కరెంట్ అఫైర్స్-17-10-2021
జాతీయం
ల్యాబ్ ఫెసిలిటీ సెంటర్
ఫైటోఫార్మాస్యూటికల్ ల్యాబొరేటరీని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అక్టోబర్ 5న ప్రారంభించారు. దీనిని మణిపూర్ రాజధాని ఇంఫాల్‌లోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ బయోరిసోర్సెస్ అండ్ సస్టెయినబుల్ డెవలప్మెంట్ (ఐబీఎస్‌డీ) ప్రాంగణంలో ఏర్పాటు చేశారు.
అర్బన్ ఇండియా
ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలోని ఇందిరాగాంధీ ప్రతిష్ఠాన్‌లో ఏర్పాటు చేసిన 75వ న్యూ అర్బన్ ఇండియా (ట్రాన్స్ఫార్మింగ్ అర్బన్ ల్యాండ్ స్కేప్ కాన్ఫరెన్స్ అండ్ ఎక్స్పో) కార్యక్రమాన్ని ప్రధాని మోదీ అక్టోబర్ 5న ప్రారంభించారు. ఈ సందర్భంగా 75 వేల మందికి ఇండ్లు అందజేశారు.
చామరాజ మెడికల్ కాలేజీ
కర్నాటక చామరాజ నగర జిల్లాలో చామరాజ నగర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌ను అక్టోబర్ 7న రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ప్రారంభించారు. 450 పడకలతో దీనిని
నిర్మించారు.
ఆక్సిజన్ ప్లాంట్లు
కొత్తగా ఏర్పాటు చేసిన 35 ప్రెషర్ స్వింగ్ అబ్సార్ప్షన్ (పీఎస్ఏ) ఆక్సిజన్ ప్లాంట్లను ప్రధాని మోదీ అక్టోబర్ 7న ప్రారంభించారు. పీఎం కేర్స్ ఫండ్ కింద 35 రాష్ర్టాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన వీటిని ఉత్తరాఖండ్‌లోని రిషికేశ్ ఎయిమ్స్ నుంచి వర్చువల్‌గా వీటిని ఆవిష్కరించారు. ఈ 35తో దేశంలో వీటి సంఖ్య 1150కి చేరింది.
వైమానిక దళం వేడుకలు
భారత వైమానిక దళం 89వ వార్షిక వేడుకలను ఎయిర్ చీఫ్ మార్షల్ వివేక్ రామ్ చౌధరి అక్టోబర్ 8న ప్రారంభించారు. 1932, అక్టోబర్ 8న బ్రిటన్ సామ్రాజ్యం రాయల్ ఎయిర్‌ఫోర్స్‌ను స్థాపించింది. 1950 నుంచి ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌గా పేరు మార్చారు. వైమానిక దళం నినాదం ‘టచ్ ది స్కై విత్ గ్లోరీ’.
నోబెల్ ప్రైజ్
సాహిత్యంలో
సాహిత్యంలో 2021కు గాను టాంజానియా రచయిత అబ్దుల్ రజాక్ గుర్నాకు లభించింది. స్వీడన్ రాజధాని స్టాక్‌హోమ్‌లోని రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ ఈ అవార్డును అక్టోబర్ 6న ప్రకటించింది. శరణార్థుల వ్యధ, వలసపాలన మిగిల్చిన చేదు జ్ఞాపకాలను రాసినందుకు ఈ అవార్డు దక్కింది. 1948లో జంజిబార్ ద్వీపంలో జన్మించిన ఆయన 1960లో బ్రిటన్‌కు శరణార్థిగా వచ్చారు. 1994లో ఆయనకు బుకర్ ప్రైజ్ లభించింది. కెంట్ యూనివర్సిటీలో ఇంగ్లిష్ లిటరేచర్ ప్రొఫెసర్‌గా పనిచేశారు. అతని అత్యంత ప్రసిద్ధ నవల ప్యారడైజ్. ఆయన పదికి పైగా నవలలు రాశారు.
శాంతి బహుమతి
నోబెల్ శాంతి పురస్కారం మరియా రెసా, దిమిత్రి అండ్రియేవిచ్ మురటోవ్లను ఎంపిక చేసినట్లు నోబెల్ కమిటీ అక్టోబర్ 8న ప్రకటించింది. భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ పరిరక్షణ కోసం చేసిన కృషికిగాను వీరికి ఈ అవార్డు దక్కింది. మరియా రెస్సా ఫిలిప్పినో-అమెరికన్ జర్నలిస్ట్. ఈమె 2012లో స్థాపించిన ‘రాప్లర్’ అనే డిజిటల్ మీడియా కంపెనీ కో ఫౌండర్. ఆమె ప్రస్తుతం దీనికి సీఈఓగా వ్యవహరిస్తున్నారు. దిమిత్రి మురటోవ్ రష్యన్ జర్నలిస్ట్. ఈయన నోవాజా గెజిటా వార్తాపత్రికలో పనిచేస్తున్నారు.
వార్తల్లో వ్యక్తులు
ప్రతీక్ విఠల్ మొహితే
ప్రపంచంలోనే అతి పొట్టి బాడీ బిల్డర్‌గా ప్రతీక్ విఠల్ మొహితే అక్టోబర్ 3న గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్ సాధించాడు. మహారాష్ట్రకు చెందిన అతడి ఎత్తు 3 అడుగులు, 4 అంగుళాలు.
శక్తి సిన్హా
ప్రముఖ పరిపాలన రంగ నిపుణుడు, రచయిత, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి శక్తి సిన్హా అక్టోబర్ 4న మరణించారు. ఆయన మాజీ ప్రధాని స్వర్గీయ అటల్ వాజ్‌పేయికి కార్యదర్శిగా పనిచేశారు. 1979 ఐఏఎస్ బ్యాచ్ అధికారి అయిన ఆయన నెహ్రూ మెమోరియల్ మ్యూజియం లైబ్రరీకి డైరెక్టర్‌గా పనిచేశారు. ఆయన వాజ్‌పేయితో కలిసి 1996 నుంచి 1999 వరకు పనిచేశారు. ఆయన ‘వాజ్‌పేయి: ది ఇయర్స్ దట్ చేంజ్డ్ ఇండియా’ నవల రాశారు.
అబియ్ అహ్మద్
ఇథియోపియా ప్రధానిగా అబియ్ అహ్మద్ అక్టోబర్ 4న ప్రమాణం చేశారు. ఆ దేశానికి ఆయన ప్రధానిగా ఎన్నికవడం వరుసగా ఇది రెండోసారి. 2018 నుంచి ప్రధానిగా కొనసాగుతున్నారు. 2019లో ఆయనకు నోబెల్ శాంతి బహుమతి లభించింది. ఆయన ఇథియోపియా-ఎరిత్రియా దేశాల సరిహద్దు అంశంపై చర్చించారు.
నదీమ్ అహ్మద్ అంజుమ్
పాకిస్థాన్ గూఢచారి సంస్థ ఐఎస్ఐ (ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్) నూతన అధిపతిగా నదీమ్ అహ్మద్ అంజుమ్‌ను పాక్ ప్రభుత్వం అక్టోంబర్ 6న నియమించింది. కరాచీ కోర్లో లెఫ్టినెంట్ జనరల్‌గా పనిచేశారు. ఇప్పటివరకు ఐఎస్ఐ అధిపతిగా పనిచేసిన ఫయాజ్ హమీద్‌ను పెషావర్ కార్ప్స్ కమాండర్‌గా నియమించింది.
పీఎల్ హరనాథ్
పారదీప్ పోర్ట్ ట్రస్ట్ నూతన చైర్మన్‌గా పీఎల్ హరనాథ్ అక్టోబర్ 7న నియమితులయ్యారు. ఆయన 1994 భారతీయ రైల్వే ట్రాఫిక్ సర్వీస్ అధికారి. షిప్పింగ్ శాఖలో ఆయన వివిధ హోదాలో పనిచేశారు. 1966, మార్చి 12న పారదీప్ పోర్ట్ ట్రస్ట్‌ను స్థాపించారు.
అంతర్జాతీయం
జిక్రాన్ క్షిపణి
రష్యా మొట్టమొదటిసారిగా ఓ అణు జలాంతర్గామి నుంచి రెండు జిక్రాన్ క్రూయిజ్ క్షిపణులను అక్టోబర్ 4న విజయవంతంగా ప్రయోగించింది. ఈ క్షిపణులు బారెంట్స్ సముద్రంలోని నిర్దేశిత లక్ష్యాలను ఛేదించాయని రష్యా రక్షణ శాఖ వెల్లడించింది. ఈ క్షిపణులు ధ్వని కంటే 9 రెట్ల వేగంతో ప్రయాణిస్తాయి.
భూ కక్ష్యలో షూటింగ్
ఓ సినిమా షూటింగ్ కోసం రష్యా నటి యులియా పెరెసిల్డ్, డైరెక్టర్ క్లిమ్ షిపెంకోలతో పాటు వ్యోమగామి ఆంటోన్ ష్కాప్లెరోవ్ అక్టోబర్ 5న ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్ (ఐఎస్ఎస్)కు వెళ్లారు. భూ కక్ష్యలో సినిమా షూటింగ్ చేపట్టడం ఇదే తొలిసారి. రష్యా ప్రభుత్వ టీవీ ‘చానెల్ వన్’ నిర్మిస్తున్న ఈ సినిమా పేరు
‘చాలెంజ్’.
మలేరియా వ్యాక్సిన్
మలేరియా వ్యాధి నివారణ మొదటి వ్యాక్సిన్ ఆర్టీఎస్, ఎస్‌ను ప్రపంచ ఆరోగ్య సంస్థ అక్టోబర్ 7న ఆమోదించింది. ఈ వ్యాక్సిన్‌ను ఆఫ్రికా దేశాల్లో ప్రారంభించేందుకు డబ్ల్యూహెచ్‌వో గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 23 లక్షల మందికి ఈ టీకాను అందించనున్నారు.
అమెరికా పోస్టాఫీసుకు భారతీయుడి పేరు
అమెరికాలోని టెక్సాస్ రాష్ర్టానికి చెందిన వెస్ట్ హ్యూస్టన్‌లోని ఓ పోస్టాఫీసుకు ఇండో-అమెరికన్ సందీప్‌సింగ్ ధలివాల్ పేరును అక్టోబర్ 6న పెట్టారు. ధలివాల్ పోలీసు అధికారిగా పనిచేసే సమయంలో 2019, సెప్టెంబర్ 27న విధుల్లో భాగంగా ట్రాఫిక్‌ను ఆపబోయిన అతడిపై దుండగులు కాల్పులు జరపగా అతడు మరణించాడు.
క్రీడలు
డ్యురాండ్ కప్
ఆసియాలోనే పురాతనమైన డ్యురాండ్ కప్ ఫుట్‌బాల్ 130వ ఎడిషన్ కోల్‌కతాలో సెప్టెంబర్ 5న ప్రారంభమై అక్టోబర్ 3న ముగిసింది. ఫైనల్ మ్యాచ్‌లో ఎఫ్‌సీ గోవా జట్టు విజేతగా నిలువగా.. మహ్మదాన్ జట్టు రన్నరప్‌గా నిలిచింది. ఉత్తమ గోల్ కీపర్ అవార్డు నవీన్‌కు లభించింది.
ఐశ్వరీ ప్రతాప్ సింగ్ తోమర్
పెరూ రాజధాని లిమాలో నిర్వహిస్తున్న వరల్డ్ జూనియర్ షూటింగ్ చాంపియన్‌షిప్‌లో భాగంగా అక్టోబర్ 5న జరిగిన పురుషుల 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్లో ఐశ్వరీ ప్రతాప్‌సింగ్ తోమర్ (మధ్యప్రదేశ్) స్వర్ణ పతకం సాధించాడు. ఈ పోటీలో అతడు 463.4 పాయింట్లు సాధించాడు. దీంతో 462.9 పాయింట్లతో ఫిలిప్ నెపిచాల్ (చెక్ రిపబ్లిక్) పేరిట ఉన్న జూనియర్ ప్రపంచ రికార్డును బద్దలు కొట్టాడు.
అన్షు మాలిక్
నార్వే రాజధాని ఓస్లోలో నిర్వహించిన ప్రపంచ రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో భారత మహిళా రెజ్లర్ అన్షు మాలిక్ రజత పతకం సాధించింది. అక్టోబర్ 7న జరిగిన మ్యాచ్‌లో అమెరికాకు చెందిన హెలెన్ లూయిస్ మారోలిన్ చేతిలో ఓడింది. హెలెన్ స్వర్ణం సాధించగా, అన్షుకు రజతం దక్కింది. అదేవిధంగా ప్రపంచ రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో ఫైనల్ చేరిన తొలి భారత మహిళా రెజ్లర్‌గా అన్షు రికార్డు సృష్టించింది.
ఎఫ్ఐహెచ్ అవార్డులు
అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఫెడరేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ హాకీ-ఎఫ్ఐహెచ్) 2021కు గాను అవార్డులను అక్టోబర్ 7న ప్రకటించింది. హర్మన్‌ప్రీత్ సింగ్ (పురుషుల విభాగం), గుర్జీత్ కౌర్ (మహిళల విభాగం)లకు ‘ప్లేయర్ ఆఫ్ ది ఇయర్’ అవార్డు లభించింది. పీఆర్ శ్రీజేశ్ (పురుషుల విభాగం), సవితా పూనియా (మహిళల విభాగం)లకు ‘ఉత్తమ గోల్‌కీపర్ అవార్డు దక్కింది. వివేక్ సాగర్ (పురుషుల విభాగం), షర్మిలా దేవి (మహిళల విభాగం)లు ‘బెస్ట్ రైజింగ్ స్టార్’లుగా నిలిచారు. గ్రాహం రీడ్ (పురుషుల విభాగం), జోయెర్డ్ మరీన్ (మహిళల విభాగం)లు ఉత్తమ కోచ్‌లుగా నిలిచారు.
వేముల సైదులు
జీకే, కరెంట్ అఫైర్స్ నిపుణులు
ఆర్సీ రెడ్డి స్టడీ సర్కిల్ హైదరాబాద్
- Tags
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు