారతదేశ చరిత్ర రాజపుత్ర యుగం
హర్షుని మరణంతో భారతదేశ చరిత్రలో ప్రముఖ ఘట్టం పరిసమాప్తమైంది. దేశాన్ని రాజకీయంగా, సాంస్కృతికంగా సమైక్యం చేసి పాలించే ఆశయంతో జరిగిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. అలాంటి ప్రయత్నాల్లో హర్షుని తర్వాత ప్రతిహారులు చేసిన ప్రయత్నాన్ని పాల, రాష్ట్రకూట, కర్కోటక వంశాల వారు విచ్ఛిన్నం చేశారు. హర్షుని తర్వాత (క్రీ.శ 647), ఢిల్లీలో తురుష్క రాజ్యస్థాపన జరిగేంతవరకు (క్రీ.శ 1206) మధ్య కాలాన్ని భారతదేశ చరిత్రలో రాజపుత్రుల యుగంగా వ్యవహరిస్తారు.
రాజపుత్రులు ధైర్యసాహసాలకు పేరొందిన యుద్ధప్రియులు. ఈ రాజపుత్ర వంశాల రాజులు ఉత్తర భారతదేశంలో అనేక చిన్న రాజ్యాలను స్థాపించి దేశచరిత్రలో మిక్కిలి కష్టమైన సమయంలో పరిపాలన సాగించారు.
వీరిలో అంత:
కలహాలు ఉన్నప్పటికీ గుప్తులు, హర్షుని కాలం నాటి సాంస్కృతిక కళకు మెరుగులు దిద్దారు. దేశం మీద దండెత్తి వచ్చిన తురుష్కులను ఎదిరించి, వీరోచితంగా పోరాడి చివరకు పరాజితులయ్యారు. అయితే రాజపుత్రులది ఆసక్తిదాయకమైన సుదీర్ఘ ఇతిహాసం. వీరు ఎవరో, ఎక్కడి నుంచి వచ్చారో అంతుబట్టని రహస్యంగా మిగిలిపోయింది. వీరి పూర్వ చరిత్ర గురించి చరిత్రకారుల్లో వివిధ బేధాభిప్రాయలు ఉన్నాయి. కొందరు విదేశీయులని, మరికొంతమంది భారతీయులని వాదించగా, రాజపుత్రులు అగ్నికుల క్షత్రియులనే మరో సిద్ధాంతం కూడా ప్రచారంలో ఉంది. చరిత్రకారులు వెల్లడించిన ఈ అభిప్రాయాలన్నీ ఒక దానితో ఒకటి ఏకీభవించని పరస్పర విరుద్ధాలు.
-విదేశీవాదం :
భారతదేశ చరిత్రను రచించిన వలసవాద చరిత్రకారులు కల్నల్ చార్లెస్టాడ్, కెనడీ, విలియంబ్రూక్, ఎడ్వర్డ్‌లు ఈ వాదాన్ని ప్రతిపాదించారు. ముఖ్యంగా కల్నల్టాడ్ తను రచించిన రాజస్థాన్ కథాకవళిగ్రంథం రాజపుత్రుల చరిత్రను పరిశోధించి వారి పూర్వచరిత్రను గురించి తెలుపుతూ.. రాజపుత్రులు కూడా భారతదేశంలో స్థిరపడిన శకులు, హుణులు, కుషాణులు, మొదలైన విదేశీ జాతుల లాంటి వారేనని, కాలక్రమేణా వారు భారతదేశ సమాజం- సంస్కృతితో మమేకమై భారతదేశాన్ని తమ మాతృదేశంగా భావించారని, ఆ తర్వాత వారిలోని కొందరు రాజకీయంగా ఉన్నతస్థాయి కెదిగి తమకు తామే రాజపుత్రులుగా ప్రకటించుకున్నారని అభిప్రాయపడినాడు.
-దీనికి ఆధారాలుగా వీరు పాటించిన అశ్వమేధయాగాలు, అశ్వాలను పూజించడం, ఆయుధపూజ మొదలైన ఆచారాలన్నీ విదేశీయమైనవని, కాబట్టి రాజపుత్రులు భారతదేశంలో స్థిరపడిన విదేశీయులుఅని తన వాదాన్ని సమర్థించుకున్నాడు. టాడ్ వెలిబుచ్చిన ఈ అభిప్రాయాన్నే మిగతా యూరోపియన్ చరిత్రకారులంతా అంగీకరించారు.
-స్వదేశీవాదం :
భారత జాతీయవాద చరిత్రకారులు గౌరీశంకర్ ఓఝా, సి.వి వైద్య, డా. దశరథ శర్మ, డా. హరిరామ్‌లు విదేశీయులనే సిద్ధాంతాన్ని ఖండిస్తూ రాజపుత్రులు భారతీయులే అని వ్యక్తపరిచారు. రాజపుత్రులు తమ శాసనాల్లో ఇతిహాసకాలం నాటి సూర్య, చంద్రవంశాలకు చెందిన వారమని చెప్పుకోవడం, వీరి అవయవ సౌష్టవం, రంగు, శరీర నిర్మాణం మొదలైనవి ఇతిహాస వీరులను పోలి ఉన్నాయని, కాబట్టి రాజపుత్రులు భారతీయులేనని వీరి వాదం. అంతేకాక రాజపుత్రులు పాటించిన అశ్వమేధయాగాలు, ఆయుధపూజ, అశ్వపూజ మొదలైన ఆచారాలు కొత్తవేమీకావని భారతదేశంలోని పాలకవర్గాలు ప్రాచీనకాలం నుంచే వీటిని పాటిస్తూ వస్తున్నాయని, అందువల్ల వీరు భారతీయులేనని ఈ చరిత్రకారులు సిద్ధాంతీకరించారు.
-అగ్నికుల క్షత్రియులు :
చాంద్ బర్దాయ్ రచించిన పృథ్విరాజ్ రాసో అనే కావ్యంలో ఈ సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. పరశురాముడు ఈ భూమి మీదున్న యావత్ క్షత్రియవర్గాన్ని నాశనం చేశాడని, అప్పుడు ప్రజారక్షణ కల్పించే క్షత్రియులే లేకుండా పోయారని ఆ పరిస్థితిలో బ్రాహ్మణులు ప్రజాపాలన, రక్షణను కల్పించే పాలకవర్గ ఆవశ్యకతను గుర్తించి, అందుకోసం అబూపర్వత శిఖరంపై యజ్ఞం నిర్వహించగా యజ్ఞగుండం నుంచి నలుగురు దివ్య పురుషులు జన్మించారని, తిరిగి వారు ఒక్కొక్కరు ఒక్కొక్క రాజపుత్ర తెగను సృష్టించారని, ఆ విధంగా సృష్టించబడినవారే చౌహానులు, సోలంకీలు, పరమారులు, ప్రతిహారులని, వీరు అగ్నిగుండం నుంచి ఉద్భవించిన వీరుల చేత సృష్టించబడ్డవారు కాబట్టి రాజపుత్రులు అగ్నికుల క్షత్రియులు అని తన సిద్ధాంతాన్ని ప్రదిపాదించాడు. అయితే రాజపుత్రులు విదేశీ, స్వదేశీ జాతుల సమ్మేళనం అని సత్యనాథ్ అయ్యర్, అరుణ భట్టాచార్జీ, విన్సెంట్ స్మిత్, ఆర్.జి భండార్కర్ తమ అభిప్రాయాలు తెలిపారు.
-రాజపుత్రుల్లో ప్రధానంగా 6 వంశాలున్నాయి. అవి…
-1. ప్రతిహారులు 2. గహధ్వాలులు 3. చౌహాన్లు 4. పరమారులు 5.చందేలులు 6. సోలంకీలు
-ప్రతిహారులు (క్రీ.శ. 730-965) :
ఉత్తరభారత్‌లో మొదటి రాజకీయాధికారాన్ని స్థాపించిన రాజపుత్ర రాజ్యం ప్రతిహారులది. ఆరావళి పర్వాతాల పశ్చిమ భాగమైన రాజస్థాన్, ఎగువ గంగా మైదాన ప్రాంతాలను పాలించారు. వీరు మధ్య ఆసియాలోని ఘూర్జర జాతికి చెందిన వారు. హూణుల తర్వాత ఉత్తరభారత్‌లో స్థిరపడ్డారు.
– ప్రతిహారి అంటే ద్వారపాలకుడు అని అర్థం. వీరు తమ మూలపురుషుడు లక్ష్మణుడని, శ్రీరామునికి లక్ష్మణుడు ద్వారపాలకుడిగా ఉండటంవల్ల అతని వారసులైన తాము ప్రతిహారులుగా ప్రసిద్ధి చెందామని తమ శాసనాల్లో పేర్కొన్నారు. కాని కొన్ని ఆధారాలు హరిశ్చంద్రుడనే బ్రాహ్మణుడు ప్రతిహారుల మూలపురుషుడని తెలుపుతున్నాయి.
– వీరి ప్రథమ రాజధాని ఉత్తర రాజస్థాన్‌లోని జోధ్ ప్రాంతమున భేన్మల్. రెండో రాజధాని కనోజ్. ప్రతిహార రాజ్యస్థాపకుడు నాగభటుడు. ఇతడు అరబ్బు దండయాత్రలను, చాళుక్య, రాష్ట్రకూట దండయాత్రలను ఎదుర్కొని రాజ్యానికి పటిష్టమైన పునాది నిర్మించాడు. ఇతనిని గురించి భోజుడు వేయించిన గ్వాలియర్ శాసనం తెలుపుతుంది.
– వత్సరాజు (క్రీ.శ. 783-815) :
నాగభటుని తర్వాత అతని కుమారుడు రాజ్యానికి వచ్చాడు. ఇతని కాలంలో కనోజ్ (కన్యాకుబ్జం) కోసం ప్రతిహార, రాష్ట్రకూట, పాల వంశస్థుల మధ్య భీకర పోరాటాలు జరిగాయి. దీనినే త్రైపాక్షిక పోరాటం అంటారు. వత్సరాజు పాల వంశస్థుడైన ధర్మపాలుని ఓడించి కనోజ్తో సహా బెంగాల్ వరకు తన రాజ్యాన్ని అంతా జయించి వశపర్చుకున్నాడు. అయితే కనోజ్‌లో వత్సరాజు అధికారం సుస్థిరం కాకముందే రాష్ట్రకూట రాజు ధృవుడు దండెత్తి అతడిని ఓడించాడు. ధృవుడు తన రాజధానికి తిరిగిపోగా ధర్మపాలుడు కనోజ్ మీదకు దండెత్తి తిరిగి ఆక్రమించాడు. ఈ విధంగా కనోజ్ వచ్చినట్టే వచ్చి చేజారిపోయింది.
-రెండో నాగభటుడు (క్రీ.శ. 815-836) :
వత్సరాజు కుమారుడు. ఇతను బెంగాల్ రాజు ధర్మపాలుని, కనోజ్ రాజు చక్రాయుధుడిని ఓడించాడు.
-మిహిరభోజుడు (క్రీ.శ. 836-885) :
రెండో నాగభటుడి కుమారుడు. ఇతడు ప్రతిహార రాజుల్లో గొప్పవాడు. రాష్ట్రకూటులు, పాల వంశ రాజులను ఓడించి రాజ్యాన్ని విస్తరించాడు. ఇతను రాష్ట్రకూటరాజైన కృష్ణ-2ని ఓడించి కనోజ్‌ను రాజధానిగా పాలించాడు. ఇతని కాలంలో ప్రతిహార రాజ్యం ఉత్తరాన హిమాలయాల నుంచి దక్షిణాన నర్మదానది వరకు, తూర్పున బీహార్ నుంచి పడమరన గుజరాత్ వరకు వ్యాప్తిచెందింది. ఈ విధంగా ప్రతిహార వంశం పరాకాష్టనందుకుంది. ఇతడు అరబ్బుల దండయాత్రలను వీరోచితంగా తిప్పికొట్టినట్లు గ్వాలియర్ శాసనం తెలుపుతుంది. మిహిరభోజుడి ఆస్థానాన్ని క్రీ.శ 851లో అరబ్బుల యాత్రికుడు సులేమాన్ సందర్శించి గొప్పగా కొనియాడాడు. ఇతని ఆస్థానంలో కర్పూర మంజరి రచించిన రాజశేఖరుడు ఉండేవాడు. భోజరాజు గొప్ప సాహిత్య పోషకుడు. వైష్ణవ మతం ఆచరించినాడు. నాణేల మీద విష్ణువు వరాహ అవతారం ముద్రించాడు. మిహిరభోజుడుఆది వరాహుడు బిరుదు ధరించాడు.
-మొదటి మహేంద్రపాలుడు (క్రీ.శ. 885 -910) :
మిహిరభోజుడి కుమారుడు. ఇతని పాలనాకాలంలో మగధ, పశ్చిమబెంగాల్లోని అనేక ప్రాంతాలను జయించి ప్రతిహార రాజ్యంలో విలీనం చేశాడు. ఈయన తర్వాత రెండో భోజరాజు కొంతకాలం మాత్రమే పరిపాలన చేశాడు.
-రెండో మహేంద్రుడు (క్రీ.శ. 912-944) :
ఇతని కాలంలో రాష్ట్రకూట రాజు మూడో ఇంద్రుడు కనోజ్ని ముట్టడించి ప్రయాగ వరకు గల ప్రాంతాలను దోపిడీ చేశాడు. దీన్ని అవకాశంగా తీసుకొని పాలరాజులు తమ పూర్వ భూభాగాలను తిరిగి ఆక్రమించుకున్నారు. ఈయన పాలన చివరికాలం నాటికి రాష్ట్రకూట రాజు మూడో కృష్ణుడు దండెత్తి క్రీ.శ 940 నాటికి వీరి దుర్గాలు, కోటలు ఆక్రమించాడు. రెండో మహేంద్రుడి కాలంలో బాగ్దాద్ నివాసి ఆల్ మసూది క్రీ.శ 915-916 లో గుజరాత్‌ను సందర్శించి, ప్రతిహార పాలకుల ఘనతను, సామ్రాజ్య వైశాల్యాన్ని వివరించాడు.
-ఆల్మసూది :
ఇతడు గుర్జర ప్రతిహార రాజ్యాన్ని ఆల్-జుజ్మ్గ్రా వర్ణించాడు. ఇతడు పేర్కొన్న బవురా పదం భోజుడి బిరుదైన ఆదివరాహా అయి ఉంటుంది. (అప్పటికే భోజుడు మరణించాడు). ఇతడు వివరించిన ప్రకారం జుజ్మ్ రాజ్యంలో 18 లక్షల గ్రామాలు, నగరాలు ఉన్నాయి. సామ్రాజ్యం 2 వేల కిలోమీటర్ల పొడవు, 2వేల కిలోమీటర్ల వెడల్పు కలిగి ఉంది. రాజు సైన్యంలో 4 విభాగాలున్నాయి. ఒక్కో విభాగంలో 7 లక్షల నుంచి 9 లక్షల మంది సైనికులు ఉండేవారు.
-మహేంద్రపాలుడి తర్వాత రెండో రాజపాలుడు, ఆ తర్వాత క్రీ.శ. 948 లో దేవపాలుడు రాజ్యానికి వచ్చారు. ప్రతిహార రాజ్యం ఇతని కాలంలోనే అతిశీఘ్రంగా క్షీణదశకు చేరింది. చాళుక్యులు, చందేలులు, ఛేది, పరమారులు మొదలైన వారు ప్రతిహార రాజ్యంలోని ప్రాంతాలను ఆక్రమించడంతో ప్రతిహార రాజ్యం క్షీణించింది.
-గహధ్వాలులు/రాథోరులు (క్రీ.శ. 1085-1202) :
వీరు ప్రతిహారుల పతనానంతరం కనోజ్ని ఆక్రమించారు. వీరి పూర్వచరిత్ర గురించి ఎలాంటి ఆధారాలు లేవు. కొంతమంది చరిత్రకారులు వీరు రాష్ట్రకూటుల్లోని ఒకశాఖకు చెందినవారని అభిప్రాయపడ్డారు. ఏది ఏమైనప్పటికీ వీరు దాదాపు ఒక శతాబ్దికాలం మహ్మదీయుల దండయాత్రల నుంచి మధ్య భారతదేశాన్ని రక్షించారు. వీరి మొదటి రాజధాని కనోజ్ కాగా, కాశీ రెండో రాజధానిగా ఉండేది. ఈ వంశానికి మూలపురుషుడు చంద్రదేవుడు.
-చంద్రదేవుడు (క్రీ.శ. 1085-1100) :
ఇతడు తన శాసనాల్లో పవిత్ర ప్రదేశాలైన కౌశిక (కనోజ్), కాశీ, ఉత్తర కోసల (అయోధ్య), ఇంద్రప్రస్థ (ఢిల్లీ)లకు రక్షకుడిగా వర్ణించుకున్నాడు. మహ్మదీయులను ఎదిరించుటకు గొప్ప సైన్యాన్ని పోషించాడు. ఈ సైన్యాన్ని పోషించడానికి ప్రజలపై తురకదండు అనే పన్నుని విధించాడు.
-జయచంద్రుడు (క్రీ.శ. 1154-1193) :
ఇతడు రాథోర్లలో సుప్రసిద్ధుడు. చంద్రదేవుని మనుమడు. కాని ఇతనితోనే రాథోర్ వంశ ప్రతిష్ట అంతరించింది. ఒకవైపు బెంగాల్‌ను పాలించే లక్ష్మణసేనుడితోనూ, మరొకవైపు ఢిల్లీని పాలించే పృథ్విరాజ్చౌహాన్తో నిరంతరం యుద్ధాలు చేశాడు. స్వయంవరంలో తన కుమార్తె రాణి సంయుక్తను పృథ్విరాజ్చౌహాన్ వరించడంతో అతడిని సర్వనాశనం చేసే ఉద్దేశంతో జయచంద్రుడు భారతదేశంపై దండెత్తమని మహ్మద్ఘోరీని ఆహ్వానించినట్లు ఒక అభిప్రాయం ఉంది. మహ్మద్‌ఘోరీ రెండో తరైన్ యుద్ధం (క్రీ.శ1192)లో పృథ్విరాజ్‌ను ఓడించి, మరుసటి సంవత్సరమే క్రీ.శ. 1193లో ఘోరీ కనోజ్ మీద దండెత్తి చందావర్ యుద్ధంలో జయచంద్రుడిని ఓడించాడు. ఈ అవమానాన్ని, అపజయాన్ని భరించలేని జయచంద్రుడు ఆత్మహత్య చేసుకొన్నాడు. అనంతరం వచ్చిన అతని కుమారుడు హరిశ్చంద్రుడితో క్రీ.శ. 1202లో గహధ్వాలుల వంశం అంతరించింది.
-చౌహానులు :
ప్రథమ రాజధాని శాకంబరి. ఆ తర్వాత ఢిల్లీ. వీరు మొదట ప్రతిహారులకు సామంతులుగా ఉండేవారు. ప్రతిహారులు క్షీణించిన తర్వాత సింహరాజ చౌహాన్ క్రీ.శ. 956లోమహారాజాధిరాజ బిరుదు ధరించి స్వతంత్రుడయ్యాడు. అజయరాజు, విశాలదేవుల కాలంలో చౌహాన్ రాజ్యం విస్తరించింది. అజయరాజు నిర్మించినదే అజ్మీరు (అజయమేరు) నగరం. విశాలదేవుడు లాట చాళుక్యులతోనూ, మాళ్వా పరమారులతోనూ యుద్ధాలు చేసి వారి రాజ్యాల్లోకి కొన్ని ప్రాంతాలను ఆక్రమించారు. ఇతడు పంజాబ్‌ను పాలిస్తున్న గజనీ వంశస్థులను, ఢిల్లీ పాలకులైన తోమరుల్ని పరాజితుల్ని చేసి ఢిల్లీని స్వాధీనపర్చుకున్నాడు. ఇతడు గొప్ప సారస్వతాభిమాని, స్వయంగా కవి. హర్షకేళి అనే నాటకాన్ని రచించాడు. అంతేకాకుండా అజ్మీర్‌లో ఒక విద్యాపీఠాన్ని నిర్మించి విద్యావ్యాప్తికి కృషి చేశాడు. ఇతని ఆస్థానంలో లలిత విగ్రహరాజ అను నాటకం రచించిన కవి సోమదేవుడు ఉండేవాడు.
-పృథ్విరాజ్ చౌహాన్ (క్రీ.శ 1179-1192) :
ఇతను చౌహాన్ పాలకుల్లో అగ్రగణ్యుడు. ఇతని ధైర్య సాహసాల గురించి, యుద్ధ నైపుణ్యాన్ని గురించి అనేక కథలు, పాటలు ప్రచారంలో ఉన్నాయి. చాంద్ బర్దాయ్ పృథ్విరాజ్ రాసో అనే హిందీ కావ్యంలో ఇతని కీర్తిని అజరామరం చేశాడు. పృథ్విరాజ్ తన రాజ్యం చుట్టూ ఉన్న సోలంకి, చందేల, గహధ్వాల రాజులతో పోరాడి తన అధికారం సుస్థిరం చేసుకున్నాడు. చౌహాన్ తురుష్కులతో పోరాడి వారి దండయాత్రలను అరికట్టడానికి ప్రయత్నించడంవల్ల హిందూ జాతీయవీరుడిగా కీర్తించబడ్డాడు.
-తరైన్ యుద్ధాలు/ స్థానేశ్వర యుద్ధాలు :
ఈ యుద్ధాలు పృథ్విరాజ్ చౌహాన్‌కు, మహ్మద్ ఘోరీకి మధ్య జరిగాయి. భారతదేశ చరిత్రలో ఈ యుద్ధాలకు ప్రముఖస్థానం ఉంది. ఈ యుద్ధాలు ముఖ్యంగా ఉత్తరభారతదేశంలో రాజకీయ పరిస్థితులను మార్చివేశాయి.
-మహ్మద్‌ఘోరీ :
ఇతనికే షహబుద్దీన్ మహ్మద్, మయుజుద్దీన్ మహ్మద్బిన్సామ్ అనే పేర్లు ఉన్నాయి. 1173లో ఘజ్ని (ఆఫ్ఘనిస్థాన్) సింహాసనం అధిష్టించాడు. ఇతడు 1178లో గుజరాత్‌ను ఆక్రమించడానికి ప్రయత్నించాడు. అయితే అబూ పర్వతం వద్ద జరిగిన యుద్ధంలో ఘోరీని అప్పటి గుజరాత్ పాలకుడు రెండో భీముడు చిత్తుగా ఓడించాడు.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?