Memory treasure in articles | కథనాల్లో జ్ఞాపక నిధి
తెలియని అంశాన్ని తెలిసిన వాటితో లింక్ చేసుకోవడం ద్వారా, ఎలాంటి విషయం అయినా సరే తేలికగా గుర్తుపెట్టుకోవచ్చని గత సంచికలో చూశాం. ఈ విధానంలోనే కొత్త విషయాలను తేలికగా, ఒక్కసారి చదివి గుర్తుంచుకోవచ్చు. ముందుగా భుగోళ శాస్త్రం (జాగ్రఫీ) అంశంతో ప్రారంభిద్దాం.
భారత దేశంలో మొత్తం 29 రాష్ర్టాలు ఉన్నాయి. ఇందులో మొత్తం 17 రాష్ర్టాలకు, వేరే దేశాలతో సరిహద్దు ఉంది. మొత్తం 7 దేశాలతో భారత్‌లోని వేరువేరు రాష్ర్టాలకు సరిహద్దులు ఉన్నాయి. దేశాలు ఏడు మాత్రమే కాబట్టి, వాటిని గుర్తుంచుకోవడం చాలా తేలిక, అయితే దేశాలతో సరిహద్దును కలిగి ఉన్న రాష్ర్టాలను గుర్తుంచుకోవడం మాత్రం చాలా కష్టం. చైనా, పాకిస్థాన్, ఆఫ్ఘనిస్థాన్ తదితర దేశాలతో సరిహద్దును కలిగి ఉన్న భారత రాష్ర్టాలను గుర్తుంచుకోవడం పెద్ద ఇబ్బంది కాదు. ఎందుకంటే, భారత పటాన్ని చూడటం ద్వారా అది తేలిక అవుతుంది. ఎటొచ్చి, భారతదేశానికి ఈశాన్యంలో ఉన్న మయన్మార్, నేపాల్, భూటాన్, బంగ్లాదేశ్ తదితర దేశాలతో సరిహద్దును కలిగిన భారత రాష్ర్టాలను గుర్తుంచుకోవాలంటే మాత్రం ఇబ్బందే. అయితే మెమరీ టెక్నిక్స్ ఉపయోగించి వాటిని తేలికగా నేర్చుకోవచ్చు. మనిషి తేలికగా ఎప్పుడు గుర్తుంచుకుంటాడో గత సంచికలో వివరించాం. మన మస్తిష్కంలో నిక్షిప్తమైన వాటితో లింక్ చేయాలి. ఆ లింక్ అనేది చిన్న కథల రూపంలో ఉంటే ఇంకా బాగా గుర్తుంటుంది. అలాగే మనం రూపొందించుకొనే కథ, ఇల్లాజికల్ ( అంటే సంభవించనిది)గా ఉంటే ఇంకా బాగా గుర్తుంటుంది
-నేపాల్ – సిక్కిం, ఉత్తరాఖండ్, పశ్చిమబెంగాల్, బీహార్, ఉత్తరప్రదేశ్
-భూటాన్ – అరుణాచల్‌ప్రదేశ్, అసోం, సిక్కిం, పశ్చిమబెంగాల్
-మయన్మార్- అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, మణిపూర్, మిజోరం
ఇక్కడ పేర్కొన్న దేశాలు, సరిహద్దులు నేర్చుకోవాలి. మామూలు పద్ధతిలో అయితే బట్టీ పడతాం. మెమరీ టెక్నిక్స్ ఉపయోగిచి మొదట నేర్చుకోవాలనుకున్న ప్రతీది మనకు తెలిసిన చిత్రం (ఇమేజ్)లా మార్చాలి. ఆ తర్వాత కథలను అల్లుతూ పోవాలి. ఈ టెక్నిక్ ఉపయోగించే ముందు ఒకసారి మామూలు పద్ధతిలో నేర్చుకొనేందుకు పై దేశాలు, సరిహద్దులు నేర్చుకొనేందుకు ప్రయత్నించండి. ఆ తర్వాత టెక్నిక్ తెలుసుకొని ప్రయత్నించండి. తేడా స్పష్టంగా తెలుస్తుంది.
తెలిసిన చిత్రాలుగా మార్చడం…
-నేపాల్ – దీనిని గూర్ఖాగా భావించాలి. ఎందుకంటే రాత్రి పూట పహారా కాచేది ఎక్కువగా గూర్ఖాలే కాబట్టి. వారు సాధారణంగా నేపాల్ నుంచి వస్తారు, ఇది అందరికి పరిచితమే కాబట్టి. దీనిని ఎంచుకున్నాం.
-భూటాన్ – బటన్ (అంటే స్విచ్‌లు వేసే బటన్)
-మయన్మార్ – తీన్మార్ సినిమా.
-సిక్కిం – కాంచన జంగ పర్వతం. ఇది ఈ రాష్ట్రంలో ఉంటుంది. అంటే పర్వతం, సిక్కింతో లింక్ చేశాం.
-ఉత్తరాఖండ్- గుడి (చార్ధామ్ యాత్రకు సంబంధించి చాలా మేరకు గుళ్లు ఈ రాష్ట్రంలో ఉన్నాయి. కాబట్టి, ఉత్తరాఖండ్‌ను గుడితో లింక్ చేశాం)
-పశ్చిమబెంగాల్ – మమతా బెనర్జీ, ప్రస్తుతం ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి.
-బీహార్ – లాలూ ప్రసాద్ యాదవ్. ఆ రాష్ట్ర ప్రముఖ నేత, సాధారణంగా బీహార్ అంటే గుర్తుకువచ్చే పేరు లాలూ ప్రసాద్ యాదవ్.
-ఉత్తర్ ప్రదేశ్- ములయాంసింగ్ యాదవ్. ఆ రాష్ట్ర నేత, ప్రస్తుత ముఖ్యమంత్రి తండ్రి.
-నేపాల్- ఒక గూర్ఖా మమత బెనర్జీకి అంగరక్షకుడిగా ఉన్నాడు. అతడు ములయాంసింగ్ యాదవ్‌కు అంగరక్షకుడిగా బదిలీ అయ్యాడు. వెళుతూ వెళుతూ కాంచనజంగ పర్వతాన్ని ఎక్కి మొత్తం పరిశీలించాడు. చుట్టూ అతడికి దేవాలయాలు కనిపించాయి. అలాగే కొండ మీద అతడికి లాలూ ప్రసాద్ యాదవ్ తారసపడ్డాడు. ఈ కథలో నేపాల్‌తో సరిహద్దులు కలిగిన భారత రాష్ర్టాలను నేర్చుకున్నాం.
కింది ప్రశ్నలకు జవాబులు చెప్పండి…
గూర్ఖా ఎవరి దగ్గర అంగరక్షకుడిగా ఉన్నాడు?
ఎవరి దగ్గరికి బదిలీ అయ్యాడు?
వెళుతూ వెళుతూ ఏ పర్వతాన్ని అధిరోహించాడు?
పర్వతంపై నుంచి అతడికి ఏం కనిపించాయి?
అక్కడ అతడికి ఎవరు తారసపడ్డారు?
మొదటి ప్రశ్న సమాధానం మమత బెనర్జీ (అంటే పశ్చిమబెంగాల్). రెండో ప్రశ్న సమాధానం ములయాంసింగ్ యాదవ్ (అంటే ఉత్తరప్రదేశ్). మూడో ప్రశ్నకు జవాబు కాంచన జంగ (సిక్కిం). నాలుగో ప్రశ్న జవాబు గుళ్లు (ఉత్తరాఖండ్). ఇక చివరి ప్రశ్నకు సమాధానం లాలూ ప్రసాద్ యాదవ్. అంటే బీహార్. ఇప్పుడు గూర్ఖాతో అనుసంధానం చేసినవన్ని నేపాల్‌తో సరిహద్దును కలిగి ఉన్నట్లు. ఇప్పుడు ప్రయత్నించండి. ఎంత తేలికగా వచ్చిందో, పైగా ఎంత కాలమైనా ఈ పద్ధతిలో అన్ని గుర్తుంటాయి.
మిగతా రెండు దేశాలకు, అలాగే ఆ దేశాలతో సరిహద్దును కలిగి ఉన్న భారత రాష్ర్టాలతో, చిన్నపాటి కథలను అల్లి తేలికగా నేర్చుకోండి.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?