రాచకొండ వెలమలు ఎలాంటి వారు?
రాచకొండ-దేవరకొండ వెలమలు (1324-1475)
-కాకతీయ సామ్రాజ్య పతనానంతరం నేటి నల్లగొండ, మహబూబ్నగర్ జిల్లాల్లో వెలసిన రాజ్యమే రేచర్ల వెలమ రాజ్యం. కాపయనాయుని మరణానంతరం తెలంగాణలోని ముసునూరు రాజ్యాన్ని ఆక్రమించి మొత్తం తెలంగాణకు పాలనాధిపతులయ్యారు. సుమారు 150 ఏండ్లు రాచకొండ, దేవరకొండలను రాజధానులుగా చేసుకుని నాటి ఆంధ్రదేశ రాజకీయాలను ప్రభావితం చేశారు. వీరినే వెలమలు లేదా పద్మనాయకులు అంటారు. రేచర్ల గోత్రస్తులైన వీరి పరిపాలనాకాలంలో నిత్యం యుద్ధాలు జరిగినప్పటికీ సమర్థవంతమైన పరిపాలన ఫలితంగా రాజ్యం ఆర్థిక, సామాజిక రంగాల్లో అభివృద్ధి చెందడమే కాకుండా, సాంస్కృతిక రంగంలో కూడా ముందంజ వేసింది. కళా, సారస్వత పోషణలో కాకతీయుల వారసులమని అనిపించుకున్నారు.
ఆధారాలు
-రేచర్ల వెలమ రాజుల చరిత్ర తెలుసుకోవడానికి అనేక ఆధారాలున్నాయి. వీరి పరిపాలనా కాలంలో వేయించిన శాసనాలు రాచకొండ, దేవరకొండ, భువనగిరి, ఐనవోలు, గార్ల, దేవులమ్మ నాగారం, బెల్లంకొండ, ఉమామహేశ్వరం, ఓరుగల్లు, సింహాచలం, శ్రీకూర్మం మొదలైన ప్రదేశాల్లో లభించాయి. అదేవిధంగా సాహిత్య రచనలైన సంగీత రత్నాకరం, రసార్ణవ సుధాకరం, మదన విలాస బాణం, భోగినీ దండకం, హరిశ్చంద్రోపాఖ్యానం, సింహాసన ద్వాత్రింశిక, వెలుగోటి వారి వంశావళి, చాటువులు, సురభి వంశచరిత్ర, పెరిస్టా వంటి విదేశీ రచనలు కూడా వీరి చరిత్రను గురించి తెలుపుతున్నాయి. అంతేగాకుండా సమకాలీన రాజవంశాలైన గజపతులు, రెడ్డి రాజులు, విజయనగర రాజుల శాసనాలు, సాహిత్యం మొదలైనవి కూడా రేచర్ల వెలమ రాజ్యం చరిత్రను తెలుసుకోవడానికి ఉపయోగపడుతున్నాయి.
రాజకీయ చరిత్రఆధారాలు
-రేచర్ల వెలమ రాజులు మొదట కాకతీయులకు సామంతులుగా పనిచేశారు. ఆనాటి రైతు బృందాల్లో ప్రబలమైన వెలమ కులానికి చెందిన బేతాళనాయుడు అనే వ్యక్తి రేచర్ల వంశస్థాపకుడు. బేతాళనాయుడు నిక్షిప్తనిధిని కనుక్కోవడంతో అతడి ఎదుగుదల ప్రారంభమైందని వెలుగోటి వారి వంశావళి చెబుతున్నది. ఇతని జన్మస్థలం నేటి నల్లగొండ జిల్లా మిర్యాలగూడెం ప్రాంతంలోని ఆమనగల్లు. ఆ కాలంలో రేచర్ల వెలమలు కాకతీయుల సామంతులుగా ఆమనగల్లు, పిల్లలమర్రిని పరిపాలించేవారు. క్రీ.శ. 1225-53 మధ్యకాలంలో కాకతీయ గణపతిదేవుడు ఆమనగల్ ప్రాంతానికి బేతాళనాయుడిని స్థానిక పాలకునిగా నియమించాడు. ఈ విధంగా రేచర్ల వెలమలు గణపతిదేవుని పాలనాకాలంలోనూ, ఆ తరువాత అతడి కుమార్తె రుద్రమదేవి పరిపాలనా కాలంలోనూ ప్రముఖ స్థానాలను ఆక్రమించారు. గణపతిదేవుని కాలం నుంచి ప్రతాపరుద్రుని వరకు కాకతీయుల పాలనా వ్యవహారాల్లో ప్రముఖ పాత్ర పొషించారు. ఢిల్లీ సుల్తానుల చేతిలో కాకతీయ వంశం అంతమయ్యాక స్వతంత్ర శక్తిగా ఎదిగి సమర్థవంతమైన పాలన అందించారు.
-బేతాళనాయునికి దామనాయుడు, ప్రసాదిత్య నాయుడు, రుద్రనాయుడు అనే ముగ్గురు కుమారులు ఉన్నారు. రేచర్ల వెలమ రాజులు లేదా పద్మనాయకుల చరిత్ర వీరితోనే ప్రారంభమైంది. వీరు కాకతీయుల కొలువులో సేనాధిపతులు. కాకతీయ రుద్రదేవుడు, గణపతిదేవుడి పరిపాలనా కాలంలో ప్రముఖ పాత్ర పోషించిన మల్యాల, రేచర్ల రెడ్డి నాయకులు రాజ్య నిర్వహణలో క్రియాశీలకంగా పాలుపంచుకోకుండా, ఆ సమయానికి కనుమరుగయ్యారు. ఈ ఖాళీని రేచర్ల వెలమ బేతాళనాయుని ముగ్గురు పుత్రులు పూరించారు.
-ఈ ముగ్గురిలో పెద్దవాడైన రుద్రుడు గణపతిదేవుని పరిపాలనా ప్రారంభ రోజుల్లో రాజ్య సిరిసంపదలను, వైభోగాన్ని తిరిగి స్థాపించడంలో ప్రధానపాత్ర నిర్వహించాడు. కాకతీయ రాజు రుద్రదేవుడు, అతడి సోదరుడు మహాదేవుడు యాదవ రాజులకు వ్యతిరేకంగా జరిగిన యుద్ధంలో మరణించిన తరువాత గణపతి దేవుడిని యాదవ రాజులు దేవగిరిలో బంధించారు. ఈ సమయంలో ఓరుగల్లుపై సర్దారులు తిరుగుబాటు చేసినా, రేచర్ల రుద్రుడు విశ్వాస పాత్రంగా విదేశీ దురాక్రమణదారులను పారదోలాడు. దేవగిరి కారాగారం నుంచి గణపతిదేవుడు విముక్తమయ్యే వరకు రాజ్యాన్ని పరిపాలించి ఆయన మెప్పు పొందాడు. కాకతీయ రాజ్యస్థాపన భారధౌరేయుడు అనే బిరుదు పొందాడు.
-బేతాళనాయుడి కుమారుల్లో రెండోవాడైన ప్రసాదిత్యుడు రుద్రమదేవి పరిపాలన ప్రారంభరోజుల్లో ఆమెపై కొంతమంది రాచకుటుంబ సభ్యులు తిరుగుబాటు చేయడంతో వాటిని అణిచి రాణి పక్షం వహించాడు. తన విశ్వసనీయతకు గుర్తుగా కాకతీయ రాజ్యస్థాపనా చార్య, రాయ పితామహంక అనే బిరుదులను రుద్రమదేవి నుంచి పొందాడు.
-రేచర్ల సోదరుల్లో మూడోవాడు దామనాయుడు. గణపతిదేవుడు తమ తండ్రి బేతాళనాయుడికి ఇచ్చిన ఆమనగల్లు వ్యవహారాలను చక్కదిద్దడంతో కాలం గడిపాడు. అతడు ఖడ్గనారాయణ, రాయగోయగహళ, భజబల భీమ, ప్రతిగండ భైరవ అనే బిరుదులు పొందినట్లు వెలుగోటివారి వంశావళి పేర్కొంటున్నది. దామనాయుని కుమారుడు వెన్నమ నాయుడు అల్లాఉద్దీన్ కాలంలో జరిగిన ముస్లిం దండయాత్రలను ఎదిరించడంలో ముఖ్యపాత్ర పోషించాడు. వెన్నమ నాయుడి కుమారుడు ఎరదాచనాయుడు కాకతీయ పాలకుడు ప్రతాపరుద్రుని కాలంలో సేనాధిపతి. ప్రతాపరుద్రుడు పాండ్యులపై దండయాత్ర చేసినప్పుడు ఎరదాచనాయుడు వీరోచితంగా పోరాడి కాకతీయ ప్రభువులపై తన విశ్వసనీయత చాటుకున్నాడు. అందుకు గుర్తింపుగా వంచ పాండ్యదళ విభాళ, కంచి కవాటా చూరకార, పాండ్య గజకేసరి అనే బిరుదులు పొందాడు. ఎరదాచనాయుడి పెద్ద కుమారుడైన మొదటి సింగమనాయుడు రేచర్ల వెలమ రాజ్య స్థాపకుడు.
మొదటి సింగమనాయుడు (1325-61)ఆధారాలు
-ఆమనగల్లును రాజధానిగా చేసుకుని రేచర్ల వెలమ రాజ్యాన్ని పరిపాలించాడు. తన తండ్రి ఎరదాచనాయుడితోపాటు ఇతడు కూడా కంచి దండయాత్రలో పాల్గొన్నాడు. తరువాత ప్రతాపరుద్రుని ఆజ్ఞపై 1320లో కంపిలి దండయాత్రలో పాల్గొన్నాడు. 1323లో కాకతీయులకు జునాఖాన్తో జరిగిన చివరి యుద్ధంలో కూడా పాల్గొన్నాడు.
-ఇతడు కృష్ణా, తుంగభద్ర అంతర్వేది, ఏలేశ్వరం మొదలైన ప్రాంతాలను జయించాడు. సోమ వంశ క్షత్రియుల ప్రాంతాలను జయించే క్రమంలో అతని బావమరిది చింతంపల్లి సింగమనాయుడు జల్లిపల్లి (ఖమ్మం సమీపంలో ఉన్న ప్రాంతం) కోటలో బందీగా చిక్కాడు.
-తన బావమరిదిని విడిపించుకోవడానికి రేచర్ల సింగమనాయుడు పెద్ద సైన్యంతో జల్లిపల్లి కోటను ముట్టడించాడు. దీంతో సోమ వంశస్థులు తంబళడియ్య అనే వ్యక్తిని మొదటి సింగమనాయుడి వద్దకు రాయబారిగా పంపారు.
-ఈ సమయంలో సింగమనాయుడిని తంబళడియ్య పొడిచి చంపాడు.
-అతడు మరణించే నాటికి కందూరు చోళులు పాలించిన ప్రాంతం మొత్తం రేచర్ల వెలమరాజ్య ఆధీనంలోకి వచ్చింది. రేచర్ల రాజ్యం స్థిరపడింది.
మొదటి అనపోతానాయుడు (1361-83)ఆధారాలు
-మొదటి సింగమనాయుడి మరణానంతరం అతని పెద్ద కుమారుడైన అనపోతానాయుడు సింహాసనం అధిష్టించాడు. తన సోదరుడు మాదానాయకుడి సహాయంతో జల్లిపల్లిపై దండెత్తి తన తండ్రి మరణానికి కారకులైన సోమవంశస్థులను, వారికి సహాయంగా వచ్చిన రెడ్డి నాయకులను హతమార్చి సోమకుల పరశురామ బిరుదు పొందాడు.
-ఈ దండయాత్ర తరువాత అనపోతానాయుడు రాచకొండను అభేద్యంగా చేయడానికి ఒక రాతికోటను, అనపోత సముద్రం అనే జలాశయాన్ని, బావులను నిర్మించి శత్రువుల దాడి నుంచి రక్షించుకునేందుకు దుర్భేద్యమైన దుర్గంగా మార్చినట్లు 1365లో రాచకొండలో వేయించిన మూడు శాసనాలు ధ్రువీకరిస్తున్నాయి.
-ఇతడు రాజధానిని ఆమనగల్లు నుంచి రాచకొండకు మార్చాడు. ఇతని కాలంలోనే రెడ్లకు, వెలమలకు సంఘర్షణ మొదలైంది.
-అనపోతా, మాదానాయుడులు రెడ్డి రాజ్యంపై దండెత్తి ధరణికోట వద్ద కొండవీటి అనవేమారెడ్డిని జయించి శ్రీశైల ప్రాంతాన్ని ఆక్రమించారని వెలిగోటి వారి వంశావళి చెబుతున్నది.
-అనపోతానాయుడు 1367-68 మధ్యకాలంలో ముసునూరి కాపయనాయుడిపై దండెత్తి.. ఓరుగల్లు సమీపంలో భీమవరం వద్ద జరిగిన యుద్ధంలో అతడిని హతమార్చి ఓరుగల్లును వశం చేసుకున్నాడు. దీన్నే భీమవరం యుద్ధం అంటారు.
-ఆ తరువాత అనపోతానాయుడు భువనగిరి, శనిగరం మొదలైన కోటలను ఆక్రమించి ఐనవోలు పుణ్యక్షేత్రాన్ని దర్శించి అక్కడ తన విజయాలకు చిహ్నంగా శాసనం వేయించాడు. ఈ సమయంలోనే అతడు ఆంధ్రదేశాధీశ్వర అనే బిరుదు పొందాడు.
-ఈ విజయాలతో రేచర్ల వెలమ రాజ్యం తెలంగాణలో ఉత్తరాన గోదావరి నుంచి దక్షిణాన శ్రీశైలం వరకు విస్తరించింది. తూర్పున కొండవీటి రాజ్యం, పశ్చిమాన బహమనీ రాజ్యం సరిహద్దులుగా మారాయి.
-ఇతని కాలంలో వెలమలు బహమనీ సుల్తానులతో మైత్రి వహించి తమ రాజ్య విస్తరణను కొనసాగించారు. క్రీ.శ. 1356, 58 ఏడాదుల్లో అనపోతానాయుడు కళింగపై దండెత్తినట్లు అతని సింహాచల శాసనం తెలుపుతున్నది.
-శ్రీపర్వతం పైకి యాత్రికులు తేలికగా వెళ్లేందుకు మెట్లు కట్టించాడని రసార్ణవ సుధాకరం తెలుపుతున్నది. ఈ విషయానికి మాదానాయుడు శ్రీశైల సమీపంలోని జాతర రేవు వద్ద వేయించిన శాసనంవల్ల సమర్థన లభిస్తుంది. తెలంగాణ నుంచి వచ్చే యాత్రికుల సౌకర్యార్థం ఆ మెట్లు కట్టించినట్లు కూడా ఆ శాసనం వెల్లడిస్తున్నది.
-అనపోతానాయుడు పరిపాలనా సౌలభ్యం కోసం రాజ్యపు ఆగ్నేయ సరిహద్దు దృష్ట్యా దేవరకొండ రాజ్యాన్ని స్థాపించి తన సోదరుడైన మొదటి మాదానాయుడిని రాజ్యపాలకుడిగా నియమించాడు.
-ఇలా వెలమ రాజ్యం రాచకొండ, దేవరకొండలుగా విభజింపబడింది. రాజధానులు వేరైనా వారి వంశీయులు ఐకమత్యంతో పరిపాలిస్తూ వెలమరాజ్య రక్షణకు పాటుపడ్డారు.
ప్రాక్టీస్ బిట్స్
1. వెలిగోటివారి వంశావళి ఎవరి చరిత్రకు ప్రధాన ఆధారం? (2)
1) శాతవాహనులు 2) వెలమరాజులు
3) ముదిగొండ చాళుక్యులు 4) కాకతీయులు
2. రేచర్ల వెలమ రాజులు మొదట ఎవరికి సామంతులుగా ఉన్నారు? (4)
1) శాతవాహనులు 2) కుతుబ్షాహీలు
3) ముదిగొండ చాళుక్యులు 4) కాకతీయులు
3. రేచర్ల వెలమ వంశస్థాపకుడు? (3)
1) అనపోతా నాయకుడు 2) మాదానాయకుడు 3) బేతాళనాయుడు 4) దామనాయుడు
4. రేచర్ల వెలమ రాజ్య స్థాపకుడు? (2)
1) బేతాళనాయుడు
2) మొదటి సింగమనాయుడు
3) ఎరదాచనాయుడు
4) దామనాయుడు
5. మొదటి సింగమనాయుడి రాజధాని? (1)
1) ఆమనగల్లు 2) దేకరకొండ
3) నల్లగొండ 4) పిల్లలమర్రి
6. ఆంధ్రదేశాధీశ్వర అనే బిరుదును పొందిన వెలమ రాజు? (3)
1) కాపయనాయుడు
2) మొదటి సింగమనాయుడు
3) అనపోతానాయుడు
4) బేతాళనాయుడు
7. దేవరకొండ రాజ్యాన్ని స్థాపించిన అనపోతానాయుడు, రాజ్యపాలకునిగా నియమించిన అతని సోదరుడు? (1)
1) మొదటి మాదానాయుడు
2) మొదటి అనపోతానాయుడు
3) బేతాళనాయుడు
4) మొదటి సింగమనాయుడు
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు