Local self-government | స్థానిక స్వపరిపాలన
ప్రజల దైనందిన అవసరాలను తీర్చి వారి సమస్యలను పరిష్కరించడం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు కష్టంతో కూడుకున్న పని. స్థానికసంస్థలకు ఈ బాధ్యత అప్పగిస్తే ఈ సమస్య సులభంగా పరిష్కారమవుతుంది. అధికారాన్ని స్థానిక సంస్థలకు అప్పగిం చడమే ప్రజాస్వామ్య వికేంద్రీకరణ. దీన్నే స్థానిక స్వపరిపాలన (లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్) అంటారు. నిజ మైన ప్రజా స్వామ్యం అంటే ప్రజలకు రాజకీయ, ఆర్థిక, సామాజిక రంగాల్లో నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉండాలి. ప్రజా స్వామ్య వ్యవస్థను బలోపేతం చేసేవి, ప్రజల్లో రాజకీయ చైతన్యాన్ని కలిగించేవి స్థానిక స్వపరిపాలనా సంస్థలు. ప్రభుత్వ కార్యక్రమాల్లో ప్రజలకు భాగస్వామ్యం కల్పించేవి స్థానిక సంస్థలే.
– స్థానిక అవసరాలకు అనుగుణంగా కార్యక్రమాలను రూపొందించి వాటిని సమర్థవంతంగా అమలు చేయాలంటే అధికార వికేంద్రీకరణ అవసరం.
– ఆ అధికార వికేంద్రీకరణలో భాగమే స్థానిక ప్రభుత్వాలు.
– ప్రాచీనకాలం నుంచి దేశంలో గ్రామీణ ప్రాంతంలో గ్రామ పంచాయతీలు, పట్టణాల్లో నగరపాలక సంస్థలు సమర్థవంతంగా పనిచేసేవని చరిత్ర చెబుతున్నది.
ప్రాచీన భారతదేశం స్థానిక ప్రభుత్వాలు
– ప్రాచీన కాలం నుంచి స్థానిక స్వపరిపాలన సంస్థలు ఉన్నాయి.
– బౌద్ధం వెల్లివిరిసిన కాలంలోనే దేశంలో స్థానిక సంస్థలు ఉండేవని అంబేద్కర్ పేర్కొన్నారు.
– ప్రాచీన భారతదేశంలో ప్రతి గ్రామంలో స్వయంపాలిత, స్వయంపోషక స్థానిక సంస్థలు గ్రామసభ ఆధ్వర్యంలో ఉండేవి.
– ఆర్యుల కాలంలో నెలకొల్పిన సభ, సమితి స్థానిక స్వపరిపాలనలో కీలక పాత్ర పోషించాయి.
– కౌటిల్యుని అర్థశాస్త్రంలో గ్రామీణ ప్రాంతాల పరిపాలనలో గ్రామణి అనే అధికారి ముఖ్యపాత్ర పోషించేవారు.
– 10 గ్రామాలను పాలించే అధికారి దశగ్రామిణి
– ధర్మస్థియ, కంఠకశోధన అనేవి స్థానిక న్యాయస్థానాలు.
– దక్షిణ భారతదేశంలో స్థానిక స్వపరిపాలనను నిర్వహించినవారు చోళులు.
– స్థానిక సంస్థల ప్రతినిధులను ఎన్నుకునే పద్ధతి చోళుల కాలంలో అమలులో ఉండేది.
– ప్రాచీన భారతదేశంలో ప్రతి గ్రామం చిన్న, చిన్న రిపబ్లిక్‌లుగా ఉండేవి.
– పంచాస్ అనే ఐదుగురు సభ్యులతో కూడిన మండలి గ్రామీణ పాలనలో కీలక పాత్రపోషించేది. కాలక్రమంలో అదే పంచాయతీగా ఏర్పడింది.
మధ్యయుగంలో
– మధ్యయుగంలో స్థానిక స్వపరిపాలన సంస్థలు నిర్లక్ష్యానికి గురయ్యాయి.
– షేర్షా కాలంలో ప్రాంతీయ పరిపాలనపై దృష్టి కేంద్రీకరించారు.
– కొత్వాల్ అనే అధికారి శాంతిభద్రతల నిర్వహణ, భూమి శిస్తు వసూలు చేసేవాడు.
బ్రిటిష్ కాలంలో
– బ్రిటిష్‌వారు పాలనా సౌలభ్యం కోసం తప్పనిసరి పరిస్థితుల్లో స్థానిక ప్రభుత్వాలను పునరుద్ధరించారు.
– చార్టర్ చట్టంఊ-1813 ద్వారా స్థానిక సంస్థల్లో పన్ను విధించే అవకాశం కల్పించారు.
– 1870లో లార్డ్ మేయో ప్రవేశపెట్టిన తీర్మానం స్థానిక సంస్థల అభివృద్ధికి కృషిచేసింది.
– లార్డ్ మేయో స్థానిక ప్రభుత్వాలను తొలిసారిగా భారతదేశంలో ప్రవేశపెట్టాడు.
– 1882లో లార్డ్ రిప్పన్ స్థానిక సంస్థల అభివృద్ధిపై తీర్మానం ప్రవేశపెట్టారు.
– స్థానిక స్వపరిపాలన సంస్థల పితామహునిగా లార్డ్ రిప్పన్ పేరొందాడు.
– రిప్పన్ మూడంచెల పంచాయతీరాజ్ వ్యవస్థను ప్రవేశపెట్టాడు.
– ప్రస్తుతం దేశంలో కొద్ది మార్పులతో రిప్పన్ ప్రవేశపెట్టిన నమూనానే పాటిస్తున్నారు. అవి..
– దేశంలో స్థానిక ప్రభుత్వాల పనితీరును సమీక్షించడానికి బ్రిటిష్ ప్రభుత్వం చార్లెస్ హబ్‌హౌస్ నేతృత్వంలో ఒక రాయల్ కమిషన్‌ను 1907లో ఏర్పాటు చేసింది.
1. కింది స్థాయిలో- గ్రామపంచాయతీ
2. తాలూకాస్థాయిలో- తాలూకా బోర్డులు
3. పైస్థాయిలో- జిల్లా బోర్డులు
– ఈ కమిషన్ తన నివేదికను 1909లో ప్రభుత్వానికి సమర్పించింది.
– గ్రామాలు, తాలూకాలు, జిల్లాల్లో ప్రజలతో ఎన్నికైన ప్రజాప్రతినిధుల ప్రాతినిధ్యమే అధికంగా ఉండాలని సిఫారసు చేసింది.
– రాయల్ కమిషన్ సిఫారసు మేరకు భారత కౌన్సిల్ చట్టం-1909 స్థానిక ప్రభుత్వాల్లో తొలిసారిగా ప్రత్యక్ష ఎన్నిక విధానాన్ని ప్రవేశపెట్టింది.
– 1919లో మాంటేగ్-చేవ్సుఫర్డ్ సంస్కరణల ద్వారా ప్రవేశపెట్టిన ద్వంద్వ ప్రభుత్వ విధానంలో స్థానిక సంస్థలను ట్రాన్స్‌ఫర్డ్ జాబితాలో, స్థానిక ప్రభుత్వ పరిపాలను తొలిసారిగా రాష్ట్ర జాబితాలో చేర్చారు.
– 1934లో తాలూకా బోర్డులు రద్దయి, జిల్లా బోర్డులు కొనసాగాయి.
– భారత ప్రభుత్వ చట్టం-1935 ద్వారా రాష్ర్టాలకు స్వయం ప్రతిపత్తి కల్పించడంవల్ల స్థానిక స్వపరిపాలన సంస్థలకు ప్రాధాన్యతనిస్తూ అధికారాలను బదిలీచేశారు.
స్వాతంత్య్రానంతరం
– దేశంలో దాదాపు 80 శాతం ప్రజలు గ్రామీణ ప్రాంతాల్లోనే
– జాతిపిత మహాత్మాగాంధీ అభిప్రాయం ప్రకారం భారతదేశం గ్రామాల్లో నివసిస్తుంది.
– గ్రామాల్లోని ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడనిదే మన స్వాతంత్య్రానికి అర్థంలేదు.
– గ్రామ స్వరాజ్ ఏర్పాటు చేయాలని గాంధీజీ భావించారు.
– రాజ్యాంగంలోని 4వ భాగంలో ఆదేశిక సూత్రాల్లోని 40వ ప్రకరణలో గ్రామ స్వపరిపాలనకు పంచాయతీలను ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు.
– రాజ్యాంగంలోని 7వ షెడ్యూల్లోని రాష్ట్రజాబితాలో స్థానిక ప్రభుత్వాలు అనే అంశాలను పేర్కొన్నారు.
– స్థానిక సంస్థలు రాష్ట్ర జాబితాలో ఉన్నాయి.
సమాజాభివృద్ధి పథకం
– 1952, అక్టోబర్ 2న ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు.
– ప్రణాళికా సంఘం మొదటి పంచవర్ష ప్రణాళికా ముసాయిదాని రూపకల్పనచేస్తూ బాగా వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి తగిన చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వానికి సూచించింది.
– ఈ పథకాన్ని వీటీ కృష్ణమాచారి సూచనతో రూపొందించారు.
– విద్య, ఆరోగ్యం, వ్యవసాయం, రవాణా, నీటిపారుదల, గృహనిర్మాణం, కుటీర పరిశ్రమలు, సాంఘిక సంక్షేమం మొదలైన రంగాల్లో ప్రగతిని సాధించడానికి ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు.
– ఈ పథకానికి అమెరికాకు చెందిన ఫోర్డ్ ఫౌండేషన్ ఆర్థిక సహాయం అందించింది.
– ఈ పథకాన్ని ప్రారంభంలో దేశంలో 50 జిల్లాల్లోని 55 బ్లాకుల్లో ప్రయోగాత్మకంగా ప్రారంభించారు.
– ఒక్కో బ్లాక్‌లో 100 గ్రామాలు ఉన్నాయి.
– బ్లాక్ స్థాయిలో ప్రధాన కార్యనిర్వహణాధికారి (బ్లాక్ డెవలప్మెంట్ ఆఫీసర్)
– ఈ పథకాన్ని 5011 బ్లాకులకు విస్తరించారు.
జాతీయ విస్తరణ సేవా పథకం
– ఈ పథకాన్ని 1953, అక్టోబర్ 2న ప్రవేశపెట్టారు.
– సమాజాభివృద్ధి పథకానికి అనుబంధంగా జాతీయ విస్తరణ సేవా పథకాన్ని ప్రవేశపెట్టారు.
– ఈ పథకం ఆచరణలో ఆశించిన లక్ష్యాలను సాధించనప్పటికీ అభివృద్ధిపై ప్రజలు దృష్టి సారించడానికి తోడ్పడింది.
– దేశంలో స్థానిక స్వపరిపాలన అభివృద్ధి కోసం వివిధ కమిటీలను ఏర్పాటు చేశారు.
– అందులో ముఖ్యమైనవి బల్వంతరాయ్ మెహతా కమిటీ, అశోక్ మెహతా కమిటీ, దంత్వాలా కమిటీ, సీహెచ్ హనుమంతరావు కమిటీ, జీవీకే రావు కమిటీ, ఎల్ఎం సింఘ్వీ కమిటీ, తుంగన్ కమిటీ.
సుశిక్షితులైన తోటమాలి నిర్వహించే చక్కటి ఉద్యానవనం ఈ పథకం
– ఎస్కే డే
జాతీయ విస్తరణ సేవా పథకాన్ని నిశబ్ద విప్లవం
– జవహర్లాల్ నెహ్రూ
అశోక్ మెహతా కమిటీ 1977
– దీన్ని రెండో ప్రజాస్వామ్య వికేంద్రీకరణ కమిటీగా పేర్కొంటారు.
– ఈ కమిటీని 1977, డిసెంబర్లో జనతా ప్రభుత్వం ఏర్పాటు చేసింది.
– కమిటీ తన నివేదికను 1978, ఆగస్టులో కేంద్ర ప్రభుత్వానికి సమర్పించింది.
– ఈ కమిటీ 132 సిఫారసులను చేసింది. వాటిలో ముఖ్యమైనవి
1. రెండంచెల పంచాయతీరాజ్ వ్యవస్థను ఏర్పాటు చేయాలి.
2. జిల్లా స్థాయిలో జిల్లాపరిషత్,
3. కింది స్థాయిలో (మండల స్థాయిలో) మండల పరిషత్ ఏర్పాటు చేయాలి (15,000 నుంచి 20,000 జనాభా కలిగిన గ్రామాలతో ఏర్పాటు).
4. పార్టీ ప్రాతిపదికపై ఎన్నికలు నిర్వహించాలి.
5. అభివృద్థి విషయంలో గ్రామపంచాయతీని యూనిట్‌గా పరిగణించకూడదు.
6. స్థానిక సంస్థల పదవీ కాలం 4 ఏండ్లుగా ఉండాలి.
7. కాలవ్యవధి ప్రకారం ఎన్నికలు నిర్వహించాలి.
8. అభివృద్ధి కార్యక్రమాలన్నీ ఈ సంస్థల ద్వారానే నిర్వహించాలి.
9. తగిన అధికారాలు, ఆర్థిక వనరులను ఇవ్వాలి.
10. పంచాయతీలకు పన్నులు విధిండం, సొంత వనరులను సమకూర్చుకునే అధికారం ఉండాలి.
11. శాసనసభ్యులతో కూడిన కమిటీ పంచాయతీ నిధులు, జమాఖర్చులను (సోషల్ ఆడిట్) తనిఖీ చేయాలి.
12. పంచాయతీరాజ్ వ్యవస్థలను రద్దు పరిస్తే ఆరు నెలల్లోపు తప్పక ఎన్నికలు నిర్వహించాలి.
13. జిల్లా పరిషత్ అధ్యక్షున్ని ప్రత్యక్షంగా ఎన్నుకోవాలి. మం డల్ పరిషత్ అధ్యక్షున్ని ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని ఎన్నుకోవచ్చు.
14. ఎస్సీ, ఎస్టీలకు జనాభా ప్రాతిపాదికపై రిజర్వేషన్లు కల్పించాలి.
15. రాష్ట్ర మంత్రివర్గంలో పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలి.
16. అభివృద్ధి కార్యక్రమాలను జిల్లా పరిషత్‌కు బదిలీ చేయాలి.
17. పంచాయతీరాజ్ వ్యవస్థల అభివృద్ధి కోసం స్వచ్ఛంద సంస్థలను ప్రోత్సహించాలి.
18. న్యాయ పంచాయతీలను ఏర్పాటు చేసి వాటిలో అర్హతగల జడ్జీలను నియమించాలి.
సమాజ వికాస ప్రయోగాలు స్వాతంత్య్రానికి ముందు…
గుర్గావ్ ప్రయోగం-1920
శాంతినికేతన్ (శ్రీనికేతన్) ప్రయోగం-1921
మార్తాండం ప్రయోగం-1921
బరోడా ప్రయోగం-1932
సేవాగ్రావ్ు ప్రయోగం-1933
ఫిర్కా ప్రయోగం-1946
ఇటావా ప్రయోగం-1948
నీలోకెరె ప్రయోగం-1948
– గుర్గావ్ ప్రయోగం-1920: పంజాబ్‌లోని గుర్గావ్ జిల్లాలో డిప్యూటీ కమిషనర్‌గా పనిచేసిన బ్రేయన్ 1920లో గ్రామీణ అభివృద్ధి ఉద్యమాన్ని ప్రారంభించారు. వ్యవసాయ ఉత్పత్తిని, ప్రజారోగ్యాన్ని పెంపొందించడం, అభివృద్ధి పథకాలను వ్యవస్థీకరించడం, ఉత్సవాల్లో జరిగే ధన వ్యయాన్ని తగ్గించి సమాజ అభివృద్ధికి తోడ్పడటం లాంటివి గుర్గావ్ ప్రయోగంలోని ముఖ్య లక్ష్యాలు.
– శాంతినికేతన్ (శ్రీనికేతన్) ప్రయోగం-1921: రవీంద్రనాథ్ ఠాగూర్ కలకత్తాలో శాంతినికేతన్లో విద్యాబోధనలో భాగంగా సమాజ వికాసానికి కూడా వ్పయత్నించారు. ఆత్మగౌరవంతో కూడిన అభివృద్ధి అనే అంశానికి ప్రాధాన్యత ఇచ్చారు. వ్యవసాయం, చేనేత పరిశ్రమ, విద్య మొదలైన అంశాలపై శిక్షణ ఇచ్చారు.
– మార్తాండం ప్రయోగం-1921: కన్యాకుమారి జిల్లా (తమిళనాడు) మార్తాండం అనే ప్రాంతంలో బ్రిటిష్ అధికారులు స్పెన్సర్, హాబ్‌ల నేతృత్వంలో 70 గ్రామాలను ఎంపిక చేసుకుని ఈ ప్రయోగం చేశారు. వైఎంసీఏ సహకారంతో గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక అంశాలపై శిక్షణనిస్తూ తద్వారా ప్రజల్లో అభివృద్ధిపై స్పృహను కలిగించే ప్రయత్నం చేశారు.
– బరోడా ప్రయోగం-1932: బరోడా సంస్థానంలో దివాన్‌గా పనిచేసిన వీటీ కృష్ణమాచారి ఈ ప్రయోగం చేపట్టారు. గ్రామీణ ప్రాంతాల్లోని యువతీ, యువకులను సమీకరించి రోడ్లు వేయడం, పాడిపరిశ్రమ అభివృద్ధి, విద్యాబోధన, ఆరోగ్యంపై అవగాన కల్పిచడం, వ్యవవసాయం, కుటీర పరిశ్రమలను ప్రోత్సహించారు.
– సేవాగ్రావ్ు ప్రయోగం-1933: మహారాష్ట్రలోని వార్ధాలో మహాత్మాగాంధీ దీన్ని ప్రారంభించారు. ప్రాథమిక విద్య, సత్యాగ్రహం, నవోదయ, మత సామరస్యం, చేనేత పరిశ్రమలు మొదలైన అంశాలపై శిక్షణ ఇచ్చారు. సర్వోదయ, నవోదయ సిద్ధాంతాలపై ఈ సంస్థను నిర్వహించారు. ఆచార్య వినోబాభావే, జయప్రకాష్ నారాయణ్ ఈ సిద్ధాంతానికి ఆకర్షితులయ్యారు.
– ఫిర్కా ప్రయోగం-1946: మద్రాస్ ముఖ్యమంత్రిగా ఉన్న టంగుటూరి ప్రకాశంపంతులు తాలూకాలను కొన్ని ఫిర్కాలుగా విభజించి ఆ ప్రాంతాల అభివృద్ధికి కృషిచేశారు. దీన్నే ఫిర్కా ప్రయోగం అంటారు.
– ఇటావా ప్రయోగం-1948: ఉత్తరప్రదేశ్‌లోని రోహతక్ జిల్లా కలెక్టర్ ఆల్బర్ట్ మేయర్ కొన్ని గ్రామాలను ఎంచుకొని ప్రయోగాత్మకంగా పౌర సౌకర్యాలను కల్పించారు.వ్యవసాయం, పాడిపరిశ్రమ, చేనేత పరిశ్రమలను ప్రోత్సహించారు.
– నీలోకెరె ప్రయోగం-1948: దేశ విభజన కాలంలో అనేక మంది కాందిశీకులు తలదాచుకున్నారు. హర్యానాలో కర్నాల్ జిల్లాలోని నీలోకెరె ప్రాంతంలో ఎస్‌కేకే డే నేతృత్వంలో స్వయంసమృద్ధి సాధించడానికి వ్యవసాయ పనిముట్ల తయారీ, పాడిపరిశ్రమ, కోళ్ల పెంపకం, చేతివృత్తులు మొదలైన అంశాలపై శిక్షణ ఇచ్చారు.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు