ఏమిటీ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్
-కంప్యూటర్లు, రోబో లాంటి యంత్రాలు చేసే ప్రతి పనికి ప్రోగ్రామ్‌లు అవసరం. ఇలా ప్రోగ్రామ్‌ల అవసరం లేకుండానే పరిసరాల్లో మార్పులకు అనుగుణంగా ఆలోచించగలగడం, నేర్చుకోగలగడం, సొంతంగా నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం కలిగి ఉండటాన్నే ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) అంటారు. మరోవిధంగా చెప్పాలంటే ఇనుముకు మెదడు, హృదయాన్ని అమర్చడం అన్నమాట. అమెరికా సైంటిస్ట్ జాన్ మెక్కార్తి 1956లోనే ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ పదాన్ని సృష్టించారు.
-ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ప్రాథమికంగా కంప్యూటర్ ఆధారిత వ్యవస్థ. ఇది సాధారణంగా మానవులకు అవసరమయ్యే పనులను చేయగలదు. ఇందులో స్పీచ్ రికగ్నిషన్, విజువల్ పర్సెప్షన్, లాంగ్వేజ్ ఐడెంటిఫికేషన్, డెసిషన్ మేకింగ్ మొదలైనవి ఉంటాయి. వాయిస్ కమాండ్లపై పనిచేసే మీ చుట్టూ మీరు చూసే ఇటువంటి వ్యవస్థలన్నీ కృత్రిమ మేధస్సు వ్యవస్థలే. ఐఫోన్ వినియోగదారులకు తెలిసిన సిరి కూడా ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ పర్సనల్ అసిస్టెంటే.
-ప్రస్తుతం డిజిటల్ యుగం వేగంగా దూసుకుపోతుంది. దీంతో ఎన్నో కొత్త కొత్త సాంకేతిక వ్యవస్థలు అందుబాటులోకి రానున్నాయి. వ్యాపార, వాణిజ్య, సేవ రంగాల్లో ఉత్పత్తిని మెరుగుపర్చడానికి ఈ కృత్రిమ మేధ ఉపయోగపడుతుంది. మనిషి తన తెలివిని జోడించి మెషీన్లను తెలివైనవాటిగా మార్చేస్తున్నాడు.
-ముందున్నదంతా ఏఐ యుగమే. దీంతో ఇప్పటికే చాలా టెక్నాలజీ, ఫార్మా, కార్లు, ఇన్సూరెన్స్ ఏజెన్సీ, మొబైల్ కంపెనీలు ఏఐని విరివిగా ఉపయోగిస్తున్నాయి. అడిగినదానికి సమాధానం చెప్పే రోబోలు, కంప్యూటర్ అప్లికేషన్లు, మనుషుల తీరును బట్టి వాటంతట అవే మెయిల్స్, మెసేజ్‌లలో ముఖ్యమైనవాటిని గుర్తించి నోటిఫికేషన్లుగా చూపే యాప్స్ ఇలా ప్రతి విషయంలో ఏఐ కీలకంగా మారింది.
-ప్రస్తుతం నిత్యావసర వస్తువుగా మారిన సెల్ఫోన్లలో కూడా ఏఐ టెక్నాలజీని వినియోగిస్తున్నారు. యాపిల్ సిరి, అమెజాన్ అలెక్సా, గూగుల్ అసిస్టెంట్ వంటి వర్చువల్ అసిస్టెంట్లతోపాటు చాలా రకాల యాప్స్ ఏఐ, క్లౌడ్ కంప్యూటింగ్, మెషీన్ లెర్నింగ్ టెక్నాలజీతో రూపొందించినవే. క్లౌడ్ కంప్యూటింగ్ సర్వీసులిచ్చే కంపెనీలు మెషీన్ లెర్నింగ్ సామర్థ్యంపైనే దృష్టి పెడుతున్నాయి. దీంతో బిజినెస్‌ను పెంచుకునేందుకు తమ అప్లికేషన్లను మరింత తెలివిగా మార్చేస్తున్నాయి.
నైపుణ్యాలు
-కృత్రిమ మేధస్సుతో పనిచేయడానికి విశ్లేషణాత్మక ఆలోచన ప్రక్రియ, సమస్యలను సమర్థవంతంగా పరిష్కరించే సామర్థ్యం ఉండాలి.
-అత్యాధునిక ఆవిష్కరణల గురించి ఆలోచించే దూరదృష్టి ఉండాలి. టెక్నాలజీ, సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్‌ల రూపకల్పన, నిర్వహణ, మరమ్మతు చేయగల సాంకేతిక నైపుణ్యాలు కూడా ఉండాలి.
-సామాన్యులు కూడా అర్థం చేసుకోగల అధిక సాంకేతిక సమాచారాన్ని అనువదించేందుకు మంచి కమ్యూనికేషన్, సహోద్యోగులతో కలిసి పనిచేయగల ఓర్పు, నేర్పు ఉండాలి.
-కంప్యూటర్ టెక్నాలజీ, మ్యాథ్స్, ప్రాబబిలిటీ, స్టాటిస్టిక్స్, అల్జీబ్రా, క్యాలిక్యులస్, లాజిక్ అండ్ అల్గారిథమ్స్, ఇంజినీరింగ్, రైటింగ్, శబ్ద సంభాషణల్లో నైపుణ్యం ఉండాలి.
పాఠ్యాంశాలు
-ప్రస్తుత సమాజంలో ఏఐ సాంకేతిక పరిజ్ఞానం విస్తృతమవుతుంది. సెల్ఫ్ డ్రైవింగ్ కార్లు, వ్యక్తిగత సహాయకులు, నిఘా వ్యవస్థలు, రోబోటిక్ తయారీ, యంత్ర అనువాదం, ఆర్థిక సేవలు, సైబర్ భద్రత, వెబ్ శోధన, వీడియో గేమ్స్, కోడ్ విశ్లేషణ వంటి అనువర్తనాల నుంచి సమాచారాన్ని సేకరించడానికి, వివరించడానికి ఏఐ పద్ధతులను ఉపయోగిస్తున్నారు.
-కాబట్టి థియరీ, ప్రాక్టికల్ ఆధారంగా సాగే ఈ కోర్సులో ఏఐ పరిచయం, బిగ్ డేటా అనలిటిక్స్, డాటా సైన్స్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐఓటీ), రోబోటిక్స్, సెర్చ్ అల్గారిథమ్స్, ఇంటెలిజెంట్ ఏజెంట్స్, మెషీన్ లెర్నింగ్ బేసిక్ కాన్సెప్ట్స్, లీనియర్ మోడల్స్, పర్సెప్ట్రాన్, అడ్వర్సియల్ సెర్చ్ గేమ్స్, న్యూరల్ నెట్వర్క్స్, ఎస్వీఎం మార్కోవ్ డెసిషన్ ప్రాసెసింగ్, డెసిషన్ ట్రీస్, ప్రపోర్షనల్ అండ్ ఫస్ట్ ఆర్డర్ లాజిక్, లాజికల్ ఏజెంట్, ఏఐ అప్లికేషన్స్ వంటి పాఠ్యాంశాలను అధ్యయనం చేస్తారు.
కెరీర్
-కంప్యూటర్ సైంటిస్ట్, కంప్యూటర్ ఇంజినీర్, గేమ్ ప్రోగ్రామర్స్, డెవలపర్స్ అండ్ అల్గారిథమ్ స్పెషలిస్ట్స్, రిసర్చ్ సైంటిస్ట్స్ అండ్ ఇంజినీరింగ్ కన్సల్టెంట్స్, ఏఐ రిసర్చర్స్, సర్జికల్ టెక్నీషియన్స్ వంటి వివిధ హోదాల్లో కెరీర్‌ను ప్రారంభించవచ్చు.
-ఏఐ కోర్సులు చేసినవారికి ప్రభుత్వ, ప్రైవేట్, విద్యాసంస్థలు, మిలిటరీ, రోబోటిక్స్, స్పేస్, మార్కెటింగ్, హెల్త్‌కేర్ రంగాల్లో ఉద్యోగాలు లభిస్తాయి.
-యాపిల్, ఫేస్బుక్, ఐబీఎం, యాక్సెంచర్, అమెజాన్, ఫ్రాక్టల్ అనలిక్స్, ఇంటెల్, శాప్ ల్యాబ్స్, సొసైటీ జనరాలి, మైక్రోసాఫ్ట్, అడోబ్, అటోస్, ఎన్విడియా, టెక్ మహీంద్రా వంటి తదితర సంస్థలు ఏఐ చేసినవారిని రిక్రూట్ చేసుకుంటున్నాయి.
-మొదట్లో వీరిని ఏడాదికి సుమారు రూ.6 లక్షల ప్రారంభ వేతనంతో తీసుకుంటారు. ఆ తర్వాత నైపుణ్యం పెరిగేకొద్ది ఏడాదికి రూ.60 లక్షల వరకు వేతనం లభిస్తుంది.
-చిప్ డిజైన్‌పై ఆసక్తి ఉన్నవారు ఇంటెల్ వంటి మైక్రోచిప్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీల్లో కూడా అవకాశాలు ఉంటాయి.
ఏఐ ఘనతలు
-హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో 2018, ఫిబ్రవరిలో జరిగిన నాస్కామ్ సదస్సులో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన రోబో సోఫియాను ఏఐ టెక్నాలజీతోనే రూపొందించారు. ఇది ప్రపంచంలోనే మొదటి హ్యూమనాయిడ్ రోబో. దీన్ని హాంకాంగ్‌కు చెందిన హాన్సన్ రోబోటిక్స్ తయారుచేసింది.
-చైనాకు చెందిన జిన్హువా న్యూస్ ఏజెన్సీ ఏఐ న్యూస్ యాంకర్‌తో 2019, నవంబర్ 8న వార్తలు చదివించింది. ఈ ఏఐ యాంకర్‌కు కియు హావో అని పేరు పెట్టారు. అలాగే ఇదే న్యూస్ ఏజెన్సీ ఈ ఏడాదిలో మొదటి మహిళ ఏఐ యాంకర్‌తో కూడా వార్తలు చదివించింది. దీని పేరు జిన్ జియోమెంగ్.
-గత జూలైలో న్యూయార్క్‌లో జరిగిన పోకర్ ఆటలో ప్రపంచ చాంపియన్లను కృత్రిమ మేధ ఓడించి సంచలనం సృష్టించింది. అమెరికాలోని మిలాన్ యూనివర్సిటీ, ఫేస్బుక్ ఏఐ కలిసి ప్లూరిబస్ అనే కృత్రిమ మేధను అభివృద్ధి చేశాయి. ఇది ఆరుగురు ఆడే నో లిమిట్ టెక్సాస్ హాల్డెమ్ పోకర్‌లో ఈ ఘనత సాధించింది. ఈ ఆటలో అత్యధిక ప్రపంచ టైటిళ్ల విజేత డారెన్ ఈలిస్, ఆరు ప్రపంచ శ్రేణి పోకర్ ఈవెంట్లలో గెలిచిన క్రిస్ ఫెర్గూసన్‌పై ఈ కృత్రిమ మేధ విజయం సాధించి ఏఐ రంగంలో కొత్త అధ్యయాన్ని లిఖించింది.
-ఫిన్‌ల్యాండ్ సైంటిస్టులు గుండె జబ్బుల్ని డాక్టర్ల కంటే ముందుగానే కనిపెట్టే ఏఐని అభివృద్ధి చేశారు. ఆరేండ్లపాటు జరిగిన ఈ శోధనలో హార్ట్‌బీట్‌ను అంచనావేస్తూ ఇది పనిచేస్తుంది. దీంతో భవిష్యత్తులో గుండెపోటు వచ్చే అవకాశాల్ని ముందుగానే గుర్తించి చెబుతుంది.
కోర్సులు
-ఏఐ, మెషీన్ లెర్నింగ్, ఆటోమేషన్, రోబోటిక్స్ విభాగాల్లో కెరీర కోరుకునే విద్యార్థులు కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రానిక్స్, మెకానికల్ వంటి బ్రాంచీల్లో బీటెక్ చేస్తే ఏఐ, రోబోటిక్స్‌లో కెరీర్‌కు మేలని నిపుణులు సూచిస్తున్నారు.
-మన దేశంలో చాలా సంస్థలు ఆర్టిఫీషియల్ ఇంటెలిటెన్స్ కోర్సును ఆఫర్ చేస్తున్నాయి. ఎంటెక్, ఎంఈ, ఎమ్మెస్సీ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. కొన్ని ఇన్స్టిట్యూట్లు షార్ట్‌టర్మ్ కోర్సులను కూడా ఆఫర్ చేస్తున్నాయి.
-ఐఐటీ హైదరాబాద్ ఈ ఏడాది నుంచే బీటెక్‌లో ఏఐ కోర్సును ప్రవేశపెట్టింది. అలాగే ఐఐటీ ఖరగ్‌పూర్ ఇప్పటికే ఆరునెలల సర్టిఫికెట్ కోర్సును నిర్వహిస్తుంది.
-ఐఐటీ మద్రాస్, GUVI స్టార్ర్టప్తో కలిసి ఏఐ కోర్సును హైస్కూల్ నుంచి పీజీ స్థాయి విద్యార్థులకు అందిస్తున్న ది. నిట్ వరంగల్, హైదరాబాద్ ఐఐటీ ఏఐ అండ్ ఎంఎల్ కోర్సులను అందిస్తున్నాయి.
-ఐఐఐటీ నయా రాయ్‌పూర్ బీటెక్ ఇన్ డాటా సైన్స్ అండ్ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ఆఫర్ చేస్తుంది.
-అమిటీ యూనివర్సిటీ ఇంటిగ్రేటెడ్ బీటెక్+ఎంటెక్ ఇన్ ఏఐ, రోబోటిక్స్ కోర్సును అందిస్తుంది.
-శారదా యూనివర్సిటీ, అమృత విశ్వవిద్యాపీఠంలో బీటెక్ సీఎస్ఈ (ఏఐ) కోర్సు ఉంది.
-ఐఐఎస్సీ బెంగళూరు, ఐఐటీ బాంబే, ఐఐఐటీ హైదరాబాద్, ఐఎస్ఐ కోల్‌కతా, సీడాక్ ముంబై వంటి సంస్థలు ఈ కోర్సును పీజీ స్థాయిలో ఆఫర్ చేస్తున్నాయి.
-ఇంకా హైదరాబాద్‌లోని పలు ప్రైవేట్ సంస్థలు ఏఐలో 6 నెలల కోర్సులు, ఆన్లైన్ క్లాసులను కూడా ఇస్తున్నాయి.
-ఎస్పీటీఈఎల్, మూక్స్ వంటి ఆన్లైన్ సోర్సెస్ షార్ట్ టర్మ్ కోర్సులను అందిస్తున్నాయి. మైక్రోసాఫ్ట్, ఐటీఎం, ఇన్ఫోసిస్ వంటి కంపెనీలు సైతం పరిశోధన కేంద్రాలను ఏర్పా టుచేసి ఏఐపై శిక్షణ ఇవ్వడానికి సిద్ధమవుతున్నాయి.
-రానున్న మూడు నాలుగేండ్లలో సుమారు 5 లక్షల మందికిపైగా.. డాటాసైన్స్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, ఇంటెలిజెంట్ క్లౌడ్ వంటి అంశాల్లో శిక్షణ ఇవ్వనున్నట్లు ఐటీ దిగ్గజం మైక్రోసాఫ్ట్ ఇటీవల తెలిపింది.
-తైవాన్‌కు చెందిన ఫాక్స్కన్ కంపెనీ హైదరాబాద్‌లో ఏఐ రిసెర్చ్ సెంటర్‌ను ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో ఇటీవల ఒప్పందం కుదుర్చుకుంది.
-మనదేశంలో ఏఐ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ యూనివర్సిటీని ఏర్పాటు చేయడానికి ప్రముఖ పారిశ్రామిక సంస్థ మాలక్ష్మి గ్రూప్, ఫిన్లాండ్కు చెందిన ఎఫ్‌ఇండియా మధ్య గతనెలలో అవగాహన ఒప్పందం కుదిరింది. ఈ వర్సిటీలో ఏఐ, రోబోటిక్స్, డిజైన్ థింకింగ్, గేమ్ డెవలప్మెంట్, టీచర్స్ ట్రైనింగ్ వంటి కోర్సులు ఉంటాయి.
-అంతేకాకుండా సీబీఎస్ఈ కూడా ఈ విద్యా సంవత్సరం నుంచే 9వ తరగతిలో ఏఐను ఐచ్ఛిక సబ్జెక్టుగా తీసుకువచ్చింది. అంతేకాకుండా ఈ విద్యాసంవత్సరం నుంచే 9వ తరగతిలో ఏఐను ఐచ్ఛిక సబ్జెక్టుగా అమలు చేసేందుకు సీబీఎస్ఈ బోర్డు నిర్ణయించింది. అయితే 9వ తరగతిలో ఏఐని తీసుకుంటే 10 తరగతిలో కూడా దాన్ని ఎంచుకోవాల్సి ఉంటుంది.
-విదేశాల్లో అయితే యూనివర్సిటీ ఆఫ్ ఎడిన్బర్గ్, యూనివర్సిటీ ఆఫ్ అమ్‌స్టర్‌డామ్, వర్సిటీ ఆఫ్ జార్జియా, యూనివర్సిటీ ఆఫ్ గ్రోనింజెన్, యూనివర్సిటీ ఆఫ్ సౌథాంప్టన్ ఏఐలో మాస్టర్ కోర్సులను అందిస్తున్నాయి.