Gandhi | గాంధీయుగం
– గాంధీజీ 1915లో భారత్‌కు తిరిగివచ్చారు. దక్షిణాఫ్రికా లో ఆయన నిర్వహించిన పోరాటం అప్పటికే భారత్‌లోని విద్యాధికులకే కాక, బడుగు జనాలకు కూడా తెలిసిపోయింది. కుంభమేళా సందర్భంగా హరిద్వార్ వెళ్లినప్పుడు ఆయన్ని చూడటానికి జనం బారులుతీరారు.
– నాయకులు, త్యాగమూర్తులకున్న అన్ని లక్షణాలు గాంధీ లో ఉన్నాయంటూ గోఖలే కీర్తించారు. అంతేకాదు గాంధీ లో ఉన్న మరో లక్షణాన్ని కూడా గోఖలే గుర్తించారు. తన చుట్టూ ఉన్న సామాన్యులను కూడా ధీరులుగాను, వీరులుగాను తీర్చిదిద్దగల ఒక అతీంద్రియ శక్తి ఆయనలో ఉంది అని అన్నారు.
– గోఖలే సలహాతో ఏ విషయంపై అయినా సమగ్ర అవగాహన లేనిదే వేలుపెట్టకూడదన్న తన స్వభావానికి అనుగుణంగా ఏడాదిపాటు ఎటువంటి రాజకీయ సమస్యపైనా ప్రజాముఖంగా ఒక నిర్ణయానికి కట్టుబడకూడదని గాంధీ జీ నిర్ణయించుకున్నారు.
– ఆయన ఏడాదంతా దేశవ్యాప్తంగా పర్యటనలు చేస్తూ దేశ ప్రజల స్థితిగతులను స్వయంగా అధ్యయనం చేయడంలో గడిపారు. అహ్మదాబాద్‌లో ఆశ్రమాన్ని ఏర్పాటుచేసుకునే పనిలో ఉన్నారు. ఆయనతోపాటు దక్షిణాఫ్రికా నుంచి వచ్చిన అనుచరులూ నివసించడానికి అది ఏర్పాటైంది.
– బ్రిటిష్ ప్రభుత్వం మొదటి ప్రపంచ యుద్ధంలో ఉన్న తరుణంలోనే ఉద్యమించి ఒత్తిడి తేవాలన్న హోంరూల్ ఉద్య మ నాయకుల వాదనపై కూడా ఆయనకు విశ్వాసం లేదు.
– రాజకీయ పోరాటానికి ఈ మార్గాలేవి ఉపకరించవని, సత్యాగ్రహం మాత్రమే సరైన పోరాట మార్గమని ఆయన పూర్తి విశ్వాసంతో ఉన్నారు. అప్పటికే ఏర్పడిన రాజకీయ సంస్థల్లో తాను చేరకపోవడానికి కారణాలను ఆయన మాటల్లోనే..నా జీవితకాలంలో వివిధ అంశాలపై నిర్దిష్టమైన అభిప్రాయాలు అప్పటికే ఏర్పడిన కారణంగా నేను ఒక సంస్థలో చేరడమన్నది జరిగితే అది ఆ సంస్థ విధానాలను ప్రభావితం చేయడానికే… కాని సదరు సంస్థ నన్ను ప్రభావితం చేయడానికి మాత్రం కాదు. మనకు దారిచూపే కాంతి మిణుకు మిణుకు మనకుండా కళ్లు మిరిమిట్లు గొలిపే స్థాయిలో ఉండాలన్నదే నా ఆకాంక్ష అని గాంధీజీ వ్యాఖ్యానించారు.
– 1917, 1918 తొలినాళ్లలో గాంధీజీ మూడు ప్రధాన ఉద్యమాలు చేశారు. బీహార్‌లోని చంపారన్, గుజరాత్‌లోని అహ్మదాబాద్, ఖేడాల్లో ఇవి సాగాయి. ఈ ఉద్యమాల్లో ఉన్న సామీప్యం ఒకటే. ఇవన్నీ ఆయా ప్రాంతాలకు సంబంధించిన సమస్యలపై అంటే స్థానిక సమస్యల ఆధారంగా జరిగాయి.
– ఈ ఉద్యమాలు అక్కడివారి ఆర్థిక సంబంధమైన డిమాండ్ల సాధన కోసం జరిగాయి. చంపారన్, ఖేడా ఉద్యమాల్లో రైతు కూలీలు పాల్గొంటే అహ్మదాబాద్ పోరాటంలో పారిశ్రామిక కార్మికులు ఆయన వెంట నడిచారు.
చంపారన్ ఉద్యమం
– ఇది 1917 తొలినాళ్లలో ఆరంభమైంది. భారతీయ వ్యవసాయదారులు తమ కమతాల్లో 3/20వ వంతున నీలిమందు పండించాలని యూరోపియన్ యజమానులు వ్యవసాయదారులతో ఒక ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. దీనికే తీన్ కథియా విధానం అని పేరు.
– 19వ శతాబ్దం చివరినాటికి పరిస్థితులు మారిపోయాయి. జర్మనీలో తయారైన సింథటిక్ రంగులు నీలిమందుకు మార్కెట్లో గిరాకీ లేకుండా చేశాయి. తమ కమతాల్లో 20 వంతుల్లో మూడో వంతు తప్పనిసరిగా నీలిమందును పండించాలన్న ఒప్పందం అప్పటికే అమల్లో ఉంది. దాని నుంచి భారతీయ రైతులను విముక్తం చేయాల్సిన యూరోపియన్ యజమానులు.. రైతుల అవసరాన్ని అడ్డంపెట్టుకుని ఒప్పందం నుంచి విముక్తిచేసే పేరిట కౌలు విపరీతంగా పెంచి, ఇతరత్రా బకాయిలను కూడా అక్రమంగా రైతుల నెత్తిన రుద్దారు.
– దీంతో రైతుల్లో వ్యతిరేకత ఆరంభమైంది. ఇది వాస్తవానికి 1908లోనే మొదలైనప్పటికీ రాజ్‌కుమార్ శుక్లా అనే స్థానిక రైతు గాంధీజీతోపాటు దేశవ్యాప్తంగా పర్యటించి ఆయనను చంపారన్ వచ్చి రైతుల సమస్యలను స్వయం గా చూడటానికి ఒప్పించేవరకూ కొనసాగుతూనే ఉంది. గాంధీజీని చంపారన్ తీసుకురావాలన్న రాజ్‌కుమార్ శుక్లా నిర్ణయం పేదల హక్కుల కోసం పోరాడుతున్న వ్యక్తిగా గాంధీజీకి అప్పటికే ఉన్న ప్రతిష్ఠకు అద్దంపడుతుంది.
– గాంధీజీ చంపారన్‌లో అడుగుపెట్టగానే వెంటనే జిల్లా విడిచి పొమ్మంటు జిల్లా కమిషనర్ నుంచి ఉత్తర్వులు వచ్చాయి. అయితే గాంధీజీ అందుకు నిరాకరించడమే కాకుండా ఆదేశాలను ఉల్లంఘించినందుకు శిక్ష అనుభవించడానికి తాను సిద్ధంగా ఉన్నట్టు కూడా ప్రకటించి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశారు.
– ఇది అత్యంత అసాధారణమైన చర్య ఎందుకంటే అప్పటివరకు తిలక్, అనిబిసెంట్ వంటి వారు ప్రజా ఉద్యమాలు నిర్వహించినప్పటికీ ప్రభుత్వ ఆదేశాలను బేఖాతరు చేయలేదు. ఒక ప్రాంతంలో ఉద్యమాన్ని నిర్వహిస్తున్నప్పుడు వెంటనే ఆ ప్రాంతాన్ని విడిచిపొమ్మని ప్రభుత్వం ఆదేశిస్తే వారు తప్పకుండా పాటించేవారు.
– గాంధీజీ నిర్ణయాన్ని ఒక సమస్యాత్మకమైన అంశంగా మార్చి ఆయనను తిరుగుబాటుదారుడిగా గుర్తించి, వ్యవహారాన్ని సాగదీయడానికి ఇష్టపడని బ్రిటిష్ ప్రభుత్వం, గాంధీజీని ముందుకు సాగనీయమని స్థానిక ప్రభుత్వానికి ఆదేశాలు ఇచ్చింది. ఈ విధంగా విజేయుడైన గాంధీజీ నీలిమందు పండించే రైతుకూలీల సమస్యలను తెలుసుకోడానికి ఉపక్రమించారు.
– అప్పటికే గాంధీజీ సహచరులుగా మారిన బీహార్ మేధావు లు బ్రిజ్‌కిశోర్, బాబు రాజేంద్రప్రసాద్ వంటివారు, మహదేశాయ్, నరహరి పాఠక్ వంటి గుజరాతీ యువకులు, జేబీ కృపలాని కలిసికట్టుగా ఉదయం నుంచి సాయంత్రం వరకు గ్రామాల్లో విస్తృతంగా తిరిగి రైతుల సమస్యలను రికార్డు చేశారు. అంతేకాదు వారిన అనేక విధాలుగా ప్రశ్నించి వారు చెబుతున్నది సరైందా కాదా అని నిర్ధారించుకుని మరీ వాటి ప్రకటనలను రికార్డు చేశారు.
– ఈ మొత్తం వ్యవహారాన్ని అధ్యయనం చేయడానికి బ్రిటిష్ ప్రభుత్వం ఒక విచారణ కమిషన్‌ను ఏర్పాటు చేస్తూ అందులో గాంధీజీని సభ్యుడిగా నియమించింది. 8 వేలమంది రైతుకూలీల నుంచి సేకరించిన విస్తృత సమాచారం తన దగ్గరున్న గాంధీజీ ఇక వెనుదిరిగి చూడలేదు.
– తీన్ కథియా విధానం రద్దుచేయాల్సిన అవసరాన్ని కమిషన్‌కు తెలియచెప్పడంతోపాటు అక్రమంగా కౌలు హెచ్చించినందుకు నష్టపరిహారం ఇవ్వడానికి కూడా కమిషన్‌ను ఒప్పించారు. ఇక తోటల యజమానులతో సత్వరమే ఒక అంగీకారానికి వచ్చేందుకు వీలుగా వారు అక్రమంగా వసూలుచేసిన మొత్తంలో నాలుగో వంతు మొత్తాన్ని మాత్రమే రైతుకూలీలకు తిరిగి ఇచ్చేందుకు కూడా గాంధీజీ అంగీకరించారు.
– మొత్తం సొమ్మంతా వెనక్కు ఇవ్వాల్సిందేనంటూ యజమానులను ఎందుకు పట్టుపట్టలేదన్న విమర్శకుల ప్రశ్నలకు ఆయన చెప్పిన సమాధానం ఒకటే వారు ఎంతోకొంత తిరిగి ఇవ్వడమే వారి హోదాను, ఆత్మగౌరవాన్ని తగినంతగా దెబ్బతీసిందని అది చాలునని గాంధీజీ వ్యాఖ్యానించారు. చాలా సందర్భాల్లో గాంధీజీ అంచనా సరైనది అయినట్టే ఈ సందర్భంలో కూడా ఆయన అనుకున్నట్టే అయింది. సరిగ్గా పదేండ్లలో తోట యజమానులందరూ ఆ జిల్లాను విడిచిపెట్టి వెళ్లిపోయారు.
అహ్మదాబాద్ మిల్లు కార్మికుల పోరాటం
– గాంధీజీ అహ్మదాబాద్ మిల్లు కార్మికుల సమస్యపైన దృష్టి సారించారు. ఇక్కడ కార్మికులు, యజమానులకు మధ్య ప్లేగు బోనస్‌కు సంబంధించిన వివాదం రాజుకుంటుంది. ప్లేగు వ్యాధి తగ్గిపోయిన కారణంగా ఈ బోనస్‌ను ఉపసంహరించుకుంటామని యజమానులు అంటుండగా యుద్ధకాలంలో వేతనాల పెంపు నామమాత్రంగానే ఉన్నందున ధరలు ఆకాశాన్నంటుతున్న స్థితిలో బతుకు దుర్భరంగా ఉందని, ఈ బోనస్‌ను యథాతథంగా కొనసాగించాలని కార్మికులు కోరుతున్నారు.
– యజమానులు, కార్మికులకు మధ్య సాగుతున్న ఈ వివాదం తీవ్రస్థాయికి చేరుకునే ప్రమాదాన్ని పసిగట్టిన కలెక్టర్ ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోవాలని, మిల్లు యజమానులపై ఒత్తిడి తెచ్చి ఏదో ఒక విధంగా ఇరువర్గాల మధ్య రాజీ కుదుర్చాలని గాంధీజీని కోరాడు. అహ్మదాబాద్‌లో ప్రము ఖ మిల్లు వ్యాపారి అంబాలాల్ సారాభాయ్ గాంధీజీకి మిత్రుడు. భూరి విరాళంతో సబర్మతి ఆశ్రమం అంతరించిపోకుండా కాపాడిన దానశీలి.
– గాంధీజీ అటు మిల్లు యజమానులు ఇటు కార్మికులను ట్రిబ్యునల్ ఆదేశాలకు లోబడి ఉండేందుకు ఎంతో శ్రమకోర్చి ఒప్పించారు. అయితే ఎక్కడో అనుకోకుండా జరిగిన ఒక చిన్న సమ్మెను అవకాశంగా తీసుకుని మిల్లు యజమానులు ఒప్పందం నుంచి వైదొలిగిపోతూ 20 శాతం బోనస్ మాత్రమే ఇస్తామని దీన్ని ఆమోదించని కార్మికులను డిస్మిస్ చేస్తామని హెచ్చరించారు.
– ఈ చర్య గాంధీజీని ఆగ్రహానికి గురిచేసింది. ఒప్పందం ఉల్లంఘనని ఆయన చాలా తీవ్రమైన విషయంగా తీసుకుని వెంటనే మిల్లు కార్మికులకు సమ్మె చేయాలని సూచించారు. పారిశ్రామిక ఉత్పత్తి వ్యయాన్ని, లాభాలను మరోవైపు జీవన వ్యయాన్ని అధ్యయనం చేసిన తర్వాత వేతనాలపెంపు కనీసం 35శాతం ఉండాలన్న డిమాండ్ సమంజసమని గాంధీజీ సూచించారు.
– సమ్మె సందర్భంగా గాంధీజీ ప్రతిరోజూ సబర్మతీ నది ఒడ్డున మిల్లు కార్మికులను ఉద్దేశించి ప్రసంగించారు. రోజూ ఒక న్యూస్ బులిటెన్ విడుదల చేసేవారు.
– అంబాలాల్ సారాభాయ్ సోదరి అనసూయాబెన్ ఈ పోరాటంలో గాంధీజీకి కుడిభుజంలా వ్యవహరించారు. ఈ వ్యవహారంలో ఆమె సోదరుడు, గాంధీజీ మిత్రుడు అయిన అంబాలాల్ వీరి ప్రధాన ప్రత్యర్థుల్లో ఒకరు.
– కొన్ని రోజుల తర్వాత కార్మికుల వ్యవహార శైలిలో మార్పువచ్చింది. రోజువారీ సమావేశాలకు హారయ్యే కార్మికుల సంఖ్య క్రమంగా తగ్గిపోవడం ప్రారంభమైంది. ఈ పరిస్థితుల్లో కార్మికులను సంఘటితం చేయడానికి గాంధీజీ నిరహారదీక్షకు సంకల్పించారు. ఇది కార్మికులపైనే కాదు, మిల్లు యజమానులపైన కూడా ప్రభావం చూపింది.
– మొత్తం వివాదాన్ని ఒక ట్రిబ్యునల్‌కు అప్పగించడానికి వారు అంగీకరించారు. గాంధీజీ వెంటనే సమ్మెను ఉపసంహరించారు. కొద్దికాలంలోనే కార్మికులు డిమాండ్ చేస్తున్న విధంగా వేతనాన్ని 35 శాతం పెంచాలని ట్రిబ్యునల్ తీర్పు చెప్పింది.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు