గురిపెడితే.. గ్రూప్స్ ఈజీనే!
రాష్ట్ర ప్రభుత్వం భారీ సంఖ్యలో పోస్టుల భర్తీకి గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడంతో పాటు అర్హత వయస్సు పెంచింది. దీంతో చాలామంది నిరుద్యోగుల టార్గెట్ టీఎస్పీఎస్సీ నిర్వహించనున్న గ్రూప్స్ పరీక్షలే. గ్రూప్-1, గ్రూప్-2, గ్రూప్-3, గ్రూప్-4 ఉద్యోగాల కోసం పోటీపడేవారి సంఖ్య ఎక్కువగా ఉండనుంది. లక్ష్యాన్ని చేరుకునేందుకు అభ్యర్థులు ఎలా సన్నద్ధం కావాలి? ఏ అంశాలపై ఫోకస్ పెట్టాలి? మెటీరియల్ ఎలా సేకరించాలి? అన్నింటికి మించి ఎలాంటి ప్రణాళికతో ముందుకెళ్లాలన్న దానిపై స్పష్టత ముఖ్యం. ఈ అంశాలపై గ్రూప్స్ కోచింగ్ నిపుణులు, తెలంగాణ ఎక్సైజ్ శాఖలో సూపరింటెండెంట్‌గా విధులు నిర్వర్తిస్తున్న సీహెచ్ విజయ్ ఇస్తున్న సలహాలు, సూచనలు నిపుణ పాఠకుల కోసం..
ఒక్క గ్రూప్-1 ప్రిపరేషన్‌తో ఇతర పరీక్షలకూ సిద్ధమయినట్లే సమయాన్ని సద్వినియోగం చేసుకుని సక్సెస్ సాధించండి. నోటిఫికేషన్ కోసం చూడకుండా ప్రిపరేషన్ మొదలుపెట్టండి. ఉద్యోగార్థులకు గ్రూప్-1 ఆఫీసర్ విజయ్ సలహాలు, సూచనలు
యూపీఎస్సీ, టీఎస్పీఎస్సీ సారూప్యత
చాలామంది యూపీఎస్సీకి ప్రిపేరవుతుంటారు. వాళ్లు కూడా గ్రూప్-1 పరీక్ష రాయవచ్చు. రెండింటిలో ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ ఒకేలా ఉంటాయి. దాదాపు 50 నుంచి 60 శాతం వరకు సిలబస్ కూడా ఒకేలా ఉంటుంది. టీఎస్పీఎస్సీలో గ్రూప్-1లో దాదాపు 50 నుంచి 60 శాతం వరకు ప్రశ్నలు తెలంగాణ ఉద్యమం, తెలంగాణ చరిత్ర, జాగ్రఫీ, ఎకానమీ, కల్చర్, తెలంగాణ ఉద్యమ అంశాలపై చాలా క్షుణ్ణంగా ప్రశ్నలు ఉంటాయి. ఇవి బాగా ప్రిపేర్ కావాలి. యూపీఎస్సీకి ప్రిపేరయ్యే వారు తెలంగాణతో పాటు ఇతర విషయాలు ప్రిపేర్ కావాలి. యూపీఎస్సీ మెయిన్స్‌లో ఆప్షన్ ఉంటుంది. టీఎస్పీఎస్సీ మెయిన్స్‌లో ఆప్షన్ ఉండదు. అన్నీ జనరల్ స్టడీస్ పేపర్లే ఉంటాయి.
ప్యాట్రన్
గ్రూప్-1 మూడు దశల పరీక్ష. మొదటిది ప్రిలిమ్స్. రెండోది మెయిన్స్. మూడోది ఇంటర్వ్యూ. వయస్సు పెంచడం వల్ల చాలామంది ఈ పరీక్షకు అర్హత సాధించనున్నారు. జనరల్ కేటగిరీ 44, ఎక్స్ సర్వీస్‌మెన్ 47, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీలకు 49, దివ్యాంగులు 54 ఏండ్ల వరకు వయోపరిమితి పెంచిన విషయం తెలిసిందే. కాబట్టి సీనియర్స్ ఉన్నారని జూనియర్స్, ఫ్రెషర్స్ వస్తున్నారని సీనియర్స్ ఆలోచించకుండా చదువుపై ధ్యాస పెట్టాలి. ఏ విషయం గురించి ఆలోచించకుండా ఎంత కష్టపడితే అంత మంచిది.
ఐదు నెలలు సరైన సమయం
క్రమశిక్షణతో చదివితే నాలుగు నుంచి ఐదు నెలల ప్రిపరేషన్ తప్పనిసరి. ఈ ఐదు నెలల సమయాన్ని ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూలకు చాలా క్లియర్‌గా సిలబస్ పెట్టుకుని జాగ్రత్తగా చదవాలి. టైమ్‌టేబుల్ పెట్టుకొని ప్రతిరోజూ తప్పనిసరిగా పాటించాలి. ఉద్యోగం సాధించాలన్న కసి, పట్టుదలతోప్రిపరేషన్ మొదలుపెట్టాలి.
సరైన ఫ్యాకల్టీ
ఒకవేళ కోచింగ్ తీసుకోవాలనుకుంటే.. ఏ ఇన్స్టిట్యూట్లో చేరుతున్నాం, అక్కడ సరైన ఫ్యాకల్టీ ఉందా లేదా చూసుకోవాలి. అభ్యర్థులకు సరైన గైడెన్స్ ఇస్తున్నారా లేదా అని ఆరా తీయాలి. చాలామంది ఉద్యోగం సాధించాలన్న కోరికతో వెనుకా ముందు చూసుకోకుండా సరైన ఫ్యాకల్టీ, వసతులు లేని ఇన్స్టిట్యూట్లో చేరితే చదువుపై సరిగా కాన్సన్ట్రేట్ చేయలేం. దీనివల్ల సమయం, డబ్బులు వృథా అవడమే కాకుండా లక్ష్యం దెబ్బతింటుంది.
సిలబస్ దగ్గరగా ఉంటుంది
గ్రూప్-1, 2, 3, 4 పరీక్షల్లో సిలబస్ ఇంచుమించు చాలా దగ్గరగానే ఉంటుంది. నాలుగింటిలో ప్రతి దానిలో జనరల్‌స్టడీస్ పేపర్, తెలంగాణ హిస్టరీ, హిస్టరీ, ఎకానమీ ఉంటుంది. కాకపోతే ప్రశ్నల సరళి లోతైన విశ్లేషణ, మరింత లోతుగా అడిగే విధానంలో ఒక్కోదానికి ఒక్కోలా ఉంటుంది.
మొత్తంగా ప్రిపరేషన్ పద్ధతి కానీ, సిలబస్ కానీ చాలావరకు ఒకేరీతిన ఉండవచ్చు. కాబట్టి గ్రూప్-1కు ప్రిపేరవడం వల్ల మిగిలిన గ్రూప్స్ పరీక్షలు కూడా ఎంతో సులువవుతాయి.
మెటీరియల్
గ్రూప్-1 పరీక్షలో సాధారణ పరిజ్ఞానాన్ని, విజ్ఞానాన్ని ఎక్కువగా పరీక్షిస్తారు. కాబట్టి దీనికి ప్రత్యేకమైన పుస్తకాలు అంటూ ఏమీ ఉండవు. సెలెక్ట్ చేసే వారు కూడా అత్యద్భుతమైన నాలెడ్జ్ ఉన్నవాళ్లనే సెలెక్ట్ చేస్తారని ఏమీ ఉండదు.
రోజువారీ అంతర్జాతీయ, జాతీయ, రాష్ట్ర స్థాయిలో జరుగుతున్న అంశాలను గమనిస్తుండాలి. ఉదాహరణకు సైన్స్ అండ్ టెక్నాలజీలో ఎలాంటి ప్రశ్నలు వస్తాయంటే.. ఇటీవల కాలంలో బయోడిగ్రీడబుల్ టాయిలెట్స్ వచ్చాయి. అవి ఏ పరిజ్ఞానంతో పనిచేస్తాయి.
లేదంటే ఇస్రో ఇటీవల ఏ శాటిలైట్స్‌ను ప్రయోగించింది. వాటిని ఏ రాకెట్లో పంపింది. ఎక్కడి నుంచి ప్రయోగించింది. ఇలాంటి అంశాలపై ప్రశ్నలు వస్తాయి. కాబట్టి వాటి గురించి ప్రాథమికంగా తెలుసుకోవాలి. వాటి చరిత్రపై కొంత అవగాహన పెంచుకోవాలి. ఇందుకు వార్తాపత్రికలు, న్యూస్ చానెల్స్ చూడాలి. ఇస్రో శాటిలైట్ గురించి తెలుసుకోవాలంటే సైంటిస్ట్ తరహాలో తెలుసుకోవాల్సిన పనిలేదు.
శాటిలైట్ ఎప్పుడు? ఎలా? ఎక్కడ తయారు చేసి ప్రయోగించారు? దానివల్ల ఏ ప్రయోజనాలు ఉన్నాయి? అని తెలుసుకుంటే సరిపోతుంది. దాని సాంకేతిక అంశాలపై లోతుగా వెళ్లాల్సిన పనిలేదు. అంతేకాకుండా కొన్ని స్టాండర్డ్ తెలుగు అకాడమీ పుస్తకాలు, స్టేట్ సిలబస్‌లో చదివిన పుస్తకాలు ఉన్నాయి.
ఇవన్నీ బేసిక్స్‌ను దృఢంగా చేసుకోవడానికి ఉపయోగపడతాయి.
ప్రిపరేషన్ మొదలుపెట్టండి
గ్రూప్-1 నోటిఫికేషన్ కచ్చితంగా వెలువడుతుంది. వారంలో వస్తుందా? నెలలో వస్తుందా? అన్నది తరువాత విషయం. కాబట్టి నోటిఫికేషన్ గురించి చూడకుండా ఇప్పటినుంచే ప్రిపరేషన్ మొదలుపెట్టాలి. దీనివల్ల నోటిఫికేషన్ వెలువడే సమయానికి కొంత సిలబస్ కవర్ చేయడంతోపాటు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఎలాంటి గైడెన్స్ కావాలన్నా, ఏ సహాయం కావాలన్నా అన్ని విషయాల్లో సహకారం అందించేందుకు సిద్ధంగా ఉన్నాను. ఈ-మెయిల్: www.atharvacademy.com, 7569524064 నంబర్లో గాని సంప్రదించవచ్చు.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు