‘పది’ తరువాత పయనమెటు!
పదో తరగతి తర్వాత ఏంటి అని ఆలోచిస్తున్నారా?
నిర్ణయం తీసుకునే ముందు ఈ కెరీర్స్ లో అవకాశాల గురించి ఆలోచించండి.
పదో తరగతి అనగానే మనకు గుర్తుకు వచ్చేది బోర్డు పరీక్షలు. విద్యార్థి జీవితంలో ఇవి ఒక మైలురాయి. కానీ అంతకన్నా ముఖ్యమైనది ఇది విద్యార్థులు తమ భవిష్యత్తు దశ దిశ నిర్దేశించుకోవలసిన సమయం. కొంతమంది విద్యార్థులకు ముందునుంచే ఒక అవగాహన ఉంటుంది. వారికి ఆ కెరీర్ గురించి సరైన సమాచారం ఉండటం వల్ల లేదా వారి చుట్టూ ఉన్న వాతావరణం, మనుషుల వల్ల ప్రభావితమై ఉండవచ్చు. తెలుగు రాష్ర్టాల్లో అన్నిటి కన్నా ఎక్కువ ఆదరణ ఉన్న కెరీర్లు ఇంజినీరింగ్, మెడిసిన్. 2020లో తెలంగాణ రాష్ట్ర ఎంసెట్ పరీక్షకు సుమారు 2.6 లక్షల మంది రిజిస్టర్ చేసుకున్నారు. ఇందులో 1.40 లక్షల మంది పరీక్ష రాశారు. కానీ ఇవే కాదు, ఇంకా ఎన్నో ఆప్షన్స్ ఉన్నాయి. టెన్త్ తర్వాత ఇంటర్, ఇంటర్ తర్వాత అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులు. అండర్ గ్రాడ్యుయేషన్ కోర్సుల గురించి తెలుసుకుని, వాటికి అనుగుణంగా ఇంటర్ బోర్డులో సబ్జెక్ట్స్‌ను ఎంచుకోవాలి.
కామర్స్
కామర్స్, అకౌంటింగ్, ఫైనాన్స్, బ్యాంకింగ్ అండ్ ఇన్సూరెన్స్ సెక్టార్లలో ఉద్యోగం చేయాలనుకునేవారికి సరైన కోర్సు. అలాగే చార్టెర్డ్ అకౌంటెన్సీ, కాస్ట్ అకౌంటింగ్, లేదా కంపెనీ సెక్రటరీ లాంటి కెరీర్‌కు కూడా బీకాం ఉపయోగపడుతుంది. దేశంలోని యూనివర్సిటీలు, కళాశాలలు బీకాంలో వివిధ రకాల కోర్సులు అందిస్తున్నాయి. బీకాం రెగ్యులర్, బీకాం ఆనర్స్, బీకాం ఇంటర్నేషనల్ బిజినెస్, బీకాం ఫైనాన్స్.
బీకాం అడ్మిషన్ ఇంటర్ మార్కులతో కాని అడ్మిషన్ టెస్ట్ ద్వారా కాని ఆయా కళాశాలల అడ్మిషన్ ప్రక్రియ మీద ఆధారపడి ఉంటుంది.
సీఏ అంటే చార్టెర్డ్ అకౌంటెన్సీ. ఇది ఒక ప్రొఫెషనల్ కోర్సు. ఇందులో ఫౌండేషన్ రూట్లో వెళితే పది తర్వాత ఫౌండేషన్ కోర్సులో చేరి, పన్నెండు తర్వాత సీపీటీ పరీక్ష రాసి, ఆ తర్వాత ఐసీఐటీఎస్ కోర్స్, ఇంటర్మీడియట్ పరీక్ష, ప్రాక్టికల్ ట్రైనింగ్ చేసి, అడ్వాన్స్ ఇంటిగ్రేటెడ్ కోర్స్ ట్రైనింగ్ ఆన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ సాఫ్ట్‌స్కిల్స్ ట్రైనింగ్, చివరిగా సీఏ ఫైనల్ పరీక్ష రాసి అందులో ఉత్తీర్ణులు కావాలి. కామర్స్ గ్రాడ్యుయేట్ లేదా వేరే గ్రాడ్యుయేషన్ చేసినవారు డైరెక్ట్‌గా ఇంటర్మీడియట్ పరీక్షకు రిజిస్టర్ అయి అక్కడి నుంచి కంటిన్యూ చేయవచ్చు. (https://resource.cdn.icai.org/19323ca_atcourse260510.pdf). సీఏ మాదిరిగా కాస్ట్ మేనేజ్మెంట్ అకౌంటెంట్, కంపెనీ సెక్రటరీ లాంటి ఆసక్తికరమైన కోర్సులు ఎన్నో ఉన్నాయి.
లా కోర్సులో మూడేండ్ల ఎల్ఎల్బీ, ఐదేండ్ల ఎల్ ఎల్బీ ప్రోగ్రామ్‌లు ఉంటాయి. ఇందులో కూడా బీఏ ఎల్ఎల్బీ, బీకాం ఎల్ఎల్బీ, బీబీఏ ఎల్ఎల్బీ, బీఎస్సీ ఎల్ఎల్బీ లాంటి ప్రోగ్రామ్స్ ఉన్నాయి. లాయర్, అడ్వకేట్, జడ్జి లాంటి కెరీర్ పట్ల మక్కువ ఉన్నవారు ఈ కెరీర్‌ని ఎంచుకోవచ్చు. లా కెరీర్ అంటే కోర్ట్ అనే కాదు కార్పొరేట్ కంపెనీల్లో కూడా వీరికి చాలా మంచి అవకాశాలు ఉన్నాయి. గ్రాడ్యుయేషన్ తర్వాత సివిల్ లా, క్రిమినల్ లా, కార్పొరేట్ లా, సైబర్ లా, ఇంటర్నేషనల్ లా, ఇంటెలెక్చువల్ ప్రాపర్టీస్ ఇలా ఎన్నెన్నో అవకాశాలు. ఇంటర్ తర్వాత లా చేయాలనుకునేవారికి ఐదేండ్ల కోర్సు సరైనది.
క్లాట్ (https://consortiumofnlus.ac. in/clat-2021/) లా ఎంట్రన్స్ కోసం రాసే పరీక్షల్లో ముఖ్యమైనది.
మేనేజ్మెంట్
పారిశ్రామిక అభివృద్ధి మొదలైనప్పటి నుంచి మేనేజర్ పదవికి ప్రాముఖ్యం పెరిగింది. బీబీఏ అంటే బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్. ఎంబీఏ అంటే మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్. మేనేజ్మెంట్ కెరీర్, కుటుంబ వ్యాపారం లేదా సొంత వ్యాపారంవైపు మొగ్గుచూపేవారు. ఇంటర్ తర్వాత బీబీఏ ప్రవేశ పరీక్ష రాయవచ్చు. ఎంబీఏకి పేరున్న ఐఐఎంలు, ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రాం ఇన్ మేనేజ్మెంట్ (5 సంవత్సరాల) కోర్సులు ప్రవేశపెట్టారు.
టూరిజం, ట్రావెల్ వ్యాపారాలు, హోటళ్లు పెరగడం వల్ల హోటల్ మేనేజ్మెంట్ ప్రొఫెషనల్స్‌కి అవకాశాలు పెరిగాయి. ఫుడ్ అండ్ బేవరేజెస్, ఎయిర్‌లైన్స్ సెక్టార్లో వీరికి అవకాశాలు ఉన్నాయి. NCHM JEE లేదా NCHMCT JEE హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ కోసం రాసే పరీక్షల్లో ప్రధానమైనది.
బ్యాచిలర్ ఇన్ హోటల్ మేనేజ్మెంట్, ట్రావెల్, హాస్పిటాలిటీ, కలినరీ స్కూల్ ఇలా ఎన్నో కోర్సులు ఉన్నాయి. డిప్లొమా ప్రోగ్రామ్స్, సర్టిఫికెట్ కోర్సులు కూడా ఉన్నాయి. హాస్పిటల్ మేనేజ్మెంట్, హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్, ఈవెంట్ మేనేజ్మెంట్, లాజిస్టిక్ మేనేజ్మెంట్ ఇలా గ్రాడ్యుయేషన్‌లో ఎంచుకున్న కోర్సులను బట్టి ఎన్నో అవకాశాలు. గ్రాడ్యుయేషన్ అయిన తర్వాత మేనేజ్మెంట్ కోర్స్ చేయాలనిపిస్తే ఎంబీఏ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయాలి.
పాలిటెక్నిక్
పాలీసెట్ పరీక్ష ద్వారా 10వ తరగతి తరువాత, 3 లేదా 3.5 సంవత్సరాల డిప్లొమా కోర్సులో చేరవచ్చు. ఈ కోర్సు పూర్తయిన తర్వాత, టెక్నీషియన్‌గా, టెక్నికల్ సూపర్వైజర్గా ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. బీటెక్, బీఎస్సీ, బీకాం వంటి కోర్సుల్లో చేరే అవకాశం సీట్లను బట్టి ఉంటుంది. https://tspolycet.nic.in/efault.aspx
తెలంగాణ స్టేట్ ఇంటర్మీడియట్ బోర్డులో మీకు ఎంపీసీ, బైపీసీ, ఎంబైపీసీ, ఎంఈసీ, సీఈసీ, హెచ్ఈసీ, హెచ్ఈసీ లాంటి కోర్సులు ఉన్నాయి.. 2020లో 4.11 లక్షల మంది ఇంటర్ రెండో సంవత్సరం పరీక్షలు రాశారు. 4.80 లక్షల మంది విద్యార్థులు ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు రాశారు. వీరిలో సుమారు 37 వేల నుంచి 49 వేల మంది ఒకేషనల్ కోర్స్ పరీక్షలు రాస్తే మిగిలినవారు జనరల్ కోర్స్ విద్యార్థులు.
మీరు ఇంజినీరింగ్ ప్రవేశ పరీక్ష జేఈఈ మెయిన్స్ లేదా ఎంసెట్ రాయాలంటే ఇంటర్లో ఎంపీసీ, నీట్ రాయాలంటే బైపీసీలో చేరడం ఉత్తమం. కొన్ని కోర్సులకు ఇంటర్లో ఏ సబ్జెక్ట్స్ తీసుకున్నా పర్వాలేదు. ఏ కెరీర్లో ఇంట్రెస్ట్ ఉంటుందో దానికి కావాల్సిన ప్రవేశ పరీక్ష అర్హత నిబంధనలు చూసుకొని ఇంటర్లో ఆ కోర్సులో చేరడం లేదా ఆ సబ్జెక్ట్స్ ఉన్న కోర్సులో చేరడం ఉత్తమం.
హ్యుమానిటీస్
హ్యుమానిటీస్ స్ట్రీమ్‌లో విద్యార్థులు ఇంగ్లిష్, హిస్టరీ, పొలిటికల్ సైన్స్, జియోగ్రఫీ, సోషియాలజీ, సైకాలజీ వంటి సబ్జెక్ట్స్ చదవాలి. ఎకనామిక్స్, ఫైన్ ఆర్ట్స్, ఫారిన్ లాంగ్వేజ్, జర్నలిజం, క్రిమినాలజీ, లైబ్రరీ సైన్స్, ఫిజికల్ ఎడ్యుకేషన్ ఇలా ఎన్నో బీఏ కోర్సులు ఉన్నాయి.
బీఎస్సీ
ఇది మూడు సంవత్సరాల ప్రోగ్రాం. బీఎస్సీ ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్, జువాలజీ, బోటనీ, ఎకనామిక్స్ లాంటి స్టాండర్డ్ అండ్ రెగ్యులర్ కోర్సులు, కంప్యూటర్ సైన్స్, మాస్ కమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్ మీడియా లాంటి ఆధునిక కోర్సులు, ఓషనోగ్రఫీ, సెరీకల్చర్, ఫుడ్ అండ్ న్యూట్రిషన్, డెయిరీ టెక్నాలజీ, ఫోరెన్సిక్ సైన్స్ లాంటి వైవిధ్య సబ్జెక్ట్స్ ఎన్నో ఉన్నాయి. డిగ్రీ పూర్తి చేసి వీటిలో మాస్టర్స్ చేయవచ్చు.
ఐటీఐ
వివిధ కర్మాగారాల్లో స్కిల్డ్ వర్కర్స్ ని సమకూర్చడానికి గవర్నమెంట్ ఐటీఐని ప్రారంభించింది. తెలంగాణలో 63 ప్రభుత్వ, 208 ప్రైవేట్ ఇన్స్టిట్యూట్లు ఉన్నాయి. ఇందులో 23 ఇంజినీరింగ్ , 7 నాన్ ఇంజినీరింగ్ ట్రేడ్లలో శిక్షణ ఇస్తున్నారు. ఐటీఐలో 10వ తరగతి తరువాత చేరవచ్చు. కొన్ని కోర్సులకు 8వ తరగతి పాసైనా సరిపోతుంది. కనీస వయస్సు 14 సంవత్సరాలు ఉండాలి. https://iti.telangana.gov.in/
డిజైనింగ్
క్రియేటివ్ టాలెంట్ ఉన్నవారు ఈ కోర్సుపై మక్కువ చూపుతున్నారు. డిజైన్ కోర్సుల్లో ఇంటర్ తర్వాత లేదా గ్రాడ్యుయేషన్ తర్వాత కూడా చేరవచ్చు. బ్యాచిలర్ అఫ్ డిజైన్, ఫ్యాషన్ డిజైనింగ్, గ్రాఫిక్ డిజైన్, ఇంటీరియర్ డిజైన్, ఫర్నిచర్ డిజైన్, ప్రొడక్ట్ డిజైన్, కమ్యూనికేషన్ డిజైన్, టెక్స్టైల్ డిజైన్, సిరామిక్ డిజైన్ ఇలా ఎన్నో కోర్సులు ఉన్నాయి. ఎన్ఐడీ (NID), ఎన్ఐఎఫ్టీ (NIFT) దేశంలో పేరుగల కాలేజీలు.
మెడికల్
మెడికల్ ఐదు సంవత్సరాల ప్రోగ్రాం. ఇంటర్లో బైపీసీ తీసుకున్నవారికి మెడికల్ అడ్మిషన్ పరీక్షకు అర్హత ఉంటుంది. ఎంబీబీఎస్ అంటే బ్యాచిలర్ ఆఫ్ మెడిసిన్ అండ్ బ్యాచిలర్ ఆఫ్ సర్జరీ. వైద్య విద్యకు సంబంధించి అలాగే ఆయుర్వేద, యునాని, వెటర్నరీ, డెంటల్ ఇలా ఎన్నో కోర్సులున్నాయి. నీట్ (https://ntaneet.nic.in/) పరీక్ష మెడికల్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ లో దేశంలో ప్రధానమైనది.
ఇంజినీరింగ్
ఇంజినీరింగ్ విద్యను అభ్యసించాలనుకునేవారికి ఆయా కళాశాలలు బీటెక్ లేదా బీఈ పట్టా ఇస్తాయి. నిట్, ఐఐఐటీలో సీట్ కోసం జేఈఈ మెయిన్స్ (https://jeemain.nta.nic.in/) పరీక్ష రాయాలి. ఐఐటీ సీటు కోసం మెయిన్స్ తో పాటు అడ్వాన్స్డ్ పరీక్ష కూడా క్వాలిఫై కావాలి. ఇంజినీరింగ్ చేయాలనుకునేవారు తెలంగాణ ఎంసెట్, ఏపీ ఎంసెట్ లాంటి రాష్ట్ర స్థాయి పరీక్షలు కూడా రాయవచ్చు.
ఇంటిగ్రేటెడ్ కోర్సులు
బీటెక్ పట్టా పొందాలంటే నాలుగు సంవత్సరాలు పడుతుంది, బీకాం మూడు సంవత్సరాల్లో పూర్తవుతుంది. అలాగే గ్రాడ్యుయేషన్ తరువాత ఎం టెక్, ఎంఏ, ఎంబీఏ కోర్సుల్లో చేరవచ్చు. ఇవి రెండు సంవత్సరాల ప్రోగ్రామ్స్.
కానీ ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్స్‌లలో ఇంటర్ తర్వాత అడ్మిషన్ తీసుకోవచ్చు. ఇవి సాధారణంగా ఐదు సంవత్సరాల ప్రోగ్రామ్స్. ఇంటిగ్రేటెడ్ కోర్సులు చాలా రకాల సబ్జెక్టుల్లో రూపుదిద్దుకున్నాయి. బిట్స్ పిలానీ, జేఎన్టీయూ లాంటి ఎన్నో కళాశాలల్లో ఇంటిగ్రేటెడ్ బీటెక్ ప్రోగ్రామ్స్ అందుబాటులో ఉన్నాయి. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ లాంటివి ఇంటిగ్రేటెడ్ సైన్స్ కోర్సులు ఆఫర్ చేస్తున్నాయి. ఇంటిగ్రేటెడ్ మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఇలా ఎన్నో ఉన్నాయి.
- Tags
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు