Paramedical | సేవా మార్గం.. పారామెడికల్
ఇంటర్మీడియట్ తర్వాత దారెటు? కేవలం మెడిసిన్, ఇంజినీరింగ్ మాత్రమేనా? ప్రవేశ పరీక్షలు పూర్తయ్యాయి. ఫలితాల కోసం ఎదురుచూస్తున్న వేళ విద్యార్థులు, తల్లిదండ్రుల్లో కొంత అయోమయం ఉంటుంది. ఎంత ర్యాంక్ వస్తుంది.. ఏ సీటు వస్తుంది, ఏ కోర్సు తీసుకోవాలి, ఏ కాలేజీ ఎంపికచేసుకోవాలి? ఉపాధి అవకాశాలు ఎలా ఉంటాయి? మెడిసిన్‌లో సీటు రాకపోతే? ఇలాంటి సందేహాలు విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు సహజం. ప్రధాన స్రవంతి కోర్సుల్లో అడ్మిషన్ రానంత మాత్రాన నిరుత్సాహం అవసరం లేదు. ఇదిగో ఈ ప్రత్యామ్నాయ కోర్సులను ఓసారి పరిశీలించండి…!
చాలామందికి తెలియని, ఎంతో ఉపయుక్తమైన, ఉపాధికి భరోసానిచ్చే వృత్తి విద్యాకోర్సులు వైద్యఆరోగ్య రంగంలో చాలానే ఉన్నాయి. ముఖ్యంగా ఇంటర్ బైపీసీ, ఎంపీసీ విద్యార్థులకు ఫిజియోథెరపీ, నర్సింగ్ కోర్సులే కాకుండా ఎన్నో స్పెషాలిటీల్లో పారామెడికల్ డిప్లొమా, డిగ్రీ, అడ్వాన్స్డ్ డిప్లొమా, పీజీ డిప్లొమా, పీజీ కోర్సులను ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు ఆఫర్ చేస్తున్నాయి. సరైన అవగాహన, ప్రచారం లేకపోవడంతో చాలా కోర్సుల్లో సీట్లు మిగిలిపోతున్నాయి.
-వైద్యవృత్తిలో స్థిరపడాలనుకుని ఒకవేళ మెడిసిన్, డెంటల్, హోమియోపతి కోర్సుల్లో సీటురాకపోతే నిరాశపడకుండా పారామెడికల్ కోర్సులు ప్రయత్నించవచ్చు. మంచి జీతం, రోగులకు సేవచేశామన్న సంతృప్తి ఈ కోర్సుల ద్వారా లభిస్తుంది. 10+2 ఇంటర్ బైపీసీ పూర్తిచేసినవారికి రెండేండ్ల డిప్లొమా కోర్సులు, డిగ్రీ కోర్సులు అదేవిధంగా సైన్స్ డిగ్రీ పూర్తిచేసిన వారికి పోస్ట్‌గ్రాడ్యుయేషన్ డిప్లొమా కోర్సులు అందుబాటులో ఉన్నాయి. కొన్ని సంస్థలు అడ్వాన్స్డ్ డిప్లొమా కోర్సులను కూడా వివిధ స్పెషాలిటీల్లో అందిస్తున్నాయి.
-ఈ కోర్సులు కేవలం మన రాష్ట్రంలోనే కాకుండా ఇతర రాష్ర్టాల్లో చేసే వీలుంది. తెలంగాణలోని ప్రభుత్వ, ప్రైవేటు దవాఖానల్లో ఈ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. తెలంగాణ పారామెడికల్ బోర్డు ఆయా కోర్సులకు జూన్‌లో నోటిఫికేషన్ విడుదల చేయనుంది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్‌లో జూలైలో నోటిఫికేషన్ రావచ్చు. వీటితోపాటు మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, ఢిల్లీలో కూడా మన విద్యార్థులు అడ్మిషన్ పొందొచ్చు.
-ఉస్మానియా, గాంధీ, ఎంజీఎం వరంగల్, ఎంఎన్‌జే క్యాన్సర్, జిల్లా దవాఖానలు, ఇతర ప్రైవేటు హాస్పిటళ్లలో నిర్వహించే ఈ కోర్సులకు పారామెడికల్ బోర్డు అడ్మిషన్ ప్రక్రియ నిర్వహిస్తుంది.
పారామెడికల్ డిగ్రీ కోర్సులు
-తెలంగాణలో పారామెడికల్ సైన్సెస్‌లో డిగ్రీ కోర్సులు అందుబాటులో లేవు. కానీ నాలుగేండ్ల ఈ డిగ్రీ కోర్సులకు దేశ, విదేశాల్లో మంచి డిమాండ్ ఉంది. తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ (స్విమ్స్) దాదాపు తొమ్మిది స్పెషాలిటీల్లో డిగ్రీ కోర్సులను నిర్వహిస్తున్నది. అంతేకాకుండా బీఎస్సీ నర్సింగ్, బీఎస్సీ ఫిజియోథెరపీ కోర్సులు కూడా అభ్యసించవచ్చు. వీటికి 10+2 సైన్స్ విద్యార్థులు అర్హులు. నోటిఫికేషన్ జూన్ లేదా జూలైలో వస్తుంది.
స్విమ్స్‌లో డిగ్రీ కోర్సులు (నాలుగేండ్లు)
-బీఎస్సీ నర్సింగ్
-బీఎస్సీ అనస్థీషియా టెక్నాలజీ
-బీఎస్సీ మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ
-బీఎస్సీ న్యూరోఫిజియాలజీ టెక్నాలజీ
-బీఎస్సీ యూరాలజీ
-బీఎస్సీ రేడియోగ్రఫీ అండ్ ఇమేజింగ్ టెక్నాలజీ
-బీఎస్సీ న్యూక్లియర్ మెడిసిన్ టెక్నాలజీ
-బీఎస్సీ డయాలసిస్ టెక్నాలజీ
-బీఎస్సీ కార్డియాక్ పల్మనరీ పర్ఫ్యూజన్ టెక్నాలజీ
పోస్టు గ్రాడ్యుయేట్ పారామెడికల్ కోర్సులు
-మెడికల్ రికార్డ్ సైన్సెస్- ఏదైనా డిగ్రీ చేసినవారు అర్హులు
-డయాలసిస్ టెక్నాలజీ- బీఎస్సీ లైఫ్ సైన్సెస్ అర్హత
-కార్డియాక్ పల్మనరీ పర్ఫ్యూజన్ టెక్నాలజీ- బీఎస్సీ లైఫ్ సైన్సెస్ అర్హత
చెన్నైలోని శ్రీరామచంద్ర మెడికల్ కాలేజీ కూడా పారామెడికల్ సైన్సెస్‌లో వివిధ డిగ్రీ కోర్సులను అందిస్తున్నది. అయితే అడ్మిషన్ ప్రక్రియ ఇప్పటికే పూర్తయ్యింది.
-ముంబైలోని టాటా మెమోరియల్ సెంటర్ రెండేండ్ల కాలవ్యవధిగల అడ్వాన్స్డ్ డిప్లొమా కోర్సులను నిర్వహిస్తున్నది.
-న్యూఢిల్లీలోని అభిలభారత వైద్యవిజ్ఞాన పరిషత్ (ఎయిమ్స్) 10+2 సైన్స్ విద్యార్థులకు డిగ్రీ కోర్సులను ఆఫర్ చేస్తున్నది.
-ఆన్లైన్ ద్వారా ఎన్నో ప్రైవేటు సంస్థలు ఇలాంటి కోర్సులను అందిస్తున్నాయి. అలాంటివాటి పట్ల జాగ్రత్తగా ఉండాలి. ఆయా సంస్థలకు రాష్ట్ర ప్రభుత్వ గుర్తింపుకానీ, మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా గుర్తింపుకాని ఉండదు.
నిమ్స్‌లో పారామెడికల్ కోర్సులు
ఇంటర్ సైన్స్ విద్యార్థులకు
-బీఎస్సీ (నర్సింగ్): నాలుగేండ్ల కాలవ్యవధి. అర్హత ఇంటర్ మార్కుల ప్రాతిపదికన అమల్లో ఉన్న రిజర్వేషన్లను అనుసరిస్తున్నది.
బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపీ
-నాలుగున్నరేండ్ల కాలవ్యవధి గల ఈ కోర్సు చేయడానికి ఇంటర్లో బైపీసీ మార్కులను ప్రాతిపదికగా తీసుకుంటారు.
సైన్స్ గ్రాడ్యుయేట్లకు పీజీ డిప్లొమా కోర్సులు
-మెడికల్ ల్యాబొరేటరీ టెక్నాలజీ (12 సీట్లు)
-అనస్థీషియా టెక్నాలజీ (8 సీట్లు)
-కార్డియాక్, పల్మనరీ పర్ప్యూజన్ టెక్నాలజీ (4 సీట్లు)
-కార్డియాక్ వాస్కులర్ టెక్నాలజీ (2 సీట్లు)
-డయాలసిస్ టెక్నాలజీ (40 సీట్లు)
-ఎమర్జెన్సీ మెడికల్ టెక్నాలజీ (10 సీట్లు)
-న్యూరో టెక్నాలజీ (2 సీట్లు)
-న్యూక్లియర్ మెడిసిన్ టెక్నాలజీ (4 సీట్లు)
-రేడియేషన్ థెరపీ టెక్నాలజీ (4 సీట్లు)
-రేడియోగ్రఫీ అండ్ ఇమేజింగ్ టెక్నాలజీ (8 సీట్లు)
-రెస్పిరేటరీ థెరపీ టెక్నాలజీ (12 సీట్లు)
-ట్రాన్స్ఫ్యూజన్ మెడిసిన్ టెక్నాలజీ (2 సీట్లు)
-రెండేండ్ల కాలవ్యవధి ఉండే ఈ కోర్సులు పూర్తయిన తర్వాత ఏడాదిపాటు ఇంటర్న్‌షిప్ చేయాలి. ఈ సమయంలో రూ. 17,000 స్టయిఫండ్‌గా చెల్లిస్తారు. దీనితర్వాత ప్రభుత్వ లేదా ప్రైవేటు ఉద్యోగాల్లో చేరవచ్చు. ఆకర్షణీయమైన జీతం, వైద్య సదుపాయాలు లభిస్తాయి.
-నోటిఫికేషన్ జూన్ నెలలో వస్తుంది. బీఎస్సీ లైఫ్‌సైన్స్ చేసి ఉండాలి. ఇతర వివరాలకు www.nims.edu.in చూడవచ్చు.
పారా మెడికల్ డిప్లొమా కోర్సులు
-డిప్లొమా ఇన్ మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ
-డిప్లొమా ఇన్ ఆప్తాల్మిక్ అసిస్టెంట్ కోర్సు
-డిప్లొమా ఇన్ మెడికల్ ఇమేజింగ్ టెక్నాలజీ
-డిప్లొమా ఇన్ మెడికల్ స్టెరిలైజేషన్ అండ్ ఆపరేషన్ థియేటర్ టెక్నాలజీ
-డిప్లొమా ఇన్ పర్ఫ్యూజన్ టెక్నాలజీ
-డిప్లొమా ఇన్ ఆప్టోమెట్రీ టెక్నాలజీ
-డిప్లొమా ఇన్ రేడియోథెరపీ టెక్నాలజీ
-డిప్లొమా ఇన్ రేడియోగ్రాఫిక్ అసిస్టెంట్ కోర్సు
-డిప్లొమా ఇన్ కార్డియాలజీ టెక్నీషియన్ కోర్సు
-డిప్లొమా ఇన్ క్యాథ్‌ల్యాబ్ టెక్నాలజీ
-డిప్లొమా ఇన్ అనస్థీషియా టెక్నాలజీ
-డిప్లొమా ఇన్ మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్
విద్యార్హతలు
-10+2 విధానంలో ఇంటర్లో బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ (బైపీసీ) చేసినవారు. బైపీసీ వారు అందుబాటులో లేనప్పుడు ఎంపీసీ చేసినవారు కూడా అడ్మిషన్ పొందవచ్చు.
-కాలవ్యవధి: రెండేండ్లు
-ఎంపిక విధానం: ఇంటర్ మార్కుల ఆధారంగా ఆన్లైన్ అడ్మిషన్లు.
-మరిన్ని వివరాలు తెలంగాణ పారామెడికల్ బోర్డుకు చెందిన వెబ్సైట్ www.tspmb.gov.in ద్వారా తెలుసుకోవచ్చు.
-ఈ కోర్సులన్నీ ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ ప్రభుత్వ, ప్రైవేటు దవాఖానల్లో కూడా అందుబాటులో ఉన్నాయి. నాన్‌లోకల్ కింద అక్కడ అడ్మిషన్ పొందవచ్చు. ఆంధ్రప్రదేశ్‌లోని రంగరాయ మెడికల్ కాలేజీ, సిద్ధార్థ మెడికల్ కాలేజీ, గుంటూరు మెడికల్ కాలేజీ, శ్రీవేంకటేశ్వర మెడికల్ కాలేజీ, రాజీవ్ గాంధీ విద్యా విజ్ఞాన సంస్థ- కడప, కర్నూలు మెడికల్ కాలేజీ, అనంతపురం ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో ఈ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ పారామెడికల్ బోర్డు ఈ నోటిఫికేషన్‌ను జూన్ లేదా జూలై నెలల్లో విడుదల చేయనుంది. వివరాలకు www.apspmb.gov.in చూడవచ్చు.
పోస్టుగ్రాడ్యుయేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రిసెర్చ్- చండీగఢ్ అదిస్తున్న పారామెడికల్ కోర్సులు
-బీఎస్సీ మెడికల్ ల్యాబొరేటరీ (మూడేండ్లు)
-బీఎస్సీ మెడికల్ ఎక్స్‌రే టెక్నాలజీ (మూడేండ్లు)
-బీఎస్సీ ఆడియాలజీ అండ్ స్పీచ్ థెరపీ (నాలుగేండ్లు)
-బీఎస్సీ రేడియోథెరపీ (మూడేండ్లు)
-బీఎస్సీ ఫిజికల్ థెరపీ (నాలుగున్నరేండ్లు)
-బీఎస్సీ పర్ఫ్యూజన్ టెక్నాలజీ (మూడేండ్లు)
-ఈ కోర్సులకు సంబంధించిన నోటిఫికేషన్ ఆగస్టు లేదా సెప్టెంబర్‌లో వచ్చే అవకాశం ఉంది. వివరాలకు pgimer.edu.in వెబ్సైట్ చూడవచ్చు.
-కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరి ప్రభుత్వం బీఎస్సీ ఫిజియోథెరపీ, నర్సింగ్, మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ కోర్సులను అందిస్తున్నది. అడ్మిషన్ ప్రక్రియ సెంట్రలైజ్డ్ అడ్మిషన్ కమిటీ. పుదుచ్చేరి ప్రభుత్వం ఎంబీబీఎస్, బీడీఎస్, ఇంజినీరింగ్‌లతోపాటు ఏకకాలంలో చేపడుతుంది. వివరాలకు www.centaconling.in చూడవచ్చు.
-శాస్త్ర సాంకేతికత అభివృద్ధి చెందుతున్న తరుణంలో వైద్య ఆరోగ్య రంగంలో పలు విప్లవాత్మక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. రోగ నిర్ధారణ పరీక్షల్లో కచ్చితత్వం పెరగింది. పలు రోగ నిర్ధారణ, చికిత్స పద్ధతులు టెక్నాలజీపై ఆధారపడ్డాయి. ఈ రంగంలో చాలా అవకాశాలు లభిస్తున్నాయి. అందువల్ల ఈ కోర్సులు పూర్తిచేసినట్లయితే ప్రభుత్వ, ప్రైవేటు, కార్పొరేట్ రంగాల్లో కచ్చితంగా ఉపాధి లభిస్తుంది. సొంతంగా డయాగ్నస్టిక్ సెంటర్లు, రోగ నిర్ధారణ కేంద్రాలు ఏర్పాటు చేసుకోవచ్చు.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు