Revolutions in France | ఫ్రాన్స్‌లో ప్రజాస్వామిక, జాతీయవాద విప్లవాలు
19వ శతాబ్దంలో ప్రజాస్వామిక, జాతీయవాద విప్లవాలు
– న్యాయ స్మృతి-1804ని నెపోలియన్ కోడ్‌గా వ్యవహరిస్తారు. పుట్టుక ఆధారంగా లభించే అన్ని ప్రత్యేక హక్కులను ఈ కోడ్ తొలిగించింది. చట్టం ముందు అందరికీ సమానత్వాన్ని, ఆస్తిహక్కును కల్పించింది. ఫ్రాన్స్ నియంత్రణలోని ఇతర ప్రాంతాల్లో కూడా దీన్ని అమలు చేశారు. డచ్ గణతంత్రం, స్విట్జర్లాండ్, ఇటలీ, జర్మనీల్లో పరిపాలన విభాగాలను నెపోలియన్ సరళతరం చేశాడు. ఫ్యూడల్ వ్యవస్థను రద్దుచేసి రైతాంగాన్ని భూస్వాముల పొలాలు, ఇండ్లలో వెట్టిచాకిరి నుంచి విముక్తి చేశాడు. పట్టణాల్లో కూడా వస్తుత్పత్తిపై గిల్డ్ పరిమితులను తొలిగించి, రవాణా, ప్రసార వ్యవస్థలను మెరుగుపరిచాడు. ఉమ్మడి చట్టాలు, ప్రామాణిక తూనికలు, కొలతలు, జాతీయ కరెన్సీ వంటి వాటివల్ల ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి సరుకు లు, మూలధన రవాణా తేలికవుతుందని వ్యాపారులు, చిన్నస్థాయి సరుకుల ఉత్పత్తిదారులు గుర్తించారు.
– ఫ్రాన్స్ జయించిన ప్రాంతాల్లో ప్రజల నుంచి మిశ్రమ స్పందన ఎదురైంది. మొదట్లో హాలెండ్, స్విట్జర్లాండ్‌లో, బ్రసెల్స్, మైంజ్, మిలన్, వార్సా వంటి పట్టణాల్లో స్వేచ్ఛ ప్రదాతలుగా ఫ్రెంచ్ సైన్యానికి స్వాగతం లభించింది. కొంతకాలం కొత్త పరిపాలన విధానంలో రాజకీ య స్వేచ్ఛ లేదని అర్థం కావడంతో ఉత్సాహం పోయి వ్యతిరేకత మొదలైంది. పరిపాలనా సంబంధంగా ఎన్నో మార్పులు చేసినా పన్నులు పెరిగాయి. సెన్సార్ విధానం అమల్లో ఉండే ది. మిగిలిన యూరప్‌ని జయించడానికి ఫ్రెంచ్ సైన్యంలోకి అభీష్టానికి వ్యతిరేకంగా సైనికులను తీసుకునేవారు.
– ఉదారవాద జాతీయవాదం: యూరప్‌లో 19వ శతాబ్దం ఆరంభంలో దేశ ఏకత అన్న భావం ఉదారవాద సిద్ధాంతం తో ముడిపడి ఉంది. బ్రిటన్ వంటి అనేక ఆధునిక దేశాల్లో ఉదారవాదం అనే కొత్త సిద్ధాంతం ముందుకు వచ్చింది. ఉదారవాదం (లిబరలిజం) అన్న పదం స్వేచ్ఛ అనే అర్థం ఉన్న లాటిన్ పదమైన లిబర్ నుంచి వచ్చింది. కొత్త మధ్యతరగతి వర్గాలకు ఉదారవాదం అంటే చట్టం ముందు ప్రజలందరికీ సమాన స్వేచ్ఛ ఉండటం. రాజకీయంగా దాని అర్థం ప్రజల సమ్మతితోనే ప్రభుత్వం పనిచేయాలి. ఎన్నికైన ప్రజాప్రతినిధుల ద్వారా ప్రజల సమ్మతి వ్యక్తం కావాలి. ఫ్రెంచ్ విప్లవం తర్వాత చర్చి ప్రత్యేక హక్కులను, నియంత పాలనను అంతమొందించడంపై ఉదారవాదం దృష్టి కేంద్రీకరించింది. రాజ్యాంగానికి పార్లమెంట్ ద్వారా ప్రాతినిధ్య ప్రభుత్వానికి అది ప్రాముఖ్యం ఇచ్చింది. 19వ శతాబ్దపు ఉదారవాదులు వ్యక్తిగత ఆస్తికి ఏ రకంగానూ భంగం కలుగకూడదని భావించారు. వ్యక్తిగత ఆస్తులను జప్తు చేయడం, సంపద సమానంగా పంపిణీ అయ్యేలా చూసే చట్టాల వంటివి, ఫ్రెంచి విప్లవంలోని అతివాద చర్యలను వాళ్లు వ్యతిరేకించారు. ఉదారవాదులు ఒకవైపు రాజకీయ ప్రజాస్వామ్యాన్ని సమర్థిస్తూనే, మరోవైపు భూస్వాములు, వ్యాపారుల వ్యక్తిగత ఆస్తులను కాపాడాలనుకున్నారు. అయితే స్వేచ్ఛ, ప్రజాస్వామ్యం, చట్టం ముందు సమాన త్వం వంటివి ప్రజలందరికీ సార్వత్రిక ఓటుహక్కు కల్పిచలేకపోయాయి. ఫ్రాన్స్ విప్లవకాలంలో ఓటుహక్కు, సభలకు ఎన్నికయ్యే హక్కు ఆస్తి ఉన్న వర్గాలకే కల్పించారు. జాకోబిన్ల ఆధ్వర్యంలో కొద్దికాలం మాత్రమే వయోజనులైన పురుషులందరికీ ఓటుహక్కు లభించింది. నెపోలియన్ కాలంలో తిరిగి ఓటుహక్కును పరిమితం చేశారు. ఆ కాలంలో మహిళలను మైనర్ల స్థాయికి తగ్గించారు. 19వ శతాబ్దం అంతం, 20వ శతాబ్దం ఆరంభంలో మహిళలకు, ఆస్తిలేని పురుషులు సమాన రాజకీయ హక్కులు కోరుతూ ఎన్నో ఉద్యమాలు చేపట్టారు.
– ఆర్థికరంగంలో వ్యక్తిగత ఆస్తిని రక్షించాలని, మార్కెట్లకు స్వేచ్ఛ ఉండాలని ఉదారవాదం కోరింది. సరుకులు, మూలధన రవాణాల్లో ప్రభుత్వ ప్రతిబంధకాలు ఉండకూడదని వాళ్లు భావించారు. ప్రాభవంలోకి వస్తున్న మధ్యతరగతి వర్గాలు 19వ శతాబ్దంలో దీన్ని బలంగా కోరాయి. 1834లో ప్రష్యా సుంకాలకు ఏకీకృత ప్రాంతాన్ని (ఓల్ వెరెన్స్) ప్రకటించింది. దీంట్లో జర్మన్ రాష్ర్టాలు చాలా ఉన్నాయి. దీనికిం ద సుంకాల అవరోధాలను తగ్గించారు. 30కిపైగా ఉన్న కరెన్సీలను రెండుకు తగ్గించారు. ఆ తర్వాత కొంతకాలానికి ఏర్పడిన రైలు మార్గాల ద్వారా మనుషులు, సరుకుల రవాణాను అది సరళతరం ఏకీకృ తం కావడానికి అది తోడ్పడింది.
– 1815 తర్వాత కొత్త సంప్రదాయవాదం: 1815లో నెపోలియన్ ఓడిపోయిన తర్వాత యూరప్‌లోని ప్రభుత్వాలు సంప్రదాయవాదాన్ని పాటించాయి. సంప్రదాయవాదులు సమాజంలో రాచరికం, చర్చి, ధనిక భూస్వాములకు ప్రత్యే క హక్కులు, వ్యక్తిగత ఆస్తి, కుటుంబం వంటి సంప్రదాయ సంస్థలు కొనసాగాలని భావించారు. అయితే వారిలో చాలా మంది విప్లవంకంటే ముందున్న రోజులకు తిరిగి వెళ్లాలని ప్రతిపాదించలేదు. పరిమితమైన ఆధునికీకరణ వల్ల రాచరికం వంటి సంప్రదాయ సంస్థలను బలోపేతం చేయొచ్చని వాళ్లు గుర్తించారు. రాజ్యం మీద తన పట్టును పెంచుకోవడానికి ఆధునికీకరణను రాచరికం ఒక సాధనంగా వాడుకుంది. ఆధునిక సైన్యం, సమర్థ పాలనా యంత్రాంగం, గతిశీలమైన ఆర్థిక వ్యవస్థ, ఫ్యూడలిజాన్ని, బానిసత్వాన్ని నిషేధించడం వంటి వాటివల్ల యూరప్‌లో నియంత రాచరికాలు మాత్రమే కాకుండా ధనిక భూస్వాములు కూడా బలపడవచ్చని అనుకున్నారు.
– ఐరోపా శక్తులైన బ్రిటన్, రష్యా, ప్రష్యా, ఆస్ట్రియా ఉమ్మడిగా నెపోలియన్‌ని ఓడించాయి. ఈ దేశాల ప్రతినిధులు నెపోలియన్ విడిచి వెళ్లిన ఐరోపా రాజ్య సరిహద్దులను పునర్నిర్మించడానికి 1815లో ఆస్ట్రియా రాజధాని వియన్నాలో సమావేశమయ్యారు. ఆస్ట్రియా ప్రధాని మెటర్నిక్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి రష్యా చక్రవర్తి జార్, ఒకటో అలెగ్జాండర్, ప్రష్యా రాజు మూడో ఫ్రెడరిక్ విలియం, ఇంగ్లండ్ విదేశాంగ మంత్రి కాజల్రీ, వాటర్లూ విజేత డ్యూక్ ఆఫ్ వెల్లింగ్టన్, ఫ్రెంచ్ విదేశాంగ మంత్రి టాలీరాండ్, డెన్మా ర్క్, బల్గేరియా రాజులు హాజరయ్యారు. ఫ్రెంచ్ విప్లవ భావాలను, నెపోలియన్ సంస్కరణలను కూల్చివేసి నిరంకుశ రాచరికాన్ని పునరుద్ధరించే ప్రయత్నం ఈ సమావేశంలో బలంగా జరిగింది. ఈ భావజాలానికి ప్రతినిధి అయిన మెటర్నిక్ ఐరోపాలో పురాతన వ్యవస్థను, రాచరిక నిరంకుశత్వాన్ని పునఃప్రతిష్టించడానికి జన్మించిన భగవంతుని సేవకుడిగా తనను తాను అభివర్ణించుకున్నాడు.
– ఈ విధంగా 1815లో ఏర్పర్చిన సంప్రదాయ పాలనలు నియంతృత్వంగా వ్యవహరించాయి. నియంత ప్రభుత్వాలను ప్రశ్నించిన వారి కార్యకలాపాలను నిలిపివేయడానికి ప్రయత్నించారు. దినపత్రికలు, పుస్తకాలు, నాటికలు, పాట ల్లో ఏం చెబుతున్నారో, ఏం రాస్తున్నారో నియంత్రించడానికి సెన్సార్ ఉండేది. ఫ్రెంచి విప్లవంతో సంబంధం ఉన్న స్వేచ్ఛ, స్వాతంత్య్రం అన్న భావనల గురించి ప్రజలను రాయనిచ్చేవారు కాదు. అయితే, ఉదారవాద జాతీయవాదులు సంప్రదాయవాద ప్రభుత్వాన్ని విమర్శిస్తూ పత్రికా స్వేచ్ఛ కావాలంటూ నిరసనలు వ్యక్తం చేయసాగారు.
– విప్లవకారులు: 1815 తర్వాత అణచివేతకు భయపడి ఉదారవాద జాతీయవాదుల్లో అనేక మంది అజ్ఞాతంలోకి వెళ్లా రు. విప్లవకారులకు శిక్షణ ఇవ్వడానికి, వారి భావాలను ప్రచారం చేయడానికి ఐరోపా దేశాల్లో అనేక రహస్య సంఘాలు ఏర్పడ్డాయి. వియన్నా సమావేశం తర్వాత ఏర్పడిన రాచరిక ప్రభుత్వాలను వ్యతిరేకించడానికి, స్వేచ్ఛ, స్వాతంత్య్రాల కోసం పోరాడాలని నిర్ణయిం చారు. స్వేచ్ఛ కోసం పోరాటంలో భాగంగా జాతీయ రాజ్యా లు ఏర్పడటం అవసరమని వారు భావించారు.
– వీరిలో ఇటాలియన్ విప్లవకారుడు గిసెప్పి మాజిని ఒకరు. 1805లో జెనీవాలో పుట్టిన ఈయన కార్బోనరికి చెందిన రహస్య సంఘంలో సభ్యుడయ్యాడు. లిగ్వురియాలో తిరుగుబాటుకి ప్రయత్నించినందుకు 1831లో అతడిని దేశం నుంచి బహిష్కరించారు. ఆ తర్వాత అతడు రెండు రహస్య సంఘాలను స్థాపించాడు. మార్సెల్లెస్లోని యంగ్ ఇటలీ మొదటిది కాగా, బెర్న్‌లో యంగ్ యూరప్ రెండోది. రెండో దానిలో ఒకే అభిప్రాయంతో ఉన్న పోలెండ్, ఫ్రాన్స్, ఇటలీ, జర్మనీ దేశాలకు చెందిన యువత సభ్యులు. మానవాళికి సహజ యూనిట్లుగా దేశాలను దేవుడు ఉద్దేశించాడని మాజిని విశ్వసించాడు. కాబట్టి ఇటలీ చిన్నచిన్న దేశాలు, రాజ్యాలతో అతుకుల బొంతగా కొనసాగడానికి వీల్లేదు. అది ఒకే ఒక ఏకీకృత గణతంత్రంగా ఏర్పడి ఇతర దేశాలతో విస్తృత బంధంలో భాగం కావాలి. ఈ ఏకీకరణ ద్వారానే ఇటలీ స్వేచ్ఛను పొందగలదు. అతని నమూనాను అనుసరించి జర్మనీ, ఫ్రాన్స్, స్విట్జర్లాండ్, జర్మనీల్లో రహస్య సంఘాలు ఏర్పడ్డాయి. రాచరికానికి వ్యతిరేకంగా మాజిని చేపట్టిన పోరాటం, ప్రజాస్వామిక గణతంత్రాలపై ఉన్న అతడి ఆశయం చూసి సంప్రదాయవాదులు భయపడసాగారు. మన సామాజిక వ్యవస్థకి అత్యంత ప్రమాదకరమైన శత్రువు అని అతడి గురించి మెటర్నిక్ పేర్కొన్నారు.
– కాల్పనికవాదం, జాతీయభావం: సాంస్కృతిక ఉద్యమమైన కాల్పనికవాదం ఒక ప్రత్యేకమైన జాతీయతా భావాన్ని పెంపొందించడానికి ప్రయత్నించింది. కాల్పనికవాద కవులు, కళాకారులు విజ్ఞానశాస్త్రం, హేతువులకు పెద్దపీట వేయడాన్ని విమర్శించారు. ఉద్వేగాలు, సహజ విజ్ఞానం, మహిమలు వంటి భావనలపై వీళ్లు దృష్టి కేంద్రీకరించారు. ప్రాంతీయ భాష, స్థానిక జానపదకథల సేకరణలు కేవలం పురాతన జాతీయత, స్ఫూర్తిని తిరిగి సాధించడానికి ప్రాధాన్యం ఇవ్వడమే కాకుండా చాలా వరకు నిరక్షరాస్యులైన విస్తృత ప్రజానీకంలోకి జాతీయతా సందేశాన్ని తీసుకెళ్లడానికి దోహదపడ్డాయి.
– 1830 విప్లవం: సంప్రదాయ ప్రభుత్వాలు తమ అధికారాన్ని కట్టుదిట్టం చేసుకొనే ప్రయత్నంలో ఉండటంతో యూరప్‌లోని ఇటలీ, జర్మనీ దేశాల్లో ఒట్టోమాన్ సామ్రాజ్యంలోని రాష్ర్టాల్లో, ఐర్లాండ్, పోలెండ్‌లలో ఉదారవాదం, జాతీయతావాదాలు రానురాను విప్లవానికి దగ్గరకాసాగాయి. మధ్యతరగతిలో పై వర్గాలకు చెందిన ఉదారవాద జాతీయవాదులు ఈ విప్లవాలకు నాయకత్వం వహించసాగారు. 1815 తర్వాత సంప్రదాయవాద ప్రతిచర్యల్లో భాగంగా అధికారం తిరిగి చేజిక్కించుకున్న బూర్బన్ రాజులను ఉదారవాద విప్లవకారులు తొలిగించి 1830 జూలైలో లూయీ ఫిలిప్ అధిపతిగా రాజ్యాంగ రాజరికాన్ని ఫ్రాన్స్‌లో స్థాపించారు.
– వియన్నా సమావేశం ఫ్రాన్స్ సింహాసనంపై 18వ లూయీ ని కూర్చోబెట్టింది. అయితే, తన సోదరుడు 17వ లూయీ లాగా ఇతను నియంత కాదు. 1814 చార్టర్ చట్టం ప్రకారం అతడు పార్లమెంట్ సమ్మతితో పాలన చేశాడు. ఇతని పాలనతో ఫ్రాన్స్ ప్రజలు సంతృప్తిగానే ఉన్నారు. అయితే, 1824లో మూడో సోదరడైన 10వ చార్లెస్ సింహాసనం అధిష్టించాడు. అతడు విప్లవాన్ని వ్యతిరేకించి, ఉన్నత కులీనులు, మతాధిపతులకు ఇచ్చిన ప్రత్యేక హక్కులను పునరుద్ధరించడానికి ప్రయత్నించాడు. 1814 చార్టర్ని పక్కన పెట్టి తన ఇష్టం వచ్చినట్టు పాలించడానికి ప్రయత్నించడంతో అతడిపై జరిగిన బహిరంగ తిరుగుబాటుతో చార్లెస్ పదవిని త్యజించక తప్పలేదు. ఇతని తర్వాత దూరపు బంధువైన లూయీ ఫిలిప్ (1830-48) రాజయ్యాడు.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు