Self-employment | స్వయం ఉపాధి@ ఎంఎస్ఎంఈ
1956లో సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల అభివృద్ధి సంస్థ (ఎంఎస్ఎంఈ-డీఐ)ను బాలానగర్‌లో ఏర్పాటు చేశారు. ఈ సంస్థ సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తున్నది. ఇది నిరుద్యోగులైన యువతీ యువకులు ఆర్థిక స్వావలంబన సాధించడం, స్వయం ఉపాధి కోసం శిక్షణ ఇస్తుంది. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు పరిశ్రమల స్థాపనకు సంబంధించి ప్రాజెక్టు రిపోర్టు తయారీ నుంచి మార్కెటింగ్ వరకు సలహాలు సూచనలు అందజేస్తుంది. ఇప్పటికే స్థాపించిన ఎంఎస్ఈలకు రుణ సౌకర్యాల గురించి తెలుపుతుంది. ఇక్కడ స్వయం ఉపాధి కోసం శిక్షణ పొందాలంటే కనీసం ఎనిమిదో తరగతి ఉత్తీర్ణులై, 18 ఏండ్లు నిండి ఉండాలి. సంస్థ ఆధ్వర్యంలో కెమికల్, మెకానికల్, లెదర్, ఫుట్‌వేర్, మెటలర్జి తదితర విభాగాల్లో పలు కోర్సుల్లో శిక్షణ ఇస్తున్నారు. ఒక రోజు నుంచి 6 నెలల వరకు వ్యవధిగల కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఫీజు నామమాత్రంగా ఉంటుంది.
శిక్షణ ఇచ్చే అంశాలు
-ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు, నిరుద్యోగులైన విద్యాధికులు, యువతీయువకులు, మహిళలకు సాధారణ, నిర్దిష్టమైన వస్తువు ఉత్పాదనలో శిక్షణ ఇస్తారు. పలు రంగాల్లో స్వయం ఉపాధి యూనిట్లు నెలకొల్పే విధంగా ఈ శిక్షణ ఉంటుంది. జ్యూట్ బ్యాగుల తయారీ, ఫుడ్ ప్రాసెసింగ్, ఫ్యాషన్ డిజైనింగ్, మోటార్ రివైండింగ్, లెదర్/ రెగ్జిన్ వస్తువుల తయారీ, కెమికల్ సంబంధిత వస్తువులు, ద్విచక్రవాహనాల రిపేర్, సర్వీసింగ్, మొబైల్ఫోన్లు, కంప్యూటర్ హార్డ్‌వేర్ రిపేరింగ్, కంప్యూటర్ అకౌంటెన్సీ, ట్యాలీ, ఆన్లైన్ మార్కెటింగ్, జీఎస్టీ, అకౌంటింగ్ ప్యాకేజీ, సీఏడీ-సీఏఎం రంగాల్లో ఆరు వారాలు శిక్షణ ఇస్తారు.
-ఎంచుకున్న స్వయం ఉపాధి గురించి సాధారణ, సంబంధిత విషయాలతోపాటు ఎంట్రప్రెన్యూర్షిప్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్, బిజినెస్ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్‌ను నిర్వహిస్తున్నారు. ఇందులో వ్యాపారాభివృద్ధిపై శిక్షణ ఇస్తారు.
-చిన్న, సూక్ష్మ, మధ్యతరహా యూనిట్ల యజమానులు, సూపర్వైజర్ల కోసం మార్కెటింగ్, ఫైనాన్షియల్, ఇండస్ట్రియల్, ఉత్పత్తి, మెటీరియల్, టోటల్కాస్ట్, టోటల్ క్వాలిటీ, ఐఎస్ఓ-9000 తదితర మేనేజ్మెంట్ అంశాల్లో శిక్షణ ఇస్తారు.
-నైపుణ్యాభివృద్ధి కింద సైంటిఫిక్ గ్లాస్ బ్లోయింగ్, మెషీన్షిప్ ప్రాక్టీస్, ఫ్యాబ్రికేషన్ తదితర రంగాల్లో మూడు నెలల నుంచి 6 నెలలపాటు శిక్షణ ఇస్తారు.
-డిటర్జంట్ పౌడర్, లిక్విడ్ సోప్, రూమ్ ఫ్రెష్నర్, షూ పాలిష్ తదితర కెమికల్ వస్తువుల తయారీలో ఒకరోజు శిక్షణ ఇస్తారు.
శిక్షణ తీరు..
-మొదట సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల స్థాపన, నిర్వహణ తదితర అంశాలపై అవగాహన కల్పిస్తారు. అభ్యర్థి ఎంచుకున్న రంగంలో ఎలాంటి అవకాశాలు ఉంటాయి. వ్యాపార ఆలోచనను ఆచరణలో పెట్టడానికి కావాల్సిన సాధనాలను ఎలా సమకూర్చుకోవాలి. పరిశ్రమ స్థాపన, నిర్వహణకు సంబంధించి నాయకత్వ లక్షణాలు పెంపొందించుకోవడం, పుస్తక నిర్వహణ, అకౌంటింగ్ తదితర అంశాలు క్షుణ్ణంగా వివరిస్తారు.
-వస్తువులను ఉత్పత్తి చేయడమే కాదు వాటిని విక్రయించినప్పుడే ఆ పరిశ్రమ మనుగడ సాధించగలుగుతుంది. దీన్ని దృష్టిలోపెట్టుకొని మార్కెటింగ్ మెలకువలపై కూడా అవగాహన కల్పిస్తారు. పరిశ్రమ నెలకొల్పడానికి పెట్టుబడి కావాలి. ఒక్కోసారి పూర్తిస్థాయిలో నగదు అందుబాటులో ఉండకపోవచ్చు. కాబట్టి పెట్టబోయే పరిశ్రమకు ఏయే బ్యాంకుల్లో ఎలాంటి రుణ అవకాశాలు ఉంటాయి. ఇందుకోసం బ్యాంకులను ఎలా సంప్రందించాలి. ఎవరిని కలవాలి తదితర అంశాలపై అవగాహన కల్పిస్తారు. బ్యాంకు రుణంతోపాటు కేంద్ర, రాష్ట్ర పథకాలైన ప్రధానమంత్రి ముద్ర యోజన, స్టార్టప్ మిత్ర, స్టార్టప్ ఇండియా, పీఎంఈజీపీ, జిల్లా పరిశ్రమల కేంద్రం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పారిశ్రామిక పాలసీ, గ్రాంట్లు, రాయితీలు తదితర అవకాశాలపై అవగాహన కల్పిస్తారు.
పరిశ్రమ స్థాపకుల కోసం
-ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు పరిశ్రమ స్థాపనకు అవసరమైన సహాయ సహకారాలను ఎంఎస్ఎంఈ అందిస్తున్నది. వస్తువు ఉత్పత్తి, తయారీ యంత్రాలు, ప్లాంట్ లే అవుట్, ముడిసరుకు, ఆధునికీకరణ, నాణ్యమైన ఉత్పత్తుల అభివృద్ధి, ఇంధన ఆదా, కాలుష్య నియంత్రణ రంగాల్లో కావాల్సిన సహాయ సహకారాలను ఎంఎస్ఎంఈ అందిస్తున్నది. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు సులువుగా రుణాలు పొందడం కోసం ప్రాజెక్టు రిపోర్టులు, వాటి సాధ్యాసాధ్యాల నివేదికలు రూపొందిస్తుంది.
ఎంఎస్ఎంఈ – డీఐ పథకాలు
క్రెడిట్ గ్యారంటీ ఫండ్ ట్రస్ట్
-ఈ పథకం కింద ఏర్పాటుచేసే యూనిట్లకు కోల్లాటరల్ గ్యారంటీ లేని రుణాలు ఇస్తారు. అర్హతగల సంస్థ నుంచి ఇచ్చే కోల్లాటరల్/థర్డ్ పార్టీ గ్యారంటీ ఫ్రీ రుణాలను తీసుకొని కొత్తగా లేదా అప్పటికే స్థాపించిన ఎంఎస్ఈలకు గరిష్ఠంగా రూ. కోటి వరకు క్రెడిట్ కవరేజీ ఉంటుంది.
క్రెడిట్ లింక్డ్ క్యాపిటల్ సబ్సిడీ స్కీమ్
-సూక్ష్మ, లఘు పరిశ్రమల్లో సాంకేతికాభివృద్ధి కోసం ఆర్థికపరమైన సహాయం అందించడం దీని ప్రధాన లక్ష్యం. అనుమతి పొందిన కొన్ని విభాగాల్లో సాంకేతికాభివృద్ధి చేయడంతో ఎంస్ఈలకు 15 శాతం క్యాపిటల్ సబ్సిడీ లభిస్తుంది.
క్లస్టర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్
-ఎంఎస్ఈల ఉత్పాదనను, మంచి పోటీతత్వాన్ని, నిర్మాణ శక్తిని పెంచడానికి ప్రభుత్వం క్లస్టర్ డెవలప్మెంట్ పద్ధతిని కీలకమైన అంశంగా ప్రవేశపెట్టింది. డయాగ్నస్టిక్ స్టడీ రిపోర్టులకు ఒక్కొక్క క్లస్టర్‌కు రూ. 2.5 లక్షలతోపాటు 75 శాతం, 90 శాతం సాఫ్ట్ ఇంటర్వెన్షన్స్కు అత్యధిక రుణం రూ. 25 లక్షలు ఇస్తుంది.
మార్కెట్ అభివృద్ధి సహాయం
-రిజిస్టర్ చేయంచుకున్న ఎంఎస్ఈలకు ప్రపంచ వాణిజ్య ప్రదర్శనల్లో పాల్గొనే అవకాశాలు కల్పిస్తుంది. ఎన్నికైన ఎంఎస్ఈలకు స్టాల్ కిరాయిలో 50 శాతం, విమాన టికెట్లలో 75 శాతం, ఎస్సీ, ఎస్టీ, మహిళా పారిశ్రామికవేత్తలకు 100 శాతం రాయితీ ఇస్తుంది.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు