Carnivorous | మాంసాహార మొక్కలు
జంతువుల్లాగే మొక్కల్లో కూడా కొన్ని మాంసాహారులు ఉన్నాయి. అయితే ఇవి ఎక్కువ పరిమాణంలో మాంసాన్ని తీసుకోవు. కీటకాలు, మిడతలు, చిన్నచిన్న కప్పలు, బల్లుల వంటి వాటిని రూపాంతరం చెందిన పత్రాల్లో బంధించి జీర్ణం చేసుకుంటాయి. వీటిని మాంసాహార మొక్కలు లేదా కీటకాహార మొక్కలు (పిచర్ ప్లాంట్స్) అంటారు. నత్రజని లభ్యత తక్కువగా ఉండే బురదనేలల్లో పెరిగే ఈ మొక్కలు నత్రజని స్థాపన కోసం కీటకాలను ఆహారంగా తీసుకుంటాయి. ఇవి కీటకాలను బంధించే విధానం ఒక్కోజాతిలో ఒక్కోరకంగా ఉంటుంది. ముఖ్యమైన కొన్ని కీటకాహార మొక్కలు, వాటి వివరాలు నిపుణ పాఠకుల కోసం…
సర్రేసీనియా (Sarracenia)
– సర్రేసీనియా ప్రజాతి మొక్కలు సర్రేసినియేసీ కుటుంబానికి చెందినవి. ఈ ప్రజాతిలో 8-11 జాతులున్నాయి. ఈ మొక్కలన్నీ ఉత్తరఅమెరికాలోని సముద్ర తీరాలు, కెనడాలోని ఆగ్నేయ ప్రాంతాల్లో పెరుగుతాయి. వీటిని సాధారణంగా ట్రంపెట్ పిచర్స్ అంటారు.
– ఈ ప్రజాతి మొక్కల్లో పత్రాలు గరాటు ఆకారంలో ఉండి, గరాటు లోపల కీటకాన్ని జీర్ణం చేయడానికి ఉపయోగపడే ద్రవాలుంటాయి. ఈ ద్రవాలు వర్షపు నీటితో కలిసి గాఢతను కోల్పోకుండా గరాటు పైభాగంలో మూతలాంటి నిర్మాణం ఉంటుంది.
– గరాటు కలిగి ఉండే చక్కటి రంగు, కమ్మటి వాసనలు, గరాటు పై అంచుల్లో ఉండే తేనెలాంటి స్రావాలు కీటకాలను ఆకర్షిస్తాయి. కీటకం గరాటుపై వాలి స్రావాలను పీల్చగానే అందులోని మత్తు దాన్ని ఎగిరిపోకుండా చేస్తుంది. కీటకం జారి గరాటు అడుగు భాగంలో పడి చనిపోతుంది. గరాటు ద్రవాల్లో ఉన్న ప్రొటియేజ్లు, ఇతర ఎంజైమ్లు ఆ కీటకాన్ని జీర్ణం చేస్తాయి.
నెపంథిస్ (Nepenthes)
– నెపంథిస్ ప్రజాతి మొక్కలు నెపంథేసియే కుటుంబానికి చెందినవి. వీటిలో 130కి పైగా జాతులున్నాయి. ఇవి ఉష్ణమండల ప్రాంతంలో పెరిగే మాంసాహార మొక్కలు. వీటిని సాధారణంగా మంకీ కప్స్ అంటారు.
– ఈ మొక్కలు మనదేశంతోపాటు చైనా, మలేషియా, ఇండోనేషియా, ఫిలిప్పీన్స్, మడగాస్కర్, సీషెల్స్, ఆస్ట్రేలియా దేశాల్లోని చిత్తడినేలల్లో పెరుగుతాయి. వీటిలో కొన్ని జాతుల మొక్కలు 10 నుంచి 15 మీటర్ల పొడవుండి తీగల్లా ఇతర ఆధారాలపై ఎగబాకుతాయి.
– నెపంథిస్ కాండంపై కత్తుల ఆకారంలో పత్రాలు ఉంటాయి. ఈ పత్రాల అగ్రాల నుంచి నులితీగలు పొడుచుకువచ్చి ఆ నులితీగల చివరన కూజాల్లాంటి నిర్మాణాలు ఏర్పడుతాయి. ఈ కూజా పైభాగంలో మూత ఉంటుంది. కూజా లోపల చిక్కని ద్రవం ఉండి, జీర్ణరసంలా పనిచేస్తుంది.
– కూజాలోపలికి వచ్చిన కీటకాలు అందులోని ద్రవాల్లో పడిపోగానే చనిపోతాయి. తర్వాత కీటకాలు జీర్ణమై వాటిలోని పోషకాలు మొక్క భాగాలకు సరఫరా అవుతాయి. అందుకు కూజా అడుగు భాగంలో ఉన్న గ్రంథులు తోడ్పడుతాయి.
– నెపంథిస్ ప్రజాతిలోని చాలా జాతుల మొక్కలు చిన్నవిగా ఉండి చిన్నచిన్న కీటకాలను ఆహారంగా తీసుకుంటాయి. కానీ నెపంథిస్ రఫ్లీషియానా, నెపంథిస్ రజా, నెపంథిస్ అటెన్బరోగి జాతులకు చెందిన మొక్కలు పెద్దవిగా ఉండి ఎలుకలు, బల్లులు మొదలైన పెద్ద ప్రాణులను కూడా కూజాల్లాంటి నిర్మాణాల్లో బంధించి జీర్ణం చేసుకుంటాయి. నెపంథిస్ అటెన్బరోగిని ప్రపంచంలోనే అతిపెద్ద మాంసాహార మొక్కగా చెప్పవచ్చు. దీన్ని 2009 ఆగస్టులో కనిపెట్టారు.
యుట్రిక్యులేరియా (Utricularia)
– యుట్రిక్యులేరియా ప్రజాతి మొక్కలు లెంటిబ్యులారియేసి కుటుంబానికి చెందినవి. ఈ ప్రజాతిలో 230కి పైగా జాతులున్నాయి. ఇవి స్వచ్ఛమైన నీటిలో, తడి నేలల్లో పెరిగే మాంసాహార మొక్కలు. వీటిని సాధారణంగా బ్లాడర్వర్ట్లు అంటారు.
– ఈ మొక్కలు మంచు ఖండం అంటార్కిటికా మినహా మిగిలిన అన్ని ఖండాల్లో పెరుగుతాయి. ఈ ప్రజాతిలోని 80 శాతం జాతులు తడి నేలల్లో, 20 శాతం జాతులు మంచినీటి కుంటల్లో ఉంటాయి. వీటిని ప్రధానంగా పుష్పాల కోసం సాగుచేస్తారు.
– ఈ మొక్కల్లో పత్రాలు తిత్తుల్లా రూపాంతరం చెంది ఉంటాయి. అందుకే వీటికి బ్లాడర్వర్ట్లు అనే పేరు వచ్చింది. తిత్తి లాంటి నిర్మాణం లోపలికి సూక్ష్మక్రిములు, కీటకాలు ప్రవేశించగానే అది మూసుకుంటుంది. అనంతరం తిత్తిలోపలి జీర్ణరసాల ప్రభావంవల్ల కీటకం జీర్ణమవుతుంది.
– బ్లాడర్స్ కొన్ని జాతుల్లో చిన్నవిగా, మరికొన్ని జాతుల్లో పెద్దవిగా ఉంటాయి. చిన్న బ్లాడర్స్ కలిగిన మొక్కలు ప్రొటోజోవన్ల వంటి సూక్ష్మజీవులను, పెద్ద బ్లాడర్స్ కలిగిన మొక్కలు టాడ్పోల్ లార్వాలు, వాటి పరిమాణంలోని ఇతర జీవులను బంధించి జీర్ణించుకుంటాయి.
డ్రాసిరా (Drosera)
– డ్రాసిరా ప్రజాతి మాంసాహార మొక్కలు డ్రాసిరేసి కుటుంబానికి చెందినవి. ఈ ప్రజాతిలో దాదాపు 195 జాతులున్నాయి. వీటిని సాధారణంగా సన్డ్యూస్ అంటారు.
– ఇవి కూడా అంటార్కిటికా మినహా అన్ని ఖండాల్లో కనిపిస్తాయి. వీటి పరిమాణం ఒక్కోజాతిలో ఒక్కోతీరుగా ఉంటుంది. జాతిని బట్టి సెంటీమీటర్ నుంచి మీటర్ వరకు ఎత్తు పెరుగుతాయి. జీవితకాలం సుమారు 50 ఏండ్లు.
– ఈ మొక్కల పత్రాల ఉపరితలం అంతటా సన్నని కేశాల వంటి నిర్మాణాలు నిటారుగా పెరుగుతాయి. వీటి నుంచి తియ్యని జిగురు స్రావాలు విడుదలవుతాయి. కీటకాలు ఈ కేశాలపై వాలగానే జిగురు అంటుకుంటుంది. వెంటనే చుట్టూ ఉన్న కేశాలు కూడా కీటకాన్ని చుట్టి ఊపిరి ఆడకుండాచేసి చంపుతాయి. తర్వాత జిగురు స్రావాల్లోని గ్రంథులు కీటకాలను జీర్ణంచేసి మొక్కకు పోషకాలను అందిస్తాయి.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?