ఆత్మవిశ్వాసమే మొదటి ఆయుధం
సివిల్ సర్వీసెస్ కోసం జరిగే ఎంపిక ప్రక్రియలో అత్యంత కీలకమైన దశ ఇంటర్వ్యూ. 2021 నోటిఫికేషన్‌కు సంబంధించి మెయిన్స్ పరీక్షలో మెరుగైన మార్కులు సాధించిన అభ్యర్థులకు ఈనెల ఐదో తేదీ నుంచి ఇంటర్వ్యూలు ప్రారంభమయ్యాయి. మే 26 నాటికి ఈ ఇంటర్వ్యూల ప్రక్రియ ముగుస్తుంది. ఆ రోజు నుంచి మొదలుకొని మే 31 లోపు ఫలితాలు ఎప్పుడైనా వెల్లడయ్యే అవకాశం ఉంది.
సివిల్స్ పరీక్షలో భాగంగా ప్రిలిమ్స్, మెయిన్స్ పూర్తి చేసి ఇంటర్వ్యూ స్థాయి వరకు రావడమనేది అభ్యర్థి ప్రతిభని, పట్టుదలని, శ్రమించేతత్వాన్ని సూచిస్తుంది. అయితే ఇంటర్వ్యూలో కూడా రాణించి సర్వీస్ సాధించడం వారిని పూర్తి విజేతలుగా నిలబెడుతుంది. ఈ దశలో విజయం సాధించాలంటే అన్ని విషయాల్లోనూ జాగ్రత్తగా వ్యవహరించాలి.
ఇంటర్వ్యూకి వెళ్తున్న అభ్యర్థులు తమపై తాము పూర్తి విశ్వాసాన్ని కలిగి ఉండాలి. సానుకూల దృక్పథంతో బోర్డు ముందుకెళ్లాలి. ప్రతికూల ఆలోచనలకు దాదాపుగా తావు ఇవ్వకూడదు. కాస్త కఠినమైన స్వరంతోనో, ప్రశ్నలతోనో బోర్డు సభ్యులు వ్యవహరించినా ఆత్మవిశ్వాసాన్ని ప్రదర్శించగలగాలి. విజయానికి ఇది తొలి ఆయుధం.
వేషధారణ
వేషధారణ చాలా చక్కగా ఉండాలి. ఒంటికి నప్పే విధంగా అదే సందర్భంలో వ్యక్తిత్వాన్ని, భవిష్యత్ పరిపాలకులుగా ప్రతిబింబించేలా ఉండాలి. సాధారణ భాషలో చెప్పాలంటే ఫార్మల్గా కనిపించాలి.
అర్థవంతమైన చర్చ కోసం సిద్ధమవండి
ఇంటర్వ్యూని కఠినమైన పరీక్షలాగా భావించకండి. అది అర్థవంతమైన, మేధోపరమైన చర్చలా సాగాలి. దానికి సిద్ధమవండి. మిమ్మల్ని ఇంటర్వూ చేసే బోర్డు సభ్యులు కొన్నిసార్లు సాధారణ పరిభాషలో మాట్లాడినా మెరుగైన పద్ధతిలో సమాధానాలు ఇవ్వాలి. అభ్యర్థి తనకు అనువైన భాషలో ఇంటర్వ్యూలో సమాధానాలు ఇచ్చే అవకాశం ఉంది. కాబట్టి స్వేచ్ఛగా వ్యవహరించండి. ధైర్యంగా ఉండండి.
తొలి ప్రశ్న దాదాపు ఇచ్చిన సమాచారం నుంచే !
అభ్యర్థి యూపీఎస్సీ బోర్డుకు సమర్పించే డీటెయిల్డ్ అప్లికేషన్ ఫామ్‌లోని సమాచారం ఆధారంగానే ప్రాథమిక ప్రశ్నలు ఉండే అవకాశం ఉంది. ఉదాహరణకు అభ్యర్థి పేరు, పుట్టి పెరిగిన ప్రాంతం, వాటి నేపథ్యం, అభిరుచులు, విద్యా సంబంధమైన నేపథ్యం, ఒకవేళ ఉద్యోగం ఏదైనా చేసి ఉంటే అక్కడ చేపట్టిన ఉద్యోగ బాధ్యతలు ఆ సంస్థకు సంబంధించిన నేపథ్యం ఇలాంటి అంశాలన్నింటిపై అలవోకగా జవాబు ఇచ్చేలా సిద్ధం కావాలి. అయితే ఇలాంటి అంశాలపై సమాధానాలు సంక్షిప్తంగా ఉండాలి.
వివిధ అంశాలని వర్గీకరించుకోండి
ఇంటర్వ్యూ కోసం సన్నద్ధమయ్యేటప్పుడు వివిధ అంశాలపై అభ్యర్థి పరిజ్ఞానాన్ని పరీక్షిస్తుంటారు. కాబట్టి చదవాల్సిన జాబితా కొంచెం పెద్దదిగానే కనిపిస్తుంటుంది. వాటిని సరైన విధంగా వర్గీకరించుకుంటే కష్టమైన పని మాత్రం కాదు. ఉదాహరణకు ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ అంశాలుగా వర్గీకరణ. అలాగే రాజకీయ, ఆర్థిక, సామాజిక దృక్పథాల్లో వర్గీకరణ. ఇలా విభజించుకుని సిద్ధమవాలి. ఈ తరహా ప్రశ్నల్లో సాధారణంగా అభ్యర్థి అభిప్రాయాన్ని కూడా అడిగే అవకాశం ఉంది. అలాంటప్పుడు ఏ వామపక్ష భావజాలంతోనో లేదంటే సనాతనవాదిగానో వ్యవహరించకుండా మధ్యేమార్గంగా సమాధానాలు ఉండాలి. సొంత అభిప్రాయాలు రుద్దే విధంగా ప్రయత్నించకూడదు. ఏమాత్రం వాదనకు అసలు తావే ఉండకూడదు.
యూపీఎస్సీ ఇంటర్వ్యూలో వర్తమాన అంశాలకు ఎక్కువ ప్రాధాన్యం ఉంటుంది. కాబట్టి ఆయా పరిణామాలపై అభ్యర్థికి అవగాహన ఉండాలి. ఈ ఏడాదికి సంబంధించి కీలకమైన అంశాలు వాటి ద్వారా వ్యక్తమయ్యే ప్రశ్నలను ఒకసారి గమనిస్తే..
నాటో విస్తరణ
తూర్పు ఉక్రెయిన్‌లో నాటో విస్తరణ ప్రాముఖ్యం ఏంటి?
రష్యా, ఉక్రెయిన్ యుద్ధంలో నాటో పాత్ర ఏంటి?
సమకాలీన ప్రపంచంలో నాటో ఔచిత్యం ఉందా?
క్వాడ్కి నాటోకి ఏమైనా సారూప్యత ఉందా?
రష్యా, ఉక్రెయిన్ యుద్ధం
21వ శతాబ్దంలో యుద్ధాన్ని ఏవిధంగా చూస్తారు?
ఈ యుద్ధం విషయంలో భారత్ శైలి ఏంటి?
ఈ యుద్ధంపై మీ వ్యక్తిగత అభిప్రాయం ఏంటి?
యుద్ధానికి ఆహారం, చమురు ధరల పెరుగుదలకు కారణం ఏంటి?
ఉక్రెయిన్, రష్యాకు క్రిమియా ప్రాముఖ్యం ఏంటి?
బిమ్ స్టెక్ సమావేశం
బిమ్స్టెక్ ఎప్పుడు ఏర్పాటైంది? అందులో పార్టీ ఎవరు?
బిమ్స్టెక్ భారత్‌కు ఎందుకు ముఖ్యమైంది?
ఇటీవల జరిగిన సమావేశంలోని ముఖ్యమైన అంశాలు ఏంటి?
బిమ్స్టెక్కు సార్క్‌కు పోలిక, వ్యత్యాసాలు?
ఆసియాన్, యూరోపియన్ యూనియన్ నుంచి బిమ్స్టెక్ నేర్చుకోవాల్సింది ఏంటి?
శ్రీలంకలో ఆహార సంక్షోభం
శ్రీలంకలో ఆహార సంక్షోభానికి కారణం ఏంటి?
ఈ సంక్షోభానికి కొవిడ్‌కి ఏమైనా సంబంధం ఉందా?
శ్రీలంకకు భారత్ ఏవిధంగా సహాయపడగలదు ?
చైనా జోక్యం ఏవిధంగా ఉండబోతుంది?
భారత్ లో ఆహార భద్రత
ఒకప్పుడు ఆహార ధాన్యాలను దిగుమతి చేసుకున్న భారత్ ఇప్పుడు ఎగుమతిదారుగా ఎలా రూపాంతరం చెందింది?
సంక్షోభంలో ఉన్న అఫ్ఘాన్, జింబాబ్వేకు భారత్ ఆహార ధాన్యాలు ఎగుమతి చేయడంపై మీ అభిప్రాయం ఏంటి?
భారత్‌లో ప్రజా పంపిణీ వ్యవస్థ పనితీరు ఎలా ఉంది?
ఆజాదీకా అమృత్ మహోత్వవ్
ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ ప్రాముఖ్యం ఏంటి?
ఇప్పటివరకు వివిధ రంగాల్లో భారత్ సాధించిన ప్రగతి ఏంటి?
ఇంకా వెనుకబడిన రంగాలు ఏవి?
స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు
భారత్ గతంలో ఇతర దేశాలతో చేసుకున్న స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు ఏంటి? వాటి పనితీరు ఏంటి?
ప్రాంతీయ సమగ్ర ఆర్థిక భాగస్వామ్యం విషయంలో భారత్ విధానం ఏంటి? ఎందుకు అందులో భాగస్వామి కాలేదు?
స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలతో కలిగే ప్రయోజనం ఏంటి? వాటి ద్వారా ఆర్థిక ప్రగతి సాధ్యమా?
బ్రిటన్ ప్రధాని- భారత్ పర్యటన
భారత్ – బ్రిటన్ సంబంధాలు
పర్యటన ప్రాముఖ్యత
చర్చకు రాబోయే కీలకాంశాలు
శాంతి నెలకొల్పడంలో ఐక్యరాజ్యసమితి పాత్ర
ఇటీవల యుద్ధాన్ని ఎందుకు నిలువరించలేకపోయింది?
ఐక్యరాజ్యసమితి విఫలమైందని భావిస్తున్నారా?
ఐక్యరాజ్యసమితిలో ఎలాంటి సంస్కరణలు రావాలి?
అసోం-మేఘాలయ సరిహద్దు వివాదం
భారత్‌లో రాష్ర్టాల మధ్య సరిహద్దు వివాదాలకు కారణాలు ఏంటి?
వీటిని పరిష్కరించడానికి ఉన్న యంత్రాంగం గురించి వివరించండి?
ఇస్రో తలపెట్టిన గగన్ యాన్ ప్రాజెక్ట్ గురించి వివరించండి
భారత్ అంతర్జాతీయ సంబంధాలు ఏర్పర్చుకోవడంలో ఇస్రో ఎలా దోహదపడుతుంది?
ప్రాక్టీస్‌తో మేలు
ఒక్కో అంశంపై ఇలా ప్రశ్నలు మీరే రూపొందించుకుని కళ్ల ముందు ఇంటర్వ్యూ బోర్డును ఊహించుకోండి. ఆ ప్రశ్నలకు సమాధానం చెబుతున్నట్లుగా అద్దం ముందు నిలబడి ప్రాక్టీస్ చేయండి. దాని ద్వారా తెలియకుండానే జవాబు చెప్పే తీరు ఒక సాధారణ ప్రక్రియగా మారిపోతుంది. బోర్డు ముందుకెళ్లినప్పుడు వారిని ఎదుర్కోవడం కాస్త తేలిక చేస్తుంది. మెరుగైన ప్రతిభతో అంతిమంగా విజేతలుగా నిలబెడుతుంది.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు