Catastrophic disaster | విధ్వంస విపత్తు – చక్రవాతం
చక్రవాతాలు (Cyclones)
– సైక్లోన్ అనే పదం సైక్లోస్ అనే గ్రీకు పదం నుంచి వచ్చింది. గ్రీకు భాషలో సైక్లోస్ అంటే చుట్టుకుని ఉన్న పాము లేదా పాము మెలికల చుట్టు (Coils of a snake) అని అర్థం.
– 1848లో బ్రిటిష్ వాతావరణ శాస్త్రవేత్త హెన్రీ పెడింగ్టన్.. బంగాళాఖాతంలో, అరేబియా సముద్రంలో ఏర్పడే తుఫానులు సర్పిలాకారంలో ఉండటంతో వీటికి సైక్లోన్స్ (చక్రవాతాలు) అని నామకరణం చేశారు.
– ఇది సహజకారక విపత్తు (నేచురల్ డిజాస్టర్).
చక్రవాతం
– చక్రవాతం అనేది సమశీతోష్ణ, ఉష్ణ అక్షాంశాల వేడి ప్రవాహాల్లో సంభవించే అల్ప వాతావరణ పీడనం. (లేదా) చక్రవాతాలు వెచ్చని సముద్రపు ఉష్ణోగ్రత, అధిక సాపేక్ష ఆర్థ్రత, వాతావరణ అస్థిరత కలయికవల్ల సంభవిస్తాయి.
– చక్రవాతాల్లో చక్రవాత కేంద్రం (eye of the cyclone) ఉంటుంది. కేంద్రం చుట్టూ మేఘాలు గుమికూడి ఉంటా యి. దీని వ్యాసం సుమారు 40-80 కి.మీ. ఉంటుంది.
– చక్రవాత కేంద్రం వద్ద మంచి ప్రశాంత వాతావరణం ఉంటుంది. చక్రవాత కేంద్రం అంచును చక్రవాత కుడ్యం అంటారు. దీని మందం 20-40 కి.మీ. ఉంటుంది. చక్రవాత కేంద్రం అంచువద్ద విధ్వంస పవనాలతో కూడిన తీవ్ర పరిస్థితులు ఉంటాయి. ఇది సుమారు 200 కి.మీ. దూరం వరకు కూడా విస్తరిస్తుంది. చక్రవాత కేంద్రం ఒక ప్రాంతాన్ని దాటేకొద్దీ గాలివేగం తగ్గుతుంది. అయితే చక్రవాతం కదిలేకొద్దీ గాలివేగం మళ్లీ పెరుగుతుంది.
తుఫాను ఎలా ఏర్పడుతుంది?
– చక్రవాతాలు సాధారణంగా భూమధ్యరేఖకు 5-20 డిగ్రీల ఉత్తర, దక్షిణ అక్షాంశాల మధ్య సంభవిస్తాయి. సముద్ర ఉపరితలంపై ఒక ప్రాంతంలో వేడెక్కిన గాలి తేలికై పైకి వెళ్తుంది. ఆ ప్రాంతంలో గాలి పీడనం తక్కువ అవుతుంది. దీన్నే అల్పపీడన ప్రాంతం అంటారు. ఈ అల్పపీడన ప్రాంతంలోకి చల్లనిగాలి అన్నిదిశల నుంచి చాలా వేగంతో ఒకేసారి చొచ్చుకుని వస్తుంది. ఇలా అన్నివైపుల నుంచి వచ్చిన గాలివల్ల వాయుగుండం ఏర్పడుతుంది. భూమి తన చుట్టూ తాను తిరుగుతుండటంవల్ల ఈ గాలి చక్రంవలె సుడులు తిరుగుతుంది. ఇది ఉత్తరార్ధగోళంలో అపసవ్యదిశలోను, దక్షిణార్ధగోళంలో సవ్యదిశలోనూ తిరుగుతుంది. ఇది తనతోపాటు ఎక్కువ నీటి ఆవిరిని తీసుకుని సమారు 9 కి.మీ. ఎత్తుకు లేస్తుంది. ఈ తేమగాలి పైకి పోయేకొద్దీ వ్యాప్తిచెంది చల్లారుతుంది.
– ఇందులోనూ నీటి ఆవిరి ద్రవీకరణం చెందేటప్పుడు ఉష్ణం విడుదలై కుండపోతగా వర్షం కురుస్తుంది.
– సుడులు తిరిగే తుఫానువల్ల ఈదురుగాలులు వీస్తాయి.
– తుఫాను ఏర్పడి అభివృద్ధి చెందడానికి దాదాపు 48 గంటలు పడుతుంది.
తుఫాన్ల సాధారణ లక్షణాలు
1. బలమైన గాలులు
2. అసాధారణ వర్షం
3. తుఫాను కల్లోలం
– భారత్‌లో తుఫానులు తక్కువ స్వభావం కలిగి ఉంటాయి.
– చక్రవాతం మూడు దశల్లో అభివృద్ధి చెందుతుంది. అవి..
– రూపకల్పన, తొలి అభివృద్ధి దశ: చక్రవాతం ఏర్పడాలంటే (రూపకల్పన) నాలుగు వాతావరణ సముద్ర పరిస్థితులు అవసరం.
ఎ. 60 మీ. లోతువరకు 26 డిగ్రీ సెంటీగ్రేడ్ కంటే అధికమైన వెచ్చని ఉష్ణోగ్రత. (భాష్పీభవనం ద్వారా గాలిలోకి సమృద్ధిగా నీటి ఆవిరిని అందించడం కోసం)
బి. అధిక సాపేక్ష ఆర్థ్రత (నీటి ఆవిరిని, మేఘాలను సూక్ష్మబిందువులుగా మార్చడానికి)
సి. సాంద్రీకరణం చెందినప్పుడు మేఘ సంవహనాన్ని ప్రోత్సహించే వాతావరణ అస్థిరత.
డి. అల్పపీడన కేంద్రాల చుట్టూ చక్రవాతాల ప్రసరణవల్ల ప్రేరేపితమయ్యే ప్రభావాన్ని స్వీకరించడానికి. భూభ్రమణం కారణంగా బలం ప్రభావాన్ని అనుమతించే భూమధ్య రేఖకు 4 డిగ్రీలు, 5 డిగ్రీలు దూరంలో ఉండే ప్రదేశం.
– సంపూర్ణ పక్వదశ: ఉరుములతో కూడిన అతిపెద్ద క్యుములస్ మేఘాలు వలయాకారపట్టీగా ఏర్పడుతాయి. అధిక వర్షాన్ని ఇస్తాయి.
– బలహీన పడటం: వెచ్చని తేమతో కూడిన గాలి అర్ధాంతరంగా చేదనం చెందడం ప్రారంభమైన వెంటనే ఉష్ణమండల చక్రవాతం బలహీనపడటం మొదలవుతుంది.
– సగటున ఒక చక్రవాత జీవితచక్రం ఆరు రోజులు.
– చరిత్రలో ఇప్పటివరకు అత్యంత సుదీర్ఘమైన చక్రవాతంగా టైపూన్ జాన్ నమోదైంది. ఇది 1994, ఆగస్టు 10 నుంచి సెప్టెంబర్ 11 వరకు ఈశాన్య, వాయవ్య పసిఫిక్ పరివాహ ప్రాంతంలో ఏర్పడి 31 రోజులపాటు ఉంది.
– దేశంలో అయనరేఖా చక్రవాతాలు ఏర్పడుతాయి.
– అయనరేఖా చక్రవాతాలు భూమధ్యరేఖకు 50-200ల ఉత్తర-దక్షిణ అక్షాంశాల మధ్య ఏర్పడుతాయి.
– తుఫాను గాలులు గంటకు 50 కి.మీ. లేదా అంతకంటే ఎక్కువ వేగంతో వీస్తూ ఉంటాయి.
తుఫాను కేటగిరీలు
– చక్రవాత తుఫాన్లను అవి సృష్టించే విధ్వంసం, గాలి వేగాన్ని బట్టి ఐదు కేటగిరీలుగా విభజించారు. అవి..
– తూర్పు తీరరేఖ చక్రవాతాలకు భారత్ అత్యంత అనుకూలంగా ఉంటుంది. దీనికి కారణం తక్కువలోతు కలిగిన మహాసముద్ర సంస్తరం (Ocean bed), తీరప్రాంతపు నీరు. దీంతో భారత ఉపఖండం ప్రపంచంలోనే అత్యంత తీవ్రమైన చక్రవాత ప్రభావిత ప్రాంతంగా మారింది.
తుఫాను లక్షణాలు
– తుఫాను (చక్రవాతాలు) సహజ కారక విపత్తు
– ఇది వేగంగా సంభవించే విపత్తు. ఇది వాతావరణ, నీటి సంబంధ విపత్తు.
ముప్పు ఉన్న అంశాలు
– భారీ ఎత్తున ప్రాణ నష్టం, ఆస్తి నష్టం, పర్యావరణ నష్టం కలుగుతుంది.
ఉదా: 1991లో ఒడిశాలో వచ్చిన సూపర్ సైక్లోన్‌వల్ల 10 వేల మందికిపైగా మరణించారు.
– 1970లో పశ్చిమబెంగాల్, బంగ్లాదేశ్‌లో సంభవించిన తుఫానువల్ల 5 లక్షల మంది చనిపోయారు.
– 2008లో బర్మాలో సంభవించిన తుఫానువల్ల లక్షా 38వేల మంది మరణించారు. దీంతోపాటు 81.2 బిలియన్ అమెరికన్ డాలర్ల ఆస్తి నష్టం జరిగింది.
– లోతట్టు ప్రాంతాలను ముంచివేయడం (వరదలు సంభవించండం). తీర ప్రాంతాల్లో సుమారు 15 కి.మీ. దూరం వరకు లోతట్టు ప్రాంతాలు ముంపునకు గురవుతాయి.
– తుఫాన్ల వల్ల సంభవించే మరణాల్లో 90 శాతం నీటిలో మునిగిపోవడంతో సంభవిస్తాయి.
– ప్రజారోగ్యం దెబ్బతినడం, (అంటే నీరు కలుషితం కావడం, తద్వారా వైరల్ వ్యాధులు, డయేరియా, మలేరియా వంటి వ్యాధులు వ్యాపిస్తాయి) తుఫాను వరదల తర్వాత అంటువ్యాధులు విజృంభించడం.
– పంటలు, ఆహార పదార్థ్ధాలు దెబ్బతినడం (అంటే పంటలు కొట్టుకుపోవడం, నేలకొరగడం, తోటపంటలు, కూరగాయలు దెబ్బతినడం).
– మౌలిక సదుపాయాలకు నష్టం వాటిల్లడం. అంటే రోడ్లు, డ్రైనేజీలు, కమ్యూనికేషన్ వ్యవస్థ దెబ్బతినడం, విద్యుత్ ఆటంకాలు సంభవించడం.
తుఫాను హెచ్చరిక
– చక్రవాతం (సైక్లోన్లు) ఏర్పడటానికి కొంత సమయం తీసుకున్నప్పటికీ అవి తీరప్రాంతాలను అకస్మాత్తుగా తాకుతాయి. చక్రవాత కదలిక, అది ఏర్పడే తీరు, అది పయనించే మార్గాన్ని శాటిలైట్ వ్యవస్థలు పసిగడుతాయి.
– ప్రపంచంలో అత్యుత్తమ తుఫాను హెచ్చరిక వ్యవస్థలు కలిగిన దేశాల్లో భారత్ ఒకటి.
– చక్రవాతాల రాకను అంచనావేసి హెచ్చరికలు చేసే బాధ్యతను భారత వాతావరణ శాఖ నిర్వర్తిస్తుంది. ఇది నోడల్ డిపార్ట్మెంట్గా పనిచేస్తుంది.
– ఐఎన్ఎస్ఏటీ ఉపగ్రహం 10 సైక్లోన్ డిటెక్షన్ రాడార్ల సహాయంతో చక్రవాతం రాకను పసిగడుతుంది.
– ఈ తుఫాను హెచ్చరికను శాటిలైట్ ఆధారిత విపత్తు హెచ్చరిక వ్యవస్థలైన టీవీ, రేడియో, టెలిఫోన్, ఫ్యాక్స్, టెలిగ్రామ్, బహిరంగ ప్రకటనల ద్వారా ప్రచారం చేస్తారు.
– తుఫాను హెచ్చరికలను నాలుగు దశల్లో జారీచేస్తారు. అవి..
1. ప్రి సైక్లోన్ వాచ్: 72 గంటల ముందుగా జారీ చేస్తారు.
2. సైక్లోన్ అలర్ట్: కనీసం 48 గంటల ముందు
3. తుఫాను హెచ్చరిక: కనీసం 24 గంటల ముందు
4. తుఫాను నేలను తాకిన అనంతర పరిస్థితి: కనీసం తీరాన్ని తాకడానికి 12 గంటల ముందు
– భారత వాతావరణ శాఖ సైక్లోజెనిసిస్, ఇంటెన్సిఫికేషన్, మానిటరింగ్ అంచనాలకు సంబంధించి ఒక రోడ్ మ్యాప్‌ను తయారు చేసింది. చక్రవాతాలు పయనించే మార్గాన్ని ఇన్శాట్ ఉపగ్రహం ద్వారా కనిపెడతారు. ఈ హెచ్చరికలను ఐఎండీ.. సాధారణ ప్రజానీకం, సముద్రాల్లో వేటకు వెళ్లిన మత్స్యకారులు, ఓడరేవుల అధికారులు, వైమానిక వర్గాలు, ప్రభుత్వయంత్రాగానికి తెలుపుతుంది.
భారత్‌లో చక్రవాతాలు
– ప్రపంచవ్యాప్తంగా సంభవించే మొత్తం తుఫాన్లలో 107 భారత్‌లో సంభిస్తాయి.
– దేశంలోని మొత్తం భూవైశాల్యంలో సుమారు 8 శాతం భూభాగం చక్రవాతాలకు అనుకూలంగా ఉంది. సుమారు 5700 కి.మీ.ల తీరరేఖ చక్రవాతా (తుఫాన్లు)లు, వరదలు, సునామీలు సంభవించడానికి అనుకూలంగా ఉన్నాయి.
– బంగాళాఖాతంలో సంభవించే అత్యధికశాతం తుఫాన్లతోపాటు అరేబియా సముద్రంలో కూడా తుఫానులు సంభవిస్తాయి. ఈ రెండు సముద్రాలలో 4:1 నిష్పత్తిలో ఉంటాయి.
– దేశంలో సంభవించే మొత్తం చక్రవాతాలలో సుమారు 80 శాతం తూర్పుతీర రేఖను తాకుతుంటాయి. అంటే బంగాళాఖాతంలో ఉద్భవించే చక్రవాతాలకు తూర్పు తీరరేఖ అత్యంత అనుకూలంగా ఉంటుంది.
– దేశ తీరరేఖలో సంభవించే మొత్తం చక్రవాతాల్లో 2/3 వంతులు బంగాళాఖాతంలోనే ఏర్పడుతాయి.
– బంగాళాఖాతం వెంబడి ఉండే ఒడిశా, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, పశ్చిమబెంగాల్ రాష్ర్టాలు చక్రవాతాలతోపాటు బలమైన ఈదురుగాలులు, వరదలు, తుఫాను అలజడుల వంటి వైపరీత్యాలకు గురవుతుంటాయి.
– అరేబియా సముద్రంలో ఉద్భవించే చక్రవాతాలకు పశ్చిమ తీరంలో ఉండే గుజరాత్, మహారాష్ట్ర, కేరళ అత్యంత అనుకూలంగా ఉంటాయి.
– ప్రతి ఏడాది బంగాళాఖాతం, అరేబియా సముద్రంలో ఏర్పడే తుఫాన్లలో సుమారు 5-6 ఉష్ణమండల చక్రవాతాలు తీరాన్ని తాకుతాయి. ఇందులో 2 లేదా 3 చాలా తీవ్రంగా ఉంటాయి.
– దేశంలో నవంబర్‌లో ఎక్కువగా తుఫాన్లు ఏర్పడుతాయి.
– చక్రవాత తుఫాన్లు గంటకు 65-117 కి.మీ. పవన వేగంతో సంభవిస్తే, బలమైన చక్రవాత తుఫాన్లు గంటకు 119-164 కి.మీ. పవన వేగంతో అక్టోబర్-డిసెంబర్ నెలల మధ్య ఒడిశా, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ తీరాలను తాకుతాయి.
ఉదా: 1927లో- 23 తుఫాన్లు, 1930లో 10 తుఫాన్లు, 1949లో ఒకే తుఫాను, 1976లో 10 తుఫాన్లు, 1984లో 7 తుఫాన్లు సంభవించాయి.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు