ద్రవ్యోల్బణం నియంత్రణ ఎలా?
ద్రవ్యం, ద్రవ్యం రకాలు, ద్రవ్యం విలువ, ద్రవ్యాన్ని కొలిచే విధానం, ద్రవ్య పరిణామాలు, ద్రవ్యోల్బణ నిర్వచనం, ద్రవ్యోల్బణ రకాలు, ద్రవ్యోల్బణాన్ని కొలిచే విధానం చర్చించాం.. ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలో చర్చిద్దాం.. దానిలో భాగంగా అతిముఖ్యమైన విత్త చర్యలు, పరపతి చర్యల గురించి తెలుసుకుందాం..
ద్రవ్యోల్బణం అంటే?
-సాధారణ ధరల్లో వచ్చే క్రమానుగత పెరుగుదలను ద్రవ్యోల్బణం అంటారు. అంటే మార్కెట్లో ద్రవ్యసరఫరా పెరిగి వస్తువుల ఉత్పత్తి తక్కువగా ఉన్నప్పుడు ఆయా వస్తువులకు గిరాకీ పెరిగి వస్తువుల ధరలు పెరుగుతాయి.
-అంటే మార్కెట్లో ఉన్న కొన్ని వస్తువులను అతి ఎక్కువ ద్రవ్య సరఫరా వెంటాడుతుంది.
-ద్రవ్యోల్బణ సమయంలో ద్రవ్యసరఫరా ఎక్కువగా, వస్తూత్పత్తి తక్కువగా ఉంటుంది.
ద్రవ్యోల్బణాన్ని నియంత్రించే చర్యలు
-ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడానికి రెండు రకాల చర్యలుంటాయి.
1) మానిటరీ చర్యలు (ద్రవ్యపరపతి చర్యలు)
2) విత్త చర్యలు
-ఏ చర్య చేపట్టినా దానికి అందరి నుంచి సంపూర్ణ సహకారం అవసరమవుతుంది.
1) మానిటరీ చర్యలు
ఎ) పరపతి నియంత్రణ
-దీన్ని ఆర్బీఐ చేపడుతుంది. ఆర్బీఐ తన వడ్డీరేట్లను పెంచడం, తగ్గించడం ద్వారా మార్కెట్లో ద్రవ్యసరఫరాను నియంత్రిస్తుంది.
-తద్వారా ఆ ద్రవ్యసరఫరా తగ్గి, మార్కెట్లో వస్తువులకు గిరాకీ తగ్గి ద్రవ్యోల్బణం అదుపులోకి వస్తుంది.
-2012 నుంచి ఉర్జిత్ పటేల్ సిఫారసుల మేరకు వినియోగదారుల సూచీని ఆధారంగా చేసుకొని ఆర్బీఐ ఈ పరపతి నియంత్రణ చర్యలు చేపడుతుంది. అంతకుముందు టోకు ధరల సూచీ ఆధారంగా చేపట్టేవారు.
బి) పెద్ద నోట్ల రద్దు
-పెద్దనోట్ల రద్దు అంటే మార్కెట్లో ఉన్న రూ. 500, రూ. 1000 నోట్లను చెల్లకుండా చేయడం. దీనివల్ల ఆయా పెద్దనోట్లు తగ్గి మార్కెట్లో ద్రవ్య సరఫరా పడిపోతుంది. తద్వారా ద్రవ్యోల్బణం అదుపులోకి వస్తుంది.
-ఇలాంటి చర్యలు కేవలం చివరి అస్త్రంగా మాత్రమే వాడాలి. లేకుంటే ఆర్థికవ్యవస్థలో స్థిరత్వం లోపించి ఎకానమీ చిన్నాభిన్నం అవుతుంది.
సి) కొత్త కరెన్సీ విడుదల చేయడం
-మార్కెట్లో ఉన్న మొత్తం ద్రవ్య సరఫరాను రద్దుచేసి కొత్త కరెన్సీ ప్రవేశపెట్టడం మరొక మార్గం. ఇందులో భాగంగా పెద్దనోట్లను చిన్నచిన్న భాగాలుగా చేసి విడుదల చేస్తారు. ఉదాహరణకు రూ. 100ల కరెన్సీ నోట్లను రూపాయి నోట్లుగా మార్చి విడుదల చేస్తారు. దానివల్ల ద్రవ్య సరఫరా 1/100 వంతుకు తగ్గిపోతుంది.
-ఈ చర్య కూడా చాలా అసాధారణ పరిస్థితుల్లో మాత్రమే చేపట్టాలి. ఎందుకంటే ఎప్పుడైతే నోట్లు రద్దవుతాయో అప్పుడు ఆర్థిక వ్యవస్థలో అనిశ్చితి ఏర్పడి ప్రజల్లో విశ్వాసాన్ని కోల్పోయేటట్టు చేస్తుంది. అలాంటి పరిస్థితి ఆర్థిక వ్యవస్థకు అత్యంత ప్రమాదకరం.
2) విత్త చర్యలు
-ప్రభుత్వం ద్రవ్యోల్బణ నియంత్రణకు తీసుకునే వివిధ చర్యలను విత్త చర్యలు అంటారు.
ఎ) అనవసర ఖర్చులను తగ్గించుకోవడం
-ప్రభుత్వం నుంచి అనవసర ఖర్చులు తగ్గించుకోవడం అంటే ప్రభుత్వం తక్కువ ఖర్చు పెడుతుంది. తద్వారా మార్కెట్కు ప్రభుత్వం తరఫున తక్కువ డిమాండ్ ఉంటుంది. తక్కువ డిమాండ్ ఉన్నప్పుడు వస్తువులకు ధరలు తగ్గి ద్రవ్యోల్బణం అదుపులోకి వస్తుంది.
బి) ప్రత్యక్ష పన్నుల్లో పెరుగుదల
-ప్రత్యక్ష పన్నులరేటును పెంచడం ద్వారా ప్రజల ఆదాయాన్ని తగ్గించవచ్చు. తద్వారా మార్కెట్లో ద్రవ్య సరఫరాను తగ్గించి ద్రవ్యోల్బణాన్ని అదుపులోకి తెస్తారు.
సి) పరోక్ష పన్ను రేట్లను తగ్గించడం
-పరోక్ష పన్నులను తగ్గించడం వల్ల వస్తువుల ధరలు కూడా తగ్గుతాయి. వస్తువుల ధరలు తగ్గినప్పుడు అది ద్రవ్యోల్బణాన్ని తగ్గిస్తుంది.
డి) మిగులు బడ్జెట్ను ప్రవేశపెట్టడం
-మిగులు బడ్జెట్ అంటే ఆదాయం ఎక్కువ, ఖర్చు తక్కువ. ఈ సందర్భంలో ప్రభుత్వం నుంచి ఖర్చులు తగ్గడం వల్ల అది మార్కెట్లో ఉన్న వస్తువులకు డిమాండ్ తగ్గేటట్టు చేస్తుంది. తద్వారా వస్తువులకు గిరాకీ తగ్గి ద్రవ్యోల్బణం అదుపులోకి వస్తుంది.
3) వాణిజ్య చర్యలు
-వాణిజ్య చర్యలంటే ఎగుమతి, దిగుమతికి సంబంధించినవి. ద్రవ్యోల్బణ సమయంలో సాధారణంగా వస్తూత్పత్తి తక్కువగా ఉండి వస్తువులకు విపరీమైన డిమాండ్ ఏర్పడుతుంది.
-వస్తువుల సరఫరాను మరింతగా పెంచి ద్రవ్యోల్బణాన్ని అదుపులోకి తేవచ్చు. దీనిలో భాగంగా కింది చర్యలు చేపడుతారు.
ఎ) దిగుమతి సుంకాన్ని తగ్గించడం
-స్వదేశంలో వస్తువుల ఉత్పత్తి తక్కువగా ఉంది. కాబట్టి దిగుమతి సుంకాన్ని తగ్గిస్తే ఎక్కువ వస్తువులు దేశంలోకి చేరే అవకాశం ఉంటుంది. తద్వారా వస్తువుల సరఫరా పెరిగి ద్రవ్యోల్బణం అదుపులోకి వస్తుంది.
బి. ఎగుమతి సుంకాన్ని పెంచడం
-ఇదివరకే వస్తువులకు విపరీతమైన గిరాకీ ఉన్నందున వస్తువులను ఎగుమతి చేస్తే మరింత కొరత ఏర్పడే ప్రమాదం ఉంది. కాబట్టి ఎగుమతి సుంకాన్ని పెంచి ఎగుమతులను నియంత్రిస్తారు.
4. పరిపాలనా చర్యలు
-పై చర్యలే కాకుండా పరిపాలనా సంబంధ చర్యలు కూడా ద్రవ్యోల్బణాన్ని తగ్గించడానికి దోహదపడుతాయి. వీటిలో భాగంగా..
ఎ. జీతాలను హేతుబద్దీకరించడం
-ప్రభుత్వం ఇచ్చే జీతాలను హేతుబద్దీకరించడం వల్ల.. అంటే తగ్గించడం వల్ల ప్రజలవద్ద ద్రవ్య సరఫరా తగ్గి వస్తువులకు గిరాకీ తగ్గుతుంది. అది ద్రవ్యోల్బణాన్ని అదుపులోకి తేవడానికి దోహదపడుతుంది.
బి. ధరల నియంత్రణ
-దీనిలో భాగంగా కొన్ని వస్తువులకు గిరాకీ తగ్గించడం కోసం ధరల నియంత్రణ చేపడుతారు. అంటే ఒక పరిధికి మించి ధరలను పెంచకూడని విధానాన్ని తీసుకుని.. అంతకు మించి ఆ వస్తువు ధర పెరుగకుండా చర్యలు తీసుకుంటారు.
-పై చర్యల ద్వారా ద్రవ్యోల్బణాన్ని నియంత్రించవచ్చు. అయితే అందులో ముఖ్యంగా ఆర్బీఐ చేపట్టే మానిటరీ విధానాల వల్లనే ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. అందుకే ద్రవ్యోల్బణ నియంత్రణలో ఆర్బీఐదే పైచేయిగా ఉంటుంది.
ఆర్బీఐ, మానిటరీ పాలసీ
-భారత బ్యాంకింగ్ వ్యవస్థ నియంత్రణకు అతిపెద్ద బ్యాంకు ఈ ఆర్బీఐ. అత్యున్నత స్థాయిలో విధానాలను రూపొందించి, వాటిని అమలుచేసి తద్వారా ద్రవ్య పరపతిని నియంత్రించడానికి అత్యంత ముఖ్యమైన సాధనం ఈ ఆర్బీఐ.
-ఇది మిగతా కమర్షియల్ బ్యాంకుల రిజర్వ్ ద్రవ్యాన్ని తనవద్ద ఉంచుకుంటుంది. కాబట్టి దీన్ని రిజర్వ్ బ్యాంక్ అంటారు.
-దీన్నే కేంద్రక బ్యాంక్ అని కూడా అంటారు.
-ఇది 1935లో ఆర్బీఐ చట్టం-1934 ప్రకారం అంబేద్కర్ మానస పుత్రికగా ఏర్పడింది.
-అయితే అప్పుడు ప్రైవేటు, ప్రభుత్వ భాగస్వామ్యంతో కలిపి ఏర్పడింది.
-అయితే 1949లో ఆర్బీఐని జాతీయం చేసినప్పుడు ఇది పూర్తిగా ప్రభుత్వ ఆధీనంలోకి వచ్చింది.
-మొత్తం పరిపాలన కేంద్ర బోర్డు డైరెక్టర్ల పర్యవేక్షణలో ఆర్బీఐ చైర్మన్ ఆధ్వర్యంలో నడుస్తుంది.
-ఆవేకాకుండా నాలుగు ప్రాంతీయ కార్యాలయాలు (చెన్నై, ముంబై, కోల్కతా, న్యూఢిల్లీ) కూడా పరిపాలనలో కీలకపాత్ర వహిస్తాయి.
ఆర్బీఐ విధులు
-ఆర్బీఐ పీఠికలోనే ఆర్బీఐ విధులను వివరించారు.
-బ్యాంకు నోట్ల సరఫరాను, విడుదలను నియంత్రిస్తూ, ఆర్థిక వ్యవస్థ స్థిరత్వానికి ఉపయోగపడుతూ, దేశంలో కరెన్సీ, ద్రవ్యపరపతిని నియంత్రించే బాధ్యతను ఆర్బీఐ చేపడుతుంది.
-ఆర్బీఐ విధులను రెండు రకాలుగా వర్గీకరించవచ్చు. అవి:
1. మానిటరీ విధులు
2. సాధారణ విధులు
-పై రెండు విధుల్లో భాగంగా ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడానికి మానిటరీ విధులు అత్యంత ప్రముఖపాత్ర వహిస్తాయి.
ఆర్బీఐ ఏర్పాటులో అంబేద్కర్ పాత్ర
-1925లో హిల్టన్ యంగ్ కమిషన్కు సమర్పించిన మెమొరాండంలో దేశంలో ద్రవ్యాన్ని, కరెన్సీని ఎలా నియంత్రించాలో చాలా స్పష్టంగా వెలిబుచ్చారు అంబేద్కర్.
-మెమొరాండం ఆధారంగా అంబేద్కర్ రచనలను అధ్యయనం చేసిన బ్రిటిష్ ప్రభుత్వం.. అంబేద్కర్ రాసిన ది ప్రాబ్లమ్ ఆఫ్ రూపీ-ఇట్స్ ఆరిజిన్ అండ్ ఇట్స్ సొల్యూషన్ పుస్తకాన్ని అధ్యయనం చేసి, 1934 ఆర్బీఐ చట్టం ద్వారా ఆర్బీఐని ఏర్పాటు చేసింది.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు