కరెంట్ అఫైర్స్
జాతీయం
ఎస్కేప్డ్ పుస్తకం
‘ఎస్కేప్డ్: ట్రూ స్టోరీస్ ఆఫ్ ఇండియన్ ఫుజిటివ్స్ ఇన్ లండన్’ అనే పుస్తకం మార్చి 21న ప్రచురితమైంది. లండన్‌లో జర్నలిస్టులుగా పనిచేస్తున్న డానిష్ ఖాన్, రుహీ ఖాన్లు ఈ పుస్తకాన్ని రచించారు. విజయ్ మాల్యా, నీరవ్ మోదీ, నౌకాదళ మాజీ ఆఫీసర్ రవి శంకరన్, సంగీతకారుడు నదీమ్ సైఫీ తదితరుల గురించి ఈ పుస్తకంలో ప్రస్తావించారు.
గాంధీ శాంతిబహుమతి
ప్రపంచంలోని వివిధ రంగాల ప్రముఖులకు ఇచ్చే గాంధీ శాంతి బహుమతి 2019, 2020కు గాను కేంద్ర సాంస్కృతిక శాఖ మార్చి 23న ప్రకటించింది. 2020కు గాను బంగ్లాదేశ్ జాతిపిత (బంగబంధు) రహమాన్‌కు, 2019కుగాను గాంధీ శాంతి బహుమతి ఒమన్ రాజు సుల్తాన్ కబూస్ బిన్ సయిద్ అల్ సయిద్‌కు లభించింది. ఈ బహుమతిని 1995, అక్టోబర్ 2న స్థాపించారు. ఈ బహుమతి కింద రూ.కోటి నగదును అందజేస్తారు.
బీమా బిల్లుకు లోక్‌సభ ఆమోదం
బీమా రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడు (ఎఫ్‌డీఐ)లను 74 శాతానికి పెంచుకునేందుకు వీలుకల్పించే బీమా సవరణ బిల్లు-2021కు లోక్‌సభ మూజువాణి ఓటుతో మార్చి 22న ఆమోదం తెలిపింది. బీమా రంగంలో ఇప్పటివరకు ఎఫ్‌డీఐల పరిమితి 49 శాతంగా ఉంది. బీమా నియంత్రణ సంస్థ ఐఆర్డీఏఐ (ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా) సిఫారసుల మేరకు ఎఫ్‌డీఐల పరిమితిని పెంచుతున్నారు.
నాబ్ఫిడ్కు ఆమోదం
నేషనల్ బ్యాంక్ ఫర్ ఫైనాన్సింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్మెంట్ (నాబ్‌ఫిడ్- జాతీయ మౌలిక వసతులు, అభివృద్ధి పెట్టుబడుల బ్యాంక్)కు రాజ్యసభ మార్చి 25న ఆమోదం తెలిపింది. మౌలిక వసతుల కల్పనకు నిధులు సమకూర్చడమే ఈ బ్యాంక్ ప్రధాన ఉద్దేశమని మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు.
ఐడబ్ల్యూఎన్ చైర్‌పర్సన్‌గా షాలినీ
సీఐఐ- ఇండియన్ ఉమెన్ నెట్వర్క్ (ఐడబ్ల్యూఎన్) దక్షిణ ప్రాంత చైర్‌పర్సన్‌గా షాలినీ వారియర్ (ఫెడరల్ బ్యాంక్ సీఓఓ) మార్చి 26న ఎన్నికయ్యారు. డిప్యూటీ చైర్‌పర్సన్‌గా శోభాదీక్షిత్ (అల్‌ప్లా ఇండియా డైరెక్టర్) నియమితులయ్యారు. ఐడబ్ల్యూఎన్ తెలంగాణ విభాగానికి చైర్‌ఉమన్‌గా పూర్ణిమ కాంబ్లే (ఫాక్స్ మండల్ అండ్ అసోసియేట్స్ ఎల్ఎల్పీలో పార్ట్నర్), వైస్ చైర్‌ఉమన్‌గా ఉమ ఐసోలా (యాక్సెస్ హెల్త్ ఇంటర్నేషనల్) ఎన్నికయ్యారు.
అంతర్జాతీయం
శక్తిమంతమైన మిలిటరీ
మిలిటరీ డైరెక్ట్ అనే డిఫెన్స్ వెబ్సైట్ ప్రపంచంలో శక్తిమంతమైన మిలిటరీ కలిగిన దేశాలపై నిర్వహించిన అధ్యయనాన్ని మార్చి 20న ప్రకటించింది. దీని ప్రకారం ప్రపంచంలో అత్యంత శక్తిమంతమైన మిలిటరీ కలిగిన దేశంగా చైనా నిలిచింది. 100 పాయింట్లకుగాను చైనా 82తో మొదటి స్థానంలో నిలువగా అమెరికా (74) 2, రష్యా (69) 3, భారత్ (61) 4, ఫ్రాన్స్ (58) 5వ స్థానాల్లో నిలిచాయి.
ఆయుధానికి మహిళ పేరు
అమెరికా నౌకాదళంలో చీఫ్ పెట్టీ ఆఫీసర్‌గా పనిచేసిన తొలి మహిళ పేరును అమెరికా నేవీ ఒక తుపాకీకి మార్చి 22న పెట్టింది. 1917లో అమెరికా నౌకాదళ చీఫ్ పెట్టీ ఆఫీసర్‌గా లొరెట్టా పర్ఫెక్టస్ వాల్ష్ పనిచేశారు. యూఎస్ఎస్ కాన్స్టిట్యూషన్ అనే యుద్ధనౌకలోని ఒక భారీ తుపాకీకి ఆమె పేరుతో ‘పర్ఫెక్టస్’ అని పేరు పెట్టారు.
భారత, అమెరికా భద్రత
అమెరికాలో భారత రాయబారి తరన్జీత్ సింగ్ సంధు, అమెరికా అంతర్గత భద్రత కార్యదర్శి అలెజాండ్రో మయోర్కస్ భారత్, అమెరికా భద్రతపై మార్చి 24న భేటీ అయ్యారు. హింసాత్మక అతివాదాన్ని ఎదుర్కోవడం, సైబర్ భద్రత, నూతన సాంకేతికత వంటి ముఖ్యమైన అంశాలపైవారు చర్చించారు.
పుతిన్ బిల్లుకు ఆమోదం
రష్యా అధ్యక్షుడిగా పుతిన్ మరో రెండుసార్లు కొనసాగేందుకు వీలు కల్పించే బిల్లుకు ఆ దేశ స్టేట్ డ్యూమా (దిగువసభ) మార్చి 25న ఆమోదం తెలిపింది. 2024 నుంచి రెండుసార్లు (2036 వరకు) పుతిన్ అధ్యక్షుడిగా కొనసాగే ఈ బిల్లును ఫెడరేషన్ కౌన్సిల్ (ఎగువసభ) ఆమోదించాల్సి ఉంది. ఈ బిల్లుకు సంబంధించిన రాజ్యాంగ సంస్కరణలను ఆ దేశ ప్రజలు 2020 జూలైలో ఆమోదించారు.
బంగ్లాదేశ్‌లో భారత ప్రధాని
భారత ప్రధాని మోదీ మార్చి 26, 27 తేదీల్లో బంగ్లాదేశ్ జాతిపిత షేక్ ముజిబుర్ రహమాన్ వందేండ్ల జయంతి, బంగ్లాదేశ్ 50 ఏండ్ల ప్రజాస్వామ్య వేడుకల్లో పాల్గొన్నారు. బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనాతో మోదీ ఢాకాలో బంగబంధు-బాపు మ్యూజియాన్ని ప్రారంభించారు. తీస్తా నదీ జలాలు తదితర 5 అంశాలపై ఇరుదేశాల నేతలు చర్చించారు. 16వ శతాబ్దం నాటి జెషోరేశ్వరి కాళీ ఆలయాన్ని, ముజిబుర్ మాసోలియాన్ని మోదీ సందర్శించారు. ముజిబుర్ మాసోలియాన్ని సందర్శించిన ఏకైక విదేశీ ప్రభుత్వ నేత మోదీ.
చికాగోలో వీగిన తీర్మానం
అమెరికాలోని చికాగో నగర కౌన్సిల్లో మార్చి 26న ప్రవేశపెట్టిన భారత విధానాల వ్యతిరేక తీర్మానం 26-18 ఓట్లతో వీగిపోయింది. భారత్‌లో సీఏఏ, మానవ హక్కుల పరిస్థితిని విమర్శిస్తూ ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. అమెరికాలో శక్తిమంతమైన నగర కౌన్సిళ్లలో న్యూయార్క్ తర్వాత చికాగో ఒకటి. చికాగో మేయర్ లోరిఫుట్.
వార్తల్లో వ్యక్తులు
శరద్ పగారే
హిందీ రచయిత, ప్రొఫెసర్ శరద్ పగారేకు వ్యాస్ సమ్మాన్ అవార్డు-2020 మార్చి 25న లభించింది. ఈయన రచించిన ‘పాటలీపుత్ కీ సామ్రాజ్ఞి’ నవలకు ఈ అవార్డు దక్కింది. 1991లో కేకే బిర్లా ఫౌండేషన్ ఈ అవార్డును స్థాపించింది. ఈ అవార్డు కింద రూ.4 లక్షల నగదును అందజేస్తారు.
సంజీవ్ కుమార్
ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) చైర్మన్‌గా సంజీవ్ కుమార్ మార్చి 25న నియమితులయ్యారు. ఆయన 1993 మహారాష్ట్ర ఐఏఎస్ కేడర్ అధికారి. ఏఏఐని 1995, ఏప్రిల్ 1న స్థాపించారు.
ఆశా భోస్లే
మహారాష్ట్ర అత్యున్నత పురస్కారం మహారాష్ట్ర భూషణ్ అవార్డు ఆశా భోస్లేకు మార్చి 26న లభించింది. 1996లో ప్రారంభించిన ఈ అవార్డు కింద రూ.10 లక్షల నగదును అందజేస్తారు. ఆశా 2000లో దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు అందుకున్నారు.
సౌరభ్ గార్గ్
యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (యూఐడీఏఐ) సీఈవోగా సౌరభ్ గార్గ్ మార్చి 26న నియమితులయ్యారు. 1991 ఒడిశా ఐఏఎస్ కేడర్ అధికారి. యూఐడీఏఐని 2009, జనవరి 28న స్థాపించారు. దీని ప్రధాన కార్యాలయం ఢిల్లీలో ఉంది.
అతీష్ చంద్ర
ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్‌సీఐ) చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ (సీఎండీ)గా అతీష్‌చంద్ర మార్చి 26న నియమితులయ్యారు. ఆయన 1994 బీహార్ ఐఏఎస్ కేడర్‌కు చెందినవారు. గతంలో వ్యవసాయ, సహకార, రైతు సంక్షేమ శాఖ జాయింట్ డైరెక్టర్‌గా పనిచేశారు.
డెనిస్ సాసో ఎన్గెసో
రిపబ్లికన్ ఆఫ్ కాంగో అధ్యక్షుడిగా డెనిస్ సాసో ఎన్గెసో మార్చి 27న ఎన్నికయ్యారు. ఎన్నికల్లో 88 శాతం ఓట్లు లభించాయి. 36 ఏండ్లపాటు అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. 1979లో తొలిసారిగా అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.
తెలంగాణ
జంతుజాలంపై పుస్తకం
తెలంగాణ అడవుల్లోని జంతుజాలంపై జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా అధ్యయనం చేసి రూపొందించిన పుస్తకాన్ని అటవీశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి మార్చి 25న అరణ్యభవన్‌లో ఆవిష్కరించారు. రాష్ట్ర అడవుల్లో మొత్తం 2450 రకాల జాతుల జంతుజాలం ఉందని, దీనిలో వెన్నెముక లేనివి 1744, వెన్నెముక కలిగినవి 706 జాతులు ఉన్నాయని వెల్లడించారు. ప్రాణహిత, అమ్రాబాద్, శివారం, కవ్వాల్, ఏటూరునాగారం, కిన్నెరసాని, పాకాల, పోచారం, మంజీరా, కేబీఆర్ పార్క్, మృగవని, హరిణ వనస్థలిలల్లో ఈ అధ్యయనం చేశారు.
అవార్డులు
28వ కన్వర్జెన్స్ ఇండియా-2021 ఇంటర్నేషనల్ ఎగ్జిబిషన్, 6వ స్మార్ట్ సిటీస్ ఇండియా ఎక్స్పో మార్చి 26న ఢిల్లీలో నిర్వహించారు. దీనిలో తెలంగాణలోని బేగంపేట్‌లో ఉన్న రెయిన్ గార్డెన్‌కు, న్యూ మున్సిపల్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్, వీ హబ్‌లకు అవార్డులు లభించాయి. ఈ ఎక్స్పోను కేంద్రానికి చెందిన ఇండియా ట్రేడ్ ప్రమోషన్ ఆర్గనైజేషన్ డిపార్ట్మెంట్ ఆఫ్ కామర్స్ అండ్ ఎగ్జిబిషన్ ఇండియా గ్రూప్ ఆధ్వర్యంలో నిర్వహించారు.
క్రీడలు
లియోనల్ మెస్సీ
అర్జెంటీనా ఫుట్‌బాల్ స్టార్ లియోనల్ మెస్సీ 121 ఏండ్ల చరిత్ర కలిగిన విఖ్యాత క్లబ్ బార్సిలోనా జట్టు తరఫున అత్యధిక మ్యాచ్‌లు ఆడిన ప్లేయర్‌గా మార్చి 22న రికార్డులకెక్కాడు. 767 మ్యాచ్‌లతో గ్జేవి హెర్నాండెజ్ పేరిట ఉన్న రికార్డును 768 మ్యాచ్‌తో మెస్సీ బద్దలు కొట్టాడు. ఒకే క్లబ్ తరఫున ఆడుతూ అత్యధిక గోల్స్ (బార్సిలోనా-467) చేసిన రికార్డు కూడా మెస్సీ పేరిటే ఉంది.
టోక్యో ఒలింపిక్స్ టార్చ్
టోక్యో ఒలింపిక్స్ టార్చ్ రిలే కార్యక్రమాన్ని మార్చి 25న ప్రారంభించారు. 2011లో మహిళల ఫుట్‌బాల్ ప్రపంచ కప్‌లో విజేతగా నిలిచిన జట్టులో సభ్యురాలైన అజుసా ఇవషిమిజు ఈ టార్చ్ రిలేను జపాన్‌లో ఫుకుషిమా వద్ద ప్రారంభించారు. జపాన్‌లోని 47 ప్రాంతాల మీదుగా ప్రయాణించే ఈ టార్చ్ 121 రోజుల తర్వాత ఒలింపిక్స్ క్రీడల ప్రారంభం రోజు జూలై 23కు టోక్యోకు చేరుకుంటుంది. జూలై 23 నుంచి ఆగస్టు 8 వరకు టోక్యో ఒలింపిక్స్ నిర్వహించనున్నారు.
జాతీయ చలనచిత్ర పురస్కారాలు
67వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు 2019కు సంబంధించి కేంద్ర సమాచార మంత్రిత్వ శాఖ మార్చి 22న ప్రకటించింది.
ఉత్తమ హీరోయిన్- కంగనారనౌత్ (మణికర్ణిక)
ఉత్తమ హీరో- మనోజ్ బాజ్‌పాయ్ (భోంస్లే), ధనుష్ (అసురన్)
ఉత్తమ సహాయ నటుడు- విజయ్ సేతుపతి (సూపర్ డీలక్స్-తమిళ్)
ఉత్తమ సహాయ నటి- పల్లవీ జోషి (తాష్కెంట్ ఫైల్స్)
ఉత్తమ చిత్రం- మరక్కర్ (మలయాళం)
ఉత్తమ దర్శకుడు- సంజయ్ పూరణ్ సింగ్ చౌహాన్
(బహత్తర్ హురేన్-హిందీ)
ఉత్తమ పిల్లల చిత్రం కస్తూరి (హిందీ)
ఉత్తమ జాతీయ సమగ్రతా చిత్రం- తాజ్‌మహల్ (మరాఠీ)
ఉత్తమ వినోదాత్మక చిత్రం- మహర్షి
ఉత్తమ హిందీ చిత్రం- చిచోరే
ఉత్తమ తెలుగు చిత్రం- జెర్సీ
ఉత్తమ తమిళ చిత్రం- అసురన్
ఉత్తమ కొరియోగ్రాఫర్- రాజుసుందరం (మహర్షి)
ఉత్తమ ఎడిటింగ్- నవీన్ నూలి (జెర్సీ)
ఉత్తమ సంగీతం- డీ ఇమాన్ (విశ్వాసం-తమిళం)
ఉత్తమ గాయకుడు- బీ ప్రాక్ (కేసరి-హిందీ)
ఉత్తమ గాయని- సావని రవీంద్ర (బర్డో-మరాఠీ)
ఉత్తమ కాస్ట్యూమ్స్- సుజిత్ సుధాకరన్, వీ సాయి (మరక్కర్)
ఉత్తమ మలయాళ చిత్రం- కట్ట నోట్టమ్
ఉత్తమ కన్నడ చిత్రం- అక్షి
వేముల సైదులు
జీకే, కరెంట్ అఫైర్స్ నిపుణులు
ఆర్సీ రెడ్డి స్టడీ సర్కిల్ హైదరాబాద్
ఇవీ కూడా చదవండి…
ఎమ్మెస్సీ నర్సింగ్, ఎంపీటీ సీట్లకు తుది కౌన్సెలింగ్
ఎన్టీపీసీలో ఏఈ, కెమిస్ట్ ఉద్యోగాలు
సీబీఎస్ఈ 10, 12వ తరగతి పరీక్షల షెడ్యూల్లో సవరణలు
- Tags
- Current Affairs
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు