The trio that closed my eyes | కన్నులు మూసి నాదు మదిగన్న త్రికూటము
శరభాంక కవి
రెండో ప్రతాపరుద్రదేవ మహారాజు (1296-1323) కొలువులో శరభాంకుడు ఆస్థానకవిగా ఉన్నాడు. ఈ కాలాన్ని చరిత్రపరిశోధకులు శా.శ. (శాలివాహన శకం) 1205 నుంచి 1282-83 అవుతుందని పేర్కొన్నారు. అయితే ఈ కవి 1240లో జన్మించినట్లు తెలుస్తుంది.
శరభాంకుని తల్లిదండ్రులు పార్వతీదేవి, శివ లింగయ్య. వీరు కౌశిక గోత్ర వీరశైవులు. యశుశ్శాఖ వారు నాటి ఏకశిలా (నేటి వరంగల్) నగరానికి చెందినవారు. వీరశైవ ప్రతిష్టను, శైవ ధర్మాలను దశదిశలా వ్యాప్తిచేశారు. అత్తలూరి పాపయారాధ్య కవి కూడా ఈ వంశంలోనే జన్మించినట్లు తెలస్తుంది.
ఈయన వంశస్థులు కరీంనగర్ జిల్లాలోని వేములవాడ (భీమకవి జన్మస్థానం) మండలం, వరంగల్ జిల్లాలో ఇప్పటికీ ఉన్నారు. శరభాంకుని గురువు శ్రీరమనాథుడు. తాను రచించిన మొదటి పద్యంలో తన గురువును స్థుతిస్తూ..
ఉ॥ శ్రీరమనాథుమ్రొక్కి జయశిద్దుల సన్నుతిజేసి భానుచం
ద్రారుణ వహ్ని నేత్రునకు నంజలి జేసి తమిన్నుతించి స
త్కార మొనర్పనొక్క శతకంబు రచించెద చిత్తగింపు మీ
సారమనేక దివ్యముని సన్నుతయో శరభాంక లింగమా!!!
శరభాంకుడు అష్టసిద్దుల్లో ఆరితేరిన కవి. అంతేకాక వాటిని అప్పుడప్పుడూ ప్రయోగించి ప్రసిద్ధిగాంచాడు. వేములవాడ భీమకవిలా శివానుగ్రహమున ఆడినది ఆటగా పాడినది పాటగ అన్నట్లు చేయగలడు.
అసలు చరిత్ర
ఈయన కొంతకాలం రెండో ప్రతాపరుద్రుని వద్ద ఆస్థాన పండితునిగా, కవిగా మంత్రివర్గంలో ఉన్నాడు. కొంత కాలం తర్వాత వానప్రస్థాశ్రమాన్ని స్వీకరించి తపస్సు కోసం అరణ్యానికి వెళ్లాడు. కొన్నేండ్ల తర్వాత రాజు ఆస్థానంలో సామంత రాజులందరూ ఉండగా శరభాంకుని గూర్చిన ప్రస్తావన వచ్చింది. దీంతో వారంతా ఆయనను పరీక్షించాలనుకున్నారు. ఈ విషయాన్ని రాజుకు చెప్పడంతో ఆయన శరభాంకున్ని గురించి మాట్లాడుతూ.. నేను ఎంత చెప్పినప్పటికీ లెక్కచేయకుండా వానస్రస్థాశ్రమం స్వీకరించాడు. అలాంటి మహావ్యక్తి ఇకలేడు. నా ఆస్థాన మంత్రివర్గంలో ఎన్నో సుఖాలున్నప్పటికీ వాటిని త్యజించి అడవికి పోయాడు. అలాంటి మహావ్యక్తి మళ్లీ నా ఆస్థాన మంత్రివర్గంలోకి వస్తే కవి పండితునిగా చేర్చుకుంటాను అని చెప్పాడు.
కొంతకాలం తర్వాత శరభాంకున్ని పరీక్షించాలనుకున్న ప్రతాపరుద్రుడు.. సన్యాసాశ్రమాన్ని స్వీకరించి, శరభాంకుని తపస్సును భగ్నంచేసి నా ఆస్థానానికి తీసుకొచ్చినవారికి కొన్ని రూకల (ఘట్లు= ఆ కాలంనాటి రూపాయిలు) నాణేలు ఇస్తానని ప్రకటించాడు. ఇది తెలుసుకున్న ప్రతాపరుద్రుని భార్య విశాలాక్షి చెలికత్తెల్లో ఒకరైన చంద్రలేఖ రాజు వద్దకు వెళ్లి నేను ఎంతటి కఠిన తపస్వినైనా మోహింపజేసి సంతానాన్ని పొంది మళ్లీ రాజ దర్బారుకు శరభాంకునితో రాగలనని ప్రతిజ్ఞ చేసింది. దీంతో ఆమె శరభాంకుని వద్దకు పోవడానికి అన్ని ఏర్పాట్లు చేశాడు.
శరభాంకుడు తపస్సులో ఉండగా, చంద్రరేఖ నిరాశ నిస్పృహలతో చింతిస్తూ కాలం గడుపుతుంది. ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ ఫలితం లేకుండాపోయింది. చివరిగా ఆ కవి తీసుకునే ఆహారం రజోగుణ సంబంధమైనది ఉంటే దాంతో మోహం కలుగుతుందని, ఆహారంగా తీసుకునే ఆకులకు ఉప్పును రుద్ది తినిపించింది. ఇలా కొంతకాలం తర్వాత ఆయనను వశపరుచుకుంది. అలా ఇద్దరు పిల్లలతో రాజదర్బారుకు చేరుకున్నారు. ప్రతాపరుద్రుడు శరభాంకునికి పాదాభిషేకం చేశాడు.
నన్ను రప్పించడానికి కారణమేమిటని ఆ కవి ప్రతాపరుద్రుని అడిగాడు. దీనికి సమాధానమిస్తూ మీరు ఒక కన్యతో కాలం గడుపుతూ, ఇద్దరు మగ పిల్లలను కన్నారని ప్రజలు అనుకుంటున్నారు. అది ఎంతవరకు నిజమో తెలుసుకోవాలనుకున్నాని చెప్పాడు.
అప్పుడు శరభాంకుడు లేచి ఆ ఇద్దరు పిల్లలను పట్టుకొని గారడి మంత్రి.. బొందడయా శరభాంక లింగమా!! అనే పద్యాన్ని చదువుతూ వారిని ఆకాశంలోకి విసిరివేశాడు. దీంతో వారిద్దరు మాయమైపోయారు. దీనికి భయబ్రాంతులై శరభాంకుని పాదాలకు నమస్కరించిన రెండో ప్రతాపరుద్రుడు తన పొరపాటును క్షమించమని వేడుకొన్నాడు. సన్యాసాశ్రమాన్ని స్వీకరించిన నన్ను పరీక్షడం ధర్మమా అని పలికి, మళ్లీ అరణ్యానికి వెళ్లిపోయాడు.
ఇది జరిగిన రెండేండ్లలోనే (క్రీ.శ. 1323లో) రెండో ప్రతాపరుద్రుడు ఢిల్లీ రాజుకు బందీ అయ్యాడు. ఇది చూసిన శరభాంకుడు ఢిల్లీ పట్టణం మీద కోపంతో చాపముగా సహాయమును ఢిల్లీ మీద దెగబాపగదే శరభాంక లింగమా!! అనే పద్యాన్ని పూరించాడు. దీనికి బదులు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 10వ తరగతిలో వేరే పద్యం వేశారు.
ఆయన శరభాంక లింగ శతకమే కాకుండా దక్షయజ్ఞ వర్ణను కూడా సంస్కృత శ్లోకాల్లో పూర్తిచేశాడు. అలాగే శరభాంకుడు సన్యాసాశ్రమాన్ని స్వీకరించకముందే తన పేరుతోనే శరభాంక లింగమా!! అనే మకుటంతో శతకంలోని కొన్ని పద్యాలను, తన చివరిదశలో శతకాన్ని పూర్తి చేశాడు. శరభాంకుడు క్రీ.శ. 1326లో మరణించాడని పరిశోధకులు చెబుతున్నారు. రెండో ప్రతాపరుద్రుడు మరణించిన మూడేండ్లకు శరభాంకుడు సిద్ది పొందాడు.
అయితే మహాకవి ఆరుద్ర తన సమగ్ర ఆంధ్ర సాహిత్యం-3లో శరభాంక లింగ శతకంలోని ఐదు పద్యాలను, వేటూరి ప్రభాకర శాస్త్రి తన చాటు పద్యమణి మంజరి మొదటి భాగంలో ఉదహరించారని, వావిళ్ల వారు 1928లో నీతి శతక సంపుటంలో ఈ శతకాన్ని ప్రకటించారని పేర్కొన్నారు. (పుట నం. 51, 52). అయితే అందులో శరభాంకుడు ఏ శతాబ్దియో, ఏ రాజు ఆస్థానంలో ఉన్నాడో, ఆయన కథా జీవితాన్ని గురించి తెలపలేదు. మెదక్ జిల్లా సదాశివపేట గొరేగట్టు శరణప్ప ఇంట్లో దొరికిన ఈ పూర్తి శతకాన్ని, కవి జీవిత చరిత్రను 1998లో వ్యాసకర్త వెలుగులోకి తెచ్చారు.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?