Forensic science is gold | ఫోరెన్సిక్ సైన్స్-భవిష్యత్తు బంగారమే..
ప్రపంచవ్యాప్తంగా నేరాలు పెరిగిపోతున్నాయి. మనదేశంలోనూ వాటి సంఖ్య తక్కువేమీ కాదు. ఎక్కడో ఒకచోట ప్రతినిత్యం హత్యలు, అత్యాచారాలు, దోపిడీలు, దొంగతనాలు జరుగుతూనే ఉన్నాయి. ఇలాంటి సందర్భాల్లో ఘటనా స్థలాల్లో లభించే ఆధారాలను సేకరించి, విశ్లేషించి దోషులెవరో నిర్ధారించడంలో కీలక భూమిక పోషించేదే ఫోరెన్సిక్ సైన్స్. అదేవిధంగా రోజురోజుకు టెక్నాలజీ వాడకం పెరుగుతుండటంతో సైబర్ నేరాలూ తీవ్రమయ్యాయి. ఈ తరహా మోసగాళ్లను గుర్తించడంలో కూడా ఫోరెన్సిక్ సైన్స్‌దే కీలకపాత్ర. ప్రస్తుతం ఫోరెన్సిక్ సైన్సెస్ చదివిన వారికి ఉపాధి, ఉద్యోగాలకు కొదువలేదు. ఈ నేపథ్యంలో ఫోరెన్సిక్ సైన్స్ ప్రాముఖ్యత, కోర్సులు, కాలేజీల వివరాలు నిపుణ పాఠకుల కోసం…
ఫోరెన్సిక్ సైన్స్ ప్రాముఖ్యత
-ఈ రోజుల్లో నేరగాళ్లను గుర్తించడంలో ఫోరెన్సిక్ సైన్స్ సమర్థవంతమైన అస్త్రంగా పనిచేస్తున్నది. దీంతో ఈ రంగంలో ఉద్యోగ అవకాశాలు వేగంగా విస్తరిస్తున్నాయి. ఏదైనా ఘటన జరిగినప్పుడు అందుబాటులో ఉన్న ఆధారాలు సేకరించి, వాటి ద్వారా లభ్యమైన సమాచారాన్ని విశ్లేషించి, అసలు దోషులు ఎవరో నిర్ధారించడం ఫోరెన్సిక్ నిపుణుల ప్రధాన కర్తవ్యం. ఘటనాస్థలంలో వెంట్రుక, గోరు, దంతం, రక్తం, ఇతర కణజాలం ఇలా ఏ శాంపిల్ లభించినా దాన్ని ల్యాబ్‌లో పరీక్షించి, సంబంధిత వ్యక్తి ఎవరో నిర్ధారించడంలో ఫోరెన్సిక్ విభాగం ప్రధానపాత్ర పోషిస్తుంది. అదేవిధంగా సైబర్ నేరగాళ్లను గుర్తించడంలో కూడా ఫోరెన్సిక్ విభాగం కీలకంగా వ్యవహరిస్తుంది.
ఎవరు రాణించొచ్చు?
-నేరాలకు సంబంధించిన పలు కేసుల పరిష్కారంలో ఫోరెన్సిక్ నిపుణులదే కీలకపాత్ర కాబట్టి ఈ రంగంలో రాణించాలంటే కొన్ని ప్రత్యేక లక్షణాలు ఉండాలి. ముఖ్యంగా నలుగురితో కలిసి పనిచేసే నేర్పు, ఆలోచన విధానాల్లో చురుకుదనంతోపాటు సైన్స్పట్ల ఆసక్తి, గణితంలో ప్రావీణ్యం, విభిన్న పద్ధతుల్లో సమాచారాన్ని సేకరించి విశ్లేషించగల సామర్థ్యం, వాస్తవానికి దగ్గరగా ఊహించడం, సునిశిత పరిశీలన, ఇన్వెస్టిగేషన్పట్ల అభిరుచి మొదలైన నైపుణ్యాలు ఉన్నవాళ్లు ఈ రంగంలో రాణించే అవకాశాలున్నాయి.
కోర్సులు – వివరాలు
-దేశంలో డిగ్రీ, పీజీ, పీహెచ్డీ స్థాయిల్లో పలు ఫోరెన్సిక్ సైన్స్ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఇంటర్ అర్హతతో బీఎస్సీ ఫోరెన్సిక్ సైన్స్ కోర్సులో చేరవచ్చు. సైన్స్ సబ్జెక్టులతో డిగ్రీ పూర్తిచేసినవారు ఎమ్మెస్సీ ఫోరెన్సిక్ సైన్స్ కోర్సులు చేయడానికి అర్హులు. ఫోరెన్సిక్ సైన్స్‌లో పీజీ పూర్తిచేసిన తర్వాత పీహెచ్‌డీలో చేరవచ్చు. కొన్ని సంస్థలు ఫోరెన్సిక్ సైన్స్‌లో సర్టిఫికెట్, డిప్లొమా కోర్సులను కూడా ఆఫర్ చేస్తున్నాయి.
డిగ్రీ కోర్సులు
బీఎస్సీ ఇన్ ఫోరెన్సిక్ సైన్స్
-కోర్సు వ్యవధి: మూడేండ్లు.
-అర్హతలు: సైన్స్ గ్రూప్‌తో ఇంటర్ ఉత్తీర్ణులైనవారు ఈ కోర్సులో చేరడానికి అర్హులు.
బీటెక్ కంప్యూటర్ సైన్స్ (ఐటీ సెక్యూరిటీ అండ్ ఫోరెన్సిక్స్)
-కోర్సు వ్యవధి: నాలుగేండ్లు.
-అర్హతలు: ఈ కోర్సులో కూడా ఇంటర్ ఉత్తీర్ణులైనవారు ప్రవేశం పొందవచ్చు.
పీజీ కోర్సులు
-1. ఎమ్మెస్సీ ఇన్ ఫోరెన్సిక్ సైన్స్
-2. ఎమ్మెస్సీ ఇన్ డిజిటల్ ఫోరెన్సిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ
-3. ఎమ్మెస్సీ ఇన్ ఫోరెన్సిక్ కెమిస్ట్రీ
-4. ఎంటెక్ ఇన్ సైబర్ సెక్యూరిటీ అండ్ ఇన్సిడెంట్ రిపోర్ట్
-5. ఎంటెక్ ఇన్ ఐటీ సెక్యూరిటీ అండ్ ఫోరెన్సిక్స్
-6. ఎంబీఏ ఫైనాన్స్ (ఫోరెన్సిక్ అకౌంటింగ్)
కోర్సుల వ్యవధి: ఇవి రెండేండ్ల కాలవ్యవధి కలిగిన కోర్సులు.
అర్హతలు: డిగ్రీ ఉత్తీర్ణులైనవారు ఈ కోర్సుల్లో చేరడానికి అర్హులు.
-7. పీజీ డిప్లొమా ఇన్ ఫోరెన్సిక్ డాక్యుమెంట్ ఎగ్జామినేషన్
-8. పీజీ డిప్లొమా ఇన్ ఫింగర్‌ప్రింట్ సైన్స్
-9. పీజీ డిప్లొమా ఇన్ ఫోరెన్సిక్ మేనేజ్మెంట్
-10. పీజీ డిప్లొమా ఇన్ ఫోరెన్సిక్ అకౌంటింగ్
-11. పీజీ డిప్లొమా ఇన్ ఫోరెన్సిక్ టాక్సికాలజీ
కోర్సుల వ్యవధి: ఇవి ఏడాది కాలవ్యవధి కలిగిన కోర్సులు.
అర్హతలు: ఈ కోర్సుల్లో చేరడానికి కూడా డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.
పీహెచ్డీ కోర్సులు
-1. పీహెచ్డీ ఇన్ ఫోరెన్సిక్ సైన్స్
-2. పీహెచ్డీ ఇన్ డిజిటల్ ఫోరెన్సిక్స్
-3. పీహెచ్డీ ఇన్ ఫోరెన్సిక్ పాథాలజీ
-4. పీహెచ్డీ ఇన్ ఫోరెన్సిక్ కెమిస్ట్రీ
అర్హతలు: సంబంధిత విభాగంలో పీజీ ఉత్తీర్ణులైనవారు ఈ కోర్సుల్లో చేరడానికి అర్హులు.
ఫోరెన్సిక్ కోర్సులు అందిస్తున్న విద్యాసంస్థలు
-దేశంలో పలు విద్యాసంస్థలు, యూనివర్సిటీలు ఫోరెన్సిక్ సైన్స్ కోర్సులను ఆఫర్ చేస్తున్నాయి. వాటిలో కొన్ని ముఖ్యమైన సంస్థలు..
-1. గుజరాత్ ఫోరెన్సిక్ సైన్స్ యూనివర్సిటీ- గాంధీనగర్ (గుజరాత్)
-2. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్రిమినాలజీ అండ్ ఫోరెన్సిక్ సైన్స్- ఢిల్లీ
-3. బుందేల్‌ఖండ్ యూనివర్సిటీ- ఝాన్సీ (యూపీ)
-4. భీంరావు అంబేద్కర్ యూనివర్సిటీ- ఆగ్రా
-5. ఉస్మానియా యూనివర్సిటీ- హైదరాబాద్
-6. IFS ఇండియా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్- పుణె
-7. పంజాబ్ యూనివర్సిటీ- చండీగఢ్ (పంజాబ్)
-8. అమిటీ యూనివర్సిటీ- నోయిడా
-9. హరిసింగ్ గౌర్ యూనివర్సిటీ- మధ్యప్రదేశ్
-10. యూనివర్సిటీ ఆఫ్ మద్రాస్- తమిళనాడు
-వీటితోపాటు ఇంకా పలు కాలేజీలు, సంస్థలు ఫోరెన్సిక్ సైన్స్ కోర్సులను ఆఫర్ చేస్తున్నాయి.
నోట్: కొన్ని కాలేజీల్లో పీజీ, పీహెచ్డీ కోర్సులు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. మరికొన్ని కాలేజీలు డిగ్రీ కోర్సులను కూడా ఆఫర్ చేస్తున్నాయి. ఇంటర్ అర్హతతో ఫోరెన్సిక్ డిగ్రీ కోర్సుల్లో చేరవచ్చు. ఏ సబ్జెక్టులతో డిగ్రీ పూర్తిచేసినా ఫోరెన్సిక్ సెన్స్‌లో పీజీ చదవచ్చు. పీహెచ్డీ కోర్సులకు మాత్రం ఫోరెన్సిక్ పీజీ ఉన్నవారు మాత్రమే అర్హులు.
ఉద్యోగ అవకాశాలు
-ఫోరెన్సిక్ సైన్స్ కోర్సులు చేసినవారికి మంచి ఉద్యోగ, ఉపాధి అవకాశాలున్నాయి. అభ్యర్థి ఎంచుకున్న స్పెషలైజేషన్ ఆధారంగా ప్రభుత్వ, ప్రైవేటు డిటెక్టివ్ ఏజెన్సీలు, దవాఖానలు, ల్యాబొరేటరీల్లో ఉద్యోగాలు లభిస్తాయి. యాంటీ టెర్రరిస్ట్ ఆపరేషన్స్, మాస్ డిజాస్టర్ మేనేజ్మెంట్, సైబర్‌క్రైమ్ ఇన్వెస్టిగేషన్, కన్జ్యూమర్ ప్రొటెక్షన్ అండ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ తదితర విభాగాల్లో ఉద్యోగావకాశాలుంటాయి. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ), ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ), రిసెర్చ్ ఆర్గనైజేషన్లు, పోలీస్ శాఖల్లో ఫోరెన్సిక్ నిపుణులు కీలకపాత్ర పోషిస్తారు. కొన్ని కార్పొరేట్ కంపెనీలు ఫోరెన్సిక్ నిపుణులను డాక్యుమెంట్ రైటర్లుగా కూడా నియమించుకుంటున్నాయి. అంతేగాక ఏ రాష్ట్రంవారు ఆ రాష్ట్ర ఫోరెన్సిక్ విభాగం నుంచి సర్టిఫికేషన్ తీసుకుని ఫ్రీలాన్సర్లుగా కూడా రాణించవచ్చు. ఫోరెన్సిక్ సైన్స్‌లో ఎంఫిల్, పీహెచ్డీ చేసినవారు కాలేజీలు, యూనివర్సిటీల్లో అధ్యాపకులుగా కూడా స్థిరపడవచ్చు.
వివిధ హోదాలు
-అభ్యర్థి చదివిన కోర్సునుబట్టి ఫోరెన్సిక్ పాథాలజిస్ట్, క్రైమ్ ల్యాబొరేటరీ అనలిస్ట్, ఫోరెన్సిక్ ఇంజినీర్, ఫోరెన్సిక్ ఆర్కిటెక్ట్, ఫోరెన్సిక్ ఆర్కియాలజిస్ట్, వైల్డ్‌లైఫ్ ఫోరెన్సిక్ స్పెషలిస్ట్, ఫోరెన్సిక్ సైకియాట్రిస్ట్, ఫోరెన్సిక్ టాక్సికాలజిస్ట్, ఫోరెన్సిక్ ఒడొంటాలజిస్ట్, ఫోరెన్సిక్ బయాలజిస్ట్, ఫోరెన్సిక్ మైక్రోబయాలజిస్ట్, ఫోరెన్సిక్ ఎంటమాలజిస్ట్, ఫోరెన్సిక్ కెమిస్ట్, ఫోరెన్సిక్ డీఎన్ఏ అనలిస్ట్, బ్లడ్స్టెయిన్ ప్యాటర్న్ అనలిస్ట్ తదితర హోదాల్లో ఫోరెన్సిక్ నిపుణులు బాధ్యతలు నిర్వహిస్తారు.
వేతనం
-ఫోరెన్సిక్ సైన్సులో డిగ్రీ పూర్తిచేసినవారికి రూ. 20,000 – 50,000 వేలవరకు ప్రారంభవేతనం లభిస్తుంది. ప్రతిభ, అనుభవం ఆధారంగా భవిష్యత్తులో లక్షల్లో జీతాలు అందుకునే అవకాశం ఉంటుంది.
ప్రవేశాలు ఎప్పుడు?
-ఫోరెన్సిక్ సైన్స్ కోర్సులకు సంబంధించి ప్రతి ఏడాది వేర్వేరు యూనివర్సిటీల్లో వేర్వేరు సమయాల్లో ప్రవేశాలు జరుగుతాయి. గుజరాత్ ఫోరెన్సిక్ సైన్స్ యూనివర్సిటీ సహా పలు ప్రధాన సంస్థల్లో మే, జూన్, జూలై నెలల్లో అడ్మిషన్లు జరుగుతాయి. అడ్మిషన్ నోటిఫికేషన్లకు సంబంధించిన వివరాల కోసం ఆయా యూనివర్సిటీల వెబ్సైట్లను సందర్శించాలి.
ఫోరెన్సిక్ సైన్స్ రంగంలో మార్పులు
-ప్రపంచవ్యాప్తంగా రోజురోజుకు ఫోరెన్సిక్ సైన్స్‌లో ఎన్నో మార్పులు చోటుచేసుకుంటున్నాయి. టెక్నాలజీ పెరుగుతున్నాకొద్దీ నేరాలు, నేరగాళ్ల తీరు కూడా మారుతూ వస్తోంది. నేరం చేసినప్పుడు ఘటనాస్థలంలో ఎలాంటి ఆధారాలు వదలకుండా నేరగాళ్లు తెలివిగా వ్యవహరిస్తున్నారు. సైబర్ నేరగాళ్లు సైతం కొత్తకొత్త టెక్నాలజీలను ఉపయోగిస్తూ ఎప్పటికప్పుడు కొత్తరకం మోసాలకు పాల్పడుతున్నారు. ఇలాంటి నేరాల గుట్టును రట్టు చేసేందుకు ఫోరెన్సిక్ సైన్స్ రంగం కూడా శరవేగంగా అభివృద్ధి చెందుతున్నది. ఇందుకు నూతన పరిశోధనలు తోడ్పడుతున్నాయి. మన దేశంలో కేవలం ఫోరెన్సిక్ రంగంలో అధ్యయనం కోసం గుజరాత్ ఫోరెన్సిక్ సైన్సెస్ యూనివర్సిటీని ఏర్పాటు చేశారు. ఈ యూనివర్సిటీలో ఫోరెన్సిక్ సైన్సెస్‌కు సంబంధించి నిరంతరం అధ్యయనాలు జరుగుతుంటాయి.
-దక్షిణ భారతదేశంలో డిగ్రీ స్థాయిలో ఫోరెన్సిక్ సైన్స్ కోర్సును ప్రవేశపెట్టిన మొదటి విద్యాసంస్థ రాజాబహదూర్ వెంకటరామారెడ్డి (ఆర్బీవీఆర్ఆర్) ఉమెన్స్ కాలేజ్. మేం 2014-15 విద్యా సంవత్సరంలో బీఎస్సీ ఫోరెన్సిక్ సైన్స్ కోర్సును ప్రారంభించాం. ఈ కోర్సుకు తెలుగు రాష్ర్టాలతోపాటు ఢిల్లీ, కేరళ, ఛత్తీస్‌గఢ్ తదితర రాష్ర్టాల నుంచి కూడా మంచి రెస్పాన్స్ వస్తున్నది. ఫోరెన్సిక్ నిపుణులకు భవిష్యత్తులో మంచి ఉద్యోగ, ఉపాధి అవకాశాలున్నాయి.
-మా దగ్గర బీఎస్సీ ఫోరెన్సిక్ సైన్స్ కోర్సు పూర్తిచేసిన విద్యార్థులు ప్రస్తుతం ఉస్మానియా యూనివర్సిటీ, గుజరాత్ ఫోరెన్సిక్ సైన్స్ యూనివర్సిటీతోపాటు వేర్వేరు సంస్థల్లో పీజీలు చేస్తున్నారు. ఫోరెన్సిక్ సైన్స్‌లో డిగ్రీతోపాటు పీజీ, పీహెచ్డీ చదివిన వారికి మంచి భవిష్యత్తు ఉంటుంది.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు