తెలంగాణ వైతాళికులు- ప్రముఖులు
సురవరం ప్రతాపరెడ్డి
జననం: 1896 మే 28
స్వస్థలం: ఇటికెలపాడు (మహబూబ్‌నగర్)
మరణం: 1953 ఆగస్టు 25
సురవరం ప్రతాపరెడ్డి తొలితరం వైతాళికుల్లో, బహుముఖ ప్రజ్ఞాశాలుల్లో అగ్రగణ్యుడు. ఈయన సంస్కృతాంధ్ర భాషల్లో ప్రావీణ్యం కలవాడు.
దేశసేవ, ప్రజల సర్వతోముఖాభివృద్ధి, సంఘసంస్కరణ, మాతృభాషా వికాసం అనే ఉన్నత లక్ష్యాలతో 1926 మే 10న గోల్కొండ పత్రికను స్థాపించాడు.
నిజాం వ్యతిరేక పోరాటానికి ఈయన గోల్కొండ పత్రికను ఆయుధంగా చేసుకున్నాడు. గాంధీజీ పిలుపు మేరకు ఇతను స్వాతంత్రోద్యమంలో పాల్గొన్నాడు.
ఈయన గ్రంథాలయోధ్యమానికి చేయూతనిచ్చాడు. ఈయన ప్రోత్సాహంతో క్యాతూరు, సూర్యాపేట, జనగాంలో గ్రంథాలయ సభలు జరిగాయి.
1942 ఆంధ్ర గ్రంథాలయ మహాసభ, 1943 ఖమ్మంలో జరిగిన మహాసభకు అధ్యక్షత వహించాడు. తెలంగాణలో కవులు పూజ్యం (శూన్యం) అని ఆంధ్ర పండితుడు ముడుంబాయి వెంకట రాఘవాచార్యులు ఎగతాళి చేస్తే దానికి దీటుగా 350 మంది కవుల రచనలతో గోల్కొండ కవుల సంచిక అనే పేరుతో ప్రచురించి తెలంగాణలో కవులు పూజ్యం కాదు పూజ్యాలని పేర్కొన్నాడు.
1930 మెదక్ జిల్లా జోగిపేటలో జరిగిన నిజాం ఆంధ్రమహాసభకు అధ్యక్షత వహించి సభ తెలుగులోనే జరగాలని తీర్మానం చేశాడు. 1951లో ప్రజావాణి పత్రికను ప్రారంభించాడు. కొంతకాలం తర్వాత ఈ పత్రిక ఆగిపోయింది.
1952లో వనపర్తి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి శాసనసభకు ఎన్నికయ్యాడు, వివేకవర్ధిని పరిషత్‌ను ఏర్పాటు చేసి తెలుగు భాషా సాహిత్యానికి ఎనలేని కృషి చేశాడు.
సారస్వత పరిషత్ స్థాపనకు కృషి చేసి 1943లో స్థాపించి దానికి కొంతకాలం అధ్యక్షుడిగా వ్యవహరించాడు. ఈయన రెండు వేలకు పైగా వ్యాసాలు, గేయాలు, కథానికలు, కథలు, సంపాదకీయాలు గోల్కొండ పత్రికలో ప్రచురించాడు.
రచనలు
1. ఆంధ్రుల సాంఘిక చరిత్ర ( 1952లో కేంద్రసాహిత్య అకాడమీ పురస్కారం పొందిన తొలి తెలుగు గ్రంథంగా నిలిచింది).
2. హైందవ ధర్మవీరులు
3. హిందువుల పండగలు
4. భక్త తుకారాం ( నాటకం)
5. గ్రంథాలయోద్యమం
6. ప్రతాపరెడ్డి కథలు ( నిజాం కాలం నాటి ప్రజా జీవితం)
7. రామాయణ విశేషాలు ( పరిశోధన గ్రంథం)
8. శుద్ధాంత కాంత (నవల)
9. మొగలాయి కథలు
10. సంఘోద్ధరణం (వ్యాసాలు)
11. గ్రామజన దర్పణం
12. చంపకీ భ్రమర విషాదం
13. హరిశర్మోపాఖ్యానం
14. జాగీర్లు
15. నిజాం రాష్ట్రపాలన
16. లిపి సంస్కరణ
కలం పేర్లు:
1. అమృత కలిశి 2. విశ్వామిత్ర
3. సంగ్రహసింహ 4. జంగం బసవయ్య
5. చిత్రగుప్త 6.భావకవి రామ్మూర్తి
నవాబ్ అలీ యావర్ జంగ్
జననం: 1906
స్వస్థలం: హైదరాబాద్
మరణం: 1976 (గవర్నర్ పదవిలో ఉండగా)
ఇతను 1945-46, 1948-52 మధ్య కాలంలో ఉస్మానియా విశ్వవిద్యాలయం వైస్ చాన్స్‌లర్‌గా పనిచేశాడు. ఇతను పోలీస్ చర్యఅనంతరం వివిధ దేశాలకు రాయబారిగా పనిచేశాడు.
1952-52: అర్జెంటీనా
1954-58: ఈజిప్ట్
1958-61: యుగోస్లావియా, గ్రీస్
1961-65: ఫ్రాన్స్
1968-70: యూఎస్ఎ
ఇతనికి 1959లో పద్మభూషణ్, 1977లో పద్మవిభూషణ్ అవార్డులు లభించాయి. 1971-76 మధ్య మహారాష్ట్ర గవర్నర్‌గా పనిచేసి..1976లో బొంబాయిలోని రాజ్‌భవన్‌లో మరణించాడు.
జమలాపురం కేశవరావు
జననం: 1908 సెప్టెంబర్ 2
స్వస్థలం: ఎర్రుపాలెం (మధిర తాలూకా ఖమ్మం జిల్లా)
తండ్రి: వెంకటరామారావు
మరణం: 1953 మార్చి 29
హైదరాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో గుమాస్తా ఉద్యోగం వదిలి నిజాం నిరంకుశ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేసి కాంగ్రెస్‌లో చేరాడు. కాంగ్రెస్ కార్యకర్తలు ఇతనిని హైదరాబాద్ సర్దార్ అని కొనియాడారు.
జవహర్లాల్ నెహ్రూ కేశవరావుకు ‘ దక్కన్ సర్దార్’ అనే బిరుదు ప్రధానం చేశాడు. గాంధీజీ సిద్ధాంతాల స్ఫూర్తితో కేశవరావు నిజాం వ్యతిరేక సత్యాగ్రహ ఉద్యమంలో పాల్గొన్నాడు.
పోలీస్ చర్య అనంతరం హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ అధ్యక్షులుగా పనిచేశాడు. జమాలపురం కేశవరావు తెలంగాణ సరిహద్దు గాంధీ లేదా అపర సరిహద్దు గాంధీ అని ప్రసిద్ధి చెందాడు.
1946 మెదక్ జిల్లాలోని కంది ప్రాంతంలో జరిగిన 13వ (చివరి) ఆంధ్రమహా సభకు అధ్యక్షత వహించాడు.
సంగెం లక్ష్మీబాయి
జననం: 1911
స్వస్థలం: ఘట్కేసర్ (హైదరాబాద్ ఈస్ట్ తాలూకా, ప్రస్తుత రంగారెడ్డి జిల్లా)
తండ్రి: రామయ్య
1928లో సైమన్ కమిషన్‌ను బహిష్కరించిన ఫలితంగా వెల్లూర్ జైల్లో ఒక సంవత్సరం జైలు జీవితం గడిపారు. 1930లో ఉప్పు సత్యాగ్రహంలో ఈమె పాల్గొన్నారు.
1932లో సివిల్ డిస్ ఒబిడియన్స్ ఉద్యమంలో పాల్గొన్నందుకు 1933లో జైలుకు వెళ్లారు. ఇమ్రోజ్ పత్రికా సంపాదకుడు షోయబుల్లాఖాన్‌ను రజాకార్లు కాల్చి చంపగా అతని కుటుంబ సభ్యులను వారి ఇంటికెళ్లి ఓదార్చిన ధీరవనిత.
1951లో ఆచార్య వినోబా భావె తెలంగాణలో ప్రారంభించిన భూదానోద్యమంలో పాల్గొన్నారు. 1952లో హైదరాబాద్‌లోని సైదాబాద్‌లో ఇందిరా సేవా సదన్ ద్వారా అనాథ బాలికల విద్యావ్యాప్తికి కృషి చేశారు.
1952లో హైదరాబాద్ శాసనసభకు ఎన్నుకోబడి బూర్గుల రామకృష్ణారావు మంత్రి వర్గంలో ఉపమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు.
1957-71 సంవత్సరంలో లోక్‌సభ సభ్యురాలిగా పనిచేశారు. 1972లో తామ్రపత్ర పురస్కారం భారత ప్రభుత్వం నుంచి అందుకున్నారు.
వట్టికోట ఆళ్వార్‌స్వామి
జననం: 1915 నవంబర్ 1
స్వస్థలం: చెర్వుమాదారం (నకిరేకల్, నల్లగొండ)
తల్లిదండ్రులు: సింహాద్రమ్మ, రామచంద్రాచార్యులు
మరణం: 1961 ఫిబ్రవరి 6
ఈయన చిన్నప్పుడే తండ్రి చనిపోవడంతో సీతారామారావు అనే ఉపాధ్యాయునికి వండిపెడుతూ విద్యాభ్యాసం కొనసాగించాడు.
కాంగ్రెస్ కార్యకర్తగా క్విట్ఇండియా ఉద్యమంలో పాల్గొని 1942 అక్టోబర్ 10 నుంచి 1943 అక్టోబర్ 15 వరకు జైలుశిక్ష అనుభవించాడు. ఆళ్వార్‌స్వామి గోల్కొండ పత్రిక ఫ్రూఫ్ రీడర్‌గా పనిచేశాడు.
గ్రంథాలయోద్యమంతో ప్రేరణ పొంది నిజాం వ్యతిరేక ఉద్యమంలో పాల్గొనగా ఇతనిని నిజాం ప్రభుత్వం జైలుకు పంపింది. అక్కడే ఈయన ‘జైలు లోపల’ అనే పేరుతో జైలు జీవిత కథల సంపుటిని వెలువరించాడు.
ఆళ్వార్‌స్వామి జైలు లోపల అనే గ్రంథానికి ప్రజల మనిషి అనే బిరుదు ప్రజల చేత పొందాడు. ఈయన 1938లో దేశోద్ధారక సూచీ గ్రంథాలయాన్ని సికింద్రాబాద్‌లో స్థాపించాడు.
తెలంగాణ చైతన్యం కోసం దేశోద్ధారక గ్రంథమాలను (కాశీనాథుని నాగేశ్వరరావు స్ఫూర్తితో) స్థాపించాడు.
రచనలు
ప్రజల మనిషి (తెలంగాణ ప్రజల జీవిత నేపథ్యం)
జైలు లోపల (జైలు జీవిత కథల సంపుటి)
గంగు (నవల- 1940-45 మధ్య సాంఘిక ప్రజా ఉద్యమాల చిత్రీకరణ)
వట్టికోట ఆళ్వార్‌స్వామి చనిపోయిన తర్వాత దాశరథి.. అగ్నిధార అనే గ్రంథాన్ని రాసి ఆళ్వార్స్వామికి అంకితమిచ్చారు.
భీంరెడ్డి నర్సింహారెడ్డి
జననం: 1921
స్వస్థలం: కొత్తగూడెం (సూర్యాపేట తాలూకా నల్లగొండ జిల్లా)
తల్లిదండ్రులు: చొక్కమ్మ, రామిరెడ్డి
రావి నారాయణ రెడ్డి ప్రభావంతో ఆంధ్రమహాసభ ద్వారా రాజకీయరంగ ప్రవేశం చేసి కమ్యూనిస్టు పార్టీ సభ్యుడయ్యాడు. వీరి ప్రాంతంలో పెద్ద భూస్వామ్య కుటుంబమైన జన్నారెడ్డి ప్రతాపరెడ్డికి, చిన్న భూస్వాములైన గోరంట్ల భూస్వాములకు మనస్పర్థలు ఉండేవి.
భీంరెడ్డి నర్సింహారెడ్డి గోరంట్ల భూస్వాములతో సంబంధాలు కలిగి ఉండి బడుగు బలహీన వర్గాల కష్టాలను చూసి జన్నారెడ్డి ప్రతాపరెడ్డికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేశాడు.
ఆంధ్రమహాసభ రెండుగా చీలినపుడు ఇతను అతివాదుల పక్షాన నిలబడి ఆంధ్రమహాసభలో పనిచేశాడు. తర్వాత కాలంలో ఇతను పూర్తిస్థాయి కమ్యూనిస్టుగా మారి మొండ్రాయి, కడివెండి, చాకలి ఐలమ్మ పోరాటాల స్ఫూర్తితో ఉద్యమాల్లో పాల్గొన్నాడు.
ఇతను సూర్యాపేట నియోజకవర్గం నుంచి శాసనసభ్యుడిగా రెండుసార్లు, మిర్యాలగూడ నియోజకవర్గం నుంచి మూడుసార్లు లోక్‌సభకు ఎన్నికయ్యాడు. భీంరెడ్డి నర్సింహారెడ్డి వితంతు వివాహం చేసుకొని ఇతరులకు ఆదర్శప్రాయంగా నిలిచాడు.
బొమ్మగాని ధర్మభిక్షం గౌడ్
జననం: 1922 ఫిబ్రవరి 15
స్వస్థలం: వూకొండి (మునుగోడు మండలం నల్లగొండ)
మరణం: 2011, మార్చి 26
ధర్మభిక్షం తెలంగాణ సాయుధ పోరాట యోధుడు. ఈయన కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా తరపున నల్లగొండ లోక్‌సభ నియోజవర్గం నుంచి ఎంపీగా 1991లో 10వ లోక్‌సభకు, 1996లో 11వ లోక్‌సభకు ఎన్నికయ్యాడు.
విద్యార్థి దశలో నిజాం పట్టాభిషేకం రజతోత్సవాల సందర్భంగా పాఠశాలలో ఉత్సవాలు జరపాలన్న ప్రధానోపాధ్యాయుడి ఆదేశాలను వ్యతిరేకించి తోటి విద్యార్థులతో కలిసి బహిష్కరించాడు.
ఈయన 1942లో సీపీఐలో చేరి పార్టీలో పనిచేస్తూనే పాత్రికేయునిగా తెలంగాణలోని నాటి ప్రముఖ పత్రికలైన మీజాన్, రయ్యత్, గోల్కొండ పత్రికల్లో పనిచేశాడు. 1952లో తొలిసారిగా హైదరాబాద్ రాష్ట్ర శాసనసభకు సూర్యాపేట నియోజక వర్గం నుంచి ఎన్నికయ్యాడు.
ఈయన గీతకార్మికుల సంఘం నేతృత్వంలో గౌడ కులస్థుల హక్కుల కోసం చివరి వరకు పోరాడాడు. భారత ప్రభుత్వం నుంచి తామ్రపత్ర పురస్కారం అందుకున్నాడు.
నారాయణరావు పవార్
జననం: 1925
స్వస్థలం: వరంగల్
మరణం: 2010 డిసెంబర్ 12
ఈయన ఆర్యసమాజంలో చాలా చురుకుగా వ్యవహరించాడు. ‘బ్రతికే స్వరాజ్యం లేకపోతే వీరస్వర్గం’ అన్న ధృడసంకల్పంతో పోరాటానికి సిద్దమయ్యాడు. ఈయన తన మిత్రులతో కలిసి ఆర్య యువ క్రాంత్ అనే దళాన్ని ఏర్పాటు చేశాడు.
జగదీష్ ఆర్య, గండయ్య అనే స్నేహితులతో కలిసి నారాయణరావు పవార్ 1947 డిసెంబర్ 4న కింగ్‌కోఠి ప్యాలెస్ దగ్గర నిజాం ఉస్మాన్ అలీఖాన్‌పై బాంబు వేశాడు.
ఈ బాంబు దాడిలో నిజాం తప్పించుకున్నాడు. పోలీస్ ఇన్స్పెక్టర్ జోసెఫ్ వారిని అరెస్ట్ చేయగా, కోర్టు నారాయణరావు పవార్‌కు మరణశిక్ష, జగదీష్ ఆర్యకు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. 1948 సెప్టెంబర్ 17న జరిగిన పోలీస్‌చర్య తర్వాత పవార్ శిక్షను తగ్గించి జీవితకారాగార శిక్షగా మార్పు చేశారు.
స్వామి రామానందతీర్థ మధ్యవర్తిత్వంతో ‘మాఫీనామా’ (తప్పైందని ఒప్పుకోవడం)కు పవార్ అంగీకరిస్తే విడిచిపెట్టడానికి గవర్నర్ జనరల్ ఒప్పుకొన్నాడు. కానీ పవార్ దానికి అంగీకరించలేదు. చివరకు జైలు శిక్ష అనంతరం 1949 ఆగస్టు 10న విడుదల అయ్యాడు.
కొండా లక్ష్మణ్‌బాపూజీ
జననం: 1915 సెప్టెంబర్ 27
స్వస్థలం: వాంకిడి (ఆదిలాబాద్)
నివాసం: జలదృశ్యం (హైదరాబాద్)
మరణం: 2012 సెప్టెంబర్ 21
ఇతను భారత స్వాతంత్య్ర సమరయోధుడు. గాంధీ ప్రభావంతోవందేమాతరం ఉద్యమం, క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నాడు. 1952లో నాన్‌ముల్కీ ఉద్యమంలో పాల్గొన్నాడు.
తెలంగాణ సాయుధ పోరాటంలో నిజాంకు, రజాకార్లకు వ్యతిరేకంగా పోరాటం చేశాడు. ఇతను చేనేత కార్మికులకు ఎంతో సేవచేశాడు. 1949లో పద్మశాలి హాస్టల్‌ను ప్రారంభించాడు.
1952లో జరిగిన మొదటి సార్వత్రిక ఎన్నికల్లో అసిఫాబాద్ నియోజకవర్గం నుంచి శాసనసభకు ఎన్నికయ్యాడు. 1957లో చిన్నకొండూర్ (భువనగిరి) నుంచి గెలిచి 1957-60వరకు డిప్యూటి స్పీకర్‌గా పనిచేశాడు.
1967-69 మధ్యలో మంత్రిగా పనిచేశాడు. 1969లో తెలంగాణ ఉద్యమంలో పాల్గొని తెలంగాణ రాష్ట్రం కోసం మంత్రిపదవికి రాజీనామా చేసిన మొదటి వ్యక్తి. 1967-78 మధ్యకాలంలో రెండుసార్లు భువనగిరి నుంచి శాసనసభకు ఎన్నికయ్యాడు.
తెలంగాణ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షునిగా పనిచేశాడు. మండల కమిషన్ సిఫార్సులను రాజీవ్‌గాంధీ వ్యతిరేకించినందుకు కొండా లక్ష్మణ్ బాపూజీ కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వాన్ని వదులుకున్నాడు.
-దేవపూజ పబ్లికేషన్స్ (తెలంగాణ సమాజం) సౌజన్యంతో..
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు