Constitutional amendments | రాజ్యాంగ సవరణలు
44వ రాజ్యాంగ సవరణ చట్టం(1978)
– ఈ చట్టాన్ని 1978లో చేశారు. ఇదులో కొన్ని అంశాలను 1978, జూన్ 20న, మరి కొన్ని అంశాలు ఆగస్టు 1న, సెప్టెంబర్ 6న అమల్లోకి వచ్చాయి.
– ఈ చ్టటం ద్వారా రాజ్యాంగంలోని 19, 22, 30, 31ఏ, 31సీ, 38, 74, 77, 83, 105, 123, 132, 133, 134, 139ఏ, 150, 166, 172, 194, 213, 217, 225, 226, 227, 239బీ, 329, 352, 356, 358, 359, 360, 371ఎఫ్, 71(సబ్), 103 (సబ్), 192 (సబ్) ప్రకరణలను, వీటితోపాటు 9వ షెడ్యూల్‌ను సవరించారు.
– 134ఏ, 300ఏ, 361ఏ ప్రకరణలను కొత్తగా చేర్చడంతోపాటు 12వ భాగంలో 4వ చాప్టర్‌ను పొందుపర్చారు.
– 31, 257ఏ, 329ఏ ఆర్టికల్స్‌ను, రాజ్యాంగంలోని 30వ ప్రకరణ తర్వాత ఆస్తిహక్కు అనే సబ్హెడింగ్ను తొలగించారు.
– ప్రకరణ 22ను సవరించడం ద్వారా నివారక నిర్బంధానికి సంబంధించి కొన్ని రక్షణలు కల్పించారు. అవి..
– సలహాసంఘం అనుమతి లేకుండా నివారక నిర్బంధంలో ఉన్న వ్యక్తి అత్యధిక నిర్బంధ కాలాన్ని మూడు నుంచి రెండు నెలలకు తగ్గించారు.
– సలహా సంఘంలో అధ్యక్షుడు, ఇద్దరు సభ్యులు ఉండాలి. అధ్యక్షుడిగా హైకోర్టు జడ్జి, సభ్యులుగా పదవీ విరమణ చేసిన, పదవిలో ఉన్న జడ్జిలు ఉండాలి.
– రెండు నెలలు దాటిన నివారక నిర్బంధానికి తప్పకుండా సలహా సంఘం అనుమతి తీసుకోవాలి.
– రాజ్యాంగ యంత్రాంగం విఫలమైతే రాష్ట్రపతిపాలనను ఆరునెలల కన్నా ఎక్కువ అమలు చేయకూడదు. అయితే 365కు ఒక కొత్త క్లాజును చేర్చారు. దీంతో జాతీయ అత్యవసర పరిస్థితి అమల్లో ఉన్నప్పుడు ఏడాదిపైన ప్రతిసారి పొడిగించవచ్చు, ఎన్నికల కమిషన్ ఎన్నికల నిర్వహణకు వీలుకాదని ధ్రువీకరించినప్పుడు రాష్ట్రపతి పాలన పొడించడానికి అవకాశం కల్పించారు.
– ఆరేండ్లకు పెంచిన పార్లమెంటు, రాష్ట్ర శాసనసభల కాలపరిమితిని 42వ సవరణ ద్వారా ఐదేండ్లకు తగ్గించారు. రాష్ట్ర శాసనసభల్లో కోరమ్ పునరుద్ధరించారు. ప్రకరణలు 105, 194లను సవరించి హౌస్ ఆఫ్ కామన్స్ అనే పదాన్ని తీసివేశారు.
– 74వ ప్రకరణలోని నిబంధనలను అలాగే ఉంచి దానికి మరికొన్ని కొత్త అంశాలను చేర్చారు. దీనిప్రకారం మంత్రిమండలి పంపిన సిఫారసులను రాష్ట్రపతికి కేవలం పునఃపరిశీలనకు పంపే హక్కును మాత్రమే కల్పించారు.
– ప్రకరణలు 132, 134లను సవరించి 134ఏ అనే కొత్త ప్రకరణను చేర్చారు. సత్వర న్యాయమందేలా జడ్జిమెంట్ లేదా తుది తీర్పు తర్వాత సుప్రీంకోర్టులో అప్పీలు చేసుకోవడానికి హైకోర్టు అనుమతివ్వాలి.
– 42వ సవరణ ద్వారా హైకోర్టులకు కల్పించిన రెవెన్యూ అధికారాలను తొలగించారు. దీంతో ట్రిబ్యునళ్లపై హైకోర్టులకు ఉండే పర్యవేక్షణాధికారం మళ్లీ లభించింది.
– ఈ సవరణ ద్వారా ఆస్తిహక్కును ప్రాథమిక హక్కుల జాబితా నుంచి తొలగించి 19(1-ఎఫ్), 31వ ప్రకరణలను రద్దు చేశారు. ఆస్తిహక్కును 12వ భాగంలో ప్రకరణ 300-ఏలో కేవలం చట్టబద్ధమైన హక్కుగా చేర్చారు.
– ఈ సవరణ ద్వారా 352ను సవరించారు. దీని ద్వారా అంతర్గత అశాంతి (Internal disturbances) అనే పదాన్ని తొలగించి సాయుధ తిరుగుబాటు (Armed Rebellion) అనే పదాన్ని చేర్చారు.
– అత్యవసర పరిస్థితి ప్రకటన, క్యాబినెట్ రాతపూర్వక సిఫారసు ద్వారా మాత్రమే విధించాలని ఈ సవరణ సూచిస్తుంది. అంటే ప్రధానమంత్రి సిఫారసుపై కాకుండా మంత్రివర్గ (కేబినెట్ అనే పదం అంతకుముందు రాజ్యాంగంలో లేదు. ఈ సవవరణ ద్వారానే ఆ పదాన్ని మొదటిసారిగా చేర్చారు) సిఫారసుపై మాత్రమే రాష్ట్రపతి అత్యవసర పరిస్థితిని ప్రకటించాలి.
– అత్యవసర పరిస్థితి ప్రకటించిన మొదటి ఆరు నెలల తర్వాత ప్రతి ఆరు నెలల పొడగింపునకు పార్లమెంటు అనుమతి తప్పక ఉండాలి. అయితే ఎమర్జెన్సీ విధించిన నెలలోపు పార్లమెంటులో ప్రత్యేక మెజారిటీతో ఆమోదం పొందాలి. గతంలో (44వ సవరణకు ముందు) దీన్ని సాధారణ మెజారిటీతో ఆమోదించాల్సి ఉండేది.
– ఈ సవరణ ద్వారా 358వ ప్రకరణను సవరించారు. దీంతో 19వ ప్రకరణలోని ఆరు రకాల స్వేచ్ఛలు బాహ్యదాడుల సందర్భంలోనే రద్దవుతాయి. కాని అంతర్గత సాయుధ తిరుగుబాటు విషయంలో రద్దు కావు.
– అత్యవసర పరిస్థితి అమల్లో ఉన్నప్పుడు ప్రాణరక్షణ హక్కు, స్వేచ్ఛా హక్కు రద్దు చేయకూడదని 359వ ప్రకరణలో క్లాజ్ (1); (1a)లను సవరించారు.
45వ సవరణ చట్టం
– దీన్ని 1980, జనవరి 25న చేశారు. దీనిద్వారా ప్రకరణ 334ను సవరించారు.
– ఈ సరవణ ద్వారా లోక్‌సభ, రాష్ట్ర అసెంబ్లీలో ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు, ఆంగ్లో ఇండియన్లకు ప్రాతినిధ్యం కల్పించే విధానాన్ని మరో పదేండ్లపాటు అంటే 1990 వరకు పెంచారు.
46వ సవరణ చట్టం
– ఈ చట్టాన్ని 1982లో చేశారు. 1983, ఫిబ్రవరి 2 నుంచి అమల్లోకి వచ్చింది.
– దీనిద్వారా 269, 286, 366 ప్రకరణలను, 7వ షెడ్యూల్‌ను సవరించారు.
– రాష్ర్టాల రాబడిని పెంచడానికి వాణిజ్య పన్నుద్వారా వచ్చే ఆదాయం మరింత పెరగడానికి ఈ సవరణ వీలుకల్పిస్తుంది.
– ప్రకరణ 269 సవరించడం ద్వారా అంతర్రాష్ట్ర వాణిజ్యం, వర్తకంపై విధించిన పన్ను రాష్ర్టాలకే చెందుతుంది.
– కేంద్రం, అంతర్రాష్ట్ర వస్తు రవాణాపై పన్ను విధించేలా 9వ షెడ్యూల్ జాబితా-1లో 92(బీ) అనే కొత్త అంశాన్ని చేర్చారు.
47వ రాజ్యాంగ సవరణ
– ఈ చట్టం 1984, ఆగస్టు 26న అమల్లోకి వచ్చింది. దీనిద్వారా 9వ షెడ్యూల్‌ను సవరించారు.
– ఈ సవరణ ద్వారా 9వ షెడ్యూల్లో రాష్ర్టాలకు చెందిన 14 భూ సంస్కరణ చట్టాలను చేర్చారు. దీంతో మొత్తం 9వ షెడ్యూల్లోని చట్టాల సంఖ్య 202కు పెరిగింది.
48వ సవరణ చట్టం
– ఈ చట్టాన్ని 1984లో చేయగా, 1984, ఏప్రిల్ 1న అమల్లోకి వచ్చింది. దీనిద్వారా 356వ ప్రకరణను సవరించారు.
– ప్రకరణ 356కు క్లాజ్5ను చేర్చారు. దీంతో పంజాబ్‌లో రాష్ట్రపతి పాలనను మరో రెండేండ్లు పొడిగించారు.
49వ సవరణ చట్టం
– ఈ చట్టం 1984, సెప్టెంబర్ 11న అమల్లోకి వచ్చింది. దీనిద్వారా ప్రకరణ 244ను, 5, 6 షెడ్యూళ్లను సవరించారు.
– త్రిపురలోని గిరిజనుల అభివృద్ధికోసం స్వయంపాలిత జిల్లా కౌన్సిల్‌కు రాజ్యాంగపరమైన రక్షణలు కల్పించారు.
50వ సవరణ చట్టం
– ఈ చట్టం 1984, సెప్టెంబర్ 11న అమల్లోకి వచ్చింది. దీనిద్వారా ప్రకరణ 33(Sub)ను సవరించారు.
– దీనిద్వారా సాయుధదళాల ప్రాథమికహక్కులను నియంత్రించే అధికారం పార్లమెంటుకు కల్పించారు. ఇది రాష్ర్టాల ఆస్తులను కాపాడే సాయుధ దళాలు, రహస్య సమాచార సేకరణ సాయుధ దళాలు, రక్షక దళాలు, వాటికి సంబంధించిన బ్యూరోలు, వ్యవస్థల కోసం పనిచేసేవారు లేదా వాటికి సంబంధించినవారికి వర్తిస్తుంది.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?