Telangana movement | తెలంగాణ ఉద్యమహోరు డిసెంబర్ 9 ప్రకటన
రాష్ట్ర ఏర్పాటుకోసం అలుపెరుగని పోరాటం చేసిన తెలంగాణ ప్రజలు టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వ మెడలు వంచిన అద్భుత సందర్భం డిసెంబర్ 9 ప్రకటన. తాను సచ్చుడో.. తెలంగాణ వచ్చుడో అంటూ అకుంఠిత దీక్షతో కేసీఆర్ చేపట్టిన ఆమరణ దీక్ష యావత్ భారతదేశాన్ని కదిలించింది. తమ ఉద్యమ నాయకుడి ఆరోగ్యం క్షీణిస్తున్నదన్న ఆందోళనతో తెలంగాణలోని ప్రతిఒక్కరూ రోడ్లెక్కి ఆందోళనకు దిగటంతో యూపీఏ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది. ప్రపంచ శాంతియుత ఉద్యమ చరిత్రలో ఇదో అద్భుత ఘట్టం..
కేసీఆర్ దీక్ష అనంతరం తెలంగాణ ఉద్యమం మహోగ్రరూపం దాల్చింది. అయినా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో ఎలాంటి మార్పు రాలేదు. పైగా తెలంగాణ ఉద్యమకారులు, విద్యార్థులపై నిర్బంధ కేసులు పెరిగిపోయాయి. ఇదిలాఉండగా కేసీఆర్ ఆరోగ్యం కూడా క్షీణించింది. ఈ పరిణామాల నేపథ్యంలో టీఆర్ఎస్ పొలిట్‌బ్యూరో సమావేశం జరిగింది. ఈ సమావేశంలో తాజా పరిణామాలు, ఉద్యమ కార్యాచరణ గురించి విస్తృత స్థాయి చర్చ జరిగింది. ప్రభుత్వంపై మరింతగా ఒత్తిడి తీసుకురావాలని, కలిసివచ్చే పార్టీలను కలుపుకొని, ఉద్యమంలో కలిసిరాని పార్టీలపై ఒత్తిడి పెంచాలని టీఆర్ఎస్ పొలిట్‌బ్యూరో నిర్ణయించింది. పెద్ద ఎత్తున ఉద్యమం జరుగుతున్నా మౌనంగా ఉన్న కాంగ్రెస్ ప్రజాప్రతినిధులపై, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై మరింత ఒత్తిడి తీసుకురావడానికి 48 గంటల బంద్ పాటించాలని నిర్ణయం తీసుకుంది. బీజేపీ, న్యూడెమోక్రసీ, సీపీఐ బంద్‌కు మద్దతిచ్చాయి. బంద్ విజయవంతమైంది. తెలంగాణ పూర్తిగా స్తంభించింది. ప్రభుత్వం ఎన్ని కుట్రలు, కుతంత్రాలు పన్నినా బంద్‌లో ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విషయంలో కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ ప్రజలు స్వయంగా తెలంగాణ రాష్ర్టాన్ని ప్రకటించుకున్నారు. తెలంగాణవ్యాప్తంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ బోర్డులను తెలంగాణ బోర్డులుగా మార్చారు. తెలంగాణ రాష్ట్ర సరిహద్దులను సైతం నిర్ణయించి సరిహద్దు గ్రామాల్లో తెలంగాణ రాష్ర్టానికి స్వాగత బోర్డులను ఏర్పాటుచేశారు.
ఆంధ్ర పదాలను తొలగించి తెలంగాణ పదాలను రాయడం ఒక మహోద్యమంగా కొనసాగింది. సబ్బండ వర్గాలు, ఉద్యోగులు, విద్యార్థులు ఉద్యమంలో పాల్గొనడం మూలంగా ప్రభుత్వ పాలన పూర్తిగా స్తంభించిపోయింది. ఈ సమయంలో పరిస్థితిని అంచనా వేసిన సీఎం 2009 డిసెంబర్ 6న అత్యవసరంగా క్యాబినెట్ సమావేశం నిర్వహించారు. ఉద్యమానికి ప్రధాన కారణమైన 14ఎఫ్‌ను తొలగిస్తున్నట్లు మంత్రివర్గం తీర్మానం చేసింది. కేసీఆర్‌పై పెట్టిన కేసులు కూడా ఎత్తేస్తున్నట్లు ప్రకటించింది. మంత్రివర్గం 14ఎఫ్‌ను తొలగిస్తూ చేసిన తీర్మానం కుట్రపూరితంగా ఉందని తెరాస స్పష్టం చేసింది. 14ఎఫ్‌ను తొలగించే అధికారం కేంద్రం పరిధిలో ఉంది. అది రాజ్యాంగ సవరణ ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. అందువల్ల రాష్ట్ర క్యాబినెట్ తీర్మానంవల్ల కాని, రాష్ట్ర అసెంబ్లీ తీర్మానంవల్ల కాని సాధ్యం కాదు. పైగా కేసీఆర్‌పై నమోదైన కేసులు తొలగించి విద్యార్థులపై కేసులు తొలగించకపోవడంలో కూడా కుట్ర దాగి ఉందని టీఆర్ఎస్ స్పష్టం చేసింది.
మరోవైపు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ 2009 డిసెంబర్ 10న నిర్వహించ తలపెట్టిన చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి విద్యార్థి జేఏసీ పకడ్బందీగా పక్కా ప్రణాళికతో ఏర్పాట్లు ముమ్మరం చేసింది. ఎలాగైనా చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని ఆపాలని ప్రభుత్వం సంకల్పించింది. డిసెంబర్ 6న పారామిలిటరీ బలగాలు, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్, సీఆర్పీఎఫ్, బీఎస్ఎఫ్ లాంటి బలగాలతో వేలాదిమందిని ఓయూ క్యాంపస్‌లో మోహరించింది. ఓయూలో ఉన్నదారులన్నింటిని ముళ్లకంచెలు, బారీకేడ్లతో మూసివేసింది.
2009 డిసెంబర్ 7న తెల్లవారుజామున పోలీసులు ఉస్మానియా విశ్వవిద్యాలయం విద్యార్థుల దీక్షా శిబిరాన్ని తొలగించారు. అడ్డుపడిన విద్యార్థులను చితకబాదారు. ఆర్ట్స్ కాలేజీ దీక్షా శిబిరం వద్దకు వస్తున్న విద్యార్థులను సాయుధ పోలీస్ బలగాలు చితకబాదాయి. పరుగెడుతున్న విద్యార్థులను వెంటపడి లాఠీలతో దాడి చేశారు. పోలీసుల దెబ్బలు భరించలేక గదుల్లో తలదాచుకున్న విద్యార్థులను సైతం వదల్లేదు. ఓయూలోని హాస్టల్స్ చుట్టూ విద్యార్థులు బయటకు రాకుండా ముళ్లకంచెలు వేశారు. విద్యార్థుల గుంపులను చెదరగొట్టడానికి బాష్పవాయువు గోళాలు, రబ్బరు బుల్లెట్లు ప్రయోగించారు. వందల మంది విద్యార్థులకు తీవ్రగాయాలయ్యాయి. చాలామంది స్పృహతప్పారు. ఆస్పత్రికి తీసుకెళ్లే అవకాశం కూడా కల్పించలేదు. ఓయూ క్యాంపస్ మొత్తం కర్ఫ్యూను తలదన్నేవిధంగా భయంకరంగా మారింది. లేడీస్ హాస్టల్స్ నుంచి అమ్మాయిలు దీక్షా శిబిరంవైపు వెళ్తుండగా, అమ్మాయిలు అని చూడకుండా పోలీసులు దాడులు చేశారు. కొందరిని జడలు పట్టి రోడ్లపై ఈడ్చుకెళ్లారు. పోలీసుల లాఠీదెబ్బలు భరించలేక క్యాంపస్‌కు దగ్గరలోని మణికేశ్వరనగర్ (వడ్డెర బస్తీ)లో కొంతమంది తలదాచుకున్నారు.
ఈ విషయం తెలిసిన పోలీసు బలగాలు విచ్చలవిడిగా బస్తీపై దాడులు చేసి విధ్వంసం సృష్టించారు. లాఠీ దెబ్బలు భరించలేక కాళ్లపైపడ్డా కనికరం చూపించలేదు. ఓయూలో జరుగుతున్న పరిణామాలు తెలిసి క్యాంపస్‌కు చేరుకున్న టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హరీశ్‌రావు, రాజేందర్‌ను యూనివర్సిటీలోకి అనుమతించలేదు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హోంమంత్రికి ఫిర్యాదు చేయగా, వారిని అడ్డుకోవద్దని చెప్పినా అనుమతించకుండా అరెస్ట్ చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఓయూ ప్రొఫెసర్ ఎమ్మెల్సీ నాగేశ్వర్రావు, కొండా లక్ష్మణ్ బాపూజీ, బీజేపీ ఎమ్మెల్యేలు కిషన్‌రెడ్డి, యెండల లక్ష్మీనారాయణలను కూడా అరెస్ట్ చేశారు. అసెంబ్లీలో బీఏసీ సమావేశం కొనసాగుతుండగా, అక్కడ విధుల్లో ఉన్న జర్నలిస్టులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ మెరుపు ధర్నా చేశారు.
వెంటనే హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి వారితో చర్చలు జరిపి అనంతరం తన శాఖలో తనకు తెలియకుండానే నిర్ణయాలు జరుగుతున్నాయంటూ పదవికి రాజీనామా చేయడానికి సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో తోటి మంత్రులు, ముఖ్యమంత్రి సముదాయించారు. ఓయూ ఘటనకు డీసీపీ రవీంద్రను బాధ్యుడిని చేస్తూ ఆయన్ను శాంతిభద్రతల విధుల నుంచి తొలగిస్తున్నట్లు హోంమంత్రి ప్రకటించారు. అయితే తెలంగాణ ఉద్యమాన్ని ఎదుర్కొలేక సీమాంధ్ర శక్తులు ఉద్యమంలో నక్సలైట్లు ఉన్నారని విస్తృత ప్రచారం చేశాయి. ఆ అసత్య ప్రచారాన్ని తిప్పికొట్టడానికి తెలంగాణ ఎంపీలు అప్పటి జాతీయ భద్రతా సలహాదారులు ఎంకె.నారాయణను కలిసి ఇది నక్సలైట్ల ఉద్యమం కాదని, ఉద్యమ తీవ్రత గురించి వివరించారు. తెలంగాణ ప్రాంతంలో పార్టీలకతీతంగా వందలస్థాయిలో జడ్పీటీసీలు, వేలాది సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, వార్డ్మెంబర్లు తమ పదవులకు రాజీనామాలు చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుచేయాలని డిమాండ్ చేశారు. సొంత పార్టీ కార్యకర్తలు సైతం అధికార ప్రతిపక్ష పార్టీలకు చెందిన ప్రజాప్రతినిధులను రాజీనామాలు చేయాలని ఒత్తిడి చేశారు.
హోంమంత్రి ప్రకటన-కేసీఆర్ దీక్ష విరమణ
తెలంగాణ ప్రాంతంలో మునుపెన్నడు లేని ఉత్కంఠభరితమైన క్షణాలు డిసెంబర్ 9 నాటికి ఏర్పడ్డాయి. ఒకవేళ కేసీఆర్‌కు జరగరానిది ఏమైనా జరిగితే తెలంగాణ ప్రాంతంలో అరాచకం సంభవిస్తుందనే భయాందోళనలు మొదలయ్యాయి. తెలంగాణ రాష్ర్టాన్ని ఏర్పాటు చేయాలంటూ కాంగ్రెస్ పార్టీపై అసెంబ్లీ, పార్లమెంట్ లోపల, బయట ముప్పేట దాడి జరిగింది. అన్ని వైపుల నుంచి వస్తున్న ఒత్తిడిని కాంగ్రెస్ తట్టుకోలేకపోయింది. ఇక యూపీఏ ప్రభుత్వానికి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తప్ప మరో గత్యంతరం లేకపోయింది. కాబట్టి సాయంత్రం ప్రధాని కార్యాలయంలో కాంగ్రెస్ కోర్ కమిటీ సమావేశమై తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై సుదీర్ఘ చర్చ జరిపింది. సాయంత్రం 7 గంటలకు మరోసారి కోర్ కమిటీ చర్చించింది. మూడోసారి కోర్ కమిటీ సమావేశం సోనియా నివాసంలో జరిగింది. నాలుగోసారి కోర్ కమిటీ మీటింగ్ 7 రేస్ కోర్సులోని ప్రధాని నివాసంలో జరిగింది. చివరికి అనేక తర్జనభర్జనల అనంతరం కేంద్ర హోంమంత్రి చిదంబరం తన నివాసం న్యూఢిల్లీ సౌత్ బ్లాక్లోంచి 2009 డిసెంబర్ 9 రాత్రి 11.30 గంటలకు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు.
తెలంగాణ ఏర్పాటుపై పార్లమెంట్లో వాడీవేడి చర్చ
2009 డిసెంబర్ 9న కేసీఆర్ ఆరోగ్యంపై పార్లమెంట్లో విస్తృతస్థాయి చర్చ జరిగింది. పార్లమెంట్లో వివిధ పక్షాలు కేసీఆర్ ఆరోగ్యం క్షీణిస్తున్నందున కేంద్ర ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకోవాలని కోరారు. లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు ఎల్కే అద్వానీ మాట్లాడుతూ తెలంగాణ రావడం ఎంత ముఖ్యమో తెరాస అధినేత ప్రాణాలు కూడా అంతే ముఖ్యం దీనిపై ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకోవాలి అన్నారు. కేసీఆర్ దీక్ష ప్రారంభించి పది రోజులవుతున్నా సర్కార్ నిమ్మకు నీరెత్తినట్లు ఉండటం శోచనీయం అని శరద్‌యాదవ్ (జేడీయూ) అన్నారు. తెలంగాణకు మేం మద్దతు ప్రకటిస్తున్నాం, అఖిలపక్ష సమావేశం ఏర్పాటుచేసి ఈ అంశంపై వెంటనే దృష్టి సారించాలి అని సీపీఐ సీనియర్ నాయకుడు గురుదాస్ దాస్‌గుప్తా కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. చర్చల ద్వారా ఈ సమస్యకు పరిష్కారం కనుగొనాలని ములాయంసింగ్ యాదవ్ కోరారు. ఇలా పార్లమెంట్లో అన్ని పార్టీలు తమ తమ అభిప్రాయాలను తెల్పిన తర్వాత తెలంగాణ ప్రకటన చేయాలని బీజేపీ సభ్యులు పట్టుబట్టారు.
చిదంబరం ప్రకటన
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ప్రారంభిస్తాం. అందుకు తగిన విధంగా రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెడతారు. నవంబర్ 29 తర్వాత ఈ ఆందోళనలో పాలుపంచుకున్న నాయకులు, విద్యార్థులు, ఇతరులపై నమోదైన కేసులన్నీ ఉపసంహరించుకోవాలని ఏపీ సీఎంకి కేంద్రం విజ్ఞప్తి చేసింది. అందుకనుగుణంగా చర్యలు తీసుకుంటామని సీఎం మాకు చెప్పారు. కేసీఆర్ ఆరోగ్యం పట్ల ఆందోళనగా ఉన్నాం. ఆయన తక్షణం నిరాహార దీక్ష విరమించాలి. విద్యార్థులంతా తమ ఆందోళనలను విరమించుకొని సాధారణ పరిస్థితులు ఏర్పడటానికి సహకరించాలి. ఈవిధంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్ర హోంమంత్రి అధికారికంగా భారత ప్రభుత్వం తరపున స్పష్టమైన ప్రకటన చేశారు. దీంతో 11 రోజులుగా కొనసాగించిన తన ఆమరణ నిరాహార దీక్షను కేసీఆర్ విరమించారు. ఆచార్య జయశంకర్, తెలంగాణవాదులు నిమ్మరసం ఇచ్చి హర్షధ్వానాల మధ్య దీక్ష విరమింపజేశారు.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు