Ship traveling on a river | నదిలో ప్రయాణిస్తున్న ఓడ సముద్ర జలాల్లోకి ప్రవేశిస్తే?
ద్రవ పదార్థాలు – ధర్మాలు
– ఒక బిందువు నుంచి మరొక బిందువుకు ప్రవహించే పదార్థాన్ని ప్రవాహి అంటారు. ద్రవాలు, వాయువులు మాత్రమే ప్రవాహి ధర్మాన్ని కలిగి ఉన్నాయి.
– ద్రవాలకు ఉపరితలం ఉంటుంది. ద్రవాల సాంద్రత స్థిర ఉష్ణోగ్రత వద్ద స్థిరంగా ఉంటుంది. అంతేకాకుండా దాని సాంద్రత బాహ్య పీడనంతో ఎక్కువగా మారదు. అంటే ద్రవాలు అసంపీడ్యాలు.
– వాయువులకు ఉపరితలం ఉండదు. వాయువులు, సంపీడ్యాలు అంటే బాహ్యపీడనంతో వాటి సాంద్రత మారుతుంది.
– ద్రవాలు ప్రవాహ ధర్మాన్ని కలిగి ఉంటాయి. అందుకే వాటిని ప్రవాహాలు అంటారు. ఇవి రెండు రకాలు.
1. మొదటి రకం ప్రవాహులు చలనశీల ప్రవాహులు ఉదాహరణ: నీరు, ఆల్కహాల్
2. రెండో రకం ప్రవాహులు స్నిగ్ధ ప్రవాహులు ఉదాహరణ: తేనె, ఆముదం
– ద్రవాలు ఏ పాత్రలో పోస్తే ఆ పాత్ర ఆకారాన్ని పొందుతాయి.
– హైడ్రాలజి: ద్రవాల అధ్యయనాన్ని గురించి తెలుపుతుంది.
– హైడ్రో డైనమిక్స్: ద్రవాల ప్రవాహాలను గురించి తెలుపుతుంది.
ఒత్తిడి (Stress)
– తలానికి లంబంగా కలగజేసిన మొత్తం బలాన్ని ఒత్తిడి అంటారు.
– ఒత్తిడి కూడా బలమే కాబట్టి దీన్ని బల ప్రమాణాలతో కొలుస్తారు.
ప్రవాహి పీడనం
– ప్రవాహి కలిగించే పీడనాన్ని ప్రవాహి పీడనం అంటారు. ప్రవాహి మూడు రకాల పీడనం కలుగజేస్తుంది.
1. అధోపీడనం
2. ఊర్ధ్వపీడనం
3. పార్శపీడనం
– అధోపీడనం: అడుగుతలంపై ద్రవం కలుగజేసే పీడనాన్ని అధోపీడనం అంటారు.
– ఊర్ధ్వపీడనం: ఊర్ధ దిశలో కింది నుంచి పైభాగానికి కలుగజేసే పీడనాన్ని ఊర్ధ పీడనం అంటారు.
ఉదా: నీటితో నింపిన పాత్రలో ఫుట్‌బాల్‌ను ముంచినప్పుడు అది పాత్రపై భాగానికి చేరి తేలియాడుతూ ఉండటం.
– పార్శ పీడనం: పాత్ర చుట్టూ గోడలపై నీరు కలిగించే పీడనాన్ని పార్శ పీడనం అంటారు.
ఉదా: పొడవైన స్థూపాకార పాత్రలో నీటిని తీసుకుని పాత్ర గోడకి రంధ్రం చేస్తే పార్శపీడనం వల్ల నీరు కొంత వడితో బయటకు దూసుకొచ్చి నేలపై కొంత దూరంలో విరజిమ్మబడటం.
పాస్కల్ నియమం
– ఒక ప్రవాహికి పైన కలుగజేసిన పీడనం అనేది అన్నివైపులా సమానంగా పనిచేస్తుంది.
అనువర్తనాలు
– బట్టలు, కాగితాలను అదిమిపట్టడానికి ఉపయోగించే బ్రామాప్రెస్ అనే సాధనం పాస్కల్ నియమం ఆధారంగా పనిచేస్తుంది.
– హైడ్రాలిక్ బ్రేకులు, హైడ్రాలిక్ పంపులు, హైడ్రాలిక్ క్రేన్లు, హైడ్రాలిక్ టిప్పర్లు, సాధనాలు, ఎయిర్ బ్రేకులు పనిచేయడంలో ఈ నియమం ఇమిడి ఉంటుంది.
వాతావరణ పీడనం
– భూమి చుట్టూ ఉండే గాలిని వాతావరణం అంటారు. వాతావరణం భూమి మీద ఉండే ప్రతీ వస్తువు మీద పీడ నం కలుగజేస్తుంది. దీన్నే వాతావరణ పీడనం అంటారు.
– వాతావరణ పీడనం కొలిచే సాధనం భారమితి.
– భారమితి (బారోమీటర్)లో ఉపయోగించే ద్రవం పాదరసం. పాదరస సాంద్రత అన్ని ద్రవాల సాంద్రత కంటే ఎక్కువ. అందుకే పాదరసాన్ని భారమితిలో వాడుతారు.
– భారమితిని టారిసెల్లి కనుగొన్నాడు.
– సాధారణ వాతావరణ పీడనం 76 సెం.మీ. లేదా పాదరస స్తంభం ఎత్తు సముద్ర మట్టం కంటే దిగువగా ఉన్న ప్రదేశాల్లో భారమితిలోని పాదరసం ఎత్తు ఎక్కువవుతుంది. కాబట్టి పాదరస స్తంభం ఎత్తును బట్టి వాతావరణ పీడనం తెలుసుకోవచ్చు.
– ఒక ప్రదేశంలోని వాతావరణ పీడనం ఆ ప్రదేశంలో ఉష్ణోగ్రత, గాలిలోని తేమలపై ఆధారపడుతుంది.
– పొడిగాలి తడిగాలి సాంద్రత కంటే ఎక్కువగా ఉంటుంది. ఉష్ణోగ్రత ఎక్కువైతే వాతావరణ సాంద్రత తగ్గుతుంది. వాతావరణ పీడనం సాంద్రతపై ఆధారపడుతుంది. సాంద్రత ఉష్ణోగ్రత, ఆర్థ్రతలపై ఆధారపడుతుంది. కాబట్టి వాతావరణ పీడనం శీతోష్ణ పరిస్థితులను తెలుపుతుంది.
వాతావరణ పీడనంలో మార్పులు
– భారమితిలో వాతావరణ పీడనం విలువ అకస్మాత్తుగా 76 సెం.మీ. కంటే తక్కువగా పడిపోతే తుఫాను వచ్చే అవకాశం ఉంది. దీన్నే అల్పపీడనంగా వాతావరణ శాస్త్రజ్ఞులు భావిస్తారు. వాతావరణ పీడనం విలువ నెమ్మదిగా తగ్గితే వర్షం రాకను సూచిస్తుంది.
– భారమితిలో పాదరస మట్టం క్రమేపీ పెరగడం అనుకూల వాతావరణ రాకను సూచిస్తుంది.
ఫలితాలు
– మన శరీరం లోపల ఉండే పీడనం, వాతావరణ పీడనం సమానంగా ఉంటాయి. అందువల్ల మనం వాతావరణ పీడనాన్ని గుర్తించలేం.
– ఒక వ్యక్తి అంతరిక్షంలో ఉండే అంతర పీడనంవల్ల రక్తం బయటికి వస్తుంది. అందువల్ల అంతరిక్ష యాత్రికులు ప్రత్యేకమైన దుస్తులు ధరించడంవల్ల దుస్తులు వారి శరీరంపై వాతావరణ పీడనంతో సమానమైన పీడనాన్ని కలిగిస్తాయి.
– ఎత్తయిన పర్వతాలు ఎక్కినప్పుడు ముక్కులో నుంచి కొంత మందికి రక్తం కారడం, వాంతులు అవుతాయి. బయటి వాతావరణ పీడనం కంటే రక్త పీడనం ఎక్కువ ఉండటం వల్ల ఈ విధంగా జరుగుతుంది.
– ఎత్తులో ప్రయాణించే విమానాల్లో ఇంక్పెన్లోని ఇంక్ బయకు వస్తుంది. బయటి పీడనం కంటే పెన్నులోని పీడనం అధికం కావడం వల్ల ఈ విధంగా జరుగుతుంది.
– సముద్ర మట్టం కంటే తక్కువ ఎత్తుగల ప్రాంతాల్లోను, గాలిలోని నీటిఆవిరి శాతం శీతాకాలంలో కంటే వేసవి కాలంలో ఎక్కువగా ఉంటుంది.
– వాతావరణం వేడెక్కడానికి, చల్లబడటానికి, వాతావరణంలో మార్పులు రావడానికి గాలిలోని నీటిఆవిరి అత్యంత ప్రముఖ పాత్ర నిర్వహిస్తుంది.
– మనకు నిత్యజీవితంలో సంభవించే మేఘాలు, వర్షం, పొగమంచు, హిమబిందువులు మొదలైన వాటన్నింటికి కారణం గాలిలోని నీటిఆవిరే అని తెలుసుకోవచ్చు. మన నిత్యజీవితంలో వాతావరణ పీడనం అత్యంత ప్రముఖ పాత్రను నిర్వహిస్తుంది.
– ఇంకు ఫిల్లర్లు, గాలి పంపులు, ద్రవాలను పీల్చి తాగే స్ట్రాలు వాతావరణ పీడనాన్ని అనుసరించి పనిచేస్తాయి.
– సముద్రమట్టం నుంచి పైకి పోయే కొద్దీ వాతావరణ పీడనం తగ్గుతుంది. ప్రతి 273 మీ ఎత్తుకు, 2.54 సెం.మీ. వాతావరణ పీడనం తగ్గుతుంది.
– సముద్రమట్టం నుంచి కిందికి పోయేకొద్దీ వాతావరణ పీడనం పెరుగుతుంది. ప్రతి 273 మీటర్లకు, 2.54 సె.మీ. పీడనం పెరుగుతుంది.
– రక్తనాళాలపై రక్తం కలిగించే పీడనాన్ని రక్తపీడనం (బీపీ) అంటారు. దాన్ని స్పిగ్మోమానోమీటర్తో కొలుస్తారు.
– గ్యాస్ సిలిండర్‌లో వాయు పీడనాన్ని మానోమీటర్తో కొలుస్తారు.
వాతావరణ పీడనానికి ప్రమాణాలు
1. ఎట్మాస్పియర్ = 1.01X105 పాస్కల్
2. Cm og Hg = 76 సెం.మీ.
3. mm oh Hg = 1.33 పాస్కల్
4. 1 బార్ = 105 పాస్కల్
5. 1 టార్ = 133 పాస్కల్
– ద్రవ పదార్థాలు ద్రవ పదార్థంలో అణువుల మధ్య, బంధ దూరం ఎక్కువగా ఉండటంవల్ల అణువులు ఆ ద్రవంలో స్వేచ్ఛగా చలిస్తాయి. కాబట్టి ద్రవ పదార్థాలకు నిర్దిష్టమైన ఆకారం, ఘన పరిమాణం ఉండవు. ఏ పాత్రలో పోసిన ఆ పాత్ర ఆకారాన్ని, ఘనపరిమాణాన్ని పొందుతాయి.
ఆర్కిమెడిస్ సూత్రం
– ఒక వస్తువు ద్రవంలో మునగడంతో కోల్పోయిన భారం పొర్లిపోయిన ద్రవం భారానికి సమానం.
– ఈ సూత్రం ఉపయోగించి వస్తువు ఘన పరిమాణాన్ని, విశిష్ఠ గురుత్వం/ సాపేక్ష సాంద్రతను తెలుసుకోవచ్చు.
– ద్రవాల విశిష్ఠ సాంద్రతను హైడ్రోమీటర్‌తో తెలుసుకోవచ్చు.
– పాల స్వచ్ఛతను లాక్టోమీటరు ద్వారా కొలుస్తారు.
– బంగారం, వజ్రం స్వచ్ఛతను కొలవడానికి క్యారట్ అనే ప్రమాణాన్ని ఉపయోగిస్తారు.
1 క్యారెట్ = 200 మి.గ్రా లేదా 0.2 గ్రా.
ప్లవన సూత్రాలు
– వీటిని ఆర్కిమెడిస్ అనే శాస్త్రవేత్త ప్రతిపాదించాడు.
నియమం
– ఒక వస్తువు సాంద్రత అనేది ద్రవ సాంద్రత కంటే ఎక్కువ ఉంటే అది ద్రవంలో మునుగుతుంది.
ఉదా: ఒక గాజు బీకరు ద్రావణంలో ఒక రాయిని వేసినప్పుడు అది మునిగిపోతుంది.
– ఒకవేళ వస్తువు సాంద్రత అనేది ద్రవసాంద్రత కంటే తక్కువగా ఉంటే అది ద్రవంపైన తేలియాడుతుంది.
ఉదా: ఒక గాజు బీకరు ద్రావణంలో ఒక ప్లాస్టిక్ లేదా బెండు బంతి తేలుతుంది.
– ద్రవంపైన తేలియాడుతున్న వస్తువుల దృశ్యభారం శూన్యం.
– ఒక వస్తువు సాంద్రత అనేది ద్రవసాంద్రతకు సమానమైనట్లయితే ఆ వస్తువు ద్రవంలో సగం మునిగి మిగిలిన సగభాగంపై తేలియాడుతుంది.
ఉదా: ఒక గాజు బీకరు ద్రావణంలో బిరడాను ఉంచిన అది ద్రావణ ఉపరితలంపై సగంపైకి, సగం కిందికి ఉన్నట్లు కనిపిస్తుంది.
అనువర్తనాలు
– జలాంతర్గామి పనిచేయడంలో ప్లవన సూత్రాలను ఉపయోగిస్తారు.
– ఒక పాత్రలో ఉన్న నీటిపైన ఒక మంచు ముక్కను అమర్చారు. మంచు పూర్తిగా కరిగిన తర్వాత నీటిమట్టంలో ఎలాంటి మార్పు ఉండదు.
– ఆల్కహాల్, కిరోసిన్ లాంటి ద్రవ పదార్థాలు నీటిపైన తేలియాడటానికి కారణం వాటి సాంద్రతలు నీటి కంటే తక్కువగా ఉండటం
– నీటిపైన ఉన్న మంచుదిమ్మెపై ఒక లోహపు గోళాన్ని అమర్చారు. మంచు పూర్తిగా కరిగిన తర్వాత నీటిమట్టం తగ్గుతుంది. ఎందుకంటే గోళం గాలిలో ఉన్నప్పుడు దాని భారం ఎక్కువగా ఉంటుంది.
– మంచు దిమ్మెలోపల ఒక లోహపు గోళం ఉన్నది. ఈ మంచు దిమ్మెను నీటిపైన అమర్చారు. మంచు పూర్తిగా కరిగిన తర్వాత ఆ నీటి మట్టంలో ఎలాంటి మార్పు ఉండదు.
– కొన్ని రాళ్లను మోసుకుని వెళ్తున్న పడవ చెరువులో కొంత దూరం ప్రయాణించిన తర్వాత దానిలో గల రాళ్లను చెరువులోకి విసిరేశారు. అప్పుడు ఆ చెరువు మట్టం తగ్గుతుంది.
– చెరువులో ప్రయాణిస్తున్న ఒక ఓడలో రంధ్రం ఏర్పడి దానిలోకి నీరు ప్రవేశించి అది మునిగిపోయింది. అప్పుడు ఆ చెరువు మట్టంలో ఎలాంటి మార్పు ఉండదు.
– ఎండిపోయిన ఆకులు, గడ్డి మొదలైన వాటిని చెరువులో ఉన్న నీటిపైకి విసిరేవేసినప్పుడు ఆ నీటి మట్టంలో ఎలాంటి మార్పు ఉండదు. ఎందుకంటే నీటి సాంద్రత కంటే ఆ పదార్థాల సాంద్రత పరిగణనలోకి తీసుకోలేనంత తక్కువగా ఉంటుంది.
– సాధారణ నీటిలో కంటే, సాంద్రత ఎక్కువగా ఉన్న సముద్రపు నీటిలో ఈదడం సులభంగా ఉంటుంది.
– నీటి అడుగుభాగంలో ఒక కోడిగుడ్డును పైకి నెట్టాలంటే దానిలో ఉప్పును కలిపి నీటి సాంద్రతను పెంచాలి.
– ఇనుము, ఉక్కు మొదలైన పదార్థాలతో తయారుచేసిన గోళాలు పాదరసంపైన తేలియాడుతాయి. ఎందుకంటే పాదరసం సాంద్రత నీటి సాంద్రత కంటే ఎక్కువగా ఉండటమే.
– నదిలో ప్రయాణిస్తున్న ఒక ఓడ సముద్ర జలాల్లోకి ప్రవేశించినప్పుడు ఓడమట్టం పెరుగుతుంది. ఎందుకంటే సముద్ర నీటి సాంద్రత ఎక్కువగా ఉండటమే.
– సాధారణ నీటి సాంద్రత కంటే సముద్రంలోని ఉప్పునీటి సాంద్రత ఎక్కువ కాబట్టి సముద్రంలో ఈత సులభం.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు