శాస్త్రవేత్తల గురించి తెలుసుకుందాం..!
మానవజాతి ఆవిర్భావం నుంచి విజ్ఞానశాస్త్ర అధ్యయనం జరుగుతూనే ఉంది. అరిస్టాటిల్ మొదలు ఎంతో మంది స్వదేశీ, విదేశీ శాస్త్రవేత్తలు ఎప్పటికప్పుడు నూతన ఆవిష్కరణలతో మానవాళి శ్రేయస్సుకు తోడ్పడ్డారు. టీఆర్టీ బయాలజీ సిలబస్‌లో శాస్త్రవేత్తలకు సంబంధించిన టాపిక్ కూడా ఉన్నందున.. కొందరు ప్రముఖ విదేశీ శాస్త్రవేత్తలు, వారి ఆవిష్కరణలకు సంబంధించిన సమాచారం నిపుణ పాఠకుల కోసం…
చార్లెస్ డార్విన్
-డార్విన్ పరిణామ సిద్ధాంత రూపకర్త. 1809, ఫిబ్రవరి 12న ఇంగ్లండ్‌లో జన్మించారు. కేంబ్రిడ్జిలో థియాలజీ కోర్సు పూర్తిచేశారు. చదువులో అంత గా రాణించని డార్విన్.. ప్రకృతిని పరిశీలించడంపై ఎక్కువ ఆసక్తి చూపేవారు.
-ప్రకృతి ప్రేమికుడిగా బీగిల్ అనే ఓడమీద 1831 నుంచి 1836 వరకు అనేక దేశాలు ప్రయాణించారు. ఆ సమయంలో ఎన్నో రకాల మొక్కలు, కీటకాలు, జంతువులు, రాళ్లు, శిలాజాలను సేకరించారు.
-జీవజాతుల ఉత్పత్తి గురించి తెలుసుకోవడానికి అవసరమైన సామగ్రి పెద్దమొత్తంలో గ్యాలపోగస్ దీవుల్లోని ప్రకృతి నుంచి లభ్యమైంది. వీటిని పరిశీలించిన డార్విన్ జీవకోటిలో కాలక్రమంగా మార్పులు వస్తుంటాయనే విషయాన్ని సిద్ధాంతీకరించారు. వాటిని తెలుసుకునేందుకు అనేక పరిశోధనలు చేశారు.
-ఆహరం కోసం జీవుల మధ్య సంఘర్షణ జరుగుతుందని, ఈ సంఘర్షణలో ఉపయోగపడే వైవిధ్యాలున్న జీవులే మిగులుతాయని, మిగతావి నశిస్తాయని పేర్కొంటూ యోగ్యతముల సార్థక జీవనం గురించి తెలిపారు. ఈయన 1882, ఏప్రిల్ 19న తన 74వ ఏట మరణించారు. ఈయన పేరు ప్రకృతిమాత ముద్దుబిడ్డగా జీవశాస్త్ర చరిత్రలో నిలిచిపోయింది.
అలెగ్జాండర్ ఫ్లెమింగ్
-మానవాళికి ఎంతో ఉపయోగకరమైన పెన్సిలిన్ ఔషధాన్ని కనిపెట్టారు. ఫ్లెమింగ్ 1881, ఆగస్టు 6న స్కాట్లాండ్లో జన్మించారు. లండన్ యూనివర్సిటీలో వైద్యవిద్య అభ్యసించారు.
-వైద్యవృత్తిలో ఉండగా ఫ్లెమింగ్ రక్తంలో బ్యాక్టీరియాను ఎదుర్కొనే శక్తిని గురించి తెలుసుకోవాలనే ఆసక్తితో పరిశోధనలు ప్రారంభించారు. 1921లో కణజాలాల్లో, స్రావాల్లో బ్యాక్టీరియోలైటిక్ పదార్థాన్ని గమనించి లైసోసోమ్గా పేరుపెట్టారు.
-ఈయన 1928లో ఇన్ఫ్లుయెంజా వైరస్‌పై పరిశోధన చేస్తుండగా స్టాఫిలోకోకస్లను పెంచుతున్న ప్లేట్లో పెనిసీలియం అనే శిలీంధ్రం పెరగడం చూశారు. అది తన చుట్టూ బ్యాక్టీరియా లేకుండా చేసుకోవడం గమనించారు. పెనిసీలియం శిలీంధ్రం నుంచి వచ్చిన ఔషధానికి పెన్సిలిన్ అని పేరు పెట్టారు.
-ఫ్లెమింగ్.. లైసోసోమ్, పెన్సిలిన్‌ను వివరించడంతోపాటు బ్యాక్టీరియాలజీ, ఇమ్యునాలజీ, కీమోథెరపీపై పలు పరిశోధనాపత్రాలను తయారుచేశారు. ఫ్లెమింగ్ పెన్సిలిన్ గురించి రాసిన పరిశోధనాపత్రాల ఆధారంగా హవెర్స్, చెయిన్ అనే శాస్త్రవేత్తలు జంతువులపై పెన్సిలిన్‌ను ప్రయోగించి చూశారు. అనంతరం మానవులపై ప్రయోగించి పెన్సిలిన్ శక్తిని తెలుసుకున్నారు. జీవితమంతా సూక్ష్మజీవులపై పరిశోధనలతోనే గడిపిన ఫ్లెమింగ్ 1955, మార్చి 11న మరణించారు.
లూయీ పాశ్చర్
-పాశ్చర్ ఫ్రెంచి రసాయన శాస్త్రవేత్త. 1822 డిసెంబర్ 27న ఫ్రాన్స్‌లో జన్మించారు. 1948లో డాక్టరేట్ పూర్తిచేసి స్ట్రాస్‌బర్గ్ యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా చేరారు. మైక్రోబయాలజీలో విశేష సేవలు అందించారు.
-ద్రాక్ష సారాయి చెడిపోవడానికి సూక్ష్మజీవులు కారణమని కనుగొన్నారు. వేడి చేయడంవల్ల బ్యాక్టీరియా నశించి, సారాయి చెడిపోకుండా ఉంటుందని నిరూపించారు. పాలు, తదితర పదార్థాలను చెడిపోకుండా నిలువచేయడానికి పాశ్చర్ ఈ పద్ధతిని ఉపయోగించారు. దీన్నే పాశ్చరైజేషన్ అంటారు. పాల కేంద్రాల్లో పాలను నిలువచేయడానికి ఇప్పటికీ ఈ పద్ధతినే పాటిస్తున్నారు.
-పట్టుపురుగుల గుడ్లను సూక్ష్మజీవులు పాడుచేస్తున్నాయని గుర్తించిన పాశ్చర్.. వాటిని నిర్మూలించే పద్ధతిని కనిపెట్టారు. గొర్రెలకు సోకే ఆంథ్రాక్స్ వ్యాధికి టీకాను వృద్ధిచేశారు. ఇప్పటికీ రేబిస్ వ్యాధిని నయంచేయడానికి పాశ్చర్ చికిత్సావిధానాన్ని ఉపయోగిస్తున్నారు.
-అంగారక పదార్థాలు ధ్రువిత కాంతిని ఏవిధంగా విచలనం చెందిస్తాయో అధ్యయనం చేసి స్టీరియో కెమిస్ట్రీ అనే కొత్త రసాయనశాస్ర్తాన్ని రూపొందించారు. తన పరిశోధనలతో మానవాళికి వెలకట్టలేని సేవచేసిన పాశ్చర్ 1895 సెప్టెంబర్ 28న మరణించారు.
విలియం హార్వే
-హార్వే ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన వైద్యశాస్త్రవేత్త. 1578 ఏప్రిల్ 1న ఇంగ్లండ్‌లో జన్మించారు. 1597లో కేంబ్రిడ్జి యూనివర్సిటీలో బ్యాచిలర్ డిగ్రీ పూర్తిచేశారు. అనంతరం ఇటలీలోని పడువా మెడికల్ కాలేజీలో వైద్యవిద్య అభ్యసించారు. 1602లో ఇంగ్లండ్‌కు వెళ్లి లండన్‌లో వైద్యుడిగా స్థిరపడ్డారు.
-హార్వే జంతువుల హృదయం, రక్తప్రసరణ వ్యవస్థల మీద అనేక పరిశోధనలు చేశారు. చేపలు, కప్పలు, కోళ్ల పిండాలను జాగ్రత్తగా పరిశీలిస్తూ వాటి రక్తప్రసరణ గురించి క్షుణ్ణంగా తెలుసుకున్నారు. హృదయ సంకోచంవల్ల రక్తం దమనుల ద్వారా రక్తనాళాలకు చేరుతుందని తెలుసుకున్నారు. నాడి కొట్టుకోవడం అంటే గుండె కొట్టుకోవడమే అని రుజువు చేశారు.
-మానవుని గుండెలో నాలుగు గదులు ఉంటాయని, దమనుల ద్వారా గుండెలోని రక్తం శరీరభాగాలకు సరఫరా అవుతుందని, వాటి నుంచి సిరల ద్వారా రక్తం గుండెకు చేరుతుందని కనిపెట్టారు. మనిషి గుండె నిమిషానికి ఎన్నిసార్లు కొట్టుకుంటుందో, ఎంత రక్తాన్ని పంప్ చేస్తుందో చెప్పగలిగారు. జీవశాస్త్ర పరిశీలనలో శాస్త్రీయపద్ధతిని ప్రవేశపెట్టిన మొదటి శాస్త్రవేత్త హార్వే. ఈయన 1657 జూన్ 3న తన 79వ ఏట మరణించారు.
ఆంటోని వాన్ లీవెన్‌హుక్
-ఈయన డచ్చి శాస్త్రవేత్త. 1632 అక్టోబర్ 24న హాలెండ్‌లో జన్మించారు.
-1674-75లో తొలిసారి సరళ సూక్ష్మదర్శినిని ఆవిష్కరించారు. దీనిద్వారా ఎర్ర రక్తకణాలు, ప్రోటోజోవన్లు, బ్యాక్టీరియాను కనుగొన్నారు. ప్రస్తుతం మనం చూసే మైక్రోస్కోప్‌ల కంటే ఆయన కనిపెట్టిన మైక్రోస్కోప్ భిన్నంగా ఉండేది.
-దాదాపు 200 రకాల మైక్రోస్కోపులను తయారుచేశారు. ఈ మైక్రోస్కోపులతో ఆయన ప్రకృతి సిద్ధంగా లభించే నీటిని, ఇతర జీవపదార్థాలను పరిశీలించారు. జలాల్లో, రక్తంలో, దంతాల పాచిలో, పేగులోని ద్రవాల్లో, మల విసర్జితాల్లో ఉండే వివిధ రకాల సూక్ష్మజీవులను కనుగొన్నారు.
-మైక్రోస్కోప్ వాడకాన్ని నిర్దేశించిన మొదటి శాస్త్రజ్ఞుడు లీవెన్‌హుక్. బ్యాక్టీరియాలను వర్ణించిన తొలి శాస్త్రవేత్తగా కూడా ఆయన గుర్తింపు పొందారు. అందుకే ఆయనను ఫాదర్ ఆఫ్ మైక్రోస్కోప్, ఫాదర్ ఆఫ్ బ్యాక్టీరియాలజీగా పేర్కొంటారు. ఆయన 1723 ఆగస్టు 26న తన 90వ ఏట మరణించారు.
అరిస్టాటిల్
-గ్రీకు శాస్త్రవేత్త. క్రీ.పూ. 384లో జన్మించారు. మొదట వైద్యశాస్ర్తాన్ని అభ్యసించి క్రీ.పూ. 367లో ప్లేటో వద్ద తత్వశాస్త్రం అభ్యసించేందుకు ఏథెన్స్ నగరానికి వెళ్లాడు. క్రీ.పూ. 347లో ప్లేటో మరణానంతరం ఏథెన్స్ను వీడి కొంతకాలం ప్రయాణంలోనూ, ఏసియామైనర్ ద్వీపాల్లోనూ జీవశాస్త్ర అధ్యయనం చేశారు.
-విజ్ఞానశాస్త్ర రంగంలో అరిస్టాటిల్ స్పృశించని అంశం లేదు. ఖగోళ, భౌతిక, జంతు, వృక్ష, తర్క, తత్వ, నీతి, రాజనీతి, కావ్య, మనస్తత్వ శాస్ర్తాలు అన్నింటిని అవపోసనపట్టి అనేక గ్రంథాలు రాశారు.
-జీవశాస్త్ర పరిశోధనల్లో చేసిన కృషికి గుర్తింపుగా అరిస్టాటిల్‌ను జీవశాస్త్ర పితామహుడుగా వ్యవహరిస్తారు. జీవులను ఒక క్రమపద్ధతిలో వర్గీకరించే విధానాన్ని ప్రవేశపెట్టారు. ప్రస్తుతం అది సరైన పద్ధతి కానప్పటికీ.. ఆయన అనంతరం 2000 ఏండ్లపాటు ఆ పద్ధతే ఆచరణలో ఉన్నది.
-కోళ్లు, ఇతర జంతువుల పిండాభివృద్ధిని అరిస్టాటిల్ వర్ణించారు. ఈ వర్ణనే ఆధునికంగా ఉద్భవించిన పిండోత్పత్తి శాస్ర్తానికి నాంది పలికింది. భూమి ఆవిర్భావం, పర్వతాలు రూపొందే విధానం గురించి కూడా ఆయన వివరించారు. అరిస్టాటిల్ క్రీ.పూ. 322లో మరణించారు.
రాబర్ట్ హుక్
-ఈయన 1635, జూలై 18న లండన్‌లో జన్మించారు. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో ఉన్నతవిద్యను అభ్యసించారు. 1662లో రాయల్ సొసైటీ ఆఫ్ లండన్‌లో ప్రయోగాలు నిర్వహించే క్యూరేటర్‌గా, ఆ తర్వాత లండన్‌లోని గ్రెసామ్ కాలేజీలో జ్యామెట్రీ ప్రొఫెసర్‌గా పనిచేశారు.
-రాబర్ట్ హుక్ ఖగోళ, రసాయన, భూగర్భ శాస్ర్తాలతోపాటు మరెన్నో శాస్ర్తాల్లో ఆసక్తి చూపేవారు. హేగెన్స్, లీవెన్‌హుక్, బాయిల్, న్యూటన్ లాంటి ఎంతోమంది శాస్త్రవేత్తలతో కలిసి పనిచేశారు. సంయుక్త సూక్ష్మదర్శినిని కనిపెట్టి దాని సాయంతో కీటకాలు, స్పంజికలు, పక్షుల ఈకలను పరిశీలించారు. ఆ వివరాలను తన మైక్రోగ్రాఫియా అనే గ్రంథంలో పొందుపర్చారు.
-ఐరిస్ డయాఫ్రమ్, రెస్పిరేటర్ ప్రొటోటైప్ గడియారాల్లో బ్యాలన్స్ స్ప్రింగ్, భారమితి, అనిమోమీటర్, హైగ్రోమీటర్ మొదలైన సాధనాలను ఈయన కనుగొన్నారు. స్థితిస్థాపకతను వివరిస్తూ హుక్ సూత్రం ప్రతిపాదించారు. బెండు కణజాలంలోని కణ కుడ్యాలను పరిశీలించి అందులో కనిపించే పెట్టెల లాంటి నిర్మాణాలకు కణాలు అని పేరు పెట్టారు.
-రాబర్ట్ హుక్ శిలాజాలపై కూడా విస్తృత పరిశోధనలు చేశారు. భూకంపాల గురించి అనేక పరిశోధనా వ్యాసాలు రాశారు. జీవిత చరమాంకంలో పదేండ్లపాటు అనారోగ్య సమస్యలతో బాధపడిన హుక్.. 1703, మార్చి 3న మరణించారు.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు