ఈ వారం జాతీయం-అంతర్జాతీయం
బ్రిటిష్ అకాడమీ ఫిల్మ్ అవార్డ్స్
75వ బ్రిటిష్ అకాడమీ ఫిల్మ్ అవార్డ్స్‌ను లండన్‌లోని రాయల్ ఆల్బర్ట్ హాల్లో మార్చి 13న ప్రదానం చేశారు.
ఉత్తమ చిత్రం- ది పవర్ ఆఫ్ ది డాగ్
ఉత్తమ దర్శకుడు- జేన్ కాంపియన్ (ది పవర్ ఆఫ్ ది డాగ్)
ఉత్తమ నటి- జొవానా స్కాన్లన్ (ఆఫ్టర్ లవ్)
ఉత్తమ నటుడు- విల్ స్మిత్ (కింగ్ రిచర్డ్)
ఔట్‌స్టాండింగ్ (అత్యుత్తమ) బ్రిటిష్ ఫిల్మ్- బెల్ఫాస్ట్
బెస్ట్ సపోర్టింగ్ యాక్ట్రెస్ (నటి)- అరియానా డిబోస్ (వెస్ట్ సైడ్ స్టోరీ)
బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్- ట్రాయ్ కొట్సుర్ (కోడ)
అత్యుత్తమ తొలి ప్రదర్శన (బ్రిటిష్ రచయిత లేదా నిర్మాత)- ది హార్డర్ దే ఫాల్
ఇంగ్లిష్ భాషలో లేని బెస్ట్ ఫిల్మ్- డ్రైవ్ మై కార్
బెస్ట్ యానిమేటెడ్ ఫిల్మ్- ఎన్కాంటో
బెస్ట్ షార్ట్ ఫిల్మ్- ది బ్లాక్ కాప్, చెరిష్ ఒలేకా
ఒరిజినల్ స్క్రీన్ ప్లే- లికోరైస్ పిజ్జా (పాల్ థామస్ అండర్సన్)
అడాప్టెడ్ స్క్రీన్ ప్లే- కోడ (సియాన్ హెడర్)
ఒరిజినల్ స్కోర్- డూన్ (హాన్స్ జిమ్మెర్)
కాస్టింగ్- వెస్ట్ సైడ్ స్టోరీ (సిండి టోలన్)
రోబోటిక్స్ పార్క్
దేశంలోనే తొలిసారిగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ రోబోటిక్స్ టెక్నాలజీ పార్క్‌ను బెంగళూరులో మార్చి 14న ప్రారంభించారు. దీనిని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు.
అక్వేరియం
దేశంలో తొలిసారిగా డిజిటల్ వాటర్ బ్యాంక్ ‘అక్వేరియం’ను మార్చి 14న బెంగళూరులో ప్రారంభించారు. మెరుగైన నీటి నిర్వహణ లక్ష్యంగా ఆక్వా క్రాఫ్ట్ గ్రూప్ వెంచర్స్ దీనిని ఏర్పాటు చేసింది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, స్కిల్ డెవలప్మెంట్, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌తో పాటు స్థిరమైన, గ్రీన్ టెక్నాలజీని మిళితం చేసే ప్రక్రియ ఇది.
చైర్ ఆఫ్ ఎక్సలెన్స్
దివంగత చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ బిపిన్ రావత్ జ్ఞాపకార్థం యునైటెడ్ సర్వీస్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా (యూఎస్ఐ)లో చైర్ ఆఫ్ ఎక్సలెన్స్ విభాగాన్ని మార్చి 15న ఏర్పాటు చేశారు. రావత్ 65వ జయంతి సందర్భంగా భారత సైన్యం ఈ కార్యక్రమం చేపట్టింది. ఈ విభాగం త్రివిధ దళాల మధ్య సమన్వయం, సమగ్రతలపై దృష్టి సారిస్తుంది.
హైడ్రోజన్ వెహికిల్
ప్రపంచంలోనే అత్యంత అధునాతన సాంకేతికతతో అభివృద్ధి చేసిన గ్రీన్ హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ ఎలక్ట్రిక్ వెహికిల్ టయోటా మిరాయ్‌ను మార్చి 16న కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ప్రారంభించారు. దేశంలో మొదటి ఫ్యూయల్ సెల్ ఎలక్ట్రిక్ వెహికిల్ అయిన ఇది పూర్తిగా హైడ్రోజన్‌తో పనిచేస్తుంది.
నాటో సైనిక విన్యాసాలు
నాటో దేశాల ద్వైవార్షిక శీతల వాతావరణ సైనిక విన్యాసాలు ‘కోల్డ్ రెస్పాన్స్-2022’ పేరుతో నార్వేలో మార్చి 14న ప్రారంభమయ్యాయి. నాటోలోని 27 దేశాల నుంచి 30,000కు పైగా సైనికులు ఈ విన్యాసాల్లో పాల్గొన్నారు. భూమి, సముద్రం, గాలి అంశాలను పరీక్షించడానికి నిర్వహిస్తున్న ఈ విన్యాసాలు ఏప్రిల్ మొదటి వారం వరకు నిర్వహించనున్నారు.
రష్యాకు వ్యతిరేకంగా ఓటు
రష్యా-ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో అంతర్జాతీయ న్యాయస్థానంలో మార్చి 16న ఓటింగ్ జరిగింది. రష్యాకు వ్యతిరేకంగా 13 దేశాలు ఓటు వేశాయి. భారత్‌కు చెందిన జడ్జి దల్వీర్ భండారి రష్యాకు వ్యతిరేకంగా ఓటు వేశారు. రెండు దేశాలు రష్యాకు అనుకూలంగా ఓటు వేశాయి. మొత్తం న్యాయమూర్తుల సంఖ్య 15.
గ్రీన్ ట్రయాంగిల్
మహాత్మాగాంధీ గ్రీన్ ట్రయాంగిల్‌ను మడగాస్కర్‌లో భారత రాయబారి అభయ్ కుమార్ మార్చి 16న ప్రారంభించారు. ఈ ఏడాది ఆగస్టు 15 నాటికి భారత్‌కు స్వాతంత్య్రం వచ్చి 75 ఏండ్లు పూర్తి కానున్న సందర్భంగా ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమంలో భాగంగా దీనిని ఆవిష్కరించారు.
వార్తల్లో వ్యక్తులు
కుముద్‌బెన్ జోషి
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ గవర్నర్, సీనియర్ నాయకురాలు కుముద్‌బెన్ మణిశంకర్ జోషి మార్చి 14న మరణించారు. ఆమె 1934, జనవరి 31న జన్మించారు. 1985-1990 మధ్యకాలంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గవర్నర్‌గా పనిచేశారు. ఆ సమయంలో తెలుగు దేశం పార్టీ అధికారంలో ఉంది.
ప్రదీప్ కుమార్
చైనాలో భారత రాయబారిగా ప్రదీప్ కుమార్ రావత్ మార్చి 14న బాధ్యతలు చేపట్టారు. ఈయన 1990 బ్యాచ్ ఐఎఫ్ఎస్ అధికారి. ఇదివరకు నెదర్లాండ్స్‌లో భారత రాయబారిగా పనిచేశారు.
వికాస్ రాజ్
తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారిగా సీనియర్ ఐఏఎస్ అధికారి వికాస్ రాజ్ మార్చి 15న నియమితులయ్యారు. 1992 బ్యాచ్ ఐఏఎస్ అధికారి అయిన ఆయన ప్రస్తుతం సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శిగా పనిచేస్తున్నారు.
భగవంత్ మాన్
పంజాబ్‌కు 18వ సీఎంగా భగవంత్ మాన్ మార్చి 16న ప్రమాణం చేశారు. ఇటీవల వెలువడిన ఎన్నికల ఫలితాల్లో ఆప్ (ఆమ్ ఆద్మీ పార్టీ) 92 స్థానాల్లో గెలిచింది. కాంగ్రెస్ పార్టీ 18 స్థానాలు, మిగిలిన స్థానాలు ఇతరులు గెలుచుకున్నారు.
నారాయణ్
31వ జీడీ బిర్లా అవార్డు ప్రొఫెసర్ నారాయణ్ ప్రధాన్‌కు మార్చి 16న లభించింది. మెటీరియల్ సైన్సెస్ రంగంలో ఆయన చేసిన విశేష కృషికి గాను ఈ అవార్డు దక్కింది. 1991లో ప్రారంభించిన ఈ అవార్డును 50 ఏండ్ల కంటే తక్కువ వయస్సున్న సైంటిస్టులకు ప్రదానం చేస్తున్నారు. ఈ అవార్డు కింద రూ.5 లక్షల నగదు అందజేస్తారు.
ఆశిష్ ఝా
వైట్ హౌస్ కొవిడ్-19 రెస్పాన్స్ కో ఆర్డినేటర్‌గా ఇండో-అమెరికన్ ఆశిష్ ఝాను అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మార్చి 17న నియమించారు. కరోనా నిర్మూలనపై ప్రజల్లో అవగాహన కల్పించడం, వ్యాక్సిన్ పంపిణీ కార్యక్రమాలను ఈయన పర్యవేక్షిస్తారు.
కరోలినా బీలావ్స్కా
2021కు గాను మిస్ వరల్డ్‌గా మిస్ పోలెండ్ కరోలినా బీలావ్స్కా ఎంపికయ్యింది. 70వ మిస్ వరల్డ్ పోటీలు పోర్టోరికో రాజధాని సాన్ జువాన్లోని కోకా-కోలా మ్యూజిక్ హాల్లో మార్చి 17న నిర్వహించారు. ఈ పోటీల్లో 100 దేశాలకు చెందిన అందగత్తెలు పాల్గొనగా టాప్‌లో 13 మందికి చోటు లభించింది. రన్నరప్‌గా అమెరికాకు చెందిన శ్రీ సైనీ నిలిచింది. ఈ పోటీల్లో పాల్గొన్న మిస్ ఇండియా మానస వారణాసి (తెలంగాణ) టాప్ 13లో చోటు దక్కించుకుంది.
క్రీడలు
కున్లావుట్ వితిద్సర్న్
- యోనెక్స్ గెయిన్వార్డ్ జర్మన్ ఓపెన్ బ్యాడ్మింటన్-2022 పురుషుల సింగిల్స్ టైటిల్‌ను థాయిలాండ్ ఆటగాడు కున్లావుట్ వితిద్సర్న్ గెలుచుకున్నాడు.
- బీడబ్ల్యూఎఫ్ (బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్) వరల్డ్ టూర్ సూపర్ 300 ఈవెంట్ ఫైనల్ మ్యాచ్‌ను మ్యూల్హీమ్లో మార్చి 13న నిర్వహించారు. ఈ మ్యాచ్‌లో కున్లావుట్ భారత ఆటగాడు లక్ష్యసేన్‌ను ఓడించాడు.
- మహిళల సింగిల్స్‌లో చైనా క్రీడాకారిణి హీ బింగ్జియావో విజేతగా నిలిచింది. ఆమె తన దేశానికి చెందిన క్రీడాకారిణి చెన్ యుఫీని ఓడించింది.
- పురుషుల డబుల్స్‌లో మలేషియా ఆటగాళ్లు గోహ్ జే ఫీ, నూర్ ఇజుద్దిన్ విజేతలుగా నిలిచారు. మహిళల డబుల్స్‌లో చెనాకు చెందిన చెన్ క్విన్చెన్, జియా ఇఫాన్ గెలుపొందారు.
- మిక్స్డ్ డబుల్స్‌లో థాయిలాండ్‌కు చెందిన డెచాపోల్ పువరానుక్రోహ్, సప్సిరీ తేరత్తనాచెయ్ విజయం సాధించారు.
శుభ్‌మన్ గిల్, రుతురాజ్ గైక్వాడ్
ప్రముఖ డిజిటల్ స్కిల్ గేమ్ కంపెనీ గేమ్స్ 24X7 ప్రైవేట్ లిమిటెడ్ బ్రాండ్ అంబాసిడర్లుగా శుభ్‌మన్ గిల్, రుతురాజ్ గైక్వాడ్‌లను మార్చి 15న నియమించింది. వీరు ఈ కంపెనీకి చెందిన My 11 Circle ఫాంటసీ గేమింగ్‌కు ప్రచారకర్తలుగా వ్యవహరించనున్నారు.
అనిర్బన్ లాహిరి
భారత క్రీడల చరిత్రలో ఏ క్రీడాంశంలోనయినా వ్యక్తిగత విభాగంలో అత్యధిక బహుమతి పొందిన ఆటగాడిగా గోల్ఫ్ క్రీడాకారుడు అనిర్బన్ లాహిరి రికార్డు సాధించాడు. మార్చి 15న అమెరికాలోని ఫ్లోరిడాలో ఉన్న పొంటె వెడ్రా బీచ్‌లో జరిగిన గోల్ఫ్ టోర్నీలో కెమెరాన్ స్మిత్ (ఆస్ట్రేలియా) విజేతగా నిలువగా అనిర్బన్ రన్నరప్‌గా నిలిచాడు. దీంతో అనిర్బన్కు ప్రైజ్‌మనీ కింద సుమారు రూ.16.56 కోట్లు దక్కాయి. ఇంత పెద్ద మొత్తంలో వ్యక్తిగత విభాగంలో ఏ ఒక్క భారత ఆటగాడు అందుకోలేదు.
సురంగ లక్మల్
శ్రీలంక పేస్ బౌలర్ సురంగ లక్మల్ మార్చి 15న అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. 70 టెస్టుల్లో 171 వికెట్లు, 86 వన్డేల్లో 109 వికెట్లు, 11 టీ20ల్లో 8 వికెట్లు తీశాడు.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు