ఇంజినీరింగ్ బ్రాంచ్ ఎంపిక ఎలా?
ఎంసెట్ ఫలితాలు విడుదలయ్యాయి. అడ్మిషన్ ప్రక్రియ ప్రారంభమైంది. ఈ సమయంలో చాలామంది విద్యార్థులు ఏ కాలేజీలో చేరాలి? ఏ బ్రాంచ్‌లో చేరాలి? అని అనేక సందేహాలు ఇటు విద్యార్థులకు,అటు తల్లిదండ్రులకు వస్తున్నాయి.వీటన్నింటికి ఇంజినీరింగ్ విద్యలో 37 ఏండ్ల అనుభవం గడించిన డా. ఉదయ్‌కుమార్ ఇస్తున్న సూచనలు సలహాలు….
కాలేజీ ఎంపికలో ముఖ్యమైన అంశాలు
- మౌలిక సదుపాయాలు, అత్యాధునిక ప్రయోగశాలలు, మంచి వనరులతో కూడిన లైబ్రరీ తదితర అంశాలు ప్రధానమైనవి.
- ఇంజినీరింగ్‌లో చేరిన తర్వాత విద్యార్థులు కాలేజీలో వారానికి 36 గంటలు తరగతి గదిలో గడుపుతారు. అందుచేత తరగతి గది, కాలేజీ వాతావరణం సౌకర్యవంతంగా ఉండాలి.
ఫ్యాకల్టీ
- కాలేజీలో బోధన చేసే అధ్యాపకుల అర్హతలు, అనుభవం చూడాలి. ప్రతి విభాగంలో బోధన చేస్తున్న అధ్యాపకుల అర్హతల్లో పీహెచ్డీ చేసిన వారి సంఖ్య చాలా ముఖ్యం.
- ఫ్యాకల్టీ ఏ విశ్వవిద్యాలయం నుంచి పట్టభద్రులయ్యారు, అధ్యాపకుల సగటు అనుభవం, ప్రస్తుత కాలేజీలో వారి అనుభవంతోపాటు గతంలో వారు పనిచేసిన కాలేజీ వంటి విషయాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలి.
- విద్యార్థులు బాగా రాణించడానికి అధ్యాపకుల ప్రేరణ కూడా ముఖ్యం. ఏ కాలేజీలో అయితే విద్యార్థులను తమ పిల్లల్లాగా భావించి బోధిస్తారో అటువంటి ఫ్యాకల్టీ ఉన్న కాలేజీ మంచిది.
ప్లేస్‌మెంట్స్
- మూడు సంవత్సరాల ప్రాంగణ నియామకాలు అనేది కూడా ముఖ్యమైన విషయం. కాలేజీలో చేరిన విద్యార్థుల సంఖ్యతో పోలిస్తే ప్లేస్‌మెంట్స్ సాధించిన విద్యార్థుల సంఖ్య తెలుసుకోవాలి.
- కాలేజీలో ప్లేస్‌మెంట్స్‌కు వస్తున్న కంపెనీల సంఖ్య, విద్యార్థులకు అందించే సగటు జీతం వంటి విషయాలను అత్యంత జాగ్రత్తగా గమనించాలి.
- దీంతోపాటు విద్యార్థులకు కెరీర్ కౌన్సెలింగ్, కెరీర్ గైడెన్స్ లభ్యతకు సంబంధించి విద్యార్థులు చేరబోయే కాలేజీలో ప్రత్యేక విభాగం ఉందా లేదో తెలుసుకోవాలి. ఈ విభాగం విద్యార్థులకు భవిష్యత్తులో ఉండే వివిధ అవకాశాలను ఎలా పొందాలో వివరిస్తుంది. సరైన మార్గంలో విద్యార్థులను ముందుకు నడిపించడంలో కీలకపాత్ర పోషిస్తుంది.
- పాఠ్యాంశాల సమగ్రత, పలు రకాల నైపుణ్యాలు, ప్రోగ్రామింగ్, సాఫ్ట్‌స్కిల్స్, ఎంట్రపెన్యూర్షిప్ స్కిల్స్, సృజనాత్మక ఆలోచనలు, ఆవిష్కరణల ప్రాముఖ్యతలను పాఠ్యాంశాల్లో చేర్చడం ద్వారా విద్యార్థులను ఇండస్ట్రీకి సిద్ధం చేస్తుంది. ప్రాజెక్ట్ ఆధారిత అభ్యసనం, ఇంటర్న్‌షిప్, ఇంక్యుబేషన్ సెంటర్, స్టూడెంట్ క్లబ్స్, టెక్నికల్ అసోసియేట్ కార్యకలాపాల ద్వారా కరికులం, ఎక్స్ట్రా కరికులం యాక్టివిటీస్ వంటి కార్యకలాపాలు సమగ్ర విద్యను అందిస్తాయి.
క్యాంటీన్
- కాలేజీలో పరిశుభ్రతతో కూడిన మంచి ఆహారాన్ని అందించే ప్రదేశం క్యాంటీన్. కేవలం ఆహారం అందించడమే కాకుండా తోటి వారి నుంచి వివిధ అంశాలపై నేర్చుకోవడానికి ఈ ప్రదేశం ఉపయోగపడుతుంది. విశ్రాంతి తీసుకోవడానికి అంటే రిలాక్స్ కావడానికి ఇది ఒక మంచి ప్రదేశం. కాబట్టి మంచి విశాలమైన క్యాంటీన్ అవసరం.
బ్రాంచ్ ఎంపిక ఎలా?
- వాస్తవానికి అన్ని బ్రాంచీలు అద్భుతమైన అవకాశాలను కలిగి ఉంటాయి. ఇంజినీరింగ్ ప్రామాణిక పరీక్ష అంటే ఎంసెట్‌లో ఉత్తీర్ణులైన వారిలో ఎక్కువమంది సీఎస్ఈ, దాని అనుబంధ విభాగాలపై మొగ్గు చూపుతున్నారు. కానీ దేశంలో సీఎస్ఈ గ్రాడ్యుయేట్లలో కూడా తగినంత మందికి సరైన ఉద్యోగాలు లేకపోవడం గమనార్హం. ఎందుకంటే అసంఖ్యాకమైన సీఎస్ఈ గ్రాడ్యుయేట్లలో ఎక్కువ మందికి ప్రోగ్రామింగ్, లాజికల్ రీజనింగ్, క్రిటికల్ థింకింగ్ సామర్థ్యాలు తగినంతగా లేకపోవడమే ప్రధాన కారణం.
- చాలామంది ఇంజినీర్లు తమ కెరీర్ అభివృద్ధి చెందుతున్న కొద్దీ తమ ఫీల్డ్‌ను మార్చుకుంటున్నారు. మెటలర్జికల్ ఇంజినీర్లు, కెమికల్ ఇంజినీర్లు చాలామంది కంప్యూటర్/ఐటీ పరిశ్రమలో ఉన్నారు. కొందరు మెకానికల్ ఇంజినీర్లు బ్యాంకింగ్/ఫైనాన్స్ రంగానికి చెందిన ఉద్యోగాల్లో ఉన్నారు. మరికొందరు చలనచిత్ర పరిశ్రమలో కూడా ఉన్నారు. సీఎస్ఈ వారు కూడా కంప్యూటర్/ఐటీ కాని రంగాల్లో పనిచేస్తున్నారు. ఇలా ఇంజినీరింగ్‌లో తీసుకున్న బ్రాంచీకి సంబంధం లేకుండా వారి వారి ఇష్టాలు, అవసరాలను బట్టి ఆయా రంగాల్లో సెటిల్ అవుతున్నారు.
- బ్రాంచీ ఎంపికకు ముఖ్యంగా కావాల్సింది విద్యార్థి ఆసక్తి. ఏ బ్రాంచీపై విద్యార్థికి ఆసక్తి, సామర్థ్యం ఉందో ఆ బ్రాంచీని ఎంచుకోవడం ఉత్తమం. చాలామందికి ఆయా బ్రాంచీలు ఇష్టమని చెప్తారు. కానీ వాస్తవంలో వారికి ఆ బ్రాంచీ, దాని భవిష్యత్తుపై సరైన అవగాహన లేకపోవడం కనిపిస్తుంది.
కాలేజీ ప్రాముఖ్యత
- ఐఐటీలు, ఐఐఐటీలు, బిట్స్ వంటివి ఇతర ఇంజినీరింగ్ కాలేజీల కంటే చాలా ఉన్నతమైనవి.
- ఎన్ఐటీ (నిట్)లు అనేక రాష్ట్ర/విశ్వవిద్యాలయాల ఇంజినీరింగ్ కాలేజీల కంటే, కొన్ని డీమ్డ్ యూనివర్సిటీల కంటే మెరుగ్గా ఉన్నాయి.
- జాతీయ ప్రాముఖ్యత కలిగిన సంస్థల్లో మౌలిక సదుపాయాలు మెరుగ్గా ఉన్నాయి. వీటితోపాటు క్యాంపస్ ప్లేస్‌మెంట్స్ రికార్డు కూడా బాగుంది.
- అంతేకాకుండా జాతీయస్థాయి సంస్థల్లో దేశం నలుమూలల నుంచి విద్యార్థులు అక్కడ చదవుతారు. ఇది దీర్ఘకాలంలో విభిన్నమైన పీర్ లెర్నింగ్ (సహచరులతో) ఏర్పర్చుకునే అవకాశాన్నిస్తుంది.
- మంచి కాలేజీలు సాధారణంగా మెరుగైన అధ్యాపక బృందంతో కూడి ఉన్నత విద్యాప్రమాణాలను కలిగి ఉంటాయి. ఇది విద్యార్థి పురోగతికి దోహదపడుతుంది.
- ఉత్తమ కాలేజీలు కెరీర్ బిల్డింగ్, నెట్వర్క్ విస్తరించుకోవడానికి దోహదం చేస్తాయి.
- న్యాక్ అక్రెడిటేషన్ ఉన్న కాలేజీలకు, ఎన్బీఏ అక్రెడిటేషనల్ ఉన్న బ్రాంచీలకు, స్వయం ప్రతిపత్తిగల కాలేజీలకు ప్రాధాన్యం ఇవ్వాలి.
- తక్కువ ప్రమాణాలతో ఉన్న కళాశాల్లో అధిక ఉద్యోగ అవకాశాలను అందించే శాఖను ఎంచుకోవడం కంటే మెరుగైన ప్రమాణాలు కలిగిన కళాశాలలో పరిమిత ఉద్యోగ అవకాశాలు ఉన్న బ్రాంచీని ఎంచుకోవాలి. ఏదిఏమైనా కాలేజీలు సహేతుకంగా పోల్చదగిన స్థాయిలో ఉంటే మార్కెట్ ప్రమాణాల ప్రకారం మెరుగైన ఇంజినీర్ బ్రాంచీని ఎంచుకోవాలి.
- కళాశాలతో సంబంధం లేకుండా ఎవరైనా స్వయం ప్రేరణతో ఉంటే ఇంజినీరింగ్‌లో ఏదైనా బ్రాంచీలో రాణించవచ్చు. అయితే ఒకరికి ఎంపిక ఉంటే మెరుగైన మౌలిక సదుపాయాలు, అర్హత, అనుభవం ఉన్న ఫ్యాకల్టీ ఉన్న కళాశాలను ఎంచుకోండి.
- ఒకవేళ గొప్ప సౌకర్యాలు లేని, ఎక్కువ అర్హత, అనుభవం ఉన్న అధ్యాపకులు లేని కళాశాలలో చేరితే నిరాశ చెందకుండా కష్టపడి చదువుకోవాలి, పనిచేయాలి. ప్రఖ్యాత కళాశాలల్లో చదువుతున్న తోటివారి సహాయం పొందడానికి ప్రయత్నించాలి.
- ఇంజినీరింగ్ మొదటి సంవత్సరంలోనే పరిశ్రమ నుంచి ప్రాజెక్టులు చేయడంలో మెంటార్స్ సహాయం తీసుకోండి.
- ప్రస్తుత కాలమాన పరిస్థితుల్లో ఇంజినీరింగ్ ప్రాజెక్టులన్నీ వివిధ ఇంజినీరింగ్ విభాగాల నైపుణ్యాల కలయికతో కూడుకున్నవి. ఈ ప్రాజెక్టుల్లో అన్ని విభాగాల నిపుణుల సమన్వయంతో పనిచేయాలి. కాబట్టి కంప్యూటర్ బ్రాంచీవాళ్లే కాకుండా మిగిలిన బ్రాంచీ విద్యార్థులు కూడా ప్రోగ్రామింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్ నైపుణ్యాలను అలవర్చుకుంటే ఉద్యోగ అవకాశాలు మెరుగవుతాయి. దీనిని దృష్టిలో పెట్టుకునే ఏఐసీటీఈ ఇంజినీరింగ్ ఇతర బ్రాంచీ విద్యార్థుల కోసం సీఎస్ఈని మైనరింగ్ చేయడానికి అనుమతించింది.
- బ్రాంచ్ కంటే కాలేజీ పాత్ర చాలా ముఖ్యమైనది.
- కాబట్టి జాగ్రత్తగా కాలేజీని ఎంపిక చేసుకోండి.
బ్రాంచ్ ఎంపికలో కింది సూచనలు పరిగణలోకి తీసుకోండి…
- ఎవరికైనా ఫిజిక్స్‌లో ప్రావీణ్యత లేకపోతే అలాంటి విద్యార్థి ఈసీఈ, ఈఈఈ, మెకానికల్ వంటి బ్రాంచీలను ఎంచుకోవద్దు.
- అంతేకాదు మ్యాథ్స్‌లో నైపుణ్యం లేని విద్యార్థి కూడా ఈసీఈ, ఈఈఈ ఎంచుకోకూడదు.
- విద్యార్థులకు లాజికల్ రీజనింగ్, మ్యాథ్స్‌లో చెప్పుకోదగ్గ సామర్థ్యం కలిగి ఉంటే సీఎస్ఈ, ఐటీ దాని అనుబంధ శాఖలు ఎంచుకోవాలి.
- ఇలా ఆయా అంశాలను, ఆసక్తులను దృష్టిలో పెట్టుకుని బ్రాంచీ ఎంపిక చేసుకోవాలి.
డా.ఉదయ్ కుమార్ సుసర్ల
ప్రిన్సిపాల్
గీతాంజలి కాలేజీ ఆఫ్
ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ
చీర్యాల, కీసర మండలం
Previous article
ఘోల్ చేపలు
Next article
How to choose an Engg College ?
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు