కృషీవలుడి సమస్యలు – పరిష్కారాలు
దేశానికి వెన్నెముక వ్యవసాయం. ప్రపంచీకరణ నేపథ్యంలో వ్యవసాయం వ్యయప్రయాసలతో కూడుకున్నదిగా మారింది. పండిన పంటకు గిట్టుబాటు ధర లభించడంలేదు. దీంతో రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. ఈ కారణంతో దేశంలో నానాటికీ రైతు ఆత్మహత్యలు అధికమవుతున్నాయి. గుజరాత్‌లాంటి అభివృద్ధి చెందిన రాష్ర్టాల్లో వరుసగా జరుగుతున్న ఆత్మహత్యలు, తాము వ్యవసాయం చేసుకోవడానికి సాగు నీరు, విద్యుత్, ఎరువుల వంటి వసతులు కల్పించాలని తమిళనాడుకు చెందిన రైతులు మూడు నెలల నుంచి ఢిల్లీలో వివిధ రూపాల్లో చేస్తున్న ఆందోళనలు.. ఇలా నిస్వార్థంతో దేశానికి అన్నంపెట్టే రైతుల ఆర్తనాదాలు నలుమూలలా వినిపిస్తున్నాయి. ఈ పరిస్థితిని మార్చేందుకు తెలంగాణ లాంటి రాష్ర్టాలు రైతులకు వెన్నుదన్నుగా నిలిచేందుకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నాయి. రైతులు ఎందుకు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు? దానికి కారణాలేంటి? వీటిపై ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలేవి? రైతు ఆత్మహత్యలపై సుప్రీకోర్టు చేసిన వ్యాఖ్యలేంటి? రైతు కమిషన్ సిఫారసులేంటి? రైతుల అభివృద్ధిపై రాబోయే పదేండ్లలో వివిధ ప్రభుత్వాలు తయారుచేసిన నివేదికలు ఉన్నాయా? రైతు ఆత్మహత్యలను ఆపడం ఎలా? మొదలైన విషయాలపై సమగ్ర అవగాహన ఉండటం పోటీ పరీక్షల విద్యార్థులకు తప్పనిసరి.
రైతు ఆత్మహత్యలు-గణాంకాలు, వివరాలు
-మనది వ్యవసాయ ఆధారిత దేశం. దాదాపు 836 మిలియన్ ప్రజలు వ్యవసాయంపై ఆధారపడి ఉన్నారు.
-ఎన్ఎస్ఎస్ఓ 68వ రౌండ్ గణాంకాల ప్రకారం 70 శాతం గ్రామీణ మహిళలు వ్యవసాయం జీవనాధారంగా జీవిస్తున్నారు.
-1991లో వచ్చిన ఎల్పీజీ సంస్కరణల తర్వాత మూడు లక్షల మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని జాతీయ నేర నమోద బ్యూరో (ఎన్సీఆర్బీ) తెలిపింది.
-దేశంలో రోజుకు సగటున 46 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అంటే ప్రతి అరగంటకు ఒక రైతు చనిపోతున్నాడని అర్థం.
-1956లో వ్యవసాయరంగ జీడీపీ 60 శాతానికి పైగా ఉంటే 2016-17కు వచ్చేసరికి అది దాదాపు 12 శాతానికి పడిపోయింది. కానీ ఇంకా 50 శాతం పైగా ప్రజలు వ్యవసాయంపైనే ఆధారపడి జీవిస్తున్నారు.
-మొత్తం ఆత్మహత్యల్లో దేశంలో 11 శాతం రైతులవే ఉంటున్నాయి.
-ఆత్మహత్యల రేటులో ప్రతి లక్షమంది జనాభాకు రైతులు 1.4 శాతం మంది ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఇది ప్రపంచంలోనే ముందువరుసలో ఉంది.
-జాతీయ నేర గణాంక మండలి (ఎన్సీఆర్బీ)-2015 నివేదిక ప్రకారం దేశ వ్యాప్తంగా (2015లో) 8007 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. అందులో పురుషులు 7566, స్త్రీలు 441 మంది ఉన్నారు.
-3030 మంది రైతుల ఆత్మహత్యలతో మహారాష్ట్ర మొదటి స్థానంలో ఉంది. 854 మందితో ఛత్తీస్‌గఢ్, 581 మందితో మధ్యప్రదేశ్, 516తో ఆంధ్రప్రదేశ్ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.
-అభివృద్ధిచెందిన రాష్ర్టాలైన దక్షిణ భారతదేశంలో అత్యధికంగా రైతు ఆత్మహత్యలు ఉన్నాయి. బీహార్, పశ్చిమబెంగాల్, జార్ఖండ్, గోవా, హిమాచల్‌ప్రదేశ్‌లలో కూడా రైతుల ఆత్మహత్యలు ఎక్కువగా నమోదవుతున్నాయి.
ఆత్మహత్యలు-కారణాలు
-పంట నష్టం, దివాళా, వ్యవసాయ సంబంధ సమస్యలు రైతు ఆత్మహత్యలకు ప్రధాన కారణాలని కేంద్ర వ్యవసాయ శాఖ సహాయమంత్రి పురుషోత్తం రాజ్యసభలో ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.
-కార్మికుల వేతనాలు అధికమవ్వడం, వాతావరణ దుష్పరిణామాలు, ఉత్పత్తి కారకాలు, ధరలు పెరిగిపోవడం వంటివి ఆత్మహత్యలకు కారణాలు.
వ్యవసాయ రుణం
-పేద రైతులు ప్రధానంగా రుణాల (బ్యాంకులు, బ్రోకర్లు, మొదలైనవారు)పై ఆధారపడి వ్యవసాయం చేస్తారు.
-తక్కువ సమయంలోనే రుణాలు చెల్లించాల్సి ఉండటంతో తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు.
-అధిక వడ్డీరేట్లు ఉండటం, మొదటి దఫా అప్పు చెల్లించకపోవడంతో రెండో దఫా నిరాకరించడం.
-రైతులకు ఇవ్వాల్సిన రుణాలను ఇతర రంగాలకు మళ్లించడం
-రైతులకు కొంత మొత్తంలోనే రుణాలిచ్చిన బ్యాంకు లు.. రుణమాఫీ క్రమశిక్షణా రాహిత్యం.. అది ఆర్థిక వ్యవస్థకు మంచిదికాదని చెప్పడం.
ఆర్థిక నిబంధనలు
-జీవన వ్యయం రోజురోజుకు పెరిగిపోతుండటంతో దాన్ని అందుకోలేని రైతు ఆత్మహత్యే శరణ్యం అనుకోవడం.
-రైతులకు వచ్చే అరకొర ఆదాయంతో కనీస అవసరాలు తీర్చుకోలేక, ప్రత్యామ్నాయ ఆదాయ వనరులు లభించక వ్యవసాయ వృత్తిలోనే కూరుకుపోవడంతో రైతు తీవ్ర మానసిక క్షోభతో ఆత్మహత్యకు పాల్పడుతున్నాడు.
సామాజిక కారణాలు
-రుణం అనేది సామాజికంగా రైతును కుంగదీస్తుంది. వారికి వచ్చే ఆదాయంతో ఇమడలేక, అప్పు తీర్చలేకపోతున్నాడు.
-కుటుంబ ఖర్చులు పెరగడం, కుటుంబం నుంచి సహకారం లేకపోవడం.
-కుటుంబ సభ్యులను సంతృప్తి పరచలేక నైతిక అంశంపై తీవ్ర గౌరవంతో ఈ సమాజం ఏం అనుకుంటుందో అనే ఉద్దేశంతో ఆత్మహత్యలకు పాల్పడుతున్నాడు.
మార్కెట్ కారణాలు
-రైతు పండించిన పంటకు ధరలు మార్కెట్లో ఉన్న వ్యక్తుల దయాదాక్షిణ్యాలపై ఆధారపడటం
-మద్దతు ధర లభించక, కనీసం పెట్టుబడి కూడా రాకపోడం, బ్రోకర్లు, మధ్యవర్తులు రైతులను హింసించడం వంటి మొదలైన అంశాలు వారిని తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి.
-భారత వ్యవసాయం రుతుపవనాలపై ఆధారపడటం, అవి సమయానికి రాకపోవడం, అదే సమయంలో సాగునీటి పారుదలపై ఆధారపడినా నీళ్లు అందకపోవడం
-వ్యవసాయం దాదాపు అవ్యవస్థీకృత రంగంలో ఉండటం వల్ల సరైన పథకాలు లబ్ధిదారులకు చేరకపోవడం
-ఇతర దేశాలతో పోలిస్తే మన దగ్గర ఉత్పాదకత చాలా తక్కువగా ఉండటం
-మార్కెట్లల్లో తీవ్ర అవినీతి చోటుచేసుకోవడం
పరిష్కారమార్గాలతో సుప్రీంలో అఫిడవిట్
-సుప్రీం ఆదేశాలకనుగుణంగా సర్వే ప్రారంభించిన కేంద్ర వ్యవసాయ శాఖ దాదాపు 13 రాష్ర్టాల్లో ఒకే రకమైన కారణాలు ఆత్మహత్యకు కారణమవుతున్నాయి.
-అవి పంటనష్టపోవడం, రుతుపవనాల్లో ఒడిదుడుకులు, కచ్చితమైన నీటి పారుదల సౌకర్యాల లేమి, క్రిమిసంహారక మందుల అశాస్త్రీయ వాడకం, తీరని రుణాలు, సామాజిక కారణాలు ఇవన్నీ రైతు ఆత్మహత్యలకు కారణాలుగా పేర్కొంది.
-పైవన్నీ అధిగమించి రైతు ఆత్మహత్యలు ఆపాలంటే అది రాష్ర్టాల పరిధిలోనే ఉందని స్పష్టం చేసింది.
-పంట బీమా, పంటల పునర్వ్యవస్థీకరణ, కనీస మద్దతు ధరలో ప్రభుత్వ జోక్యం, కనీస లాభం, సంక్షేమ సెల్స్ మొదలైనవి పటిష్టపర్చాలని పేర్కొంది.
రైతులపై జాతీయ కమిషన్ (ఎన్సీఎఫ్)
-రైతులపై సమగ్ర విధానానికి, రైతుల ఉన్నతి కోసం 2004లో ప్రొఫెసర్ ఎంఎస్. స్వామినాథన్ అధ్యక్షతన జాతీయ రైతు కమిషన్ ఏర్పాటు చేశారు. ఈ ఎన్సీఎఫ్ 2004 నుంచి 2006 మధ్యలో ఐదు ప్రధాన రిపోర్టులను సమర్పించి వేగవంతమైన సమ్మిళిత వృద్ధి కావాలని పేర్కొంది.
ఎంఎస్ స్వామినాథన్
-1960లో వచ్చిన హరిత విప్లవానికి ఆద్యుడు. వ్యవసాయ రంగంలో సంస్కరణలకు, పరిశోధనకు, భవిష్యత్తులో జరగాల్సిన అభివృద్ధి మార్గానికి దిక్సూచి. ఇతను తన పేరు మీద రిసెర్చ్ ఫౌండేషన్‌ను స్థాపించి వ్యవసాయ రంగ సంస్కరణలకు తీవ్ర కృషి చేస్తున్నారు.
స్వామినాథన్ కమిటీ సిఫారసులు
-ఆహారం, న్యూట్రిషన్ దాని భద్రత కోసం ఒక మధ్యంతర విధానం తేవాలి.
-దేశంలో ప్రధాన వ్యవసాయ వ్యవస్థల ఉత్పాదకత, లాభం, సుస్థిరతను అభివృద్ధి చేయాలి.
-గ్రామీణ రుణాలను పెంచడానికి విధానాలను రూపొందించాలి.
-డ్రైలాండ్ రైతులకు, సెమి-ఆరిడ్ రైతులకు ప్రత్యేక పథకాలను రూపొందించాలి.
-అంతర్జాతీయ మార్కెట్ పోటీకి అనుగుణంగా రైతులను ప్రోత్సహించాలి.
-భూ సంస్కరణలను అమలుపర్చాలి.
-రాష్ట్రస్థాయి రైతు కమిషన్ ఏర్పాటు
-సూక్ష్మరుణ వ్యవస్థను పునర్నిర్మించడం
-విలేజ్ నాలెడ్జ్ సెంటర్లను స్థాపించాలి.
-రైతు ఆత్మహత్యలను ముందస్తుగా గుర్తించడానికి అవగాహన చర్యలు చేపట్టాలి.
-సరైన విత్తనాలు, పంటబీమా, సామాజిక భద్రత, గిట్టుబాటు ధర మొదలైనవి వేగవంతంగా అభివృద్ధిపర్చాలి.
కనీస మద్దతు ధర అంటే?
-ఒక పంటకు ప్రభుత్వం ఇచ్చే కనీస ధర. ఈ ధరకంటే తక్కువ ధరకు పంట ధరను పడిపోనివ్వదు. దీన్ని కమిషన్ ఫర్ అగ్రికల్చర్ కాస్ట్స్ అండ్ ప్రైసెస్ నిర్ణయిస్తుంది.
-రబీ, ఖరీఫ్ పంటలకు వేర్వేరుగా కనీస మద్దతు ధర ఉంటుంది.
రైతు ఆత్మహత్యలు ఆగాలంటే..
-రైతులకు గిట్టుబాటు ధరను కల్పించాలి.
-రైతు హక్కులు కూడా మానవ హక్కులే అని, దానిపై ఒక సమగ్ర విధానాన్ని రూపొందించాలి.
-వ్యవస్థాగతా రుణాలు కల్పించాలి. రైతులకు సరైన శిక్షణ ఇచ్చి లాభాలు పొందేటట్టు చేయాలి.
-సామాజికంగా పౌరులు, మీడియా, ఇతర స్వచ్ఛంద సంస్థలు రైతు సమస్యలను తీవ్రమైన, ముఖ్యమైన అంశంగా పరిగణించి ఆత్మహత్య నివారణ అవగాహన కార్యక్రమాలు చేపట్టాలి.
-రైతు లేని రాజ్యం నిలువదు.. అందుకే రైతుని కాపాడుకుంటేనే రాజ్యం సస్యశ్యామలమవుతుంది. అందుకే రైతుల ఆత్మహత్యలను నిరోధించి, రైతుకు ముఖ్యమైన స్థానం ఇచ్చి కాపాడాలి.
-వ్యవసాయంలో మహిళలు అత్యధిక సంఖ్యలో ఉన్నారు. కాబట్టి వారి సంక్షేమానికి ప్రత్యేక పథకాలు రూపొందించాలి.
-రుణాలు, రుణ హామీలు, రుణ బదిలీలు, మాఫీలు అన్నింటికి చట్టబద్ధత కల్పించి ప్రభుత్వాలు, బ్యాంకులు జవాబుదారీగా వ్యవహరించాలి.
రైతు ఆత్మహత్యలపై సుప్రీంకోర్టు
-2017, మార్చి 28న గుజరాత్లో రైతు ఆత్మహత్యలపై దేశ అత్యున్నత న్యాయస్థానంలో సిటిజన్స్ రిసోర్స్ అండ్ యాక్షన్ అండ్ ఇనిషియేటివ్ అనే స్వచ్ఛంద సంస్థ వేసిన పిటిషన్‌పై తీర్పునిస్తూ కేంద్ర ప్రభుత్వంపై తీవ్రంగా మండిపడింది.
-రైతు ఆత్మహత్యల అంశం చాలా ప్రాధాన్యమైనది. ఇప్పటి వరకు మీరు రైతులు చనిపోయాక పరిహారం ఇచ్చి అదే పరిష్కారం అనుకుంటున్నారు. కానీ అది తప్పుడు దిశ. బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుని మళ్లీ వాటిని చెల్లించకలేక రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. వారిని కాపాడటానికి ఎలాంటి చర్యలు తీసుకుంటారో చెప్పాలని ఆదేశించింది.
-దశాబ్దాల తరబడి రైతులు చనిపోతున్నా ఆత్మహత్యల వెనుక అసలైన సమస్యను పరిష్కరించే చర్యలు లేకపోవడం ఆశ్చర్యం కలిగిస్తున్నదని సుప్రీంకోర్టు ఆవేదన వ్యక్తం చేసింది.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు