కనువిందుగొలిపే తెలంగాణ ఆలయాలు
వేయి స్తంభాల గుడి (వరంగల్)
దీన్ని 1163లో కాకతీయ చక్రవర్తి రుద్రదేవుడు చాళుక్యవాస్తు శైలిలో నిర్మించారు. స్వయంభూ దేవాలయం. కాకతీయుల ఆరాధ్య దైవం. రెండో ప్రోలరాజు ఈ దేవాలయాన్ని నిర్మించాడు. ఈ స్వయంభూ దేవాలయం కాకతీయ దేవాలయాలన్నింటిలోకెల్లా పెద్దది, తలమానికమైనది. ఈ దేవాలయంలో తూర్పు భాగాన్ని గణపతి దేవుడు, పశ్చిమ భాగాన్ని రుద్రమదేవి కట్టించినట్లు తెలుస్తున్నది.
భద్రకాళి దేవాలయం
వేయి స్తంభాల గుడికి చేరువలో ఉన్న ఈ దేవాలయం భద్రకాళీ గుడి ఉపస్థితురాలైన భద్రకాళి విగ్రహంతో విరాజిల్లుతున్నది. ఈ ఆలయంలో ప్రతి ఏడాది చండీ హోమం, గురుపౌర్ణమి సందర్భంగా శాకాంబరి పూజలు నిర్వహిస్తారు. మొదటగా ఈ ఆలయాన్ని రెండో పులకేశి క్రీ.శ. 625లో నిర్మించారు. ఈ ఆలయ శైలి చాళుక్య వాస్తు శైలి.
కాళేశ్వర ముక్తేశ్వరాలయం (జయశంకర్ జిల్లా)
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో ఈ ఆలయం ఉంది. త్రిలింగాల్లో ఇది ఒక ప్రదేశం (ద్రాక్షారామం, శ్రీశైలం). ఇక్కడ శివుని ప్రతిరూపమైన రెండు లింగాలు ఒకే పానవట్టంలో ఉండటం ప్రత్యేకత. శివాలయంతోపాటు ముక్తేశ్వరాలయం (యముడు) కూడా ఉండటం ఇంకో ప్రత్యేకత. ఈ దేవాలయంలోని చేప విగ్రహం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది.
రామప్పగుడి (భూపాలపల్లి జిల్లా)
క్రీ.శ.1213లో రేచర్ల రుద్రుడు ఏకశిలపై ఈ దేవాలయాన్ని నిర్మించాడు. గుడిని చెక్కిన శిల్పి రామప్ప పేరుమీదుగా ఈ గుడికి ఆ పేరు వచ్చింది. దేశంలోనే శిల్పి పేరుతో ఉన్న ఏకైక గుడిగా రామప్ప గుడి ప్రసిద్ధి చెందింది. ఎటువైపు నుంచి చూసినా వారినే చూస్తున్నట్లుగా ఉన్న నంది ఈ గుడికి ప్రత్యేక ఆకర్షణగా ఉంది.
రాజరాజేశ్వర ఆలయం (రాజన్న సిరిసిల్ల)
వేములవాడ చాళుక్యులు ఈ ఆలయాన్ని నిర్మించారు. శివుడు రాజరాజేశ్వరుని రూపంలో కొలువై ఉన్నాడు. కోడెదూడలను దేవునికి సమర్పించడం ఈ ఆలయం ప్రత్యేకతగా పేర్కొనవచ్చు. ఆలయం లోపల దర్గా ఉండటం లౌకికత్వానికి ప్రతీక.
కొండగట్టు (జగిత్యాల)
జగిత్యాల జిల్లా కొండగట్టులో అత్యంత ప్రసిద్ధి చెందిన ఆంజనేయస్వామి దేవాలయం ఉన్నది. సుమారు 300 ఏండ్ల క్రితం ఈ ఆలయం నిర్మించారు. ఇక్కడ ఆంజనేయస్వామి ఒకవైపు నరసింహ స్వామి ముఖం కలిగి ఉండటం ప్రత్యేకత. శాఖలు, చక్రాలు, హృదయంతో సీతారాములను కలిగి ఉండటం విశేషం. ఆంజనేయ స్వామి క్షేత్రపాలకుడైన బేతాళస్వామి ఆలయం కూడా కొండపైనే ఉంది.
ధర్మపురి లక్ష్మీనరసింహ స్వామి ఆలయం
జగిత్యాల జిల్లా ధర్మపురిలో గోదావరి నదీ తీరాన ఈ దేవాలయం ఉంది. శ్రీలక్ష్మీ నరసింహస్వామి దేవాలయం, శ్రీవేంకటేశ్వర స్వామి దేవాలయం, శివకేశవుల ఆలయాలు ఒకేచోట, ఒకదాని పక్కన ఒకటి ఉంటాయి. ఈ దేవాలయానికి ఎదురుగా ప్రాచీన రామలింగేశ్వరాలయం ఉంది.
నందికొండ (నల్లగొండ)
అతి పురాతన బుద్ధుని నిర్మాణాలు, స్తంభాల మండపం, బౌద్ధ ఆరామ అవశేషాలు ఈ ప్రాంతంలో లభించాయి.
ఛాయా సోమేశ్వరస్వామి ఆలయం
ఈ ఆలయాన్ని కాకతీయ సామంతులైన కుందూరు చోడులు నిర్మించారు. ఇందులోని శివలింగంపై దీర్ఘమైన నల్లని నీడ పగలంతా కదలకుండా ఒకేచోట ఉంటుంది. చిత్రమైన ఈ నీడ రహస్యం ఎవరికీ అంతుపట్టడం లేదు. ఇక్కడున్న మరో దేవాలయం పచ్చల సోమేశ్వరాలయం.
వాడపల్లి శివాలయం
నల్లగొండ జిల్లాలో కృష్ణా, మూసీ నదులు సంగమించే చోట వాడపల్లిలో కాకతీయ రాజులు 12వ శతాబ్దంలో శ్రీ మీనాక్షి అగస్తేశ్వర స్వామి దేవాలయాన్ని నిర్మించారు. ఈ దేవాలయంలో నదికి 120 మీటర్ల ఎత్తున శివలింగం ఉంటుంది.
పిల్లలమర్రి దేవాలయం
ఇది కాకతీయుల కాలం నాటి అత్యంత పురాతనమైన శివాలయం. కాకతీయ రాజు గణపతి దేవుని కాలంలో నాగిరెడ్డి వంశస్థులు పిల్లలమర్రిలో త్రికూట ఆలయాన్ని నిర్మించారు. త్రికూట ఆలయంలో కాటేశ్వర, కాచీశ్వర, నామీశ్వర ఆలయాలు ఉన్నాయి. ఇక్కడున్న చెన్నకేశవ స్వామి దేవాలయంలోని రాతి స్థూపాలు ప్రత్యేకమైనవి.
యాదగిరి గుట్ట (యాదాద్రి భువనగిరి)
దీన్ని మాచ నరసింహక్షేత్రం అనికూడా పిలుస్తారు. శ్రీకృష్ణ దేవరాయలు తన జీవిత చరిత్రలో ఈ ఆలయం గురించి పేర్కొన్నారు.
కొలనుపాక
ఇక్కడ 2000 ఏండ్ల క్రితం నిర్మించిన జైన ఆలయం ఉన్నది.
ధూళికట్ట (పెద్దపల్లి జిల్లా)
ఈ ప్రాంతంలోని బౌద్ధ విహారాలు, స్థూపాలను దాదాపు రెండు వేల ఏండ్ల క్రితం క్రీ.పూ. 2వ శతాబ్దంలో నిర్మించారు. ప్రముఖ గ్రీకు చరిత్రకారుడు మెగస్తనీస్ తన రచనల్లో ఈ ప్రాంత విశేషాలను పేర్కొన్నాడు. శాతవాహనుల కాలం నాటి, రోమ్ల కాలంనాటి నాణేలు లభించాయి.
గౌతమేశ్వరాలయం (పెద్దపల్లి జిల్లా)
పెద్దపల్లి జిల్లా మంథని పట్టణంలో గౌతమేశ్వరాలయం గోదావరి నది తీరాన ఉంది. గౌతమేశ్వర ఆలయంలోని శివలింగం నల్లరాతితో చాలా ఎత్తుగా ఉంటుంది. శ్రీ వినాయక విగ్రహం ఆలయ ద్వారంలో కుడివైపున ఉంది. వెయ్యేండ్ల క్రితం నిర్మించిన ఆ ప్రాచీన దేవాలయాన్ని శ్రీకృష్ణ దేవరాయలు విజయనగర సామ్రాజ్య కాలంలో దర్శించినట్లు చారిత్రక ఆధారాల వల్ల తెలుస్తుంది. ఈ దేవాలయాన్ని తెలంగాణ తిరుపతి అని కూడా వ్యవహరిస్తారు. ఇక్కడ గల వేంకటేశ్వరుడు స్వయంభువని, స్వయం వ్యక్తమని అంటారు.
డిచ్పల్లి రామాలయం (నిజామాబాద్)
కొండపైన ఉన్న ఈ రామాలయాన్ని నలుపు, తెలుపు రంగు రాయితో 17వ శతాబ్దంలో నిర్మించారు. ఈ దేవాలయంపై ఆకృతులు ఖజురహో శిల్పాలను పోలి ఉంటాయి. అందుకే ఈ దేవాలయాన్ని ఇందూరు ఖజురహో అనిపిలుస్తారు.
శ్రీ నీలకంఠేశ్వర ఆలయం
నిజామబాద్ పట్టణంలో కొండపైన వెలసిన నీలకంఠేశ్వరాలయం ఎంతో పవిత్రమైనది. జనవరిలో వచ్చే రథసప్తమి రోజు శివలింగంపైన సూర్యకిరణాలు ప్రసరిస్తాయి.
సారంగపూర్ హనుమాన్ దేవాలయం
ఇక్కడి ఆంజనేయ స్వామి ఆలయానికి ఛత్రపతి శివాజీ గురువైన సమర్థ రామదాసు శంకుస్థాపన చేశాడని పేర్కొంటారు.
నవనాథ సిద్దేశ్వరాలయం
నిజామాబాద్‌లోని ఆర్మూర్ గుట్టలు నవనాథ సిద్దేశ్వరాలయానికి ప్రసిద్ధి. ఈ నవనాథులు సిద్ధులని, వీరు ఈ గుట్టల్లోనే నివసిస్తుంటారని స్థానికుల నమ్మకం.
సోమశిల ఆలయం (నాగర్ కర్నూల్)
నాగర్‌కర్నూల్ జిల్లాలోని కొల్లాపూర్ మండలంలో ఈ సోమేశ్వరాలయం ఉన్నది. దీని చుట్టుపక్కల ఉన్న 15 ఆలయాల్లో కూడా శివలింగాలు ప్రతిష్టించారు. ఈ సోమశిల ప్రాంతంలో సప్తనదుల సంగమ క్షేత్రం ఉన్నది. ఇక్కడ 12 ఏండ్లకు ఒకసారి వచ్చే కృష్ణా పుష్కరాల సందర్భంగా భక్తులు పుణ్యస్నానాలు చేస్తారు.
జైనథ్ లక్ష్మీనారాయణ దేవాలయం
ఆదిలాబాద్ సమీపంలోని జైనథ్ గ్రామంలో ఈ ఆలయం ఉన్నది. ఇది అష్టకోణాకృతిలో ఉన్నది. ఈ ఆలయం సూర్యదేవాలయంగా గుర్తింపు పొందింది. దీన్ని పల్లవుల కాలంలో నిర్మించారు.
గోదాదేవి ఆలయం
పూర్వ రంగారెడ్డి జిల్లాలోని ఎదులాబాద్‌లో దేశంలోనే అరుదైన గోదాదేవి ఆలయం ఉన్నది.
భద్రాచలం (భద్రాద్రి కొత్తగూడెం)
ప్రస్తుత ఆలయాన్ని 17వ శతాబ్దంలో నిర్మించారు. సీతాదేవి అడుగు, మారీచుని ముద్రలు ఇక్కడ కనిపిస్తాయి.
పర్ణశాల : ఈ ప్రాంతంలో శ్రీరాముడు తన వనవాసంలో భాగంగా కొంతకాలం నివసించాడని ప్రతీతి.
అలంపూర్ గుడి (జోగులాంబ గద్వాల జిల్లా)
ఆలయ సమూహంలోని నవబ్రహ్మ ఆలయం, జోగులాంబ ఆలయం అత్యంత ప్రఖ్యాతి చెందాయి. ఈ ఆలయ సమూహాలను 7-8 శతాబ్దాల మధ్యకాలంలో నిర్మించారు. దేశంలోని 18 శక్తి పీఠాల్లో జోగులాంబ ఆలయాన్ని ఒక శక్తి పీఠంగా పేర్కొంటారు.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు