Soil expansion | మృత్తికా విస్తరణ
సంప్రదాయిక వ్యవసాయ దేశమైన భారత్‌లో మృత్తికలు ప్రధానపాత్ర పోషిస్తాయి. శిలాశైథిల్యం చెందడంతో పాటు కుళ్లిన జంతు, వృక్ష సంబంధ పదార్థాలతో కూడిన పల్చటి పొరనే మృత్తిక అంటారు. ఇవి ఏర్పడటానికి వందల ఏండ్లు పడుతుంది. దేశంలో 8 రకాల నేలలు ఉన్నట్టు ఐకార్ పేర్కొంది. వీటిలో ముఖ్యమైనవి ఆరు రకాలు.
మృత్తికలు
-మృత్తికలను నేలలు అని అంటారు. భూ ఉపరితలంపై శైథిల్యం చెందిన శిలాశకలాలు, కుళ్లిన జంతు వృక్ష సంబం ధ పదార్థాల పల్చటి పొరను మృత్తికలుగా నిర్వచించవచ్చు.
-మృత్తికల్లో మాతృశిల నుంచి సంక్రమించిన పదార్థాలు, జంతువృక్షజాలాల నుంచి జతచేసిన పదార్థాలు, తేమ, గాలి కలిసి ఉంటాయి.
-మృత్తికల సాంద్రత వాటి నిర్మాణం, నాణ్యత వంటి లక్షణాలపై ఆధారపడి ఉంటుంది.
-మృత్తికలు ఏర్పడటానికి కొన్నివందల ఏండ్లు పడుతుంది.
-మృత్తికలు ఏర్పడే విధానంలో ప్రధానంగా 5 కారకాలున్నాయి. అవి 1) శిలాశైథిల్యం 2) శీతోష్ణస్థితి 3) జీవి సంబంధమైన కారకం 4) భూ స్వరూపం 5) సమయం
-పై 5 కారకాలను రెండు భాగాలు చేయవచ్చు. అవి..
1) క్రియాశీల కారకాలు : శీతోష్ణస్థితి, జీవసంబంధ కారకాలు
2) అక్రియాశీల కారకాలు : మాతృశిలాశైథిల్యం,
భూ స్వరూపం, సమయం
-దేశంలో శాస్త్రవేత్తలు ఓయల్కర్ (1893), లెదర్ (1898) మృత్తికలపై పరిశోధనలు చేశారు. వీరు దేశంలోని మృత్తికలను ప్రధానంగా 4 రకాలుగా వర్గీకరించారు. అవి 1) గంగా-సింధు ఒండలి నేలలు 2) నల్లరేగడి నేలలు 3) ఎర్రరేగడి నేలలు 4) లాటరైట్ నేలలు.
-దేశ వ్యవసాయ పరిశోధన సంస్థ (ICAR) దేశంలోని మొత్తం మృత్తికలను 8 రకాలుగా విభజించింది. ఇందులో ముఖ్యమైనవి. 6 రకాల మృత్తికలు మాత్రమే. అవి.. 1) ఒండ్రు నేలలు 2) నల్లరేగడి నేలలు 3) ఎర్రనేలలు 4) లాటరైట్ నేలలు 5) పర్వత నేలలు 6) ఎడారి నేలలు
రకాలు
1) ఒండ్రునేలలు
-నదీ ప్రవాహం వల్ల రవాణా అయి నిక్షేపించబడిన మెత్తని అవక్షేపాలు.
-ఇవి నదీ ప్రవాహానికి ఇరువైపులా, నదీ మైదానాల్లో, డెల్టా ప్రాంతాల్లో ఏర్పడుతాయి.
-గంగా మైదానంలో ఒండ్రు నేలలను 3 రకాలుగా పిలుస్తా రు. అవి 1) అతిపురాతన నేలలు- భంగర్ 2) నవీన నేలలు- ఖాదర్ 3) గులకరాళ్లతో ఏర్పడిన నేలలు- బాబర్.
-ఒండ్రునేలలు వ్యవసాయానికి చాలాముఖ్యమైనవి. ఎందుకంటే ఈ నేలలు చాలా సారవంతమైనవి.
పదార్థాలు
-ఒండ్రు నేలల్లో ప్రధానంగా సున్నం, పొటాష్, భాస్వరం సమృద్ధిగా ఉంటాయి.
-నత్రజని, జీవసంబంధమైనవి (హ్యూమస్)తక్కువ.
-నత్రజని సంబంధమైన ఎరువులు ఎక్కువగా ఉపయోగించాలి.
విస్తరణ
-దేశంలోని మొత్త భూభాగంలో సుమారుగా 23.40 శాతం విస్తీర్ణంలో ఈ నేలలు విస్తరించాయి.
-ఉత్తరాన పంజాబ్ నుంచి అసోం వరకు.
-గంగాసింధు మైదానం, గోదావరి, మహానది, కృష్ణా, కావేరి నదీలోయలు, డెల్టాలు.
-నర్మదా, తపతి నదీలోయల్లో విస్తరించి ఉంటాయి.
-తెలంగాణలో ఈ ఒండ్రునేలలు మనకు కనిపించవు.
-పండే పంటలు : వరి, చెరకు, అరటి, పప్పుదినుసులు, పండ్లతోటలు
2) నల్లరేగడి నేలలు
-నలుపురంగులో ఉంటాయి.
-వీటిని రేగూర్, చెర్నోజోమ్ నేలలని కూడా అంటారు.
-ఇవి ఎక్కువరోజులు నీటిని నిల్వ చేసుకునే శక్తిని, ఎక్కువ బంకమన్ను శాతాన్ని కలిగి ఉంటాయి.
-పత్తిపంటకు చాలా అనుకూలమైనవి.
-తక్కువ ఎరువుల వాడకంతో ఎక్కువ దిగుబడిని ఇస్తాయి.
-లావా, నీస్, గ్రానైట్ శిలలు శైథిల్యానికి గురికావడం వల్ల నల్లరేగడి నేలలు ఏర్పడతాయి.
పదార్థాలు
-వీటిలో ఎక్కువ శాతం మెత్తని ఇనుప పదార్థం ఉండటంవల్ల నలుపురంగులో కనిపిస్తాయి.
-అల్యూమినియం కూడా ఉంటుంది.
-పొటాష్,సున్నం,కాల్షియం,మెగ్నీషియం సమృద్ధిగా ఉంటాయి. నత్రజని, ఫాస్ఫారిక్ఆమ్లం, హ్యూమస్ తక్కువ.
విస్తరణ
-ఇవి దేశంలో 24.12 శాతం భూమిని ఆక్రమించాయి.
-దక్కన్ లావా పీఠభూమి ప్రాంతాలైన మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, తెలంగాణలో విస్తరించాయి.
-తెలంగాణలో ముఖ్యంగా అటవీ ప్రాంతాలైన ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మంలో విస్తరించి ఉన్నాయి.
-దక్షిణ తెలంగాణలోని మహబూబ్‌నగర్‌లో కూడా ఇవి కనిపిస్తాయి.
-నిజామాబాద్, మెదక్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాల్లో కూడా ఉన్నాయి. అయితే వీటి చుట్టూ ఎర్రనేలలు విస్తరించి ఉన్నాయి.
-తెలంగాణ భూభాగంలో దాదాపు 27 శాతం భూమిలో ఈ నేలలు విస్తరించి ఉన్నాయి.
పండే పంటలు :
పత్తి ఎక్కువగా పండుతుంది. ఇతర పంటలైన జొన్న, సజ్జలు, కొర్రలు, పొగాకు, పసుపు, మిర్చి, వరి, చెరకు పంట లు కూడా ఈ నేల్లో పండిస్తారు. వరి, చెరకు ఎక్కువగా నీటిసదుపాయం ఉన్నచోట పండిస్తారు.
3) ఎర్ర నేలలు
-ఇవి తక్కువ వర్షపాత ప్రాంతాల్లో విస్తరించి ఉన్నాయి.
-అధిక ఉష్ణోగ్రత వల్ల స్పటిక, రూపాంతర శిలలు శైథిల్యం చెందడం వల్ల ఏర్పడుతాయి.
-కొన్నిప్రాంతాల్లో సచ్చింద్రంగాను, మరికొన్ని ప్రాంతాల్లో సులభంగా చూర్ణం అయ్యే విధంగా ఉంటాయి. లవణాలు తక్కువగా ఉండి, వర్షాధార పంటలకు చాలా అనువైనవి.
పదార్థాలు
-ఇందులో ఇనుము ఎక్కువ మోతాదులో ఉంటుంది.
-నత్రజని, భాస్వరం, హ్యూమస్, ఫాస్ఫారిక్ ఆమ్లం, సున్నం తక్కువగా ఉంటాయి.
విస్తరణ
-దేశంలో సుమారు 29 శాతం భూభాగాన్ని ఆక్రమించాయి.
-ఇవి తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్రలోని ఆగ్నేయప్రాం తం తెలంగాణలోని దాదాపు అంతటా, మధ్యప్రదేశ్ తూర్పుప్రాంతం, ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌లోని చోటానాగపూర్ ప్రాంతాల్లో విస్తరించి ఉన్నాయి.
-తెలంగాణలో ఈ నేలలు సుమారుగా 69 శాతం భూభాగాన్ని ఆక్రమించాయి. అన్ని జిల్లాల్లో విస్తరించి ఉన్నాయి.
-వీటిని తెలంగాణలో రెండు రకాలుగా విభజించవచ్చు. 1) చెల్క నేలలు 2) దుబ్బ నేలలు.
ఎర్రచెల్క నేలలు
-ఇవి నల్లగొండ, మహబూబ్‌నగర్, మెదక్, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో విస్తరించి ఉన్నాయి.
-నత్రజని, ఫాస్ఫరస్‌లు చాలా తక్కువ మోతాదులో ఉంటా యి. వీటిని తక్కువ సారవంతమైన భూములు అంటారు.
దుబ్బ నేలలు
-వీటిలో నేల క్రమక్షయం ఎక్కువగా ఉంటుంది.
-రాళ్లతోకూడిన ఇసుకను కలిగి ఉంటాయి.
-పంటలకు అనుకూలం కాదు. కొన్ని రకాల ఎరువులు, రసాయనాలు వాడి పండ్లు, కూరగాయలు పండించవచ్చు.
విస్తరణ
-హైదరాబాద్, మెదక్ జిల్లాల్లో కనిపిస్తాయి.
4)లాటరైట్ నేలలు
-వీటిని ఎర్రచెల్క నేలలు అని కూడా అంటారు.
-ఇవి కూడా ఎరుపురంగులో కనిపిస్తాయి. ఎందుకంటే ఇందులో కూడా ఇనుముతో కూడిన మిశ్రమం ఎక్కువ.
-అధిక వర్షపాతం ఉష్ణోగ్రత గల ఆర్థ్ర, అనార్థ్ర శీతోష్ణస్థితుల్లో, అధిక నిక్షేపన వల్ల ఏర్పడే అంతిమ మృత్తికరకం నేలలు. ఇవి ఎక్కువ సారవంతమైన నేలలు.
పదార్థాలు
-ఇందులో ఇనుము, అల్యూమినియం, ఆక్సైడ్ల మిశ్రమం ఉంటుంది.
-ఇందులో ఉన్న సిలికా, సున్నం, వర్షం నీటిలో కొట్టుకొని పోయి ప్రధాన పోషకపదార్థాలైన భాస్వరం, నత్రజని, హ్యూమస్ పదార్థాల కొరత ఉంది.
విస్తరణ
-దేశంలో 4.30 శాతం భూభాగంలో విస్తరించాయి.
-పీఠభూమి ఎత్తు ప్రాంతాలు, కొండ ప్రాంతాలైన పశ్చిమ కనుమలు, ఛత్తీస్‌గఢ్, తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిశా, పశ్చిమబంగా, అసోంలలో విస్తరించి ఉన్నాయి.
-రాష్ట్రంలో మెదక్ జిల్లాలో ఈ నేలలు ఉన్నాయి. ముఖ్యంగా నారాయణఖేడ్, జహీరాబాద్ ప్రాంతాల్లో ఎక్కువ.
-ఈ నేలలు అధిక సారవంతమైనవి కాకపోవడం వల్ల వ్యవసాయానికి ఎక్కువగా పనికిరావు.
పండే పంటలు :
కొబ్బరి, జీడిమామిడి, మామిడి, టీ, కాఫీ, రబ్బరు, పసుపు, ఆలుగడ్డ పండించవచ్చు.
5)పర్వత నేలలు
-ఇవి ఎక్కువగా వృక్షసంపద ఉన్న కొండ పర్వశ్రేణుల్లో, వివిధ ఎత్తుప్రదేశాల్లో ఏర్పడతాయి.
-లాటరైట్ నేలల్లాగా ఉండి, పూర్తిగా పరిణితి చెందనివి.
-భాస్వరం, పొటాష్, సున్నం తక్కువగా ఉంటాయి.
విస్తరణ
-దేశంలో 10.64 శాతం భూభాగాన్ని ఆక్రమించాయి.
-హిమాలయాలు ఈ నేలలకు ప్రసిద్ధి.
-ఉత్తర భారత్‌లోని పర్వతాలు, దక్షిణభారత్‌లోని వింధ్య, సాత్పూర, పశ్చిమ కనుమల్లో ఎక్కువగా విస్తరించాయి.
-కొండ, అటవీప్రాంతాల్లో ఎక్కువగా విస్తరించి ఉండి పండ్లతోటలకు అనువైనవి.
-పండే పంటలు : కాఫీ, టీ, ఆలుగడ్డ, క్యాబేజీ, పూల తోటలకు ప్రసిద్ధి చెందాయి.
6) ఎడారి ఇసుక నేలలు
-ఇవి శుష్క, అర్ధశుష్క పరిస్థితుల్లో ఏర్పడతాయి.
-వీటిలో ద్రావణీయ లవణాల శాతం ఎక్కువ. కానీ కాల్షి యం కార్బొనేట్ శాతం మారుతూ ఉంటుంది.
విస్తరణ
-రాజస్థాన్‌లోని ఆరావళి పర్వశ్రేణికి పశ్చిమాన, హర్యానా, పంజాబ్‌లకు దక్షిణాన, రాణ్ ఆఫ్ కచ్‌కు ఉత్తరాన శుష్క, ఎడారి నేలలున్నాయి.
పదార్థాలు
-ఈ నేలల్లో ఫాస్ఫరస్ పుష్కలంగా ఉంటుంది.
-జీవసంబంధ పదార్థం (హ్యూమస్), నత్రజని తక్కువగా ఉంటాయి.
-సరైన నీటిపారుదల వసతులు కల్పిస్తే ఈ నేలలు వ్యవసాయానికి అనుకూలంగా ఉంటాయి.
పండే పంటలు :
క్షారాన్ని తట్టుకోగలిగే బార్లీ, పత్తి పండుతాయి.
నేలల క్రమక్షయం
-ప్రవాహ జలం, గాలి, మానవులు, జంతువులు నేలల క్రమక్షయానికి కారకాలు.
-వీటివల్ల మెత్తని, సారవంతమైన నేల పైపొర కొట్టుకొనిపోవడాన్ని మృత్తికా క్రమక్షయం అంటారు.
-మృత్తికా క్రమక్షయం వల్ల సుమారు 175 మిలియన్ హెక్టార్లలో ప్రతి ఏడాది 6000 మిలియన్ టన్నుల నేలలు, వాటితోపాటు విలువైన పోషక పదార్థాలను కోల్పోతున్నాం.
-మృత్తికా క్రమక్షయం వల్ల సంభవించే దుష్పరిణామాలు 1) వ్యవసాయం దిగుబడి తగ్గడం 2) వ్యవసాయ భూము లు బంజర భూములుగా మారడం 3) జలాశయాల్లో పూడిక ఎక్కువై నీటి నిల్వస్థాయి తగ్గడం.
-మృత్తికా క్రమక్షయం వివిధ రకాలుగా జరుగుతుంది. కొన్ని వందల ఏండ్ల శైథిల్యం వల్ల ఏర్పడిన విశాల ప్రాంతాల్లోని మృత్తిక తొడుగు కుండపోతగా కురిసే వర్షాలకు, హఠాత్తుగా వచ్చే వరదలకు నేరుగా గురైనప్పుడు పొరలు పొరలుగా కొట్టుకొనిపోవడాన్ని పటకక్రమక్షయం అంటారు.
-పటక క్రమక్షయం ఇలాగే కొనసాగితే మృత్తికల్లో చేతివేళ్ల ఆకారంలో అనేక గాడు ఏర్పడుతాయి. ఇలాంటి క్రమక్షయాన్ని వంకక్రమక్షయం అంటారు.
-వంక క్రమక్షయం ఇంకా కొనసాగితే వంకలు లోతై, పెద్దవై అవనాళికలు ఏర్పడతాయి. దీన్నే అవనాళిక క్రమక్షయం అంటారు.
మృత్తికా క్రమక్షయం జరిగే ప్రాంతాలు
-అధిక వర్షపాత ప్రాంతాలైన శివాలిక్ కొండలు, పశ్చిమ, తూర్పు కనుమలు, అసోం, ద్వీపకల్పంలోని ఈశాన్యప్రాంతంలో పటక్రమక్షయం సర్వసాధారణంగా కనిపిస్తుంది.
-బీహార్, యూపీ, ఎంపీ, మహారాష్ట్ర, కర్ణాటక, ఏపీ, తమిళనాడులో వంక క్రమక్షయం ఎక్కువగా జరుగుతుంది.
-యమున, చంబల్, మహానదులు, గుజరాత్‌లోని ఇతర నదుల తీరంలోని 4 మిలియన్ హెక్టార్లలో మృత్తికా క్రమక్షయం వలన లోతైన అవనాళికలు ఏర్పడతాయి.
మృత్తికా క్రమక్షయానికి సంరక్షణ చర్యలు
-ఈ మృత్తికా క్రమక్షయాన్ని తగ్గించడానికి తగిన చర్యలు కాంటూర్ కట్టడాలు, వేదికల నిర్మాణం, అడవుల పెంపక, నీటి ప్రవాహవేగాన్ని తగ్గించడానికి అడ్డుకట్టలు నిర్మించ డం, పంటల మార్పిడి, పశుసంపద నియంత్రణ, సాగునీటి వనరుల వినియోగంలో నియంత్రణ, తగిన జాగ్రత్తలు పాటించటం, సేంద్రియ ఎరువుల వినియోగం పెంచి రసాయనిక ఎరువుల వాడకం తగ్గించడం వంటి చర్యలవల్ల మృత్తికా క్రమక్షయం తగ్గించవచ్చు.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?