యూరప్‌లో ఆధునిక భావనల వ్యాప్తి ఎలా జరిగింది?
అచ్చుయంత్రం
-మధ్యయుగ యూరప్‌లో గ్రంథ ముద్రణ తోలు కాగితాల మీద జరిగేది. ఇందుకోసం ప్రత్యేకించి రాసే వారిని నియమించాల్సి వచ్చేది. అది చాలా ప్రయాస, కాలయాపనలతో కూడిన పని. ఒక ఉదాహరణ చెప్పాలంటే ఇటలీలో కాసిమోమెడిసె తన వ్యక్తిగత గ్రంథాలయంలో 200 గ్రంథాలను కూడబెట్టాలనుకున్నాడు. అందుకోసం 45 మంది లేఖకులను నియమించగా, వారు రెండేండ్లు శ్రమిస్తే ఆ పని పూర్తయింది. ఆ తర్వాత కాలంలో నార నుంచి, పత్తి నుంచి తయారయ్యే కాగితాలు డమాస్కస్, ఈజిప్టుల నుంచి 15వ శతాబ్ది నాటికి యూరప్ వారికి పరిచయమయ్యాయి. చైనా దేశస్థులు మొదట కాగితంపై అచ్చులతో ముద్రణను అభివృద్ధి చేశారు. 1455లో జర్మనీకి చెందిన జాన్గూటెన్బర్గ్ (మెయింజ్ నగరవాసి), జోహన్ఫస్ట్, పీటర్ స్కోఫర్ అనే అనుచరుల సహాయంతో మొదట కదిలే అచ్చు యంత్రాన్ని తయారుచేశాడు.
తర్వాత విలియం కాక్టన్ ఇంగ్లాండ్‌లో ముద్రణాలయాన్ని స్థాపించాడు. అచ్చు యంత్రాలపై జాన్గూటెన్బర్గ్ పాపపరిహార పత్రాలను, తర్వాత బైబిల్‌ను అచ్చువేయగా, మతాధికారులు, పండితులు హర్షామోదాలు ప్రకటించారు. చేతితో బైబిల్ ఒక నకలు ప్రతిరాసే సమయంలో అతడు 150 పుస్తకాలు ముద్రించాడు. ఈ కొత్త సాంకేతిక విజ్ఞానం పండిత ప్రపంచాన్ని మార్చేసింది. ముద్రణా యంత్రం గ్రంథ ప్రచురణను సులభతరం, నిర్దిష్టం చేసింది. చదువుకోవడానికి వీలైన, కుదురైన గుండ్రని అక్షరాలతో గ్రంథాలు లభ్యమయ్యాయి. ఎరాస్మస్ గ్రంథం ఒకే సంవత్సరంలో 24 వేల ప్రతులు అచ్చయింది. అలాగే తక్కువ రోజుల్లో ఎక్కువ గ్రంథాలు అచ్చయి పాఠకులకు అందుబాటులోకి వచ్చాయి. ఉపాధ్యాయులు ఇచ్చే నోట్స్ మీద మాత్రమే ఆధారపడే పరిస్థితి విద్యార్థులకు తప్పిపోయింది. ఈవిధంగా ముద్రిత పుస్తకాల కారణంగా పఠనా వ్యాపకం, రచనా వ్యాసంగం, ముద్రణా వ్యాపారంతో ప్రజల జ్ఞానాభివృద్ధి, వ్యక్తిత్వ సంస్కారం పెంపొందాయి.
మహిళల ఆకాంక్షలు
వ్యక్తిత్వం, పౌరసత్వం ఉన్న కొత్త భావనలు మహిళలను విస్మరించాయి. కులీన కుటుంబాల పురుషులు ప్రజా జీవనంలో ముఖ్యపాత్ర పోషించేవాళ్లు. తమ కుటుంబాల్లో వాళ్లే నిర్ణయాలు తీసుకొనేవాళ్లు. కుటుంబ వ్యాపారాల్లో, ప్రజా జీవనంలో తమకు వారసులుగా తమ కొడుకులకు చదువు చెప్పించేవాళ్లు. కొన్ని సందర్భాల్లో చిన్న కొడుకులను చర్చిలో చేర్పించేవాళ్లు. మహిళలు తెచ్చిన కట్నాన్ని కుటుంబ వ్యాపారంలో ఉపయోగించుకునేవాళ్లు. కానీ తమ భర్తలు ఆ వ్యాపారాలను ఎలా నడపాలనే దాంతో వాళ్లకు సంబంధం లేదు. వ్యాపార సంబంధాలను బలోపేతం చేసుకోవడానికి వివాహాలు తరుచూ ఉపయోగపడేవి. కూతుళ్ల పెండ్లికి చాలినంత కట్నం సమకూర్చలేకపోతే అవివాహితగా దేవుడికి అంకితమైన జీవనాన్ని గడపడానికి వారిని కొన్నిసార్లు కాన్వెంట్లకు పంపించేవాళ్లు. ప్రజా జీవనంలో మహిళల పాత్ర పరిమితంగా ఉండేది. గృహ సంరక్షకులుగానే వాళ్లను చూసేవాళ్లు. అయితే, వ్యాపార కుటుంబాల్లోని మహిళల పాత్ర కొంత తేడాగా ఉండేది. దుకాణాదారులకు దుకాణం నడపటంలో వాళ్ల భార్యల సహకారం ఉండేది. కుటుంబంలోని పురుషులు ఇతర పనుల మీద బయటకు వెళ్లినప్పుడు వ్యాపార, బ్యాంకర్ల కుటుంబాల్లో భార్యలు వ్యాపారాలను చూసుకునేవాళ్లు. ఒక వ్యాపారి చిన్న వయస్సులోనే చనిపోతే అతని భార్య ప్రజా జీవనంలో అతడి పాత్ర పోషించేది. కులీన వర్గాల కుటుంబాల పరిస్థితి ఇలా ఉండేది కాదు.
మానవతావాద విద్య ప్రాముఖ్యంపై కొంతమంది మహిళలు మేధోపరంగా ఎంతో సృజనాత్మకంగా, సున్నితత్వంతో ఉండేవాళ్లు. సాహిత్య అధ్యయనం వల్ల మహిళలకు ఎలాంటి లాభం, గౌరవం లభించకపోయినప్పటికీ ప్రతి ఒక్క మహిళ వీటిని తప్పనిసరిగా చదవాలి అని వెనిస్‌కి చెందిన కస్టాండ్ర ఫెడీల్ (1465-1558) రాసింది. మానవతావాద పండితుల లక్షణాలను అందుకొనే సామర్థ్యం మహిళలకు లేదన్న భావనను ప్రశ్నించిన మహిళల్లో ఆమె ఒకరు. గ్రీకు, లాటిన్ భాషల్లో ప్రావీణ్యతకు ఫెడీల్ ప్రఖ్యాతిగాంచింది. నడువా విశ్వవిద్యాలయంలో ఉపన్యాసాలు ఇవ్వమని ఆమెకు ఆహ్వానాలు వచ్చేవి. ఆ కాలంలో చదువుకున్న గౌరవాన్ని ఫెడీల్ రచనలు చాటాయి. స్వేచ్ఛ అంటే చాలా పరిమితమైన నిర్వచనాన్ని ఇచ్చి, స్త్రీల అభిప్రాయాల కంటే పురుషుల అభిప్రాయాలకు ప్రాధాన్యం ఇచ్చినందుకు గణతంత్రాన్ని విమర్శించిన వెనిస్ మహిళా రచయిత్రుల్లో ఆమె ఒకరు.
-మరొక చెప్పుకోదగ్గ మహిళ మాంచెసా ఆఫ్ మంటువాగా పిలిచే ఇసాబెల్లా డి ఎస్టె (1474-1539). భర్త లేని సమయంలో ఆమె దేశాన్ని పరిపాలించింది. చిన్న దేశమైనా మంటువాలోని సభ ప్రతిభకి ప్రఖ్యాతిగాంచింది. పురుషాధిపత్య ప్రపంచంలో తాము గుర్తింపు పొందాలంటే తమకు విద్య, ఆస్తి, ఆర్థిక శక్తి ఉండాలనే దృఢాభిప్రాయాన్ని మహిళల రచనలు వ్యక్తపర్చాయి.
క్రైస్తవ మతంలో సంస్కరణలు
-మధ్యయుగంలో ప్రజల మతపర, సాంస్కృతిక జీవితం మీద కాథలిక్ చర్చి ఆధిపత్యం వహించింది. క్రైస్తవులందరు తమ చర్చిలో సభ్యులుగా ఉండాలని, దానికి డబ్బులు ఇవ్వాలని, తన ఆదేశాలను పాటించాలని కాథలిక్ చర్చి చెప్పేది. రాజులు కూడా తమకు లోబడి ఉండి, తమ ఆదేశాలను పాటించాలని చర్చి ఆదేశించింది. ప్రజలకు తమ సొంత విధానంలో ఆచరించే స్వేచ్ఛ లేదు. క్రైస్తవులు ఏడు ముఖ్యమైన సంప్రదాయాలను పాటించాలని, వీటిని చర్చిలోని మతగురువు మాత్రమే నిర్వహిస్తారని చాటేవాళ్లు. ఇంకో మాటలో చెప్పాలంటే మతగురువు జోక్యం లేకుండా ఎవరూ మతజీవనం గడపడానికి లేదు. 15, 16వ శతాబ్ద ఆరంభంలో ఉత్తర యూరప్ విశ్వవిద్యాలయాల్లో పండితులు, చర్చి సభ్యులు మానవతావాద భావనలపై ఆకర్షితులయ్యారు. ఎరాస్మస్ వంటి మానవతావాదులు తమ మతంలోని పురాతన గ్రంథాల్లో రాసిన ప్రకారం క్రైస్తవులు మతాన్ని ఆచరించడాన్ని ప్రోత్సహించారు. ఒక సాదాసీదా మతానికి తర్వాత జోడించిన అనవసర సంప్రదాయాలన్నింటిని విడిచిపెట్టాలని ప్రజలను కోరారు.
మానవులు స్వేచ్ఛ, హేతుబద్ధ జీవులని సొంతంగా ఆలోచించగలరని వాళ్లు నమ్మేవాళ్లు. ఆ తర్వాత కాలంలో తాత్వికులు దూరంగా ఉన్న దేవుడు మనిషిని సృష్టించి ఇక్కడ, ఇప్పుడు ఆనందాన్ని అన్వేషిస్తూ స్వేచ్ఛగా జీవితాన్ని గడిపే స్వాతంత్య్రాన్ని ఇచ్చాడన్న భావనతో స్ఫూర్తి పొందారు. ఇంగ్లండ్‌లో థామస్ మూర్, హాలెండ్లోని ఎరాగ్మస్ వంటి క్రైస్తవ మానవతావాదులు చర్చి అత్యాశకు సంస్థగా మారిందని భావించసాగారు. ఈ మానవతావాదులు బైబిల్ని ప్రాంతీయ భాషలలోకి అనువదించి, పెద్ద సంఖ్యలో ముద్రించారు. ప్రజలు వీటిని చదివి చర్చి పేర్కొంటున్న అనేక అంశాలకు బైబిల్లో మూలాలు లేవని గ్రహిస్తారని వాళ్లు ఆశించారు. చర్చిపై మానవతావాదుల విమర్శకు సాధారణ ప్రజలు, రాజులలో సైతం మద్దతు లభించింది. మతం పేరుతో చర్చిచేసే వసూళ్లు సామాన్యులకు భారమయ్యాయి. అనేక దేశాలలో ప్రజలు తమ ఆదాయంలో 10 శాతం వరకు చర్చికి విరాళంగా ఇవ్వాల్సి వచ్చేది. అంతేకాకుండా వివిధ దేశాల రాజులు పోప్‌కి పెద్ద మొత్తంలో డబ్బులు చెల్లించాల్సి వచ్చేది. అంతేకాకుండా ప్రజల నుంచి డబ్బు వసూలు చేయడానికి పోప్లు కొత్త పద్ధతిని కనిపెట్టారు. ప్రజలు తాము చేసిన పాపభారం నుంచి విముక్తి పొందడానికి చర్చి అమ్మే పాపపరిహార పత్రాలను కొనుక్కుంటే సరిపోతుంది. అయితే, పెద్ద పెద్ద సామ్రాజ్యాలను నిర్మిస్తున్న కొత్త రాజులు కూడా బిషప్‌ల రాజకీయ జోక్యాన్ని, తమపై పోప్‌ల నియంత్రణని వ్యతిరేకించసాగారు.
మార్టిన్ లూథర్ (1483- 1546):
1483లో శాగ్జనీలోని ఎస్లిబిన్లో రైతు కుటుంబంలో పుట్టిన మార్టిన్ లూథర్ న్యాయశాస్ర్తాన్ని, క్రైస్తవ దివ్యశాస్ర్తాన్ని ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయంలో అభ్యసించాడు.
-1517లో ఇతను కాథలిక్ చర్చికి వ్యతిరేకంగా ఉద్యమాన్ని మొదలు పెట్టాడు. మొదటగా చర్చి అమ్మే పాప పరిహార పత్రాలను కొనడం ద్వారా మనుషులు తమ పాపాలను కడిగేసుకోవచ్చన్న భావనను వ్యతిరేకించసాగాడు.
-1511లో రోమ్ యాత్రకు లూథర్ వెళ్లాడు. అక్కడ కనిపించిన దృశ్యాలు కాథలిక్ చర్చిపై లూథర్ మనస్సును మార్చివేశాయి. పోప్ జీవిన విధానం అతడిని దిగ్భ్రాంతుణ్ని చేసింది. పోప్ చెప్పేదొకటి చేసేది మరొకటిగా కనిపించింది.
-పాపపరిహార పత్రాలు విక్రయించడాన్ని అసహ్యించుకున్న లూథర్ వీటి గురించి తన అభిప్రాయాలను లాటిన్ భాషలో 95 అంశాలు అనే శీర్షికతో రాసి విటెన్‌బర్గ్ చర్చి ద్వారానికి అంటించాడు. వాటి విషయమై ఎవరితోనైనా చర్చకు తాను సిద్ధమేనని ప్రకటించాడు.
-1520లో చర్చి నుంచి లూథర్ని పోప్ బహిష్కరించాడు. అయితే, జర్మనీకి చెందిన చాలా మంది యువజరాజులు లూథర్‌కి మద్దతు ఇవ్వడంతో అతడిపై చర్యలు తీసుకోలేకపోయారు.
-ఇతను నైట్జార్జి అనే పేరుతో అజ్ఞాతవాసం చేస్తూ బైబిల్‌ను జర్మన్ భాషలోకి అనువదించాడు.
-చర్చికి వ్యతిరేకంగా నిరసన (ప్రొటెస్ట్) తెలిపిన కారణంగా ఈ ఉద్యమాన్ని ప్రొటెస్టెంట్ సంస్కరణంగా పేర్కొన్నాడు.
హుల్డ్రిచ్ జ్వింగ్లి (1484- 1531)
-పోప్ అధికారాన్ని తిరిస్కరిస్తూ మత, నైతిక విషయాల్లో బైబిల్ మాత్రమే ఏకైక ప్రమాణమని ప్రకటించాడు.
-ఈయన తన వాదనను, బోధనను 67 అంశాల పట్టికగా జూరిచ్‌లో ప్రచురించాడు. అదే జ్వింగ్లీ మతానికి సిద్ధాంత మూలమైంది.
జాన్ కాల్విన్ (1509- 1564)
-ఇతను ఫ్రాన్స్‌లో జన్మించాడు. కాల్విన్ క్రైస్తవ సంస్థలు అనే గ్రంథంలో తన భావాలను పొందుపర్చాడు.
-ఇతను క్రైస్తవుడు, ప్రొటెస్టెంట్ పోప్ అని పేరు పొందాడు.
-విస్తృతంగా ప్రచారం పొందిన కాల్వినిజాన్ని యూరప్‌లో సంస్కరించిన మతం అని, ఇంగ్లండ్, స్కాట్లాండ్లలో ప్రెస్బెటేరియానిజమ్స్ అని పిలిచారు. ఫ్రాన్స్‌లో కాల్వినిస్టులను హ్యుజినాట్స్ అని వ్యవహరించారు.
-జర్మనీలో ఆనాబాప్టిస్ట్ల వంటి ఇతర సంస్కరణ ఉద్యమాలు మరింత తీవ్రవాద స్వరాన్ని కలిగి ఉండేవి. మనుషులందరినీ దేవుడు సమానులుగా సృష్టించారని వాళ్లు వాదించారు. కాబట్టి ప్రజలకు పన్ను కట్టాల్సిన పని లేదు. తమ మత గురువులను ఎంచుకునే స్వేచ్ఛ ప్రజలకు ఉండాలని వాళ్లు ప్రచారం చేశారు. ఆ కాలం నాటి పాలకులకు ఈ భావన నచ్చకపోవడంతో అనాబాప్టిస్ట్లను క్రూరంగా అణచివేశారు. రోమన్ చక్రవర్తి అయిన చార్లెస్- V 30 వేలకు పైగా అనాబాప్టిస్ట్లను సజీవంగా దహన చేశాడు.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు