American independence struggle | అమెరికా స్వాతంత్య్ర పోరాటం
అమెరికా ఖండంలో స్వేచ్ఛ, సమానత్వం, తొలి ప్రజారాజ్యం, ప్రజా సార్వభౌమత్వం, జాతీయ ప్రభుత్వం అనే సిద్ధాంతం కోసం జరిగిన విప్లవమే అమెరికా స్వాతంత్య్ర పోరాటం.
13 వలసల అభివృద్ధి నేపథ్యం
-జినోవాకు చెందిన క్రిస్టఫర్ కొలంబస్కు భౌగోళిక విజ్ఞానం, నౌకాయానంలో ఆసక్తి ఎక్కువ. భూమి గోళాకారంలో ఉందని నమ్మిన ఆయన పశ్చిమంగా నౌకాయానం చేస్తే ఆసియా దేశాలైన చైనా, భారతదేశాలను చేరుకోవచ్చని విశ్వసించాడు. తనకున్న నౌకాయాన అనుభవంతో అట్లాంటిక్‌ను దాటి ఆసియా ఖండాన్ని చేరడానికి ఒక ప్రణాళిక తయారు చేసుకొని తన ప్రణాళికకు పెట్టుబడి పెట్టాల్సిందిగా పోర్చుగల్ రాజు రెండో జాన్‌ను అభ్యర్థించాడు. ఆయన పెద్దగా స్పందించకపోవడంతో కొలంబస్ స్పెయిన్ రాణి ఇసబెల్లాను ఆశ్రయించడంతో ఆమోదం తెలిపారు.
-1492, ఆగస్టులో 87 మంది నావికులతో మూడు ఓడలలో బయల్దేరి అక్టోబర్ 12 నాటికి అమెరికా ఖండాల మధ్య ఉన్న బహామీ దీవులను చేరి, ఆసియాకు తూర్పు వైపు ఉన్న దీవులను చేరానని భావించాడు. తాను చేరిన దీవికి సాల్వెడార్ అని పేరు పెట్టి స్పెయిన్‌కు చేరి భారత్ చేరినట్లు చెప్పాడు. మూడుసార్లు అదే మార్గంలో పయనించి ఆ దీవులలోని ఆదివాసులైన కరోబ్లను ఇండియన్లని భావించాడు. కొలంబస్ నౌకాయానం తర్వాత ఇంగ్లండ్ తరఫున వెనీషియన్ నావికుడు జాన్ కాబట్ 1497లో అమెరికా తూర్పు తీరంలో న్యూ ఫౌండ్లాండ్ని కనుగొన్నాడు. తర్వాత ఇంగ్లండ్ నూతన ప్రపంచం గురించి పెద్దగా పట్టించుకోలేదు. అయితే, ఇంగ్లండ్‌లో ఆవరణోద్యమం వచ్చి ఆర్థిక మార్పులు రావడం వల్ల నిరుద్యోగులు, భూమి హీనుల సంఖ్య పెరగడంతో అలాంటి వారికి ఆశ్రయం కల్పించడానికి, స్పెయిన్ విక్రయిస్తున్న అమెరికా ఉత్పత్తులు చక్కెర, మద్యం, ఆలివ్ నూనె, సిల్క్, కాయగూరలు మొదలైన వాటిని స్వయంగా దిగుమతి చేసుకోవడానికి, ఇంగ్లిష్ వస్తువులకు మార్కెట్ కల్పించడానికి వలసలు బాగా ఉపయోగపడుతాయని రిచర్డ్ హాక్లుయిట్ రచనలు ప్రతిపాదించడంతో వలసల స్థాపన ప్రచారం పొందింది.
-అయితే, ఎలిజబెత్ రాణి సానుభూతి చూపినా వలసల స్థాపనకు పెట్టుబడికి అంగీకరించలేదు. ఫలితంగా ప్రైవేటు పెట్టుబడితో వలసల స్థాపనకు సర్ హంఫ్రీ గిల్బర్ట్ తొలి ప్రయత్నం చేశాడు. ఆయన నౌక మునిగిపోవడంతో ఆ పథకానికి ఆయన సోదరుడు సర్ వాల్టర్ ర్యాలీ వారసుడయ్యాడు. వాల్టర్ ర్యాలీ పంపిన బృందం చీసపేక్ దక్షిణ ప్రాంతాన్ని వలస స్థాపనకు ఎంచుకొని దానికి వర్జీనియా (1584) అని పేరు పెట్టారు. 1607లో లండన్ కంపెనీ వర్జీనియాలో జేమ్స్టౌన్ స్థావరాన్ని నెలకొల్పింది. 1620లో ఇంగ్లండ్ నుంచి మే ఫ్లవర్ అనే ఓడలో ప్యూరిటన్ల బృందం ఒకటి మసాచుసెట్స్ వచ్చి స్థిరపడింది. వీరు పిల్ గ్రిమ్ ఫాదర్స్ అనే పేరుతో ప్రసిద్ధులయ్యారు. 1634లో లార్డ్ బాల్టిమోర్ నాయకత్వంలో మేరీలాండ్ వలస స్థాపితమైంది. 1681లో క్వేకర్ మతశాఖ వారు పెన్సిల్వేనియాలో ఒక వలస ఏర్పర్చుకున్నారు. మసాచుసెట్స్, బోస్టన్ పట్టణాల నుంచి వెళ్లిన ప్రజలతో కనెక్టికట్, న్యూహాంప్‌షైర్ వలసలు ఏర్పడ్డాయి. 1733లో జేమ్స్ ఓగ్లితోర్ప్ జార్జియా అనే వలసను నెలకొల్పాడు. గతంలో 1623లో డచ్ కంపెనీ స్థాపించిన న్యూ నెదర్లాండ్స్ వలస న్యూయార్క్‌గా ఆంగ్లేయుల వలసగా మారింది.
-17వ శతాబ్దం తొలిదశలో ఇంగ్లిష్ వారే ఎక్కువగా వలస రాగా, శతాబ్ది అంతానికి యుద్ధ పరిస్థితి నుంచి తప్పించుకోవడానికి జర్మన్లు, దారిద్య్రాన్ని భరించలేక ఐరిష్, స్విట్టజర్లాండ్ల నుంచి వలసలు వచ్చారు. అయితే, వీరంతా కలిసిపోయారు. ఆ విధంగా అమెరికా తూర్పు తీరంలో 13 ఆంగ్ల వలసలు వెలిశాయి. వీటిలో ఉత్తర వలసలు పారిశ్రామిక సమాజంగా, దక్షిణ వలసలు వ్యవసాయ సమాజాలుగా, మధ్య వలసలు మిశ్రమ వ్యవస్థగా రూపొందాయి. వలస ప్రజలు ఇంగ్లండ్ నుంచి పారిశ్రామిక వస్తువులను తెప్పించుకొని, పొగాకు, కలప, నార మొదలైన ముడి పదార్థాలను ఎగుమతి చేసేవారు. మాతృదేశాభివృద్ధికి వలసల ఆర్థిక సంపద తోడ్పడాలన్న వాణిజ్య వాదం సూత్రాలను అనుసరించే వాణిజ్యం జరిగేది. వలసల ఆధిపత్యం ఇంగ్లండ్ నుంచి పనిచేసే ఉమ్మడి వాటా కంపెనీల చేతుల్లోనే ఉండేది. వలస పాలనా వ్యవహారాల్లో ఇతర యూరోపియన్ దేశాల నుంచి వచ్చిన వారు ఎక్కువగా ఆసక్తి చూపలేదు. కారణం వారు కొంత సంపద పోగు చేసుకొని తమ దేశాలకు వెళ్లిపోవాలన్న ఉద్దేశంతో ఉండేవారు. అయితే, ఆంగ్లేయులు అలాకాక వలసలతో స్థిరనివాసం ఏర్పర్చుకోవాలని కోరి వచ్చినవారే. అందువల్ల ఆంగ్లేయుల వలస నిర్వహణలో ప్రాతినిధ్యం కోరి సంపాదించుకున్నారు.
ఉదాహరణకు మసాచుసెట్స్ వలసలో ఇంగ్లండ్ రాజు నుంచి వలస పాలనా అధికారాన్ని చార్టర్ ద్వారా పొందిన కంపెనీ సభ్యులు నిరంకుశంగా పాలించాలని చూశారు. అప్పుడు వలస ప్రజలు తాము వేరే ప్రాంతానికి తరలిపోతామని బెదిరించారు. దీంతో కంపెనీ వారు వలస ప్రజల ప్రతినిధులకు పరిపాలనా బాధ్యతను అప్పగించారు. కానీ, రెండో జేమ్స్ మసాచుసెట్స్ చార్టర్‌ను రద్దు చేసి న్యూఇంగ్లండ్ వలసలను తన పాలనలోకి తీసుకొని ప్రభుత్వ పక్షాన ఎడ్మండ్ ఆండ్రోస్‌ను గవర్నర్‌గా నియమించాడు. ప్రజాభిప్రాయాన్ని ఖాతరు చేయని ఆండ్రోస్ పాలనను ప్రజలు నిరసించారు. ఈలోగా 1688లో రక్తరహిత విప్లవం కారణంగా జేమ్స్ ఇంగ్లండ్ విడిచి పారిపోయాడు. ఈ విప్లవం వలస ప్రజలను ఉత్తేజపర్చింది. వారు ఆండ్రోస్‌ను వెళ్లగొట్టారు. మసాచుసెట్స్తోపాటు రోడ్ ఐలండ్, కనెక్టికట్లు స్వతంత్రమయ్యాయి. కానీ, తిరిగి బ్రిటిష్ చక్రవర్తికి విధేయతను చూపాయి. అయితే, బ్రిటన్ చేసిన ఆర్థిక వాణిజ్యపరమైన శాసనాలు ఇంగ్లండ్‌కే ఎక్కువ ప్రయోజనం కలిగించి వలస ప్రజల ప్రయోజనాలను భంగం కలిగిస్తూ ఉండేవి. కాబట్టి వారు ఆ చట్టాలను లక్ష్య పెట్టేవారు కాదు. కెనడా, మిసిసిపి తీర ప్రాంతాల్లో వలసలు ఏర్పర్చుకున్న ఫ్రాన్స్ ఈ ప్రాంతం నుంచి దాడులు చేసి న్యూయార్క్ వలసలను స్వాధీనం చేసుకుంటే అట్లాంటిక్ తీరంలోని బ్రిటిష్ వలసలన్నింటినీ వశపర్చుకోవచ్చని భావించి న్యూయార్క్, న్యూఇంగ్లండ్ వలసలపై దాడులు చేశారు.
ఈ యుద్ధంలో ఇంగ్లండ్.. ఫ్రాన్స్‌ను ఓడించింది. యూట్రే సంధితో ముగిసిన ఈ యుద్ధంతో న్యూఫౌండ్లాండ్, హడ్సన్ బే, నోవాస్కోషియాలు ఆంగ్లేయులకు దక్కాయి. 1745-48 యూరప్‌లో జరిగిన ఆస్ట్రియా వారసత్వ యుద్ధంలో భాగంగా వలసల్లో ఇంగ్లండ్, ఫ్రాన్స్‌లు యుద్ధానికి దిగాయి. వలసల సైన్యం పక్షాన జార్జి వాషింగ్టన్, జనరల్ బ్రాడక్లు నాయకత్వం వహించగా బ్రిటిష్ సేనాధిపతుల సహకారం లోపించడం వల్ల వలస సైన్యాలు ఓడిపోయాయి. అయితే, ఈ ఓటమి వల్ల వసల సైనికులు, సేనానులను బ్రిటిష్ సేనానులు చిన్నచూపు చూసేవారు. 1756లో యుద్ధం బాధ్యత విలియమ్ సిట్ చేపట్టడంతో ఆంగ్లేయుల తలరాత మారింది. ఫ్రెంచి వారిని ఓడించి బ్రిటిష్ సైన్యం క్యూబెక్, మాంట్రియల్‌ను స్వాధీనం చేసుకున్నది. యుద్ధంలో ఫ్రెంచ్ వారికి సహాయం చేసిన స్పెయిన్ వలసలను కూడా బ్రిటిష్ వారు స్వాధీనం చేసుకున్నారు. ఈ యుద్ధం ఇంగ్లిష్ వలసలలో గల సంఘటితభావాన్ని, సహకార ధోరణిని పెంపొందించింది. 13 వలసలలో పెరిగిన ఐక్యతాభావం స్వాతంత్య్ర సంగ్రామంలో వారి విజయానికి తోడ్పడింది.
-బ్రిటిష్ వ్యాపారుల విధానం: ఇంగ్లండ్ మొదటి నుంచి వలసపై వాణిజ్యవాద ధోరణినే చూపింది. వలసలలోని ముడిపదార్థాలు ఇంగ్లండ్‌లోని పరిశ్రమలకు ఉపయోగపడాలనే, ఇంగ్లండ్‌లో తయారైన వస్తువుల అమ్మకానికి వలసలు అంగడిగా ఉపయోగపడాలని ఇంగ్లండ్ భావించింది. సప్త సంవత్సరాల యుద్ధం (1756-63) ఇంగ్లండ్‌పై ఆర్థిక భారం కలిగించింది. ఇంగ్లండ్ జాతీయ రుణం పెరిగిపోవడం వల్ల ఆర్థిక సమస్య పరిష్కారానికి వలసల వైపు దృష్టి సారించింది. వలసల నుంచి వచ్చే ఆర్థిక రాబడిని పెంచి క్రమబద్ధం చేసే ఉద్దేశంతో ఇంగ్లండ్ ప్రధాని గ్రెన్విల్ చేసిన చట్టాలు వలస ప్రజల ఆగ్రహాన్ని చవిచూశాయి. ఆ చట్టాలు..
i. అక్రమ వ్యాపారాన్ని అరికట్టే ఉద్దేశంతో అడ్మిరాల్టీ కోర్టులను నెలకొల్పాడు.
ii. మొలాసిస్‌పై దిగుమతి సుంకాన్ని తగ్గించే మొలాసిస్ చట్టం వల్ల ప్రజలకు అసంతృప్తిని కలిగించింది.
iii. వలసల రక్షణ కోసం కొన్ని సైనిక పటాలాలను ఏర్పరుస్తూ మొత్తం ఇంగ్లండ్ సైనిక వ్యయంలో మూడో వంతు అమెరికన్ వలసలు భరించాలని నిర్ణయించాడు.
iv. మిసిసిపిలో కొన్ని ప్రాంతాలను రెడ్ఇండియన్లకు కేటాయించడం అమెరికన్లకు అసంతృప్తిని కలిగించింది.
-విప్లవానికి దారితీసిన చట్టాలు: సప్తవర్ష సంగ్రామం (1756-63) వలసల రక్షణ కోసం జరిగింది. కాబట్టి యుద్ధ వ్యయంలో సగం వలసలే భరించాలని ఇకపై సైన్యంపై చేసే ఖర్చులో కూడా వలసలు తమవంతు భరించాలనే బ్రిటిష్ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ధనాన్ని రాబట్టడానికి 1764లో చక్కెర చట్టాన్ని, 1765లో స్టాంపుల చట్టాన్ని బ్రిటిష్ పార్లమెంట్ చేసింది. 1764 చక్కెర చట్టాన్ని అమలుపర్చడానికి కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటూ ఈ చట్టాన్ని ఉల్లంఘించి దొంగ రవాణా చేయడాన్ని నివారించడానికి అధికారులు, గృహస్తుల ఇండ్లలో చొరబడి తనిఖీ చేయడానికి అనుమతించారు.
-1765 స్టాంపుల చట్టం అన్ని విధాలైన ఒప్పంద పత్రాలతోపాటు ప్రభుత్వ పత్రాలపై, వార్తా పత్రికలు, కరపత్రాలు మొదలైన వాటికి సైతం స్టాంపుల పన్ను చెల్లించాలని నిర్దేశించింది. 1765లో వచ్చిన క్వార్టరింగ్ చట్టం వలసల్లో ఉన్న బ్రిటిష్ సైనికులకు వసతి, నిత్యావసరాలు వలస ప్రజలు కల్పంచాలని నిర్దేశించింది. స్టాంపుల చట్టానికి వ్యతిరేకత తొలుత వర్జీనియా రాష్ట్రంలో మొదలైంది. పాట్రిక్ హెన్రీ ఇంగ్లండ్ ప్రభుత్వాన్ని హెచ్చరించాడు. మసాచుసెట్స్‌లో జేమ్స్ ఓటిస్, శామ్యూల్ ఆడమ్స్‌లు స్టాంపు వ్యతిరేక ఉద్యమాన్ని నిర్వహించారు. వలసలలోని తీవ్రవాదులు స్వేచ్ఛాపుత్రులు అనే సమాజాన్ని స్థాపించారు. బోస్టన్, ఫిలడెల్ఫియా, న్యూఫోర్ట్, న్యూయార్క్, చార్లెసన్ పట్టణాలలో దోపిడీలు, దౌర్జన్యకాండలు జరిగాయి. స్టాంపుల చట్టాన్ని వ్యతిరేకించే మహాసభ న్యూయార్క్‌లో 1765 అక్టోబర్‌లో జరిగింది. బ్రిటిష్ పార్లమెంట్లో వలసలకు ప్రాతినిధ్యం లేదు కాబట్టి వసలలోని చట్టసభల ఆమోదం లేకుండా పన్నులు విధించడం చట్ట వ్యతిరేక, అన్యాయమైన చర్య అని మహాసభ తీర్మానించింది. బ్రిటన్‌కు, వలస రాష్ర్టాలకు జరిగే వాణిజ్యం దెబ్బతినడంతో 1766లో బ్రిటన్ స్టాంపుల చట్టాన్ని రద్దు చేసింది.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?