Egg production animal | అండ శిశుత్పాదకానికి ఉదాహరణ ఈ జంతువు…?
ప్రాథమిక అంశాలుపిండాభివృద్ధి కాలంలో ఏర్పడే ప్రాథమిక జననస్తరాల ఆధారంగా జీవులను రెండు రకాలుగా వర్గీకరించవచ్చు అవి..
1. ద్విస్తరిత జీవులు (Diploblastic Animals)
2. త్రిస్తరిత జీవులు (Triploblastic Animals)
ద్విస్తరిత జీవులు
బహిస్తచం (Ectoderm), అంతఃస్తచం (Endoderm) అనే రెండు ప్రాథమిక జననస్తరాలు కలిగిన జీవులను ద్విస్తరిత జీవులు అంటారు.
ఉదా: సీలెంటరేటా వర్గం జీవులు
త్రిస్తరిత జీవులు
బహిస్తచం, మధ్యస్త్వచం, అంతఃస్త్వచం అనే మూడు ప్రాథమిక జననస్తరాలు కలిగిన జీవులను త్రిస్తతరిత జీవులు అంటారు.
ఉదా: ప్లాటీహెల్మెంథిస్ వర్గం నుంచి కార్డేటా వర్గం వరకు
సౌష్ఠవం (Symmetry)
దేహ భాగాల అమరికను సూచించడానికి సౌష్ఠవం అనే పదాన్ని ఉపయోగిస్తాం. దేహంలోని అవయవాలు, అంగాలు సమతుల్యంగా అమరివుంటే సౌష్ఠవం అని అసమతుల్యంగా ఉంటే అసౌష్ఠవం అని అంటారు.
జీవులను అవి ప్రదర్శించే సౌష్ఠవాన్ని ఆధారంగా చేసుకుని మూడు రకాలుగా వర్గీకరించవచ్చు. అవి…
1. అసౌష్ఠవ జీవులు/ సౌష్ఠవ రహిత జీవులు (Asymmetrical Animals)
2. వ్యాసార్థ సౌష్ఠవ జీవులు (Radial Symmetrical Animals)
3. ద్విపార్శ సౌష్ఠవ జీవులు (Bilateral Symmetrical Animals)
అసౌష్ఠవ/సౌష్ఠవ రహిత జీవులు
జంతువు దేహాన్ని ఏ తలం నుంచి ఛేదించినా రెండు సమాన అర్ధభాగాలు (antimeres) ఏర్పడకపోతే అటువంటి దేహ అమరిక కలిగిన జీవులను అసౌష్ఠవ జీవులు/సౌష్ఠవ రహిత జీవులు అంటారు.
ఉదా: పొరిఫెరా వర్గం జీవులు (స్పంజికలు)
ప్రౌఢ గ్యాస్ట్రోపొడా జీవులు (ఇవి మొలస్కా వర్గానికి చెందినవి)
వ్యాసార్థ సౌష్ఠవ జీవులు/వలయ సౌష్ఠవ జీవులు
జంతువు దేహాన్ని మధ్య అక్షం (ముఖ, ప్రతి ముఖ అక్షం/ప్రధాన అక్షం) ద్వారా ఏ తలం నుంచి ఛేదించినా రెండు సమాన అర్ధ భాగాలుగా ఏర్పడినట్లయితే అలాంటి జీవులను వ్యాసార్థ సౌష్ఠవ జీవులు అంటారు.
ఉదా: సీలెంటరేటా వర్గం జీవులు, టీనోఫొరా వర్గం జీవులు, ఇఖైనో డర్మేటా వర్గం జీవులు.
నోట్: ఇఖైనోడర్మేటా జీవుల్లో వ్యాసార్థ సౌష్ఠవం రూపాంతరం చెంది పంచ వికిరణ సౌష్ఠవం (Pentamerous radial symmetry)గా మారింది.
ద్విపార్శ సౌష్ఠవ జీవులు
జంతువు దేహాన్ని మధ్య అక్షం నుంచి పోయే (కుడి-ఎడమ అక్షం) ఒకే తలం నుంచి ఛేదించినప్పుడు మాత్రమే రెండు సమాన అర్ధభాగాలుగా ఏర్పడే జీవులను ద్విపార్శ సౌష్ఠవ జీవులు అంటారు.
ఉదా: అన్ని త్రిస్తరిత జీవులు (ప్రాఢగ్యాస్ట్రోపొడా, ఇఖైనోడర్మేటా జీవులు తప్ప)
ద్విపార్శ సౌష్ఠవ జీవులు ఆహార సమూపార్జనలో, సంగమ జీవిని వెతుక్కోవడంలో, భక్షక జీవుల నుంచి తప్పించుకోవటంలో ఎక్కువ సమర్థవంతంగా ఉంటాయి. ఈ సమర్థత జీవులలో శీర్షత (Cephalization) (దేహ పూర్వభాగంలో నాడీ, జ్ఞాన కణాలు) వృద్ధి చెందడంవల్ల ఏర్పడింది.
నోట్: సీ అనిమోన్, వెనిడేరియన్లు ద్విపార్శ వలయ సౌష్ఠవాన్ని (Bilateral Radial Symmetry) కలిగి ఉంటాయి.
శరీర కుహరం (Coelom):
శరీర కుహరం అనే పదాన్ని మొదటగా ప్రతిపాదించిన శాస్త్రవేత్త- హెకెల్
శరీర కుడ్యానికి, ఆహారనాళానికి మధ్యగల ఖాళీ ప్రదేశాన్ని శరీర కుహరం అంటారు. వివరంగా చెప్పాలంటే శరీర కుడ్యానికి, అంతరాంగ అవయవాలకు మధ్య ద్రవంతో నిండి, మధ్యస్తచ ఉపకళ చేత ఆవరించబడిన కుహరాన్ని శరీర కుహరం అంటారు.
శరీర కుహరం పిండాభివృద్ధిలో మధ్యస్తచం నుంచి ఏర్పడుతుంది.జీవులను అవి కలిగి ఉన్న శరీరకుహరాన్ని ఆధారంగా చేసుకుని మూడు రకాలుగా వర్గీకరించవచ్చు.
1.అశరీరకుహర/శరీరకుహర రహిత జీవులు (Acoelomates)
2. మిధ్యా శరీర కుహర జీవులు (Psedudo coelomates)
3. నిజ శరీర కుహర జీవులు (Eucoelomates)
విభక్త శరీర కుహర జీవులు (Schizo coelomates)
ఆంత్ర శరీర కుహర జీవులు (Entero coelomates)
అశరీర కుహర/శరీర కుహర రహిత జీవులు
వీటిలో శరీర కుహరం ఉండదు, కాబట్టి వీటిని శరీర కుహర రహిత జీవులు అంటారు.
ఉదా: ప్లాటీ హెల్మెంథిస్ వర్గం జీవులు
మిధ్యా శరీర కుహర జీవులు
శరీర కుహరాన్ని మధ్యస్తచ ఉపకళ ఆవరించి ఉండే జీవులను మిధ్యా శరీర కుహర జీవులు అంటారు.
ఉదా: నిమాటి హెల్మెంథిస్ వర్గం జీవులు, రొటిఫెరా, కొన్ని మైనర్ వర్గాలు.
నిజ శరీర కుహర జీవులు
శరీర కుహరాన్ని మధ్యస్తచ ఉపకళ ఆవరించి ఉన్నటువంటి జీవులను నిజ శరీర కుహర జీవులు అంటారు.
శరీర కుహరం ఏర్పడిన విధానాన్ని అనుసరించి నిజ శరీర కుహర జంతువులను రెండురకాలుగా వర్గీకరించవచ్చు. అవి..
a. విభక్త శరీర కుహర జీవులు
b. ఆంత్ర శరీర కుహర జీవులు
విభక్త శరీర కుహర జీవులు
మధ్యస్తచం చీలి శరీర కుహరం ఏర్పడిన జీవులను విభక్త శరీర కుహర జీవులు అంటారు.
ఉదా: అనెలిడా వర్గం జీవులు
ఆర్థ్రోపొడా వర్గం జీవులు
మొలస్కా వర్గం జీవులు
ఆంత్ర శరీర కుహర జీవులు
ఆది ఆంత్ర మధ్యస్తచ కోశాల (Mesodermal pouches) నుంచి ఏర్పడిన శరీర కుహరాన్ని కలిగిన జీవులను ఆంత్ర శరీర కుహర జీవులు అంటారు.
ఉదా: ఇఖైనోడర్మేటా వర్గం జీవులు
హెమీకార్డేటా వర్గం జీవులు
కార్డేటా వర్గం జీవులు
పిండం చుట్టూ పిండ త్వచాలు (ముఖ్యంగా ఉల్బం అనే పిండ త్వచం) ఉన్నాయా లేవా అనే విషయాన్ని ఆధారంగా చేసుకుని జంతువులను రెండు రకాలుగా వర్గీకరించవచ్చు. అవి..
1. అఉల్బదారులు/ఉల్బరహిత జంతువులు (Anamniotes)
2. ఉల్బదారులు (Amniotes) అఉల్బదారులు
పిండం చుట్టూ ఉల్బం అనే పిండత్వచం లేనటువంటి జంతువులను అఉల్బదారులు అంటారు.
ఉదా: చేపలు, ఉభయచరాలు
ఉల్బదారులు పిండం చుట్టూ ఉల్బం అనే పిండత్వచం కలిగిన జంతువులను ఉల్బదారులు అంటారు.
ఉదా: సరీసృపాలు, పక్షులు, క్షీరదాలు
జంతువులలో ఉన్న రక్తప్రసరణ వ్యవస్థను రెండు రకాలుగా వర్గీకరించవచ్చు అవి.
1. స్వేచ్చాయుత/ వివృత రక్తప్రసరణ వ్యవస్థ (Opened type)
2. బంధిత/ సంవృత రక్త ప్రసరణ వ్యవస్థ (Closed type)
స్వేచ్చాయుత/ వివృత రక్తప్రసరణ వ్యవస్థ (Opened type)
ఈ రకం రక్తప్రసరణ వ్యవస్థ కలిగిన జంతువుల్లో రక్తం హృదయం నుంచి వెలువడి స్వేచ్చగా ఖాళీ ప్రదేశాల్లో ప్రవహిస్తూ కణాలు, కణజాలాలతో సంబంధాన్ని కలిగి ఉంటుంది.
ఉదా: ఆర్థ్రోపొడా
మొలస్కా
ఇఖైనోడర్మేటా
యూరోకార్డేటా
బందిత/ సంవృత రక్త ప్రసరణ వ్యవస్థ ( closed type)
ఈ రకం రక్తప్రసరణ వ్యవస్థ కలిగిన జంతువుల్లో రక్తం రక్తనాళాల్లో (ధమనులు, సిరలు, కేశనాళికలు) ప్రవహిస్తుంది.
ఉదా: అనెలిడా
సెఫలోపొడా(మొలస్కా వర్గం)
సెఫలో కార్డేటా
కార్డేటా
అండోత్పాదకాలు (oviparous)
గుడ్లు పెట్టే జంతువులను అండోత్పాదకాలు అంటారు.
ఉదా: చేపలు, ఉభయచరాలు, సరీసృపాలు, పక్షులు
ప్రొటోథీరియా క్షీరదాలు (ఎకిడ్నా, డక్బిల్ప్లాటిపస్)
శిశుత్పాదకాలు (Viviparous)
పిల్లలను కనే జంతువులను శిశుత్పాదకాలు అంటారు.
ఉదా: తేలు, సాలమాండ్ర అట్ర, నెక్టోఫ్రైనాయిడ్ అనే కప్ప, సొరచేప, రక్తపింజర, సముద్రపాము, మెటాథీరియా క్షీరదాలు, యూథీరియా క్షీరదాలు.
అండ శిశుత్పాదకాలు Ovoviviparous)
గుడ్లు పెట్టే, పిల్లలని కనే జంతువులను అండ శిశూత్పాదకాలు అంటారు.
ఉదా: కంగారు.
జంతువుల దేహ ఉష్ణోగ్రత మార్పులను ఆధారంగా చేసుకుని జంతువులను రెండు రకాలుగా వర్గీకరించవచ్చు. అవి…
1. అస్థిరోష్ణ/శీతల రక్త జంతువులు (Poikilothermic/cold blooded Animals)
2. స్థిరోష్ణ/ఉష్ణరక్త జంతువులు (Homeothermic/warm blooded animals)
అస్థిరోష్ణ/శీతల రక్త జంతువులు
పరిసరాల ఉష్ణోగ్రతకు అనుగుణంగా దేహ ఉష్ణోగ్రతను మార్చుకునే జంతువులను అస్థిరోష్ణ/శీతల రక్త జంతువులు అంటారు.
ఉదా: చేపలు, ఉభయచరాలు, సరీసృపాలు
స్థిరోష్ణ/ఉష్ణరక్త జంతువులు
పరిసరాల ఉష్ణోగ్రతకు అనుగుణంగా దేహ ఉష్ణోగ్రతను మార్చుకోనటువంటి జంతువులను అస్థిరోష్ణ/ఉష్ణ రక్త జంతువులు అంటారు.
ఉదా: పక్షులు, క్షీరదాలు
పిండాభివృద్ధి కాలంలో పిండంలో ఏర్పడే మొట్టమొదటి రంధ్రం అయిన ఆది ఆంత్ర రంధ్రం (Blastophore) నోరుగా మారుతుందా, పాయువుగా మారుతుందా అనే విషయాన్ని ఆధారంగా చేసుకుని జీవులను రెండు రకాలుగా వర్గీకరించవచ్చు. అవి…
1. ప్రథమ ముఖదారులు (Protostomes)
2. ద్వితీయ ముఖదారులు (Deutero stomes)
ప్రథమ ముఖదారులు
ఆది ఆంత్ర రంధ్రం నోరుగా మారే జీవులను ప్రథమ ముఖదారులు అంటారు.
ఉదా: అనెలిడా, ఆర్థ్రోపొడా, మొలస్కా వర్గాలకు చెందిన జీవులు.
ద్వితీయ ముఖదారులు
ఆది ఆంత్ర రంధ్రం పాయువుగా మారే జీవులను ద్వితీయ ముఖదారులు అంటారు.
ఉదా: ఇఖైనోడర్మేటా, హెమీకార్డేటా, కార్డేటా వర్గాలకు చెందిన జీవులు.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు