ప్రిలిమ్స్‌కు ప్రణాళికతో ప్రిపేరవుదాం


సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ పరీక్షకు దాదాపు 80 రోజుల సమయం ఉంది. ఈ కొద్దిరోజుల్లో ప్రిలిమ్స్ సిలబస్ మొత్తం పక్కాగా రివిజన్ చేయడం కాస్త కష్టమైన పనే. కానీ ప్రతి సబ్జెక్ట్‌కి ఒక ప్రణాళిక వేసుకుని, కాస్త శాస్త్రీయ పద్ధతని ఏర్పరచుకోగలిగితే నిర్ణీత సమయంలోనే లక్ష్యం పూర్తి చేయవచ్చు. ఈ క్రమంలో ప్రిలిమ్స్ సబ్జెక్టుల్లో కీలకమైనవాటికి సంబంధించి ఈ వ్యూహాన్ని అందిస్తున్నాం. దీనిలో భాగంగా పాలిటీ, హిస్టరీ సబ్జెక్టుల గురించి చర్చిద్దాం.
ప్రిలిమ్స్‌లో చరిత్రకు సంబంధించిన ప్రశ్నల సరళిని గమనిస్తే 2020 ప్రిలిమ్స్ పరీక్షలో దాదాపు 16 ప్రశ్నలు ఈ సబ్జెక్ట్ నుంచి వచ్చాయి. అలాగే 2019లో 16 ప్రశ్నలు, 2018 లో 21 ప్రశ్నలు ఇచ్చారు. దీనిని బట్టి చూస్తే చరిత్ర చదివే విషయంలో అభ్యర్థి ఎంతటి ప్రాధాన్యం ఇవ్వాలో స్పష్టమవుతుంది. ఇక పాలిటీని గమనిస్తే 2020లో దాదాపు 15 ప్రశ్నలు, 2019లో 11 ప్రశ్నలు, 2018లో 11 ప్రశ్నలు ఇచ్చారు. ఈ సబ్జెక్టుకు కూడా అభ్యర్థి విజయాన్ని నిర్దేశించే సామర్థ్యం ఉంది. కాబట్టి పాలిటీపై కూడా ప్రత్యేక శ్రద్ధ అవసరం.
ముందుగా చరిత్రకు అనుసరించాల్సిన విధానాన్ని చూస్తే.. సాధారణంగా భారతీయ చరిత్రని ప్రాచీన, మధ్యయుగ, ఆధునిక చరిత్రలుగా విభజిస్తాం. అభ్యర్థుల్లో చాలామంది ప్రాచీన, మధ్యయుగ చరిత్రలపై ఎక్కువగా దృష్టి పెట్టరు. అవి కష్టంగా భావిస్తారు. యుద్ధాలు, సంవత్సరాలు ఏవేవో గుర్తుపెట్టుకోవాలనే అపోహతో ఉంటారు. అవగాహన ఉన్న అభ్యర్థులు కూడా చరిత్ర విస్తృతి ఎక్కువ కదా.. ఎక్కువ సమయం కేటాయించాల్సి వస్తుందని వదిలేస్తుంటారు. కానీ రెండుమూడేళ్ల ప్రశ్నపత్రాలని ఒకసారి పరిశీలిస్తే ప్రాచీన, మధ్యయుగ భారత దేశ చరిత్ర నుంచే ఎక్కువ ప్రశ్నలు అడుగుతున్నారు. ఉదాహరణకు కిందటి ప్రిలిమ్స్‌లో మొత్తం చరిత్ర నుంచి 16 ప్రశ్నలు వస్తే, ఇందులో ప్రాచీన మధ్యయుగ భారతదేశ చరిత్ర నుంచే 11 ప్రశ్నలు వచ్చాయి. కేవలం ఆధునిక భారత దేశ చరిత్ర చదువుకుని పరీక్షకు వెళ్లిన అభ్యర్థులు దెబ్బతిన్నారు. కాబట్టి ఆధునిక భారత దేశ చరిత్రకు ఎంత ప్రాధాన్యం ఇస్తామో ప్రాచీన, మధ్య యుగ భారతదేశ చరిత్రకు కూడా అంతే ప్రాధాన్యం ఇవ్వాలి.
ముందుగా ఈ సబ్జెక్ట్‌ని ఇప్పటికే చదివి ఉంటారు. కాబట్టి ఇప్పుడు సబ్జెక్ట్‌ని వివిధ ముఖ్యమైన అంశాలవారీగా విభజించుకోండి. ఉదాహరణకు ఆలయాలు, వాటి నిర్మాణ శైలి, గ్రంథాలు- రచయితలు, మతం- వాటికి సంబంధించిన కీలకమైన అంశాలను గుర్తించి, వాటిని రివిజన్ చేసుకోవాలి. గత ప్రశ్నపత్రాలను గమనిస్తే ఏ అంశాలపై ఎక్కువ దృష్టి పెట్టాలనే విషయం తెలుస్తుంది. ఉదాహరణకు, గత పరీక్షల్లో ప్రాచీన భారత దేశ చరిత్రలో బౌద్ధం, జైనంలకు ప్రాధాన్యం ఇచ్చారు. మధ్యయుగాల చరిత్రలో సూఫీ, భక్తి ఉద్యమాల నుంచి ప్రశ్నలు అడిగారు. ఇలా సరళిని గమనిస్తూ ప్రిపరేషన్ కొనసాగించాలి. ఇక ఆధునిక భారత దేశ చరిత్ర విషయానికి వస్తే ప్రిలిమ్స్‌తోపాటు మెయిన్స్ పరంగా కూడా విభాగం కీలకం. సామాజిక సంస్కరణోద్యమాల నుంచి మొదలుకుని బ్రిటిష్ విధానాల వరకు దాదాపు అన్నింటిపైనా అవగాహన అవసరం.
ఇలా సబ్జెక్ట్‌ని చదువుతున్నప్పుడే ఇటీవల వార్తల్లో ఉన్న అంశాలకు వాటిని అనుసంధానం చేసుకుని చదవాలి. ఉదాహరణకు ఖజురహో డ్యాన్స్ ఫెస్టివల్ గురించి వార్తల్లో వచ్చింది. అలాంటప్పుడు ఖజురహో నిర్మాణాలతోపాటు ఇతర నృత్యరూపాల గురించి తెలుసుకోవాలి. అలాగే రాష్ట్రపతి, ప్రధానమంత్రి వంటి ప్రముఖులు తమ ప్రసంగాల్లో ఎవరి గురించైనా ప్రస్తావించినప్పుడు వారి గురించి తెలుసుకుని ఉండాలి. ఉదాహరణకు ప్రధాని నరేంద్ర మోదీ అసోం పర్యటనలో ఉన్నప్పుడు లచ్చిత్ బోర్పుఖాన్ అనే వ్యక్తి పేరు ప్రస్తావించారు. వారు మొఘల్ సైన్యంలో పనిచేసిన వ్యక్తి. చరిత్రలోని సంఘటనలు ఏవైనా ప్రస్తుతం ప్రాధాన్యాన్ని సంతరించుకుంటే అలాంటి వాటి గురించి చూసుకోవాలి. ఉదాహరణకు దండి మార్చ్ 75 ఏళ్లు పూర్తి చేసుకోవడం. ఎప్పుడైనా పీఐబీలో విశిష్టమైన వ్యక్తుల గురించి ప్రస్తావించినప్పుడు వాళ్ల గురించి కూడా తెలుసుకోవాలి. ఉదాహరణకు ఇటీవల మన్నత్తు పద్మనాభన్ అనే సామాజిక సంస్కర్త గురించి ఆర్టికల్ వచ్చింది. చౌరీచౌరా సంఘటన, మలబార్ తిరుగుబాటు, పైకా విప్లవం, ఇటువంటి అంశాలు వార్తల్లో ఉన్నాయి. వాటి పరిణామాలు, పర్యవసానాలు, ఆ సంఘటనకు సంబంధించిన వ్యక్తులు మనకు తెలిసి ఉండాలి. వర్తమాన అంశాలని చదివేటప్పుడు వాటి గురించి మాత్రమే కాకుండా కాస్త విస్తృతంగా ఆలోచించి చదవాలి. ఉదాహరణకు ప్రబుద్ధ భారత్ అనే జర్నల్ 125 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఇలాంటి వార్త చూసినప్పుడు కేవలం ప్రబుద్ధ భారత్ గురించి మాత్రమే చదవకుండా.. ఆ జర్నల్ ఎవరు స్థాపించారు? వారు ఇతర జర్నల్స్ ఏమైనా స్థాపించారా? అనే అంశాలతోపాటు ఇతర పత్రికల గురించి కూడా చదవాలి.
కరెంట్ అఫైర్స్‌లోని అంశాలను పూర్తిస్థాయిలో విశ్లేషించుకోవాలి
పాలిటీకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ పైపైన చదివేస్తే కుదరదు. ఒక అంశాన్ని గుర్తించామంటే సమగ్రంగా చదవాలి. ఉదాహరణకు వ్యవసాయ చట్టాలకు సంబంధించిన అంశం ఈ ఏడాది బాగా వార్తల్లో ఉంది. ఇందులో రకరకాల అంశాలు ఇమిడి ఉన్నాయి. కేంద్ర రాష్ర్టాల మధ్య అధికారాల పంపిణీ, సమాఖ్య అంశం, అలాగే రైతుల నిరసన కోణంలో చూసినప్పుడు ప్రాథమిక హక్కులు, సుప్రీం కోర్టు వ్యాఖ్యానం ఇలా అన్ని కోణాల్లో విశ్లేషించుకోవాలి. పౌరసత్వ చట్టం (సవరణ) అంశం ఇంకా సద్దుమణగలేదు. ఇన్నర్ లైన్ పర్మిట్, షెడ్యూల్ ప్రాంతాలు వంటి అంశాలు కూడా వార్తల్లోకి వచ్చాయి. వీటిపై కూడా అవగాహన ఉండాలి. పార్లమెంట్‌కు సంబంధించి వార్తల్లో ఉన్న అంశాలు ఉదాహరణకు ప్రివిలేజ్ మోషన్, క్వశ్చన్ అవర్, ఇవన్నీ చూసుకోవాలి. కొన్ని అంశాలు దాదాపు ప్రతి ఏడాది వార్తల్లో ఉంటాయి. ఉదాహరణకు రాష్టపతి పాలన- గవర్నర్ పాత్ర, పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం- స్పీకర్ పాత్ర ఇలాంటి అంశాలు జాగ్రత్తగా చదువుకోవాలి. వార్తల్లో ఉన్న రాజ్యాంగ బద్ధ సంస్థలు, చట్టబద్ధ సంస్థల లక్ష్యాలు వాటి పనితీరు వంటి వాటిని జాగ్రత్తగా చూసుకోవాలి. కాస్త జాగ్రత్త వహిస్తే పాలిటీలో మంచి స్కోర్ చేయవచ్చు.
పాలిటీ సులభమే కానీ
పాలిటీ సిలబస్ చూడటానికి చాలా విస్తృతంగా కనిపిస్తుంది. కానీ సులభంగా చదవచ్చు. చాలామంది అభ్యర్థులకు ఈ సబ్జెక్ట్ అర్థమైనట్లే అనిపిస్తుంది. ప్రశ్నలు ఎదుర్కోవాల్సి వచ్చినప్పుడు తడబడుతుంటారు. ఈ సమస్యని అధిగమించాలంటే మాత్రం పదే పదే రివిజన్ చేయాలి. ఇక గతంతో పోలిస్తే ప్రశ్నలు అడిగే సరళిలో స్పష్టమైన తేడాలు కనిపిస్తున్నాయి. కాన్సెప్ట్ ఓరియంటెడ్ ప్రశ్నలే ఎక్కువగా అడుగుతున్నారు. అభ్యర్థి సబ్జెక్ట్ పై సరైన పట్టు సాధించి, కనీసం ఓ రెండు సార్లు రివిజన్ చేయగలిగినప్పుడు మాత్రమే ఆన్సర్ చేయగలరు. కింది ప్రశ్నని ఓసారి గమనించండి.
The Preamble to the Constitution of India is
1) a part of the Constitution but has no legal effect
2) not a part of the Constitution and has no legal effect either
3) a part of the Constitution and has the same legal effect an any other part
4) part of the Constitution but has no legal effect independently of other parts
పై ప్రశ్న రాజ్యాంగ ప్రవేశికకు సంబంధించినది. ఆప్షన్లలో ఒకదానికొకటి సామీప్యం కనిపిస్తుంది. ఇలాంటప్పుడు, అంశంపై స్పష్టత లేకపోయినా, అభ్యర్థి సరిగా రివిజన్ చేయకపోయినా జవాబు తప్పుగా రాసే ప్రమాదం ఉంటుంది.
పాలిటీకి ప్రణాళిక ఏంటి?
పాలిటీలో ప్రాథమిక అంశాలపై బాగా పట్టు సాధించాలి. రాజ్యాంగ ప్రవేశిక, ప్రాథమికహక్కులు, ఆదేశిక సూత్రాలు, పార్లమెంటరీ విధానం ఇలాంటి చాప్టర్లపై ఎక్కువ దృష్టి పెట్టాలి. ఇటీవల వీటిపై అడుగుతున్న ప్రశ్నల సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది.
బాలలత
సివిల్స్ ఫ్యాకల్టీ
- Tags
RELATED ARTICLES
-
NIMS Admissions 2023 | నిమ్స్‌లో ఎంపీటీ కోర్సు ప్రవేశాలు
-
JNTUH Admissions 2023 | జేఎన్టీయూహెచ్లో ఎంటెక్, ఎంఫార్మసీ ప్రవేశాలు
-
SBI PO Preparation Plan | బ్యాంక్ కొలువు.. సాధించడం సులువు
-
Society QNS & ANSWERS | తెలంగాణలో పారిశ్రామిక పార్కుల అభివృద్ధికి నోడల్ ఏజెన్సీ ఏది?
-
Scholarships 2023 | Scholarships for Students
-
Chemistry – IIT,NEET Special | Decrease in Energy.. Leads to Stability
Latest Updates
Economy | ప్రపంచంలోని డైనమిక్ సిటీస్ కేటగిరీలో హైదరాబాద్ ర్యాంక్ ఎంత?
Telangana Govt Schemes & policies | తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విధానాలు- పథకాలు
Indian Cultures And Festivals | భారతదేశంలో పండుగలు – ఉత్సవాలు
General Essay – Groups Special | సూయజ్ కంటే చవక… ఈ నడవ
Groups Special – Geography | సూర్యుడు ఉదయించే దేశాలు.. శృంగాకారపు అడవులు
Indian History – Groups Special | బంగారు పుట్టలు పెట్టే చీమలు.. అబద్ధాలెరుగని ప్రజలు
Groups Special – Current Affairs | ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని ఏ రోజున నిర్వహిస్తారు ?
IIT Jam Notification | జాతీయ సంస్థలో మాస్టర్స్.. పరీక్ష ఎలా ఉంటుంది? ఎంపిక విధానం ఎలా…
IIT/NEET Foundation – chemistry | The strength of a bond depends upon?
English Grammar | We should all love and respect